Rajasthan Governor
-
అసెంబ్లీ సమావేశాలు జరిగేవరకు రిసార్ట్‌లోనే
జైపూర్: రాజస్థాన్‌లో పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైపూర్‌లోని పైర్‌మౌంట్ రిసార్ట్‌లో గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు ఎమ్మెల్యేలందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ రిసార్ట్‌లో ఉండాలన్నారు. (ముచ్చటగా మూడోసారి) అయితే మంత్రులు వారి పనులు నిర్వర్తించుకునేందుకు సచివాలయానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ అనుమతించారు. ఇదిలా వుండగా 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ సహా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. (రాజస్తాన్ డ్రామాకు తెర) -
‘అసెంబ్లీ సమావేశాలు అడ్డుకోలేదు, కానీ..’
జైపూర్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తానెప్పుడూ అడ్డు పడలేదని, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోతే సమావేశాల ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించలేదని రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆరోపించారు. గురువారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న డిమాండ్‌కు తాను ఎప్పడూ అడ్డు చెప్పలేదని, పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టే మొదట్లో ఒప్పుకోలేదన్నారు. సాధారణ అసెంబ్లీ సమావేశాలా? లేక బల పరీక్ష కోసం అసెంబ్లీ సమావేశాలా? అన్నదానిపై సీఎం గహ్లోత్ స్పష్టతే ఇవ్వలేదని గవర్నర్ మిశ్రా ఆరోపించారు. రాజ్‌భవన్ ముందు ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్ ధర్నాకు దిగడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. 1995 లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్‌భవన్ ముందు ధర్నా గురించి ప్రస్తావించగా... ఈ ధర్నాకు, గహ్లోత్ చేసిన ధర్నాకు చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. సీఎం గహ్లోత్ మెజారీ ఉందని చూపించేంత వరకూ ప్రభుత్వంపై తానేమీ వ్యాఖ్యలు చేయనని ఆయన స్పష్టం చేశారు. (చదవండి : రాజస్తాన్ డ్రామాకు తెర) రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలి కదా అని ప్రశ్నించినగా,.‘అవును గవర్నర్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. అయితే కోర్టు ఆదేశాలను, నిబంధనలను కూడా శ్రద్ధతో చూడాల్సి ఉంటుంది కదా’అని గవర్నర్ మిశ్రా పేర్కొన్నారు. కాగా, అనేక నాటకీయ పరిణామాల తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ మిశ్రా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్లు బుధవారం మిశ్రా పేర్కొన్నారు. -
రాజస్తాన్ డ్రామాకు తెర
జైపూర్: రాజస్తాన్ రాజకీయ డ్రామాకు ప్రస్తుతానికి తెర పడింది. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంగీకరించారు. దాంతో గవర్నర్, కాంగ్రెస్ సర్కార్ల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. అంతకుముందు, బుధవారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. జులై 31 నుంచి అసెంబ్లీని ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్ గహ్లోత్ కేబినెట్ గవర్నర్‌కు పంపిన మూడో సిఫారసును గవర్నర్ వెనక్కు పంపించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో తను కోరిన వివరణలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని, అసెంబ్లీ భేటీలను ప్రారంభించడానికి సహేతుక కారణం పేర్కొంటూ మళ్లీ ప్రతిపాదన పంపాలని గవర్నర్ పేర్కొన్నారు. దాంతో, బుధవారం మళ్లీ సమావేశమైన సీఎం గహ్లోత్ కేబినెట్.. ఆగస్ట్ 14 నుంచి సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది. కేబినెట్ సిఫారసులను వెనక్కు పంపిస్తూ.. గవర్నర్ ప్రతీసారి ప్రస్తావిస్తున్న 21 రోజుల నోటీసు పీరియడ్ నిబంధన అమలయ్యేలా ఆగస్ట్ 14వ తేదీని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సీఎం గహ్లోత్ ఎంచుకున్నారు. గవర్నర్‌కు తొలి ప్రతిపాదన పంపిన జులై 23 నుంచి పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనను పంపించారు. స్వల్ప వ్యవధి నోటీసుతో సమావేశాలను ప్రారంభించేందుకు కారణం చూపకపోతే 21 రోజుల నోటీసు వ్యవధితో సమావేశాలను ప్రారంభించవచ్చని గత ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రేమ లేఖ అందింది: ఈ నేపథ్యంలో గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో దాదాపు పావుగంట పాటు సీఎం గహ్లోత్ సమావేశమయ్యారు. ‘ప్రేమ లేఖ అందింది. తేనీటి సేవనం కోసం ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తున్నాను’అని రాజ్‌భవన్‌కు వెళ్లేముందు గహ్లోత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌తో సమావేశం తరువాత కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం, ఆగస్ట్ 14 నుంచి శాసన సభ సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్ పంపించారు. మరోవైపు, గవర్నర్ కల్రాజ్ మిశ్రాను బుధవారం అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి కలిశారు. కాగా, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశామని, స్పీకర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్తాన్ శాఖ అధ్యక్షుడు భగవాన్ సింగ్ బాబా తెలిపారు. -
కొత్తగా తెరపైకి సంజయ్ జైన్..
జైపూర్: రాజస్తాన్ లో ఈ వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం దాదాపు ముప్పావు గంట పాటు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరపాలా? వద్దా? బలనిరూపణకు వెళ్లాలనుకుంటే.. ఎప్పుడు వెళ్లాలి? తదితర విషయాల్లో తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆదివారం వ్యాఖ్యానించారు. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా ) యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ విప్‌ను ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పైలట్ సహా 19 ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులను కూడా స్పీకర్ జారీ చేశారు. ఆ నోటీసులపై పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు(సోమవారం) డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. దాంతో హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. ఇందులోపైలట్ సహా ఆయన వర్గం 19 మంది ఎమ్మెల్యేలు. ఈ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ల సహకారం లేకుండా, గహ్లోత్ విశ్వాస పరీక్షలో ఎలా నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రభుత్వ కూల్చివేత కుట్రకు సంబంధించి బయటపడిన ఆడియో టేప్‌లు నిజమైనవేనని సీఎం గహ్లోత్ తేల్చి చెప్పారు. బీజేపీ చెబుతున్నట్లు ఆ ఆడియో టేప్‌లు నకిలీవైతే.. రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు. షెకావత్ రాజీనామా చేయాలి: రాజస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయమై వెలుగు చూసిన ఆడియో టేప్‌ల్లో షెకావత్ సంభాషణలు బయటపడడాన్ని ప్రస్తావిస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ షెకావత్ రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. మరో వైపు, పైలట్‌ను తిరిగి కుటుం బం(పార్టీ)లోకి రావాలని కాంగ్రెస్ అధికా ర ప్రతినిధి సూర్జేవాలా మరో సారి కోరారు. బీజేపీ వల నుంచి ఇకనైనా బయటపడాలని సూచించారు. విశ్వాస పరీక్షతో బలం తేలుతుంది అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ద్వారానే మెజారిటీ తేలుతుందని బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. ‘గవర్నర్‌తో భేటీలో సీఎం ఏం చెప్పారనేది ఎవరికీ తెలియదు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితా ఇచ్చి ఉండవచ్చు, లేదా ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి ఉండవచ్చు. కానీ అంతిమంగా అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే మెజారిటీ ఉందా? లేదా? అనేది స్పష్టమవుతుంది’ అన్నారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్..! సచిన్ పైలట్ తిరుగుబాటుతో హుటాహుటిన జైపూర్‌కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేలిన తరువాత కూడా జైపూర్‌లోనే ఉంటూ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడమొక్కటే కాదు..ముఖ్యంగా బీజేపీకి, సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నామని చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలలోని కొందరితో టచ్‌లో ఉంటూ, పైలట్ వర్గం భవిష్యత్ వ్యూహాలను తెలుసుకుంటోంది. కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే.. శనివారం సీఎం గహ్లోత్ అకస్మాత్తుగా గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి, బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను చూపారు. కాంగ్రెస్(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ భావిస్తున్నారు. దాంతో, ఈ వారం విశ్వాస పరీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అకస్మాత్తుగా విశ్వాస పరీక్షకు వెళ్లాలన్న ఆలోచన వెనుక, పైలట్ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు లాగే వ్యూహముందని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అనర్హత విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలు తమకున్నారని ధీమాగా ఉంది. అనర్హత వేటు వేసేందుకు వీలు కలగనట్లైతే.. మెజారిటీ మార్క్‌కి మించి, 103 మంది సభ్యులు మద్దతిస్తున్నారని చెబుతోంది. ‘అనర్హత వేటు వేసేందుకు వీలు కలిగితే.. 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 19 మంది అనర్హులుగా తేలుతారు. దాంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. అప్పుడు మెజారిటీ మార్క్ 91 అవుతుంది. ఆ మార్క్‌ను గహ్లోత్ సునాయాసంగా చేరుకుంటారు’ అని విశ్వసిస్తోంది. సంజయ్ జైన్ ఎవరు? రాజస్తాన్ సంక్షోభంలో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు సంజయ్ జైన్. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియోటేప్ల్లో ఉన్నది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్జైన్ల స్వరాలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఆ గొంతులు తమవి కావని వారు స్పష్టం చేశారు. జైన్ బీజేపీ వ్యక్తి అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. తమ పార్టీకి అతడితో ఏ సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. అయితే, జైన్ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఆయన బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధర రాజెతో దిగిన ఫొటో ఉంది. అలాగే, రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా జైన్ పాల్గొన్నట్లుగా ఫొటోలు ఉన్నాయి. కాంగ్రెస్ ఫిర్యాదుపై షెకావత్, శర్మలతో పాటు జైన్‌పై కూడా రాజస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. మాజీ సీఎం వసుంధర రాజెను ఒకసారి కలవమని, బీజేపీలో చేరమని తనను సంజయ్ జైన్ 8 నెలల క్రితమే కోరారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుహ తాజాగా వెల్లడించారు. -
చిక్కుల్లో గవర్నర్ కల్యాణ్ సింగ్
న్యూఢిల్లీ: రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్(87) మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమర్పించిన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెల 25న యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. కాబట్టి మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరముంది. మే 23న మోదీ మళ్లీ ప్రధాని కావాలని మేమంతా కోరుకుంటున్నాం. దేశంలోని ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలి’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విచారణ జరిపిన ఈసీ.. కల్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళితో పాటు గవర్నర్ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. ఈ నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. విదేశీ పర్యటన నుంచి బుధవారం భారత్‌కు చేరుకున్న కోవింద్, సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నివేదికను హోంశాఖకు పంపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎదుర్కొన్న తొలి గవర్నర్‌గా కల్యాణ్ సింగ్ నిలిచే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. సింగ్‌కు ముందు 1990ల్లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన గుల్షర్ అహ్మద్ తన కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో పొసగకపోవడంతో 1999లో పార్టీకి రాజీనామా చేసిన కల్యాణ్ సింగ్, తిరిగి 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక కేంద్ర ప్రభుత్వం కల్యాణ్ సింగ్ ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించింది. -
రాజస్తాన్ గవర్నర్‌ది కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించిన రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. కల్యాణ్ సింగ్‌పై రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. మార్చి 23న అలీగఢ్‌లో కల్యాణ్ సింగ్ తన నివాసంలో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘ మనమంతా బీజేపీ కార్యకర్తలం. బీజేపీ గెలవాలని మనం కోరుకుంటున్నాం. మోదీ మరోసారి ప్రధాని కావాలి. మోదీ మళ్లీ ప్రధాని కావడం అవసరం’ అని వ్యాఖ్యానించారు. టికెట్ల పంపిణీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. 1990లో అప్పటి హిమాచల్ గవర్నర్ గుల్షర్ అహ్మద్ తన కొడుకు తరఫున ప్రచారంలో పాల్గొనడంతో ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గవర్నర్.!
జైపూర్ : రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్‌పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ చర్యపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు దృష్టికి తీసుకొచ్చింది. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తటస్థంగా ఉండాల్సింది పోయి పక్షపాతంగా వ్యవహరించారని తెలిపింది. ఈ మేరకు కోవింద్‌కు లేఖ రాసింది. మార్చి 23న అలీఘర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. .. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. బీజేపీ ఘనవిజయం సాధిస్తుంది. నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ప్రధాని కావడం దేశానికి అవసరం’ అని వాఖ్యానించారు. కాగా, గవర్నర్ వ్యాఖ్యలపై సీఎం అశోక్ గహ్లోత్ స్పందించారు. గవర్నర్ కల్యాణ్‌సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఇలాంటి చర్యలు ఆ పదవికి ఉన్న హుందాతనాన్ని తగ్గిస్తాయి అని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కూడా కల్యాణ్‌సింగ్ అంటే తనకు అభిమానమని, ఎంతో సీనియర్ లీడర్ అయిన ఆయన బాధ్యతాయుత పదవిలో కొనసాగుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని ట్వీట్ చేశారు. -
మోదీని బాహాటంగా సమర్థించిన గవర్నర్
జైపూర్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికవడం దేశానికి అవసరమని రాజస్ధాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యానించి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. రానున్న సార్వత్రి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని ఆకాంక్షించిన కళ్యాణ్ సింగ్ మనమంతా బీజేపీ కార్యకర్తలమేనన్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్ తటస్థ వైఖరి తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా తటస్ధంగా ఉండాల్సిన గవర్నర్ బీజేపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాగా గవర్నర్ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. యూపీలోని అలీగఢ్‌లో రాజస్ధాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా బీజేపీ కార్యకర్తలమని, తిరిగి బీజేపీ విజయం సాధించాలని మనం కోరుకుంటున్నామని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాగా 1992లో బాబ్రీమసీదు విధ్వంసం జరిగిన సమయంలో కళ్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నారు. 87 సంవత్సరాల కళ్యాణ్ సింగ్ ఆ తర్వాత కొన్నేళ్లకు పార్టీని వీడారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఆయనను రాజస్ధాన్ గవర్నర్‌గా నియమించింది. -
'అధినాయక్'పై గవర్నర్ VS గవర్నర్
కోల్‌కతా: జాతీయ గీతం జనగణమనలో 'అధినాయక్' అనే పదాన్ని తొలగించాలన్న రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వ్యాఖ్యలపై త్రిపుర గవర్నర్ టతగట రాయ్ విబేధించారు. జాతీయ గీతంలో మార్పులో చేయగాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని, మనకు స్వాతంత్ర్య వచ్చి 67 ఏళ్లు అవుతోందని, అధినాయక్ అన్న పదం బ్రిటీష్‌కు సంబంధించినది ఎందుకు అవుతుందని త్రిపుర గవర్నర్ ట్వీట్ చేశారు. జనగణమనలోని 'అధినాయక్' అంటే బ్రిటీషర్లను కీర్తించడమేనని, ఈ పదాన్ని తొలగించాలని కల్యాణ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీకే చెందిన పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత, ప్రస్తుత త్రిపుర గవర్నర్ విబేధించారు. -
మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్‌గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్‌గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. అయితే బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న కె.శంకర నారాయణన్ మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మిజోరాం గవర్నర్ గా వెళ్లేందుకు శంకర నారాయణన్ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దాంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. శంకర్ నారాయణన్ రాజీనామా చేసిన రెండు రోజులకు కొత్త గవర్నర్ ను నియమిస్తు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
యూపీ గవర్నర్ రామ్ నాయక్‌కు అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్‌కు రాజస్థాన్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం నాటికి రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో గోవా గవర్నర్ బీ వీ వాంఛూ రాజీనామా చేయడంతో అల్వాకు ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. అయితే అల్వా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లికి గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి భవన్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.