
రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించిన రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. కల్యాణ్ సింగ్‌పై రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. మార్చి 23న అలీగఢ్‌లో కల్యాణ్ సింగ్ తన నివాసంలో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘ మనమంతా బీజేపీ కార్యకర్తలం. బీజేపీ గెలవాలని మనం కోరుకుంటున్నాం.
మోదీ మరోసారి ప్రధాని కావాలి. మోదీ మళ్లీ ప్రధాని కావడం అవసరం’ అని వ్యాఖ్యానించారు. టికెట్ల పంపిణీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. 1990లో అప్పటి హిమాచల్ గవర్నర్ గుల్షర్ అహ్మద్ తన కొడుకు తరఫున ప్రచారంలో పాల్గొనడంతో ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.