న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ముందే వీవీప్యాట్ చీటీల లెక్కింపు జరపాలన్న 22 విపక్ష పార్టీల డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఈసీని కలసి ఈ మేరకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళ, బుధవారాల్లో రెండు దఫాలుగా లోతుగా చర్చించామని, మొత్తం మీద, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది ఆచరణ సాధ్యం కాదని, విపక్షాల డిమాండ్‌కు అంగీకరించే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కాగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటే అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను కూడా అనుమతించే అంశంపై ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించి నడుచుకోవాల్సిందిగా ఏప్రిల్ 8 నాటి తీర్పులో ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత చివర్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
పూర్తిగా బలహీన కమిషన్ : కాంగ్రెస్
ఈసీ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూర్తి బలహీన కమిషన్‌గా ఈసీని కాంగ్రెస్ అభివర్ణించింది. ఈసీ ఈవీఎంలను బీజేపీకి విజయాన్ని చేకూర్చే ‘ఎలక్ట్రానిక్ విక్టరీ మిషన్లు’గా ఏమన్నా మార్చిందా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి)ను ‘మోదీస్ క్యాంపెయిన్ కోడ్’గా (మోదీ ప్రచార నియమావళి) మార్చారా? అంటూ నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ఒత్తిళ్లకు ఈసీ లొంగిపోయిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరించడం విచారకరం, దురదృష్టమని పేర్కొన్నారు. ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. శాంపిల్‌ను తొలుత పరీక్షించాలన్న ప్రాథమిక సూత్రానికి ఈసీ ఎందుకు కట్టుబడటం లేదో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. డీఎంకే సైతం ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల కమిషన్ కేవలం ప్రదాని మోదీ మాటే వింటుందా? అని ఆ పార్టీ సీనియర్ నేత దొరైమురుగన్ ప్రశ్నించారు.
విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధం: అమిత్
వీవీ ప్యాట్‌లను తొలుత లెక్కించాలన్న విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా అన్నారు. ఆరో విడత ఎన్నికల తర్వాతే విపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాయని, ఎగ్జిట్ పోల్స్ తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశాయని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారని బుధవారం నాటి ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. మూడు వ్యాజ్యాలను (పిల్స్) విచారించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు తుదిరూపునిచ్చిందని అమిత్ షా చెప్పారు. వీవీప్యాట్‌లపై విపక్షాల అసహనం ఎన్నికల్లో వారి ఓటమికి సంకేతంగా కేంద్ర మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు.
వీవీప్యాట్ లెక్కింపు చివర్లోనే
Published Thu, May 23 2019 3:39 AM | Last Updated on Thu, May 23 2019 3:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment