ప్రయాగ్‌రాజ్‌లోని కౌంటింగ్ కేంద్రంవద్ద జవాను పహారా, ఢిల్లీలోని కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎం బాక్సులు
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. దిగువసభ ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన 8,049 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఏప్రిల్ 11 మొదలు మే 19 వరకు ఏడు విడతల్లో.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలతో హోరాహోరీగా సాగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈసీ అధికారులు తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారిగా ఈవీఎంల్లోని ఓట్ల వివరాలను వీవీప్యాట్ల చీటీలతో ఈసీ సరిపోల్చనుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2–3 మధ్యే పూర్తయిపోయినా వీవీప్యాట్ల చీటీలను కూడా లెక్కించాల్సి ఉండటంతో ఫలితాలు సాధారణ సమయం కన్నా ఐదారు గంటలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా గురువారమే వెలువడనున్నాయి.
చౌకీదార్ చోర్‌హై నుంచి మొదలై..
ఈ ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన ఎన్డీయే, యూపీఏకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. చౌకీదార్ చోర్ హై, అవినీతిపరుడు నంబర్ 1, ఖాకీ అండర్‌వేర్ వంటి కటువైన ఆరోపణలు.. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలను వేడెక్కించాయి. బీజేపీ 437 మంది, కాంగ్రెస్ 423 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. 19న చివరి విడత ఎన్నికలు ముగియగా.. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే తిరిగి అధికార పీఠాన్ని అధిరోహిస్తుందని చాలావరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నరేంద్ర మోదీ వ్యక్తిగత చరిష్మాతో 2014లో ఎలాగైతే ఎన్డీయే అధికారం చేజిక్కించుకుందో.. ఈసారి కూడా అలాగే ఆ కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల్లో అసంతృప్తి, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని విపక్షాలు పేర్కొన్నాయి. మోదీ, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు.
542 స్థానాలకే ఎన్నికలు
విపక్ష పార్టీలు మంగళవారం ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపులో పారదర్శకతను పాటించాల్సిందిగా ఆ పార్టీలు ఈసీని కోరాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 542 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. పెద్దయెత్తున నగదు పంపిణీ ఆరోపణల నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరులో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 282 సీట్లు రాగా 44 సీట్లతో కాంగ్రెస్ గతంలో ఎన్నడూలేని విధంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. 2009లో కాంగ్రెస్ 206 సీట్లు సాధించింది.
అప్రమత్తంగా ఉండండి: హోం శాఖ
గురువారం కౌంటింగ్ సందర్భంగా కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు, హింస చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్త వహించాల్సిందిగా రాష్ట్రాల సీఎస్‌లను, డీజీపీలను కోరింది. స్ట్రాంగ్‌రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, త్రిపుర రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు చేసిన ప్రకటనలు హింసకు దారితీయవచ్చని, కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించవచ్చునంటూ కేంద్ర భద్రతా సంస్థలకు సమాచారం అందినట్లు అధికారి ఒకరు వెల్లడించారు.
ఓట్ల లెక్కింపు ఇలా...
పోస్టల్ బ్యాలెట్లతో పాటే ఈవీఎం ఓట్ల లెక్కింపు
వీవీప్యాట్ల లెక్కింపుతో ఫలితాలు ఆలస్యం!
ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్ల ఓట్లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చే ప్రక్రియ చేపట్టడం వల్ల ఫలితాలు సాధారణం కంటే అయిదారు గంటలు ఆలస్యంగా వెలువడే అవకాశముంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2–3 గంటల మధ్య పూర్తయిపోయినా, వీవీప్యాట్ల చీటీలను కూడా లెక్కించాల్సి రావడంతో అధికారిక ఫలితాలు వచ్చేసరికి రాత్రి 8 దాటిపోతుందని అంచనా.
ఆర్వోల ప్రతినతో మొదలు..
గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఓట్ల రహస్యాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ మేరకు పత్రాన్ని బయటకి చదివిన తర్వాతే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణంగా సాయుధ బలగాలు, కేంద్ర పోలీసు సిబ్బంది, రాష్ట్ర పోలీసు సిబ్బంది, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తొలుత లెక్కిస్తారు. దౌత్యవేత్తలు, ఇతర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఓట్లను కూడా సర్వీసు ఓట్ల కిందే పరిగణిస్తారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 18 లక్షలు నమోదు కాగా రికార్డు స్థాయిలో 16.49 లక్షల ఓట్లు పోలయ్యాయి. వాటిని మే 17నే ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పోస్టల్ బ్యాలెట్లు భారీగా ఉన్న నేపథ్యంలో వాటితో పాటు ఈవీఎంల ఓట్ల లెక్కింపు రెండూ ఒకేసారి జరపాలని ఈసీ నిర్ణయించినట్లు కమిషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఉండే హక్కు ఉంటుంది. వారి సమక్షంలోనే కౌంటింగ్ సాగుతుంది.
వీవీప్యాట్ల చీటీల లెక్కింపు ఎలాగంటే..
ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాతే వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించే ప్రక్రియ మొదలవుతుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఎంపిక చేసిన అయిదు పోలింగ్ స్టేషన్లలో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాల్సి ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 10.3 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీవీప్యాట్‌ల లెక్కింపు ప్రక్రియ 20,600 పోలింగ్ స్టేషన్లలో జరగనుంది. 25 వీవీప్యాట్ చీటీలను ఒక కట్టగా కట్టి లెక్కించి ఆయా అభ్యర్థుల బాక్సుల్లో వేస్తారు. వాటిని ఈవీఎం డిస్‌ప్లేలతో పోల్చి చూస్తారు. ఒకవేళ రెంటికీ మధ్య తేడా వస్తే మరోసారి లెక్కిస్తారు. అలా మూడు సార్లు లెక్కించినా సరిపోలకపోతే వీవీప్యాట్లలో ఫలితాలనే తుదిగా పరిగణనలోకి తీసుకుంటారు.
ఒక వీవీ ప్యాట్ అయిన తర్వాతే, మరో వీవీప్యాట్ లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్‌ను లెక్కించడానికి గంట సమయం పట్టొచ్చు. 5 వీవీప్యాట్‌లలో చీటీల లెక్కింపు పూర్తి కావడానికి 5 గంటలు పట్టే అవకాశం ఉంది. వీవీప్యాట్ చీటీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, లేదంటే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాత్రమే లెక్కిస్తారు. అలా లెక్కించిన తర్వాత తుది ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఈవీఎంలు మొరాయించినా, వాటిలో లోపాలు తలెత్తినా, ఎన్నికల కమిషన్ దృష్టికి అధికారులు తీసుకువెళతారు. పోలింగ్ కేంద్రంలో అప్పటి పరిస్థితులను బట్టి రీ పోలింగ్‌కు ఆదేశిస్తారు. పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీల ఏజెంట్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే కౌంటింగ్ ముగిసినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment