జైపూర్: రాజస్తాన్ లో ఈ వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం దాదాపు ముప్పావు గంట పాటు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరపాలా? వద్దా? బలనిరూపణకు వెళ్లాలనుకుంటే.. ఎప్పుడు వెళ్లాలి? తదితర విషయాల్లో తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆదివారం వ్యాఖ్యానించారు. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా )
యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ విప్‌ను ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పైలట్ సహా 19 ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులను కూడా స్పీకర్ జారీ చేశారు. ఆ నోటీసులపై పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు(సోమవారం) డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది.
దాంతో హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. ఇందులోపైలట్ సహా ఆయన వర్గం 19 మంది ఎమ్మెల్యేలు. ఈ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ల సహకారం లేకుండా, గహ్లోత్ విశ్వాస పరీక్షలో ఎలా నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రభుత్వ కూల్చివేత కుట్రకు సంబంధించి బయటపడిన ఆడియో టేప్‌లు నిజమైనవేనని సీఎం గహ్లోత్ తేల్చి చెప్పారు. బీజేపీ చెబుతున్నట్లు ఆ ఆడియో టేప్‌లు నకిలీవైతే.. రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు.
షెకావత్ రాజీనామా చేయాలి: రాజస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయమై వెలుగు చూసిన ఆడియో టేప్‌ల్లో షెకావత్ సంభాషణలు బయటపడడాన్ని ప్రస్తావిస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ షెకావత్ రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. మరో వైపు, పైలట్‌ను తిరిగి కుటుం బం(పార్టీ)లోకి రావాలని కాంగ్రెస్ అధికా ర ప్రతినిధి సూర్జేవాలా మరో సారి కోరారు. బీజేపీ వల నుంచి ఇకనైనా బయటపడాలని సూచించారు.
విశ్వాస పరీక్షతో బలం తేలుతుంది
అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ద్వారానే మెజారిటీ తేలుతుందని బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. ‘గవర్నర్‌తో భేటీలో సీఎం ఏం చెప్పారనేది ఎవరికీ తెలియదు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితా ఇచ్చి ఉండవచ్చు, లేదా ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి ఉండవచ్చు. కానీ అంతిమంగా అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే మెజారిటీ ఉందా? లేదా? అనేది స్పష్టమవుతుంది’ అన్నారు.
వ్యూహాత్మకంగా కాంగ్రెస్..!
సచిన్ పైలట్ తిరుగుబాటుతో హుటాహుటిన జైపూర్‌కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేలిన తరువాత కూడా జైపూర్‌లోనే ఉంటూ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడమొక్కటే కాదు..ముఖ్యంగా బీజేపీకి, సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నామని చెబుతున్నారు.
పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలలోని కొందరితో టచ్‌లో ఉంటూ, పైలట్ వర్గం భవిష్యత్ వ్యూహాలను తెలుసుకుంటోంది. కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే.. శనివారం సీఎం గహ్లోత్ అకస్మాత్తుగా గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలిసి, బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను చూపారు. కాంగ్రెస్(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్‌ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ భావిస్తున్నారు.
దాంతో, ఈ వారం విశ్వాస పరీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అకస్మాత్తుగా విశ్వాస పరీక్షకు వెళ్లాలన్న ఆలోచన వెనుక, పైలట్ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు లాగే వ్యూహముందని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అనర్హత విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలు తమకున్నారని ధీమాగా ఉంది.
అనర్హత వేటు వేసేందుకు వీలు కలగనట్లైతే.. మెజారిటీ మార్క్‌కి మించి, 103 మంది సభ్యులు మద్దతిస్తున్నారని చెబుతోంది. ‘అనర్హత వేటు వేసేందుకు వీలు కలిగితే.. 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 19 మంది అనర్హులుగా తేలుతారు. దాంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. అప్పుడు మెజారిటీ మార్క్ 91 అవుతుంది. ఆ మార్క్‌ను గహ్లోత్ సునాయాసంగా చేరుకుంటారు’ అని విశ్వసిస్తోంది.
సంజయ్ జైన్ ఎవరు?
రాజస్తాన్ సంక్షోభంలో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు సంజయ్ జైన్. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియోటేప్‌ల్లో ఉన్నది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్‌జైన్‌ల స్వరాలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఆ గొంతులు తమవి కావని వారు స్పష్టం చేశారు. జైన్ బీజేపీ వ్యక్తి అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. తమ పార్టీకి అతడితో ఏ సంబంధం లేదని బీజేపీ చెబుతోంది.
అయితే, జైన్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఆయన బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధర రాజెతో దిగిన ఫొటో ఉంది. అలాగే, రాజస్తాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా జైన్ పాల్గొన్నట్లుగా ఫొటోలు ఉన్నాయి. కాంగ్రెస్ ఫిర్యాదుపై షెకావత్, శర్మలతో పాటు జైన్‌పై కూడా రాజస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. మాజీ సీఎం వసుంధర రాజెను ఒకసారి కలవమని, బీజేపీలో చేరమని తనను సంజయ్ జైన్ 8 నెలల క్రితమే కోరారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుహ తాజాగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment