Confidence Test
-
బీజేపీకి పెద్ద సవాల్‌గా ఎదిగాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీకి రాజకీయాల్లో అతిపెద్ద సవాల్‌గా, కొరకరాని కొయ్యలా తయారయ్యాం కాబట్టే ఆప్‌పై బీజేపీ అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం కేజ్రీవాల్ ప్రసంగిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే గెలుపు కావచ్చు. కానీ 2029 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దేశానికి బీజేపీ నుంచి విముక్తి కలి్పస్తాం. ఆ బాధ్యత ఆప్ తన భుజస్కంధాలపై వేసుకుంది. సభలో ఆప్కే మెజారిటీ ఉందనేది స్పష్టం. అయితే ఆప్ ఎమ్మెల్యేలకు ఎరవేసి తమ వైపు లాక్కుని, ఆప్ సర్కార్‌ను కూల్చేద్దామని బీజేపీ కుట్ర పన్నింది. అందుకే ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది’’ అని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. తర్వాత విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. -
పార్లమెంట్ విశ్వాసం పొందిన పాక్ పీఎం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పార్లమెంట్‌లోని దిగువసభ నేషనల్ అసెంబ్లీ విశ్వాసం పొందారు. మొత్తం 342 మంది సభ్యులకుగాను 180 మంది షరీఫ్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. షరీఫ్ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్‌కు 174 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. పంజాబ్, ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ)కి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లును నేషనల్ అసెంబ్లీ ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమయింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరపాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. -
ఇటలీ ప్రధాని రాజీనామా
రోమ్: ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి పదవి నుంచి వైదొలిగారు. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్య పక్షం 5–స్టార్స్ మరో రెండు పార్టీలు బహిష్కరించాయి. దీంతో ద్రాఘి తన రాజీనామా లేఖను అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు అందజేశారు. ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు 5–స్టార్స్ పార్టీ ప్రకటించడంతో గత వారమే ఆయన రాజీనామా చేసినా అధ్యక్షుడు ఆమోదించలేదు. తాజా పరిణామాలతో మరో సారి అందజేసిన రాజీనామా లేఖను మట్టరెల్లా ఆమోదించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగాలని ద్రాఘిని కోరారు. దీంతో, అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగేందుకు అవకాశముందని భావిస్తున్నారు. -
ఇమ్రాన్‌కు విషమ పరీక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం విషమ పరీక్ష ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ సోమవారం ఇమ్రాన్ ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతకుముందు సభ ఆమోదించింది. దీంతో, ప్రభుత్వంపై సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పీఎంఎల్ నేత షెహబాజ్ మాట్లాడుతూ. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విశ్వాసం లేదని సభ తీర్మానించింది. క్లాజ్–4 ప్రకారం ఇమ్రాన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు’అని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ సభను 31వ తేదీకి ప్రొరోగ్ చేశారు. కాగా, నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై సభలో ఓటింగ్ పెట్టేందుకు 3నుంచి 7 రోజుల వరకు గడువుంటుంది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుండటంతో అవిశ్వాసంపై ఓటింగ్ మార్చి 4వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. పార్లమెంట్లో మొత్తం సభ్యులు 342 మంది కాగా, అవిశ్వాసం గట్టెక్కేందుకు ఇమ్రాన్‌కు 172 మంది సభ్యుల మద్దతు అవసరముంది. అధికార పీటీఐకి 155 మంది సభ్యులుండగా, నాలుగు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 179 మంది సభ్యుల బలముంది. అయితే, ఇమ్రాన్ సొంత పీటీఐ పార్టీకి చెందిన సుమారు 25 మందితోపాటు అధికార సంకీర్ణ కూటమిలోని 23 మంది సభ్యులు ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. -
విశ్వాస పరీక్ష నెగ్గిన దేవ్బా
ఖాట్మండు: నేపాల్ నూతన ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఆదివారం జరిగిన విశ్వాస పరీక్షలో గెలుపొందారు. ప్రతినిధుల సభలో 275 ఓట్లుండగా, దేవ్‌బాకు 165 ఓట్లు వచ్చాయని హిమాలయన్ టైమ్స్ తెలిపింది. ఓటింగ్‌లో 249మంది పాల్గొన్నారు. వీరిలో 83 మంది దేవ్‌బాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక సభ్యుడు తటస్థంగా ఉన్నారు. పార్లమెంట్ విశ్వాస పరీక్షలో నెగ్గడానికి 136 ఓట్లు కావాల్సిఉంది. కావాల్సిన మెజార్టీ కన్నా అధిక మద్దతునే దేవ్బా పొందారు. పార్లమెంట్‌ను రద్దు చేయవద్దని, దేవ్‌బాను ప్రధానిగా నియమించి విశ్వాస పరీక్షకు అనుమతినివ్వాలని నేపాల్ సుప్రీంకోర్టు అధ్యక్షురాలిని ఆదేశించిన సంగతి తెలిసిందే! దీంతో ఈనెల 13న దేవ్బా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కలిపి ఇప్పటికి ఆయన ఐదుమార్లు నేపాల్ ప్రధాని పదవి స్వీకరించినట్లయింది. మాజీ ప్రధాని కేపీఓలీ సిఫార్సుతో అధ్యక్షురాలు విద్యాదేవీ దిగువ సభను మేలో రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారణ అనంతరం సభ రద్దు నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది. -
KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి
ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రతినిధుల సభ విశ్వాసాన్ని కోల్పోయారు. పుష్పకమాల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన మెజారిటీ కోల్పోయారు. నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 మంది సభ్యులు ఉండగా సోమవారం విశ్వాసపరీక్ష కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 232 మంది హాజరయ్యారు. వారిలో 93 ఓట్లు ప్రధాని ఓలికి మద్దతుగా రాగా, 124 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. మరో 15 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారని స్పీకర్ అగ్ని సప్కోట తెలిపారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మొత్తం 136 ఓట్లు కావాల్సి ఉండగా, ఆ మార్కును ఓలి అందుకోలేకపోయారు. మెజారిటీ సాధించలేకపోయిన ఓలి నేపాల్ రాజ్యాంగంలోని 100 (3) ప్రకరణ ప్రకారం ఆటోమేటిగ్గా పదవిని కోల్పోతారు. ఇదిలా ఉండగా నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబ, సీపీఎన్ చైర్మన్ ప్రచండ, జనతా సమాజ్‌వాదీ పార్టీ చైర్మన్ ఉపేంద్ర యాదవ్‌లు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాలని దేశ అధ్యక్షుడు భండారిని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. -
విశ్వాస పరీక్షలో గహ్లోత్ గెలుపు
జైపూర్: లాంఛనం ముగిసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. సచిన్ పైలట్ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరడంతో బల నిరూపణ సునాయాసమైంది. దాంతో, ఎట్టకేలకు దాదాపు నెల రోజులుగా సాగుతున్న రాజస్తాన్ డ్రామా సుఖాంతమైంది. శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, సభ ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. చర్చకు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమాధానమిస్తూ విపక్ష బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘మీరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాను’ అని స్పష్టం చేశారు. ఈ సంక్షోభానికి అద్భుతమైన రీతిలో ముగింపు లభించిందని, బీజేపీ ఓడిపోయిందని పేర్కొన్నారు. ‘అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాల్లో ఏం జరిగింది? ప్రజా ప్రభుత్వాలను కూల్చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో స్వయంగా ఒక కేంద్రమంత్రి పాల్గొన్నారని గహ్లోత్ ఆరోపించారు. సచిన్ పైలట్ తిరుగుబాటు నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, మధ్యవర్తి సంజయ్ జైన్ల గొంతులతో సంభాషణలున్న ఆడియో టేప్‌లను కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘మెజారిటీ ఉంటే ముందే విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలి. నెల రోజుల పాటు ఎమ్మెల్యేలను హోటల్లో నిర్బంధించాల్సిన అవసరం ఏంటి?’ అని అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా గహ్లోత్‌ను ప్రశ్నించారు. పైలట్‌పై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పెట్టిన దేశద్రోహం కేసు విషయాన్ని కూడా కటారియా ప్రస్తావించారు. ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని గెలిచిన అనంతరం సభను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. మిత్రపక్షాలు బీటీపీ(2), సీపీఎం(2), ఆరెల్డీ(1), స్వతంత్రులు(13)తో కలిసి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య 125 వరకు ఉంటుంది. బీజేపీ సభ్యుల సంఖ్య 72. మిత్రపక్షం(ఆర్ఎల్పీ 3)తో కలుపుకుని బీజేపీకి 75 మంది సభ్యుల మద్దతుంది. ఇప్పుడు బోర్డర్లో ఉన్నా: పైలట్ చర్చలో సచిన్ పైలట్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన స్థానం ఇప్పుడు బోర్డర్లో ఉందని వ్యాఖ్యానించారు. పార్టీలో తాను శక్తిమంతమైన యోధుడినని పేర్కొన్నారు. గతంలో సీఎం గహ్లోత్ పక్కన కూర్చొనే పైలట్ స్థానం తాజా సమావేశాల సందర్భంగా మారింది. దీన్ని పైలట్ ప్రస్తావిస్తూ.. ఇప్పుడు తాను తన పార్టీ, విపక్షం మధ్య సరిహద్దులో యోధుడిలా ఉన్నానని పేర్కొన్నారు. ‘సరిహద్దులకు ఎవరిని పంపిస్తారు? అత్యంత బలమైనవాడినే పంపిస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ ప్రయోజనాలను కాపాడుతానన్నారు. ‘నా సీట్ మారేముందు నేను సేఫ్. ప్రభుత్వంలో భాగంగా ఉండేవాడిని. ఇప్పుడు నా స్థానం స్పీకర్, చీఫ్ విప్ ఎందుకు మార్చారా అని రెండు నిమిషాలు ఆలోచించాను. ఇది విపక్షంతో పోరాటంలో కీలకమైన బోర్డర్ స్థానం అని అర్థం చేసుకున్నా. నాకు ఒకవైపు అధికార పక్షం. మరోవైపు ప్రతిపక్షం. సరిహద్దులకు ఎవరిని పంపిస్తారు? శక్తిమంతుడైన యోధుడినే కదా!’ అన్నారు. ‘మా సమస్యలను డాక్టర్‌కు వివరించాం. చికిత్స తరువాత ఇప్పుడు మొత్తం 125 మంది సభ్యులం ఇక్కడ సభలో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. తిరుగుబాటు అనంతరం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పైలట్ సమావేశమై రాష్ట్ర నాయకత్వంపై తన ఫిర్యాదులను వివరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సయోధ్య కుదిరి తిరిగి ఆయన పార్టీ గూటికి వచ్చారు. అదే విషయాన్ని ఆయన డాక్టర్‌ను కన్సల్ట్ అయినట్లుగా నర్మగర్భంగా వెల్లడించారు. -
కొత్తగా తెరపైకి సంజయ్ జైన్..
జైపూర్: రాజస్తాన్ లో ఈ వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం దాదాపు ముప్పావు గంట పాటు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరపాలా? వద్దా? బలనిరూపణకు వెళ్లాలనుకుంటే.. ఎప్పుడు వెళ్లాలి? తదితర విషయాల్లో తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆదివారం వ్యాఖ్యానించారు. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా ) యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ విప్‌ను ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పైలట్ సహా 19 ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులను కూడా స్పీకర్ జారీ చేశారు. ఆ నోటీసులపై పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు(సోమవారం) డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. దాంతో హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. ఇందులోపైలట్ సహా ఆయన వర్గం 19 మంది ఎమ్మెల్యేలు. ఈ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ల సహకారం లేకుండా, గహ్లోత్ విశ్వాస పరీక్షలో ఎలా నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రభుత్వ కూల్చివేత కుట్రకు సంబంధించి బయటపడిన ఆడియో టేప్‌లు నిజమైనవేనని సీఎం గహ్లోత్ తేల్చి చెప్పారు. బీజేపీ చెబుతున్నట్లు ఆ ఆడియో టేప్‌లు నకిలీవైతే.. రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు. షెకావత్ రాజీనామా చేయాలి: రాజస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయమై వెలుగు చూసిన ఆడియో టేప్‌ల్లో షెకావత్ సంభాషణలు బయటపడడాన్ని ప్రస్తావిస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ షెకావత్ రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. మరో వైపు, పైలట్‌ను తిరిగి కుటుం బం(పార్టీ)లోకి రావాలని కాంగ్రెస్ అధికా ర ప్రతినిధి సూర్జేవాలా మరో సారి కోరారు. బీజేపీ వల నుంచి ఇకనైనా బయటపడాలని సూచించారు. విశ్వాస పరీక్షతో బలం తేలుతుంది అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ద్వారానే మెజారిటీ తేలుతుందని బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. ‘గవర్నర్‌తో భేటీలో సీఎం ఏం చెప్పారనేది ఎవరికీ తెలియదు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితా ఇచ్చి ఉండవచ్చు, లేదా ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి ఉండవచ్చు. కానీ అంతిమంగా అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే మెజారిటీ ఉందా? లేదా? అనేది స్పష్టమవుతుంది’ అన్నారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్..! సచిన్ పైలట్ తిరుగుబాటుతో హుటాహుటిన జైపూర్‌కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేలిన తరువాత కూడా జైపూర్‌లోనే ఉంటూ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడమొక్కటే కాదు..ముఖ్యంగా బీజేపీకి, సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నామని చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలలోని కొందరితో టచ్‌లో ఉంటూ, పైలట్ వర్గం భవిష్యత్ వ్యూహాలను తెలుసుకుంటోంది. కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే.. శనివారం సీఎం గహ్లోత్ అకస్మాత్తుగా గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి, బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను చూపారు. కాంగ్రెస్(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ భావిస్తున్నారు. దాంతో, ఈ వారం విశ్వాస పరీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అకస్మాత్తుగా విశ్వాస పరీక్షకు వెళ్లాలన్న ఆలోచన వెనుక, పైలట్ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు లాగే వ్యూహముందని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అనర్హత విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలు తమకున్నారని ధీమాగా ఉంది. అనర్హత వేటు వేసేందుకు వీలు కలగనట్లైతే.. మెజారిటీ మార్క్‌కి మించి, 103 మంది సభ్యులు మద్దతిస్తున్నారని చెబుతోంది. ‘అనర్హత వేటు వేసేందుకు వీలు కలిగితే.. 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 19 మంది అనర్హులుగా తేలుతారు. దాంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. అప్పుడు మెజారిటీ మార్క్ 91 అవుతుంది. ఆ మార్క్‌ను గహ్లోత్ సునాయాసంగా చేరుకుంటారు’ అని విశ్వసిస్తోంది. సంజయ్ జైన్ ఎవరు? రాజస్తాన్ సంక్షోభంలో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు సంజయ్ జైన్. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియోటేప్ల్లో ఉన్నది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్జైన్ల స్వరాలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఆ గొంతులు తమవి కావని వారు స్పష్టం చేశారు. జైన్ బీజేపీ వ్యక్తి అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. తమ పార్టీకి అతడితో ఏ సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. అయితే, జైన్ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఆయన బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధర రాజెతో దిగిన ఫొటో ఉంది. అలాగే, రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా జైన్ పాల్గొన్నట్లుగా ఫొటోలు ఉన్నాయి. కాంగ్రెస్ ఫిర్యాదుపై షెకావత్, శర్మలతో పాటు జైన్‌పై కూడా రాజస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. మాజీ సీఎం వసుంధర రాజెను ఒకసారి కలవమని, బీజేపీలో చేరమని తనను సంజయ్ జైన్ 8 నెలల క్రితమే కోరారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుహ తాజాగా వెల్లడించారు. -
బలపరీక్ష నెగ్గిన చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు హాజరుకాలేదు. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సభా విశ్వాసం కోరుతూ ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ దేవ్డా స్పీకర్‌గా వ్యవహరించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ సారథ్యంలోని ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు దేవ్డా ప్రకటించారు. బహుజన్ సమాజ్‌పార్టీకి చెందిన ఇద్దరు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యేలు సురేంద్ర సింగ్, విక్రమ్‌సింగ్ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఈ బలపరీక్షలో మద్దతు తెలిపారు. స్వతంత్ర ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు గైర్హాజరయ్యారు. విశ్వాస పరీక్ష అనంతరం సభను ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు దేవ్డా ప్రకటించారు. సభకు ముందు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. -
నేడు మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి, బలం నిరూపణ జరపాలని స్పీకర్ ఎన్పీ ప్రజాపతిని ఆదేశించింది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీని 26వ తేదీకి స్పీకర్ వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మరో ఎంపీ పిటిషన్లు వేశారు. గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం దాదాపు 8 సూచనలను వెలువరించింది. ‘అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష జరపాలని సూచిస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సభ మద్దతు ఉన్నదీ లేనిదీ నిర్ధారించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. సభ్యులు చేతులు ఎత్తి విశ్వాసం ప్రకటించాలి’అని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ‘బెంగళూరులో ప్రస్తుతం మకాం వేసి ఉన్న 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఒత్తిడులు, అడ్డంకులు లేకుండా చూడాలి. ఇతర పౌరుల మారిదిగానే వారిని స్వేచ్ఛగా ఉండనివ్వాలి’అని మధ్యప్రదేశ్, కర్ణాటక డీజీపీలను ఆదేశించింది. ‘అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలనుకున్న ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలి. సభా కార్యక్రమాలను వీడియో తీయించాలి. నిబంధనలకు లోబడి విశ్వాస పరీక్షను లైవ్‌లో కూడా ప్రసారం చేయవచ్చు. విశ్వాస పరీక్ష సమయంలో సభలో శాంతి, భద్రతలకు విఘాతం కలగరాదు. ఈ కార్యక్రమాలన్నీ మార్చి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ముగియాలి. ఈ సమాచారాన్ని గవర్నర్‌కు తెలియజేయాలి’అని స్పీకర్‌కు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. -
కమల్‌నాథ్‌కు ‘కోవిడ్’ ఊరట?
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి కోవిడ్‌తో తాత్కాలిక ఊరట లభించనుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కానుండగా ఎమ్మెల్యేల వేరు కుంపటితో ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. కోవిడ్ భయంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తత ప్రకటించాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పలు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన కీలకమైన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించింది. శనివారం మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోత్ మీడియాతో మాట్లాడారు. ‘వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైనా నిపుణులతో చర్చిస్తున్నాం’ అని తెలిపారు. అసెంబ్లీ వాయిదాపడితే విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవసరం కూడా ప్రస్తుతానికి కమల్‌నాథ్ ప్రభుత్వానికి తప్పనుంది. విశ్వాసపరీక్ష జరపాలి: బీజేపీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం గవర్నర్ టాండన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనారిటీలో పడింది. బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆదివారమే బలపరీక్ష చేపట్టాలి’ అని గవర్నర్‌ను కోరామన్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం విమానాశ్రయం నుంచి వెళ్తున్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఎదుట నల్ల జెండాలు ప్రదర్శించిన 35 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
విశ్వాస పరీక్షకు సిద్ధం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందా యంలో పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన గవర్నర్ లాల్జీ టాండన్‌ని కలిసి ఓ లేఖ అందజేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నిర్బంధంలో ఉంచి బేరసారా లాడుతోందని ఆరోపించారు. ఈనెల 3, 4 తేదీల నుంచి 10వ తేదీ వరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పడిందన్నారు. బెంగుళూరులో నిర్బంధంలో ఉంచిన 22 మంది ఎమ్మెల్యేలను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌ని కోరినట్టు వెల్లడించారు. ఏ క్షణంలోనైనా విశ్వాస పరీక్ష జరగొచ్చని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కోరిన మేరకు జ్యోతిరా దిత్య సింధియాకు అనుకూ లంగా రాజీనామా సమర్పించిన 22 మందిలో ఆరుగురు మంత్రులను తొలగించినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించిం ది. ఇదిలా ఉండగా, మంత్రులతో సహా శాసన సభ్యులు బెంగళూరులోని రిసార్ట్స్‌లో తాము బందీలుగా ఉంచామంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. భోపాల్ బయలుదేరిన ఆరుగురు మంత్రులు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేసేందుకు బెంగళూరు రిసార్టులో ఉన్న ఆరుగురు మంత్రులు భోపాల్ బయలుదేరారు. వీరి రాక సందర్భంగా భోపాల్, బెంగళూరు విమానాశ్రయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారంలోగా తన ముందు వ్యక్తిగతం గా హాజరవ్వాల్సిందిగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభకు సింధియా నామినేషన్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఉన్నారు. -
విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. విధానసౌధలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించారు. అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప ‘నా నేతృత్వంలోని మంత్రివర్గంపై ఈ సభ విశ్వాసం ఉంచుతోంది’ అనే ఏకవాక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ..‘నేను ప్రతీకార రాజకీయాల జోలికిపోను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పాలనా యంత్రాంగం నిర్వీర్యమైంది. దీన్ని చక్కదిద్దడమే మా తొలి ప్రాధాన్యత’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్–జేడీఎస్ సభ్యులు డివిజన్ కోరకపోవడంతో విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే. ఇది అనైతిక ప్రభుత్వం.. విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి యడియూరప్పపై నిప్పులు చెరిగారు. ‘యడియూరప్ప నేతృత్వంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదు. కేవలం 105 మంది ఎమ్మెల్యేలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ మీరెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూద్దాం!’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ..‘మీరు(బీజేపీ) కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పనులు, ఈ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. విశ్వాసఘట్టం ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై దృష్టిసారిస్తామని బీజేపీ నేత సురేశ్ కుమార్ తెలిపారు. స్పీకర్ రాజీనామా.. అసెంబ్లీలో విశ్వాసతీర్మానం ఆమోదం పొందినవెంటనే తాను స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్ కుమార్ ప్రకటించారు.‘రాజ్యాంగాన్ని అనుసరించి మనస్సాక్షి ప్రకారం విధుల్ని నిర్వర్తించాను. స్పీకర్ కుర్చీ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషిచేశాను. ప్రజలు మీకు(యడియూరప్ప) రెండో అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపానలతో మీదైన ముద్ర వేయండి’ అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి అందించి సభనుంచి నిష్క్రమించారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ఉద్దేశించిన ఆర్థికబిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
పరీక్షలో నెగ్గిన సావంత్
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలో 36 మంది ఉన్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించగా, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం సావంత్ మాట్లాడుతూ.. పాజిటివ్‌గా ఉండాలి అనే పారికర్ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకోవాలని కోరారు. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్‌మృదులా సిన్హా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. 11 మంది బీజేపీ, ముగ్గురు చొప్పున గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. 14 మంది కాంగ్రెస్, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటేశారు. -
గోవాలో గట్టెక్కిన కాషాయ బలం
పణజీ: గోవాలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. సీఎం మనోహర్ పరీకర్ మరణంతో ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ ప్రభుత్వం బుధవారం విశ్వాస పరీక్షలో నెగ్గింది. గవర్నర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక శాసనసభ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం 20-15 ఓట్లతో బలపరీక్షలో విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ 19 కాగా.. బీజేపీ ఒక ఓటు ఎక్కువే సాధించింది. గోవా అసెంబ్లీలో మొత్తం స్థానాలు 40 కాగా, ప్రస్తుత సభ్యుల సంఖ్య 36. బీజేపీకి సొంతంగా 12 మంది సభ్యులు ఉండగా. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి మూడు, గోవా ఫార్వర్డ్ బ్లాక్‌కు మూడు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఒక్క ఎన్సీపీ సభ్యుడు ఉన్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లకుగాను మనోహర్ పరీకర్, అంతకుముందు ఓ బీజేపీ సభ్యుడి మృతి, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు బీజేపీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 36కు పడిపోయింది. మారిన పరిస్థితుల్లో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బీజేపీ రెండు మిత్రపక్షాలు డిమాండ్ చేయడంతో గోవాలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడుతుందని అందరూ భావించారు. చివరకు రెండు మిత్ర పక్షాలకు ఉప ముఖ్యమంత్రి పదవులకు అంగీకరించడంతో సంధి కుదిరింది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ సీఎంగా ప్రమాణం చేయగా, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అతి చిన్న రాష్ట్రమైన గోవాకు ఇద్దరు డిప్యూటి ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ త్వరగా పావులు కదిపి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు ముగ్గురు స్వతంత్య్ర సభ్యుల మద్దతును సేకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్‌ను బీజేపీ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది. (చదవండి : రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా?) -
బ్రెగ్జిట్ సుడిగుండంలో థెరిసా మే
బ్రెగ్జిట్ పరిణామాలతో బ్రిటిష్ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి (బ్రెగ్జిట్) సంబంధించిన విధివిధానాలపై ప్రధానమంత్రి థెరిసా మే ప్రవేశపెట్టిన ఒప్పంద ముసాయిదాకు కేబినెట్ ఆమోదం లభించినప్పటికీ, సొంత పార్టీలో (కన్సర్వేటివ్) తిరుగుబాటు తలెత్తింది. పలువురు కేబినెట్ సహచరులు ఇప్పటికే రాజీనామా చేశా రు. ప్రతిపక్ష లేబర్ పార్టీ, మిత్రపక్షమైన డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ దీన్ని తీవ్రంగా విభేదిస్తున్నాయి. చీలిపోయిన పార్టీ దేశానికి దిశానిర్దేశకత్వం చేయలేదని బ్రిటిష్ మీడియా విశ్లేషిస్తోంది. క్రిస్మస్‌లోగా థెరిసా పదవి నుంచి తప్పుకోవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. బ్రెగ్జిట్ సాధ్యమా? నవంబరు 25న జరిగే ఈయూ ప్రత్యేక సమావేశంలో ఈ ఒప్పందంపై యూనియన్ నాయకులు సంతకాలు చేసే అవకాశముంది. దాని కంటే ముందు, ఈయూలోని 27 దేశాల్లో 65 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే 20 దేశాలు దీనిపై ఆమోదముద్ర వేయాలి. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఇవన్నీ డిసెంబరులోగా పూర్తి కావాల్సి వుంది. డిసెంబరులో బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సివుంది. నేడు అవిశ్వాసం..? నిబంధనల ప్రకారం – పార్లమెంట్లో 15శాతం మంది (48మంది ఎంపీలు) అవిశ్వాస లేఖలు సమర్పిస్తే ప్రధాని సాధ్యమైనంత త్వరగా సభ విశ్వాసం పొంది తీరాలి. ఇప్పటికి 21 మంది ఎంపీలు అవిశ్వాస లేఖలు సమర్పించినట్టు ప్రకటించారు. అయితే, ఈ సంఖ్య 48కి చేరిందని కొందరు కన్జర్వేటివ్ బ్రెగ్జిటీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం థెరిసా విశ్వాస పరీక్ష ముప్పును ఎదుర్కొంటున్నారు. ► నెట్సెన్ ఇటీవల జరిపిన సర్వే ప్రకారం – తాజాగా 59 శాతం మంది బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్నారు. (2016 జూన్ 23న జరిగిన రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం, వ్యతిరేకంగా 48.1 శాతం ఓట్లు వచ్చాయి). ► ఈయూలో ఉండటం వల్ల బ్రిటన్ నష్టపోతున్నదంటున్నారు బ్రెగ్జిటీర్లు.. రాజకీయ సంకోభాన్ని నివారించాలంటే మరో రెఫరెండానికి వెళ్లాల్సిందేనని, పార్లమెంట్ రెఫరెండానికే ఓటు వేస్తుందని కన్సర్వేటివ్ పార్టీ ‘పీపుల్స్ ఓట్’ క్యాంపెయినర్లు భావిస్తున్నారు. ► బ్రెగ్జిట్ ముసాయిదా ఉభయ పక్షాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉందంటున్నారు ఈయూ మధ్యవర్తి మైఖేల్ బెర్నర్. దీనిపై మరోసారి చర్చలు జరిపేది లేదని జర్మనీ చాన్సరల్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ► ఈ ఒప్పందం బెస్ట్ డీల్.. ఒకవేళ బ్రెగ్జిట్ విషయంలో బ్రిటన్ వెనక్కి మళ్లినా అందుకు తాము సిద్ధమేనని అంటున్నారు ఈయూ అధ్యక్షుడు డొనాల్ట్ టస్క్. బ్రెగ్జిట్ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ► 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమిస్తుంది. తర్వాత మొదలయ్యే 21 మాసాల పరివర్తనా కాలంలో.. ఎటువంటి సుంకాలు లేకుండా ఈయూ–యూకే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. ఈయూ నిబంధనలను బ్రిటన్ అనుసరించాల్సివుంటుంది. ► ఆర్థిక లావాదేవీల పరిష్కారంలో భాగంగా విడిపోయేటప్పుడు ఈయూకి బ్రిటన్ 39 బిలియన్ పౌండ్లు (5100 కోట్లు) చెల్లించాలి. ► పౌరుల నివాస హక్కులకు ఈ ఒప్పందం గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పుడు వున్న చోటే చదువుకుని, ఉద్యోగాలు చేసే వీలుంటుంది. ► బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో భాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరు. రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు. -
బ్రెగ్జిట్‌పై ముందుకే థెరెసా మే
లండన్: ప్రస్తుతం కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందంపై స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగేందుకే బ్రిటన్ ప్రధాని థెరెసా మే మొగ్గుచూపుతున్నారు. పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమేనన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రజల భయాలను పోగొట్టేందుకు వారడిగే ప్రశ్నలకు తానే జవాబుచెప్తానన్నారు. యురోపియన్ యూనియన్ (ఈయూ)తో థెరెసా కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం ముసాయిదా బుధవారం విడుదలైనప్పటి నుంచి మంత్రులు సహా కొందరు ఎంపీలు థెరెసాను వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం బ్రిటన్ ప్రజలకు మంచిదేననీ, తన దృక్పథంలో ఇది అత్యుత్తమ ఒప్పందమన్నారు. -
కారం పొడి చల్లుకున్న ఎంపీలు!
కొలంబో: శ్రీలంక పార్లమెంట్ శుక్రవారం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. గురువారం రాత్రి అధ్యక్షుడు సిరిసేన అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి, మరోసారి విశ్వాస పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాగా రాజపక్స మద్దతుదారులైన యూపీఎఫ్ఏ ఎంపీలు కొందరు స్పీకర్ కుర్చీని ఆక్రమించారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఫర్నిచర్ విరగ్గొట్టారు. పుస్తకాలను విసిరేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లారు. దీంతో స్పీకర్ పోలీసులను పిలిపించారు. సభ్యులను సముదాయించేందుకు యత్నించిన పోలీసులపైకి కూడా వారు కారం చల్లారు. ఈ దాడిలో ప్రత్యర్థి పార్టీల సభ్యులు కొందరు గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్..సభను సోమవారానికి వాయిదా వేస్తూ పోలీసు రక్షణ నడుమ బయటకు వెళ్లిపోయారు. -
లంక పార్లమెంటులో ముష్టిఘాతాలు
కొలంబో: శ్రీలంక పార్లమెంట్ గురువారం యుద్ధ భూమిని తలపించింది. సభ్యులు పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చేతి కందిన వస్తువులను విసిరేసుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ స్పీకర్‌ను కొందరు సభ్యులు చుట్టుముట్టగా మరికొం దరు ఆయనకు రక్షణగా నిలిచారు. ఒక సభ్యుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం పార్లమెంట్లో జరిగిన బలపరీక్షలో ప్రధాని మహింద రాజపక్స ఓటమి పాలైన విషయం తెలిసిందే. గురువారం సభ సమావేశం కాగానే ఉద్వాసనకు గురైన ప్రధాని రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌పై ఓటింగ్ జరపాలని కోరారు. ఇందుకు స్పీకర్ జయసూర్య అంగీకరించడంతో సభలో గొడవ మొదలైంది. రాజపక్స మాట్లాడేందుకు యత్నించగా సభలో విశ్వాసం కోల్పోయినం దున ప్రధానిగా కాకుండా కేవలం ఎంపీగానే ఆయన్ను గుర్తిస్తానని జయసూర్య ప్రకటిం చారు. ఓటింగ్‌కు సన్నద్ధమవుతున్న దశలో అధ్యక్షుడు సిరిసేన, రాజపక్స మద్దతుదారులైన కొందరు ఎంపీలు స్పీకర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించగా యూఎన్‌పీ సభ్యులు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఒక సభ్యుడు స్పీకర్ మైక్‌ను విరగ్గొట్టారు. మరొకరు డస్ట్‌బిన్‌ను, పుస్తకాలను ఆయనపైకి విసిరేశారు. విశ్వాస పరీక్షలో రాజపక్స ఓడినం దున తమదే అసలైన ప్రభుత్వమని విక్రమ సింఘేకు చెందిన యూఎన్‌పీ అంటోంది. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరి స్తున్నాననీ, ఇప్పటికీ రాజపక్సనే ప్రధాని అంటూ సిరిసేన స్పీకర్‌కు లేఖ రాయడం గమనార్హం. ప్రధానికి పార్లమెంట్లో మెజారిటీ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
‘అవిశ్వాసం’లో ఓడిన రాజపక్స
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ పార్లమెంటులో బుధవారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీ, ఇతర చిన్నాచితకా పార్టీలతో పాటు రాజపక్స కేబినెట్లోని మంత్రులు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో తాజా ప్రధాని మహింద రాజపక్స సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్ జయసూర్య ప్రకటించారు. రాజ్యాంగానికి లోబడి తదుపరి చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సిరిసేనకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తేవీలుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజపక్స ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సైన్యం, ప్రభుత్వ అధికారులకు మాజీ ప్రధాని విక్రమసింఘే పిలుపునిచ్చారు. త్వరలోనే శ్రీలంకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
పార్లమెంటు సస్పెన్షన్ ఎత్తివేత
కొలంబో: శ్రీలంకలో రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈ నెల 16 వరకు పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేసిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెనక్కు తగ్గారు. గత షెడ్యూల్ ప్రకారమే సోమవారమైన నవంబర్ 5న యథావిధిగా పార్లమెంటు భేటీ కావాలని గురువారం అధ్యక్షుడు ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. పార్లమెంటు సోమవారమే భేటీ అవుతుందన్న సమాచారం అవాస్తవమనీ, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే వార్త అని సిరిసేన పార్టీకి చెందిన నాయకుడు సుశీల్ ప్రేమజయంత అన్నారు. ఈ నిర్ణయంతో శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికీ తానే దేశానికి అసలైన ప్రధానిననీ, విశ్వాసపరీక్షలో తామే విజయం సాధిస్తామని పదవీచ్యుత ప్రధాని రణిల్ విక్రమసింఘే ధీమా వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇటీవలి కాలంలో ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న సిరిసేన.. గత నెలలో విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి దించేశారు. మాజీ అధ్యక్షుడు రాజపక్సతో సిరిసేన చేతులు కలిపి ఆయనను కొత్త ప్రధానిగా నియమించారు. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటులో అత్యధిక మంది సభ్యులు తమ పార్టీవారేననీ, ప్రజలు ఎన్నుకున్న అసలైన ప్రధానిని తానేనని విక్రమసింఘే వాదిస్తూ వచ్చారు. తనను పదవి నుంచి దించేస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అక్రమమని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకునేందుకు వెంటనే సభను సమావేశపరిచి విశ్వాసపరీక్షను నిర్వహించాలని విక్రమసింఘే గతంలో డిమాండ్ చేశారు. అయితే సిరిసేన అందుకు విరుద్ధంగా పార్లమెంటును ఈ నెల 16 వరకు సుప్తచేతనావస్థలోకి పంపారు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు తలెత్తుతాయని పార్లమెంటు స్పీకర్ కరూ జయసూర్య అధ్యక్షుణ్ని హెచ్చరించారు. విక్రమసింఘేనే ప్రధానిగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రపంచ దేశాలు కూడా రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందిగా శ్రీలంక రాజకీయ పార్టీలను కోరాయి. ఫిరాయింపులు పూర్తయినట్లేనా? వాస్తవానికి శ్రీలంక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విక్రమసింఘేను సిరిసేన పదవి నుంచి దించేయడంతో పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరిచి విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా విక్రమసింఘే కోరారు. అందుకు విరుద్దంగా అధ్యక్షుడు పార్లమెంటును 16వ తేదీ వరకు సుస్తచేతనావస్థలోకి పంపారు. కాగా, పార్లమెంటులోని మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా, విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే సిరిసేన–రాజపక్సల పార్టీలు రెండూ కలిసినా పార్లమెంటులో వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘే పార్టీకి సొంతంగా 106 మంది సభ్యులు ఉండటంతోపాటు కొన్ని చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. దీంతో ఎక్కువ సమయం తీసుకుని మరింత మంది సభ్యుల మద్దతు కూడగట్టి విశ్వాసపరీక్షలో రాజపక్స నెగ్గేందుకే అధ్యక్షుడు సభను తాత్కాలికంగా రద్దు చేశారని వార్తలు ఉన్నాయి. ఇప్పటికే ఆరుగురు సభ్యులు విక్రమ సింఘే వైపు నుంచి రాజపక్స వైపుకు మారిపోయారు. మరోవైపు పార్లమెంటును 16 వరకు రద్దు చేసినప్పటికీ మళ్లీ సోమవారం అధ్యక్షుడు సమావేశపరుస్తున్నారు. అంటే బలపరీక్షలో గెలిచేందుకు అవసరమైనంత మంది సభ్యులను ఇప్పటికే రాజపక్స తనవైపునకు తిప్పుకున్నారా అని ప్రశ్న తలెత్తుతోంది. విశ్వాసపరీక్షలో ఎవరు నెగ్గుతారో తెలుసుకునేందుకు ఆ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
యడ్డీ గట్టెక్కేదెలా..?
న్యూఢిల్లీ: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ముందు బలనిరూపణ పెద్ద సవాలుగా నిలిచింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీ బలం 105 మాత్రమే. మెజారిటీ మేజిక్ ఫిగర్ మాత్రం 112. ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నెగ్గడమెలా? ఇందుకు సంబంధించి యడ్యూరప్ప ముందు రెండు మార్గాలున్నాయి. అవి.. 1. విపక్ష సభ్యుల గైర్హాజరు విశ్వాస పరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన కనీసం 13 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా చేయాలి. లేదా అసెంబ్లీకి హాజరైనా ఓటింగ్‌లో పాల్గొనకుండా చూడాలి. దానివల్ల అసెంబ్లీకి హాజరై ఓటేసే ఎమ్మెల్యేల సంఖ్య 209కి పడిపోతుంది. అప్పుడు హాజరైన లేదా ఓటేసిన ఎమ్మెల్యేల్లో యూడ్యూరప్పకు మెజారిటీ(సగం కన్నా ఒకరు ఎక్కువ) లభిస్తే సరిపోతుంది. అంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే యడ్యూరప్ప గట్టెక్కుతారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీకి ఇప్పటికే 105 మంది శాసన సభ్యుల మద్దతుంది. గైర్హాజరైన లేదా ఓటేయని ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు బహిష్కరిస్తే ఉప ఎన్నికలు జరుగుతాయి. 2. కాంగ్రెస్, జేడీఎస్‌ల్లో చీలిక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో.. ఏ ఒక్క పార్టీ నుంచైనా కనీసం మూడింట రెండొంతుల మంది ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ నుంచి కనీసం 52 మంది లేదా జేడీఎస్ నుంచి 24 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలి. కాంగ్రెస్ నుంచి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు వస్తే బీజేపీ బలం 157 చేరుతుంది. లేదా జేడీఎస్ నుంచి మూడింట రెండొంతుల మంది వస్తే బీజేపీ బలం 129కి చేరుతుంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ఒప్పించడం కష్టసాధ్యమే. -
యజమానిని గెలిపించిన శునకం!
సుభాష్‌నగర్: శునకాలంటే అతనికి ఎంతో మక్కువ... రెండు కుక్కలను తెచ్చి ప్రాణపదంగా పెంచుకుంటున్నాడు. వాటిలో ఓ కుక్క కనిపించకుండాపోయింది. దాని కోసం అన్ని చోట్ల వెదికినా ఫలితంలేదు. 20 రోజుల తర్వాత కనిపించిన ఆ శునకం యజమానిని ‘విశ్వాస పరీక్ష’లో నెగ్గించి మళ్లీ ఆయన చెంతకు చేరిం ది. ఆ కథా కమామీషు మీ కోసం.. సూరారం గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. రెండేళ్ల క్రితం డాబర్మాన్ జాతికి చెందిన కుక్కను తెచ్చి.. లక్కీ అని పేరుపెట్టుకొని పెంచుకుంటున్నారు. దీనికి తోడుగా మరో కుక్కను తెచ్చి బ్రౌనీ అనే పేరుపెట్టారు. జీవన్‌రెడ్డి వీటిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇరవై రోజుల క్రితం లక్కీ కనిపించకుండా పోయింది. దీంతో జీవన్‌రెడ్డి పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉండగా... బ్రౌనీ గర్భం దాల్చడం తో సైనిక్‌పురిలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి సిజేరి యన్ చేయించగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. బ్రౌనీ, దాని పిల్లలను తీసుకొని జీవన్‌రెడ్డి, ఆయన బావమరిది వినోద్‌రెడ్డి ఆటోలో శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా... సుచిత్రలోని చర్మాస్ పరి శ్ర మ వద్ద లక్కీ కనిపించింది. సూరారం గ్రామానికి చెం దిన రాజేష్ అనే వ్యక్తి దానిని వాకింగ్‌కు తీసుకెళ్తున్నా డు. వెంటనే ఆటో దిగిన జీవన్‌రెడ్డి, వినోద్‌రెడ్డిలు రాజేష్‌తో ఆ కుక్క తమదని చెప్పడంతో గొడవ జరిగింది. దీంతో స్థానికులు పోగయ్యారు. విషయం తెలుసు కున్న వారు ‘విశ్వాస పరీక్ష’ పెట్టారు. కుక్కను మధ్య లో పెట్టి జీవన్‌రెడ్డి, రాజేష్‌లను పిలవమన్నారు. వారు పిలవగానే లక్కీ తన అసలు యజమాని జీవన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి నిలబడింది. ఆ కుక్క ఆయనదేనని రుజువుకావడంతో రాజేష్ దానిని అప్పగించి వెళ్లిపోయాడు. తప్పిపోయిన లక్కీ తిరిగి రావడంతో యజమాని జీవన్‌రెడ్డి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. -
రేపట్లోగా విశ్వాస పరీక్ష!
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నబమ్ టుకీని ఈ నెల 16లోగా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ తథాగత రాయ్ గురువారం ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నబమ్ టుకీ తక్షణం అసెంబ్లీని సమావేశ పరిచి విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా గవర్నర్ లేఖ రాశారు. అసెంబ్లీ కార్యకలాపాలు శాంతియుతంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని, విశ్వాస పరీక్ష మొత్తాన్ని వీడియో తియ్యాలని, మూజువాణి ఓటుతో కాకుండా డివిజన్(ఓటింగ్) ద్వారానే మెజారిటీ నిరూపించుకోవాలని ఆ లేఖలో సూచించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం గురువారం సాయంత్రం ఈటానగర్ చేరుకున్న నబమ్ టుకీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు తనకు మరింత సమయం కావాలని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో బల నిరూపణ చేసుకోవడం సాధ్యం కాదని, దీనిపై గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తానన్నారు. సీనియర్ అధికారులు, ఇన్చార్జి సీఎస్ సత్యగోపాల్ తదితరులతో టుకీ సమావేశమయ్యారు. అసంపూర్తిగా నిలిచి పోయిన పథకాలను, విధానాలను ముందుకు తీసుకెళ్లడానికే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. కాగా, అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా కూడా గురువారం కార్యాలయానికి వచ్చారు. సభ నిర్వహణకు కనీసం 10-15 రోజుల సమయం అవసరమన్నారు. అరుణాచల్‌కు ఇప్పటికీ న్యాయంగా తానే ముఖ్యమంత్రి అని రెబెల్ కాంగ్రెస్ నేత కలిఖో పాల్ చెప్పారు.