Imran Khan: No-confidence Motion Against Imran Khan Tabled In Pak National Assembly - Sakshi
Sakshi News home page

Pakistan National Assembly: ఇమ్రాన్‌కు విషమ పరీక్ష

Published Tue, Mar 29 2022 5:18 AM | Last Updated on Tue, Mar 29 2022 8:25 AM

No-confidence motion against Imran Khan tabled in Pak National Assembly - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం విషమ పరీక్ష ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ఇమ్రాన్‌ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతకుముందు సభ ఆమోదించింది. దీంతో, ప్రభుత్వంపై సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. పీఎంఎల్‌ నేత షెహబాజ్‌ మాట్లాడుతూ. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 95 ప్రకారం ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై విశ్వాసం లేదని సభ తీర్మానించింది. క్లాజ్‌–4 ప్రకారం ఇమ్రాన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు’అని పేర్కొన్నారు.

అనంతరం స్పీకర్‌ సభను 31వ తేదీకి ప్రొరోగ్‌ చేశారు. కాగా, నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై సభలో ఓటింగ్‌ పెట్టేందుకు 3నుంచి 7 రోజుల వరకు గడువుంటుంది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుండటంతో అవిశ్వాసంపై ఓటింగ్‌ మార్చి 4వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. పార్లమెంట్‌లో మొత్తం సభ్యులు 342 మంది కాగా, అవిశ్వాసం గట్టెక్కేందుకు ఇమ్రాన్‌కు 172 మంది సభ్యుల మద్దతు అవసరముంది. అధికార పీటీఐకి 155 మంది సభ్యులుండగా, నాలుగు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 179 మంది సభ్యుల బలముంది. అయితే, ఇమ్రాన్‌ సొంత పీటీఐ పార్టీకి చెందిన సుమారు 25 మందితోపాటు అధికార సంకీర్ణ కూటమిలోని 23 మంది సభ్యులు ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement