భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు హాజరుకాలేదు. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సభా విశ్వాసం కోరుతూ ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ దేవ్‌డా స్పీకర్‌గా వ్యవహరించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ సారథ్యంలోని ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు దేవ్‌డా ప్రకటించారు. బహుజన్ సమాజ్‌పార్టీకి చెందిన ఇద్దరు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యేలు సురేంద్ర సింగ్, విక్రమ్‌సింగ్ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఈ బలపరీక్షలో మద్దతు తెలిపారు. స్వతంత్ర ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు గైర్హాజరయ్యారు. విశ్వాస పరీక్ష అనంతరం సభను ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు దేవ్‌డా ప్రకటించారు. సభకు ముందు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment