మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుతోంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీలో ముగ్గురు కీలక నేతల పరిస్థితి ఆసక్తికరంగా మారింది. శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజె సింధియా, రమణ్‌సింగ్ గతంలో అన్నీ తామై ఒంటి చేత్తో ఎన్నికల భారం మోసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బీజేపీ అధిష్టానం కొత్తగా తెరపైకి తెచ్చిన సమష్టి నాయకత్వ సూత్రాన్ని మూడు రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని అసలు ఉద్దేశం వారు ముగ్గురినీ పక్కన పెట్టడమేనని చెబుతున్నారు. అక్కడ సీఎం అభ్యర్థులుగా ఎవరినీ ప్రకటించకపోవడం అందులో భాగమేనని అంటున్నారు.
శివరాజ్‌కు బై బై...!
మధ్యప్రదేశ్‌లో శివరాజ్ రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముఖ్యంగా సీఎంగా ఉమాభారతి దారుణమైన పనితీరు అనంతరం బాబూలాల్ గౌర్‌కు అవకాశమిచ్చి భంగపడ్డాక చివరికి శివరాజ్‌కు ప్రభుత్వ పగ్గాలను పార్టీ అప్పగించింది. దాన్ని ఆయన రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. వరుసగా రెండుసార్లు పార్టీని గెలిపించి 13 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నరేంద్ర మోదీ ప్రాభవానికి ముందు జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక నేతగా ఎదిగేలా కనిపించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైంది.
కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలి 2020లో నాలుగోసారి శివరాజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇమేజీ, ఆదరణ ఈ మూడు సంవత్సరాల్లో క్రమంగా తగ్గుముఖమే పడుతూ వచ్చాయి. దాంతో మోదీ–అమిత్ షా ద్వయం ఆయనపై బాగా అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అందుకే ఈసారి శివరాజ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లరాదని నిర్ణయించారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలకు కొద్ది నెలల ముందునుంచే శివరాజ్ ప్రాధాన్యం మరింత తగ్గుతూ వచి్చంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం ఆ దిశగా మరింత బలమైన సంకేతాలే అని చెప్పొచ్చు.
► ఈసారి బీజేపీ నెగ్గినా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్గీయ ముఖ్యమంత్రి అభ్యర్థులవుతారని చెబుతున్నారు.
► లేదంటే మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ద్వారా కమల్‌నాథ్ సర్కారు పుట్టి ముంచిన జ్యోతిరాదిత్య సింధియాకు కుర్చీ దక్కినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.
వసుంధరకు వీడ్కోలే..!
రాజస్తాన్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకురాలు వసుంధర రాజె సింధియాదీ దాదాపు అదే పరిస్థితిలా ఉంది. భైరాన్‌సింగ్ షెకావత్ అనంతరం రాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడిపిన నాయకురాలిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఈ రోజుకూ రాజస్తాన్ బీజేపీలో కరిష్మా ఉన్న నాయకురాలు వసుంధరా రాజె మాత్రమే. అంతేగాక ప్రజాదరణ విషయంలో ఇప్పటికీ ఆమెకు తిరుగులేదనే చెప్పాలి.
ఆమెకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నాయకత్వం తెరపైకి తెస్తున్న అర్జున్‌రామ్ మెఘ్వాల్, సతీశ్ పునియా, సీపీ జోషీ, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా తదితరులెవరూ సామాన్య ప్రజానీకంలో మంచి ప్రజాదారణ ఉన్న నాయకులు కాదు. పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వారికి పెద్ద ఆదరణ లేదు. అయినా సరే, బీజేపీ ఈసారి వసుంధరకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండానే ఎన్నికల బరిలోకి దిగింది! కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఆయన మంత్రివర్గ సహచరులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలకు ప్రధానిగా మోదీ కరిష్మా తోడై సులువుగా గెలుస్తామని నమ్ముతోంది. అనంతరం రాష్ట్రంలో కొత్త నాయకులను తీర్చిదిద్దుకోవడం కష్టమేమీ కాదనే భావనలో ఉంది.
రమణ పర్వానికి తెర!
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పరిస్థితి మరీ ఆశావహంగా ఏమీ లేదు. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ దూకుడు మీదున్నారు. రకరకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల హామీల సమర్థ అమలు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 15 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా చేసిన రమణ్‌సింగ్‌ను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టినట్టుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగించేదే. ఫలితంగా బీజేపీకి ఒకరకంగా రాష్ట్రాస్థాయి కీలక నాయకత్వమంటూ లేకుండా పోయింది. ఏదేమైనా రాష్ట్రంలో పారీ్టకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే మోదీ–అమిత్‌షా ద్వయం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ కేవలం మోదీ కరిష్మా మీదే భారం వేసి బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ, అనంతరం కర్ణాటకలోనూ ఇదే ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న వైనాన్ని తలచుకుని బీజేపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment