
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి కోవిడ్‌తో తాత్కాలిక ఊరట లభించనుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కానుండగా ఎమ్మెల్యేల వేరు కుంపటితో ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. కోవిడ్ భయంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తత ప్రకటించాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పలు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన కీలకమైన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించింది. శనివారం మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోత్ మీడియాతో మాట్లాడారు. ‘వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైనా నిపుణులతో చర్చిస్తున్నాం’ అని తెలిపారు. అసెంబ్లీ వాయిదాపడితే విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవసరం కూడా ప్రస్తుతానికి కమల్‌నాథ్ ప్రభుత్వానికి తప్పనుంది.
విశ్వాసపరీక్ష జరపాలి: బీజేపీ
బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం గవర్నర్ టాండన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనారిటీలో పడింది. బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆదివారమే బలపరీక్ష చేపట్టాలి’ అని గవర్నర్‌ను కోరామన్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం విమానాశ్రయం నుంచి వెళ్తున్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఎదుట నల్ల జెండాలు ప్రదర్శించిన 35 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment