Outing
-
స్టన్నింగ్ డ్రెస్‌తో మెస్మరైజ్ చేసిందిగా: ధరెంతో తెలిస్తే ఔరా అంటారు!
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాదు అప్ టూ మార్క్‌గా తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంటుంది. బ్లాక్ కలర్స్ అండ్ ప్రింట్స్ ఇష్టపడే కరీనా ఇటీవలి ఔటింగ్‌లో సమ్మర్‌కు తగ్గినట్టు ప్రింటెడ్ ఓవర్సైజ్డ్ జిమ్మెర్మాన్ కో-ఆర్డ్ సెట్‌తో మెరిసింది. ఇలా స్పెషల్ లుక్‌లో అలరించిన కరీనా వేసుకున్న డ్రెస్ ఎంత అని ఇంటర్నెట్లో వెదికిన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే అక్షరాలు 75వేల రూపాయలు. ప్రింటెడ్ సిల్క్ షర్ట్ , ప్యాచ్‌వర్క్‌తో కూడిన వైబ్రెంట్ కలర్స్ వైలెట్, పింక్, గ్రీన్ పీచ్ రంగులలో పలాజోను ధరించింది కరీనా.దీనికి మ్యాచింగ్‌గా ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్ జిమ్మెర్మాన్ చెందిన సిల్క్ కో-ఆర్డ్ సెట్లో ఫ్లవర్ పైస్లీ ప్రింట్ టాప్, ఏవియేటర్-శైలి సన్ గ్లాసెస్ ఆమె లుక్ మరింత ఎలివేట్ చేసింది. కరీనా కపూర్ ఖాన్ స్టైలిష్ ఔటింగ్స్ గత ఏడాది సెప్టెంబరులో తన 42వ పుట్టినరోజు సందర్భంగా, కరీనా కపూర్ సెక్సీ జిమ్మెర్మాన్ ర్యాప్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. రూ. 59,999 విలువైన ఈ ర్యాప్ డ్రెస్‌కు తోడు మినీ బ్లాక్ బకెట్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
కమల్‌నాథ్‌కు ‘కోవిడ్’ ఊరట?
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి కోవిడ్‌తో తాత్కాలిక ఊరట లభించనుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కానుండగా ఎమ్మెల్యేల వేరు కుంపటితో ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. కోవిడ్ భయంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తత ప్రకటించాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పలు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన కీలకమైన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించింది. శనివారం మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోత్ మీడియాతో మాట్లాడారు. ‘వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైనా నిపుణులతో చర్చిస్తున్నాం’ అని తెలిపారు. అసెంబ్లీ వాయిదాపడితే విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవసరం కూడా ప్రస్తుతానికి కమల్‌నాథ్ ప్రభుత్వానికి తప్పనుంది. విశ్వాసపరీక్ష జరపాలి: బీజేపీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం గవర్నర్ టాండన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనారిటీలో పడింది. బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆదివారమే బలపరీక్ష చేపట్టాలి’ అని గవర్నర్‌ను కోరామన్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం విమానాశ్రయం నుంచి వెళ్తున్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఎదుట నల్ల జెండాలు ప్రదర్శించిన 35 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
పైప్‌కు కట్టేసి.. దారుణంగా హింసించి
డెహ్రడూన్ : బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే నేపంతో సీనియర్లు ఓ విద్యార్థిని కొట్టి చంపారనే వార్త డెహ్రడూన్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు సదరు విద్యార్థి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలోనే ఖననం చేసింది. స్థానిక మీడియా ప్రోద్బలంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకెళ్తుండగా బాధితుడు దగ్గర్లోని కిరాణ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఉపాధ్యాయులకు తెలిపాడు. దాంతో ఔటింగ్ క్యాన్సల్ అయ్యింది. బాధితుడి వల్లే ఇలా జరిగిందని భావించిన సీనియర్ విద్యార్థులు అతన్ని ఒక క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. బాధితుడి కాళ్లు చేతులను ఓ పైప్‌కి కట్టి బ్యాట్, స్టంప్స్ తీసుకోని విపరీతంగా కొట్టారు. అంతేకాక సదరు విద్యార్థి బట్టలు తొలగించి చల్లని నీటిలో ముంచారు. అంతటితో ఊరుకోక కుర్కురే చిప్స్‌ని, బిస్కెట్లని టాయిలెట్ వాటర్‌లో ముంచి తినమని బలవంతం చేశారు. దెబ్బల ధాటికి తట్టుకోలేక సదరు విద్యార్థి చేసిన ఆక్రందనలు పాఠశాలలో ఉన్న 200 మంది విద్యార్థులు కానీ.. ఉపాధ్యాయులు కానీ వినిపించలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సదరు విద్యార్థి ఒంటరిగా అదే గదిలో పడి ఉన్నాడు. సాయంకాలం వార్డెన్ ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కితే ప్రమాదం అని భావించిన పాఠశాల యాజమాన్యం సదరు బాలుడి మృతదేహాన్ని పాఠశాలలోనే ఖననం చేసింది. ఆ తర్వాత మృతుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫుడ్ పాయిజన్ వల్ల మీ అబ్బాయి చనిపోయాడని తెలిపారు. కానీ స్థానిక మీడియా విద్యార్థి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేయడం.. యాజమాన్యం కూడా బయటి వారిని లోపలికి అనుమతించకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో వారు పాఠశాలకు వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరు ఇంటర్ విద్యార్థులతో పాటు ముగ్గురు పాఠశాల సిబ్బందిని, వార్డెన్ని కూడా అరెస్ట్ చేశారు. -
పెద్దలే అబద్ధాలు చెబితే!
క్రైమ్ పేరెంటింగ్ నిజం గడపదాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందంటారు. నిప్పులాంటి నిజాన్ని కూడా మింగేసేటంత నోరెలా వచ్చింది. పెద్దల వల్లే వచ్చింది. ఊరి పెద్ద అబద్ధాలు చెబితేఆ ప్రభావం ఊరి మీద ఉండదా? అలాగే... ఇంటిపెద్ద అబద్ధం చెబితే ఆ ప్రభావం పిల్లల మీద ఉండదా? ఈ సమాజంలో అబద్ధాన్ని కాలరాసి నిజాన్ని నిలబెట్టే శక్తి ఎక్కడైనా ఉందంటే అది... మనలోనే ఉంది. మనం నిజాన్ని నిలబెట్టలేకపోతే భావి తరమే ఒక అబద్ధమైపోతుంది. ‘ఒరేయ్... చింటూ.. నిజం చెప్పు.. ఆ రోజు అక్క, రాహుల్ సినిమాకు వెళ్లారు కదూ. వాళ్లతోపాటు నువ్వూ వెళ్లావ్ కదా?’తల అడ్డంగా ఊపాడు చింటు. ‘వీడు అబద్ధం చెప్తున్నాడు పిన్నీ... ఇప్పుడు కూడా తేజస్వీ క్లాస్‌మేట్స్‌తో పిక్నిక్ అని వెళ్లడం నిజం కాదు. రాహుల్, వాడి ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కి వెళ్లింది. వీడికి ఆ విషయం తెలుసు. మనకు చెప్పట్లేదు’ ఆవేశం, బాధ, ఆవేదనతో అరిచాడు సంజయ్. అతడు చింటూకు కజిన్. తేజస్వీ అన్నయ్య. చింటు తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తల వంచుకొని గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న చింటూ దగ్గరకొచ్చి అడిగింది వాళ్ల పెద్దమ్మ అనునయంగా. ‘చెప్పు నాన్నా... తేజక్కయ్య నిజంగానే వాళ్ల ఫ్రెండ్స్‌తో వెళ్లిందా?’ చింటూ తలెత్తి హాల్లో ఉన్న పెద్దవాళ్లందరి వైపు చూశాడు. మళ్లీ తలదించుకుని గోళ్లు గిల్లుకోవడం మొదలుపెట్టాడు. వాడి ఆ చర్యతో అందరికీ చిర్రెత్తుకొచ్చింది చింటూ తల్లిదండ్రులతో సహా. సంజయ్ అయితే కోపంతో ఊగిపోయాడు.‘ఒరేయ్.. పెద్దమ్మ అడిగినదానికి సరిగ్గా జవాబు చెప్పు. ఆ నిర్లక్ష్యం ఏంటి?’ గదమాయించింది చింటూ వాళ్లమ్మ.‘నాకు తెలీదు.. తెలీదు.. తెలీదు’ అని అరుస్తూ గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు చింటూ.‘అన్నీ అబద్ధాలే పిన్నీ. వాడికి తెలుసు. వీడే తేజస్వీని బైక్ మీద బస్‌స్టాప్ పక్క గల్లీలో దింపాడట. అక్కడున్న సూపర్‌మార్కెట్ కుర్రోడు చెప్పాడు. అరే అన్నా. చింటూకి బైక్ ఎందుకు ఇస్తున్నరు. పొద్దున తేజక్కను ఎక్కించుకొని ఒచ్చిండు. కొద్దిగల పొయింది. లేకుంటే ఈడ్నే ఈ గల్లిల యాక్సిడెంట్ చేస్తుండే. మేమంతా ఉరికొచ్చినం. తేజక్క బండి దిగి ఆగంమాగం ఉరికి ఎవరి కార్లోనో ఎక్కింది. ఏంది చింటూ గంత స్పీడ్ అంటే.. అక్క ఫ్రెండ్స్‌తో బయటకు పోతుంది.. లేట్ అయితుందని స్పీడ్‌గా వచ్చిన అంతే అన్నడు... జెర భద్రం.. బండి ఇయ్యకుండ్రి.. అని చెప్పాడు ఆ కుర్రాడు. అంటే చింటూకి అన్నీ తెలిసినట్టే కదా. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఆ రోజు మూవీలో కూడా మా ఫ్రెండ్ చూశాడట. చింటూ చెప్తేనే తేజస్వీ ఎక్కడుందో తెలుస్తుంది. ఆ రాహుల్ గాడు రాస్కెల్. ప్లీజ్ పిన్నీ నువ్వయినా అడుగు వాడిని’ ఏడిచినంత పనిచేశాడు సంజయ్.చింటూ వాళ్లమ్మకు చింటూ మీద కోపం... సిట్యుయేషన్ పట్ల భయమూ... అందరిలో పరువు తీస్తున్నాడన్న అవమానమూ కలుగుతున్నాయ్. ‘అక్కయ్యా. ఎలాగైనా వాడితో నిజం చెప్పించి తేజస్వీని పదిలంగా తీసుకొచ్చే బాధ్యత మాది. కంగారు పడకండి. అది క్షేమంగానే ఉంటుంది. ఇంటికెళ్లి కాస్త రెస్ట్ తీసుకో. ఈలోపు నేను వాడితో మాట్లాడ్తా. అందరూ ఉంటే కూడా నోరు విప్పడు. వాడి మొండితనం నాకు తెలుసు’ అంది చింటూ వాళ్లమ్మ తన అక్క మాలతితో.‘కొంచెం నువ్వే బుజ్జగించాలి కల్పన.. నాకు భయంగా ఉంది. దానికి ఏం మాయమాటలు చెప్పాడో. ఎటు తీసుకెళ్లాడో. తేజస్వీ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా రాహుల్ గురించి మంచిగా చెప్పట్లేదు. అసలు వాళ్లంతా దాన్ని వారించినా అది వినలేదనే అంటున్నారు. దాన్నెంత మత్తులో పెట్టాడో చూడు వాడు. ప్లీజ్ కల్పన.. చింటూ నిజం చెప్తే వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇవ్వచ్చు’ బతిమాలింది మాలతి. ‘అయ్యో అక్కయ్యా. తేజు నాకూ కూతురే కదా. నాకు మాత్రం బెంగా, భయం ఉండవా? నేను మాట్లాడతాను’ అని అక్కకి అభయ మిచ్చి సంజయ్ వంక చూసింది కల్పన.అర్థమైనట్టుగా అందరూ లేచారు మాలతి, వాళ్లాయన, సంజయ్...వాళ్లను గేట్ దాకా సాగనంపి లోపలికి వచ్చారు కల్పన దంపతులు.చింటూ సోఫాలో కూర్చుని కనిపించాడు.వంటింట్లోకి వెళ్లి కార్న్‌ఫ్లేక్స్ కలుపుకొచ్చి చింటూకిస్తూ వాడి పక్కన కూర్చున ఉంది.‘చింటూ.. రోజూ టీవీల్లో , పేపర్లలో చూస్తున్నాం కదా. బ్యాడ్ బాయ్స్ అమ్మాయిలను తీసుకెళ్లి వాళ్లను ఎలా ఇబ్బంది పెడుతున్నారో. రాహుల్ కూడా అంతే. నీకు తెలిసింది చెప్తే తేజూను మనం జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవచ్చు’ అని ఆపి వాడిని చూసింది కల్పన.ఉదయం నుంచి జరుగుతున్న సీన్లో ఇప్పడు ఫస్ట్ టైమ్ వాడి కళ్లల్లో భయం కనిపించింది.‘తెలుసు’.. అన్నాడు నెమ్మదిగా. ఆ మాటకు ఒక్క ఉదుటున వాడి దగ్గరకు వచ్చి ‘చెప్పు ఎక్కడికి తీసుకెళ్లాడో’ అంటూ వాడి భుజాలు ఊపేస్తూ ఆవేశంగా అడిగాడు చింటూ తండ్రి.‘రాహుల్ వాళ్ల ఫామ్‌హౌజ్‌కే వెళ్లారు. ముందు రోజు రాత్రి తేజక్కయ్య రాహుల్‌తో ఫోన్లో ప్లాన్ చేసుకుంటుంటే విన్నాను’ అన్నాడు అమాయకంగా.‘మరెందుకురా అబద్ధం చెప్పావ్ తెలీదని. ఈ ముక్క అప్పుడే చెప్తే ఈ పాటికి వెళ్లేవాళ్లం కదా’ అన్నాడు కోపంగా చింటూ వాళ్ల నాన్న. ‘తేజక్కయ్య ఎవరికీ చెప్పొద్దంది. రాహుల్‌ని అడిగి ట్యాబ్ ఇప్పిస్తానంది. డ్రాప్ చేస్తే పాకెట్ మనీ ఇస్తానంది. అందుకే చెప్పలేదు’.‘తప్పు కదరా. అబద్ధం చెప్పడం. అబద్దానికి అలా డబ్బులు, గిఫ్ట్స్ తీసుకోవడం’ అంది కల్పన.‘నువ్వూ చాలాసార్లు అబద్ధం చెప్పమన్లేదా? సారీస్ అమ్మే ఆంటీ వస్తే లేనని చెప్పు కేఎఫ్‌సీ చికెన్‌కు మనీ ఇస్తా అని చెప్పలేదా? నాన్న అబద్ధం చెప్పలేదా? ప్రభాకర్ అంకుల్ వస్తే ఇంట్లో లేనని నాతో చెప్పించ లేదా? మొన్న నాన్న హెల్మెట్ లేకుండా వెళ్తుంటే పోలీస్ ఆపితే వైఫ్ హాస్పిటల్లో ఉంది... అర్జెన్సీలో హెల్మెట్ మరిచిపోయానని అబద్ధం చెప్పి తప్పించుకోలేదా. పైగా పోలీస్ అంకుల్ని ఎలా బురిడీ కొట్టించానో చూడు అని నాకు ఐస్‌క్రీమ్ కొనిపెట్టారు. మీరు అబద్ధం చెప్పినప్పుడు, నన్ను చెప్పమన్నప్పుడు డబ్బులిచ్చారు. తేజక్కయ్య కూడా అంతే చేసింది. నన్నెందుకు తప్పు పడుతున్నారు?’‘నీ వల్ల అక్కయ్య డేంజర్లో పడింది. నీకు ఆ మాత్రం తెలీదా?’‘రాహుల్ ఏం భయం లేదని చెప్పాడు. కాసేపు పార్టీ చేసుకొని వచ్చేస్తాం అన్నాడు’‘అది అబద్ధం’‘ఏమో.. నాకు మూవీకి డబ్బులిచ్చాడు’తల్లిదండ్రులిద్దరికీ కోపం వచ్చింది.‘ఇదంతా నీ వల్లే’ భార్య మీదకు తోయబోయాడు.అరచేతిని అడ్డం పెట్టి ‘ముందు బావగారికి కాల్ చేయండి. తేజు రాహుల్ వాళ్ల ఫామ్‌హౌజ్‌లో ఉన్నట్టు’ అంది. తేజస్వీ ఇంటికి చేరింది.సమయానికి తేజస్వీ అన్నయ్య ఫామ్ హౌస్‌కు వెళ్లి తేజస్వీని తేగలిగాడు. లేకుంటే ఏం జరిగేదో. తనొక్కర్తే బయటకు వెళ్లలేక చింటూ సాయం తీసుకుంది తేజస్వీ. ఇంటర్ చదువుతున్న చింటూ తన తెలిసీ తెలియని తనంతో తేజస్వీకి ప్రమాదం తెచ్చి పెట్టాడు.ఒకవేళ తేజస్వీకి ఏదైనా జరిగి ఉంటే?దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? చింటూ తల్లిదండ్రులు ఈ నిందను ఒకరి మీద ఒకరు తోయడంలో బిజీ అయిపోయారు.‘నువ్వే నేర్పావ్ వాడికి అబద్దాలు’ అని తండ్రి అంటే ‘ఇందులో మీ తప్పేం లేదా’ అని భర్తతో వాదులాటకు దిగింది తల్లి.‘నేను మగాడిని... నాకు సవాలక్ష పనులుంటాయ్... వాటి కోసం ఏవో చిన్నచిన్న అబద్ధాలు ఆడాను.. ఆడాల్సి వస్తుంది.. నీకు నాకు తేడా లేదా?’ ‘‘చిన్నదైనా.. పెద్దదైనా.. అబద్ధం అబద్ధమే. మీరు చేస్తే నిజం అవదు. నేను చేస్తే తప్పుగా మారదు. ప్రతిదానికి నా మీద పడి ఏడ్వకండి. అన్నిటికీ నన్ను తçప్పు పట్టకండి’‘పట్టకా? ఎవరని అనాలి? పిల్లలు చెడిపోతే తల్లులనే అంటారు గుర్తుంచుకో’‘మరి మీ చెడుకి మీ అమ్మను అనొచ్చా’‘నోర్ముయ్ మా అమ్మనంటావా? అసలు వాడికన్నీ నీ బుద్ధులే. అబద్ధాలు కూడా నీవే వంట బట్టాయి’ఈ వివాదం అలా సాగుతూనే ఉంది .పిల్లలు అబద్దాలకోరులుగా మారకుండా ఉండాలంటే భిన్నమైన పేరెంటింగ్ కావాలి. ఎలా ఉండాలో సైకియాట్రిస్ట్‌ని అడుగుదాం! అబద్ధాల కథలు చెప్పొద్దు అన్ని విషయాల్లో పేరెంట్స్‌ని పిల్లలు అనుకరిస్తారు. అబద్ధాల విషయంలోనూ అంతే. పరిస్థితిని తప్పించడానికో, తప్పించుకోవడానికో పెద్దలు అబద్ధం అడుతారు. అదో టెండెన్సీగా మారింది. పిల్లలు వాటిని అలవాటు చేసుకుంటారు. అందుకే పెద్దలే జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉండీ లేమని చెప్పించడం, ఎవరైనా అవసరానికి ఏదైనా అడిగితే.. అది తమ దగ్గరుందన్న విషయం పిల్లలకు తెలిసినా వాళ్లతోనే లేదని చెప్పించడం వంటివి అస్సలు చేయకూడదు. వీటిని పిల్లలు అవలీలగా అనుకరిస్తారు. పైగా అలా చేయడం తప్పుకాదని అనుకునే ప్రమాదమూ ఉంది. అంతేకాదు బయటి నుంచి మన పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారనే కంప్లయింట్స్ వస్తే.. విషయమేంటో పిల్లలనే నేరుగా అడిగి తెలుసుకోవాలి. పిల్లల వివరణను బట్టే పరిస్థితిని తెలుసుకోవాలి. అలాగే పిల్లల ఎదురుగా పెద్దవాళ్లు తాము ఆడిన అబద్ధాల విషయంలో ఒకరి మీద ఒకరు తప్పుతోసుకోవడం ఆపాలి. దీనిల్ల.. ‘ఓహో.. అబద్ధం ఆడి.. ఆ తప్పును ఇలా ఎదుటివాళ్ల మీదకు తోసేయొచ్చన్నమాట’ అని నేర్చుకుంటారు. అబద్ధం ఆడి.. దాంట్లోంచి బయటపడడాన్ని ఓ రిలీఫ్‌లా భావిస్తుంటారు. పేరెంట్స్ పిల్లలకు చిన్నప్పుడు ఒక ఊహను.. అంటే అబద్ధాన్ని ఆధారం చేసుకుని చెప్పే కథలను బాల్యానికే పరిమితం చేయాలి. పిల్లలు పెద్దాయ్యాక నిజానికి దగ్గరగా ఉన్నవాటినే చెప్పాలి. పిల్లలు ముందు తల్లిదండ్రులు ఒకరినొకరు నిందించుకోకుండా పిల్లలు లేనప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంట్లో కార్డియల్ అండ్ ట్రాన్స్పరెంట్ వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే పిల్లలు ఏ విషయాన్నయినా పెద్దవాళ్లతో నిర్భయంగా షేర్ చేసుకోగలరు. దీని వల్ల అబద్ధాలు ఆడే చాన్సెస్ చాలా తగ్గుతాయి. – డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ – శరాది -
జీవితమే ఒక పూలతోట
స్ఫూర్తి ముంబైలోని సమతానగర్లోని ఎకరన్నర ప్రదేశం... పద్ధెనిమిది వందల రకాల మొక్కలు, చెట్లతో పచ్చగా కళకళలాడుతోంది. 32 రకాల పక్షుల కిలకిలారావాలతో అలరిస్తోంది. ఈ జీవ వైవిధ్య ధామం పేరు ‘దేవ్ బాగ్’!ఒకప్పుడు ఇది చెత్తాచెదారం, పాత ఇనుప సామాన్ల డంప్‌యార్డ్‌లా ఉండేది. ఇప్పుడు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న వనంలా మారడం వెనక ఇద్దరు వ్యక్తుల కృషి ఉంది. వాళ్లే నుస్రత్, అఫ్జల్ ఖత్రి! అసలు కథ... నుస్రత్, అఫ్జల్ ఖత్రి భార్యాభర్తలు. ఇద్దరూ అరవయ్యో పడిలో ఉన్నారు. సగం జీవితం అమెరికాలో గడిపారు. సొంత దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో ఇండియాకు వచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తోచిన పనులు చేస్తూ పోయారు. అయిదేళ్ల కిందట తమ వీథిలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకొనే అనుమతి కోసం సమతానగర్ పోలీస్స్టేషన్క ు వెళ్లారు. ఏమైంది? పోలీస్ స్టేషన్ అవరణలో ఉన్న చెట్లన్నీ ఎండిపోవడాన్ని గమనించింది నుస్రత్. అఫ్జల్‌తో అంది.. ‘ఓ 30 మొక్కలను ఈ పోలీస్‌స్టేషన్‌కు డొనేట్ చేద్దామా?’ అని. మోడువారిన ఆ చెట్లను చూసిన అఫ్జల్కూ ఆ ఆలోచన బాగుందని అనిపించింది. సరే అన్నాడు. దరఖాస్తు ఇచ్చి వెళుతూ ,అక్కడున్న కానిస్టేబుళ్లకు చెప్పారు.. ‘ఈ పోలీస్ స్టేషన్‌కు 30 రకాల మొక్కలను ఇద్దామనుకుంటున్నాం.. అయితే వాటికి సరిగ్గా నీళ్లు పోసి చక్కగా చూసుకోవాలి సుమా’ అని. శ్రద్ధగా పెంచుతామని మాటిచ్చారు వాళ్లు. ఆ సంభాషణను విన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక్ మూలేకు ఆ జంట మీద విపరీతమైన గౌరవం పెరిగింది. వెంటనే సీట్లోంచి లేచి వరండాలోకి వస్తూ..‘మీకు గార్డెనింగ్ అంటే చాలా ఆసక్తి ఉన్నట్టుంది?’ అని అడిగాడు ఆ ఇద్దరినీ. నవ్వుతూ అవునన్నట్టు తలూపారు వాళ్లు. ‘అయితే నాతో రండి’ అంటూ స్టేషన్ వెనకవైపు ఉన్న ఖాళీస్థలం వైపు దారితీశాడు ఇన్స్పెక్టర్. చెత్తకుండీలా... ఆ ప్రదేశాన్ని చూసిన ఆలుమగలు ఆశ్చర్యపోయారు. దాదాపు ఒకటిన్నర ఎకరం స్థలం... మూడున్నర అడుగుల ఎత్తు మేర పేరుకుపోయిన చెత్తతో నిండి ఉంది. దుర్గంధం అక్కడ నిలువనీయట్లేదు. జప్తు చేసిన టూవీలర్స్, వదిలేసిన స్టోరేజ్ యూనిట్స్, ఇటుకలు, రాళ్ళూరప్పలు, విరిగిపోయిన వాహనాల భాగాలు, టైర్లు, కూలిన సిమెంట్ కట్టడాలు కలగలసిన పెద్ద చెత్తకుండీలా ఉంది. రెండు చేతులు వెనక్కి కట్టుకొని నిలబడ్డ ఇన్స్పెక్టర్ దీర్ఘంగా నిట్టూర్చి, ఆ దంపతుల వైపు చూస్తూ ‘దీన్ని ఏమైనా చేయగలరా... జనాలకు ఉపయోగపడేలా?’ అని అడిగాడు. అంతే దీర్ఘంగా నిట్టూర్చి ‘ప్రయత్నిస్తాం’ అని చెప్పారు ఆ దంపతులు. ఆ రోజు నుంచే... దాన్ని ఓ సవాలుగా తీసుకొని ఆ చెత్తకుప్పను తొలగించే పని ప్రారంభించారు నుస్రత్, అఫ్జల్. ముందు ఇరవై రోజులు ఈ ఇద్దరే కష్టపడ్డారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో సహా పోలీస్‌స్టేషన్‌లోని స్టాఫంతా వాళ్లకు సహాయపడ్డం మొదలుపెట్టారు. వీళ్ల కృషి గురించి తెలిసిన ఆ ప్రాంతంలోని కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు... చేయి కలిపారు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి, ముంబై మున్సిపాలిటీకి తెలిసింది. వెంటనే తగినంత మంది సిబ్బందిని పంపించారు నుస్రత్, అఫ్జల్‌కు సహాయంగా. అంతా జత కలిస్తే ఆ చెత్తను తొలగించడానికి మూడు నెలలు పట్టింది వాళ్లకు. అయిదేళ్లకు... దేశంలోని పలు ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించారు. నాటారు. చిన్న చెరువు లాంటి దాన్ని తవ్వించారు. ఆ జంటకు ప్రకృతితో ఉన్న తాత్విక అనుబంధానికి నిదర్శనంగా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దారు. వాళ్ల శ్రమ ప్రకృతి నిలయంలా మారడానికి అయిదేళ్లు పట్టింది. రకరకాల పూలు, పళ్లు కాస్తున్న చెట్లు.. తామర పూలతో లోటస్ పాండ్ అయిన తటాకం... ఎత్తయిన చెట్లకు కట్టిన తేనె తుట్టెలు.. వడివడిగా అడుగులేస్తున్న బాతులు.. గెంతుతున్న జింకలతో... నిజంగానే ఆ తోట ఇప్పుడు భూతల స్వర్గమే. రోజూ సాయంకాలైమైందంటే చాలు... స్కూల్ బ్యాగులు ఇంట్లో వదిలేసి బిలబిలమంటూ దేవ్ బాగ్‌కు పరుగులు తీస్తారు పిల్లలు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం.. ఆడుకునేందుకు పెద్ద ప్లే గ్రౌండ్ మాత్రమే కాదు వాళ్ళను ఆకర్షించేది... నుస్రత్, అఫ్జల్ చెప్పే కథలు.. పాటలు.. ఆటలు కూడా! ఈ దేవ్‌బాగ్ నిర్మాణంతో నుస్రత్, అఫ్జల్ కల తీరిపోలేదు. ముంబై లాంటి జనారణ్యాల్లో ఇలాంటి నిజమైన అరణ్యాలను ఏర్పాటు చేసి సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించాలనీ, పిల్లల కోసం ఆట స్థలాలను కాపాడాలనీ కలలు కంటున్నారు. ఆ స్వప్న సాకారానికి కంకణం కట్టుకున్నారు. నిజానికి దేవ్ బాగ్ ఘనత అంతా ఈ జంటదే అయినా ప్రేరణ సమతానగర్ పోలీస్స్టేషన్దే అని చెప్తారు. ‘పోలీసులంటే సామాన్య పౌరులకు భయం. బహుశా ఖాకీ కరుకుదనమే ప్రజలకు పరిచయం అవడం వల్ల ఆ భావన కలిగి ఉండొచ్చు. కానీ పోలీసులు సామాన్యుల స్నేహితులే అని చాటి చెప్పారు సమతానగర్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది. ఇలా పోలీసులు, సామాన్యులు కలిసి సమాజ శ్రేయస్సుకు పాటుపడొచ్చని నిరూపించారు. ఒక్క ఈ విషయంలోనే కాదు మిగిలిన సామాజిక సమస్యలు, అంశాల పట్ల కూడా పోలీసులు, సామాన్యులు కలిస్తే అద్భుతాలే జరుగుతాయి. ఈ వాతావరణం దేశమంతా వ్యాపించాలి’ అంటారు నుస్రత్, అఫ్జల్. ‘దేశం కోసం ఏదో చేయాలని ఇండియా వచ్చాం.. ఒక లక్ష్యం లేకుండా ఏది కనిపిస్తే అది చేస్తూ పోయాం. సమతానగర్ పోలీస్‌స్టేషన్ జంక్ యార్డ్‌ను చూపి. మాకో లక్ష్యాన్ని కలిపించిన వినాయక్‌కు కృతజ్ఞతలు’ అని చెప్తుంది ఈ సీనియర్ సిటిజన్ల జంట. వారు ఉదయం ఆరింటి నుంచే దేవ్బాగ్లో డ్యూటీ మొదలుపెట్టి రాత్రి తొమ్మిందింటి వరకూ ఉంటారు. ప్రతి మొక్కనూ, చెట్టునూ, చేమనూ, పక్షినీ, కీటకాన్నీ పలకరిస్తారు. యోగక్షేమాలు చూస్తారు. పసిపిల్లల్లా సాకుతారు. ఇప్పడు ఆ వనమే వాళ్ల సంతానం. సంకల్పం గట్టిగా ఉంటే ఉత్సాహమే నడిపిస్తుంది. వయసును జయించేలా చేస్తుంది అనీ నిరూపించారు నుస్రత్, అఫ్జల్. ‘దేవ్‌బాగ్’ నిర్మాతలు నుస్రత్, అఫ్జల్ ఖత్రి