జీవితమే ఒక పూలతోట | Life is a flower garden | Sakshi
Sakshi News home page

జీవితమే ఒక పూలతోట

Published Mon, Nov 28 2016 10:37 PM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM

జీవితమే ఒక పూలతోట - Sakshi

జీవితమే ఒక పూలతోట

స్ఫూర్తి

ముంబైలోని సమతానగర్‌లోని ఎకరన్నర ప్రదేశం... పద్ధెనిమిది వందల రకాల మొక్కలు, చెట్లతో పచ్చగా కళకళలాడుతోంది. 32 రకాల పక్షుల కిలకిలారావాలతో అలరిస్తోంది. ఈ జీవ వైవిధ్య ధామం పేరు ‘దేవ్ బాగ్’!ఒకప్పుడు ఇది చెత్తాచెదారం, పాత ఇనుప సామాన్ల డంప్‌యార్డ్‌లా ఉండేది. ఇప్పుడు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న వనంలా మారడం వెనక ఇద్దరు వ్యక్తుల కృషి ఉంది. వాళ్లే నుస్రత్, అఫ్జల్ ఖత్రి!
 

అసలు కథ...
నుస్రత్, అఫ్జల్ ఖత్రి భార్యాభర్తలు.  ఇద్దరూ అరవయ్యో పడిలో ఉన్నారు. సగం జీవితం అమెరికాలో గడిపారు. సొంత దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో ఇండియాకు వచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తోచిన పనులు చేస్తూ పోయారు. అయిదేళ్ల కిందట తమ వీథిలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకొనే అనుమతి కోసం సమతానగర్ పోలీస్‌స్టేషన్‌క ు వెళ్లారు. 


ఏమైంది?
పోలీస్ స్టేషన్ అవరణలో ఉన్న చెట్లన్నీ ఎండిపోవడాన్ని గమనించింది నుస్రత్. అఫ్జల్‌తో అంది.. ‘ఓ 30 మొక్కలను ఈ పోలీస్‌స్టేషన్‌కు డొనేట్ చేద్దామా?’ అని. మోడువారిన ఆ చెట్లను చూసిన అఫ్జల్‌కూ ఆ ఆలోచన బాగుందని అనిపించింది. సరే అన్నాడు. దరఖాస్తు ఇచ్చి వెళుతూ ,అక్కడున్న కానిస్టేబుళ్లకు చెప్పారు.. ‘ఈ పోలీస్ స్టేషన్‌కు 30 రకాల మొక్కలను ఇద్దామనుకుంటున్నాం.. అయితే వాటికి సరిగ్గా నీళ్లు పోసి చక్కగా చూసుకోవాలి సుమా’ అని.


శ్రద్ధగా పెంచుతామని మాటిచ్చారు వాళ్లు. ఆ సంభాషణను విన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వినాయక్ మూలేకు ఆ జంట మీద విపరీతమైన గౌరవం పెరిగింది. వెంటనే సీట్లోంచి లేచి వరండాలోకి వస్తూ..‘మీకు గార్డెనింగ్ అంటే చాలా ఆసక్తి ఉన్నట్టుంది?’ అని అడిగాడు ఆ ఇద్దరినీ. నవ్వుతూ అవునన్నట్టు తలూపారు వాళ్లు. ‘అయితే నాతో రండి’ అంటూ స్టేషన్ వెనకవైపు ఉన్న ఖాళీస్థలం వైపు దారితీశాడు ఇన్‌స్పెక్టర్.


చెత్తకుండీలా...
ఆ ప్రదేశాన్ని చూసిన ఆలుమగలు ఆశ్చర్యపోయారు. దాదాపు ఒకటిన్నర ఎకరం స్థలం... మూడున్నర అడుగుల ఎత్తు మేర పేరుకుపోయిన చెత్తతో నిండి ఉంది. దుర్గంధం అక్కడ నిలువనీయట్లేదు. జప్తు చేసిన టూవీలర్స్, వదిలేసిన స్టోరేజ్ యూనిట్స్, ఇటుకలు, రాళ్ళూరప్పలు, విరిగిపోయిన వాహనాల భాగాలు, టైర్లు, కూలిన సిమెంట్ కట్టడాలు కలగలసిన పెద్ద చెత్తకుండీలా ఉంది. రెండు చేతులు వెనక్కి కట్టుకొని నిలబడ్డ ఇన్‌స్పెక్టర్ దీర్ఘంగా నిట్టూర్చి, ఆ దంపతుల వైపు చూస్తూ ‘దీన్ని ఏమైనా చేయగలరా... జనాలకు ఉపయోగపడేలా?’ అని అడిగాడు. అంతే దీర్ఘంగా నిట్టూర్చి ‘ప్రయత్నిస్తాం’ అని చెప్పారు ఆ దంపతులు.


ఆ రోజు నుంచే...
దాన్ని ఓ సవాలుగా తీసుకొని ఆ చెత్తకుప్పను తొలగించే పని ప్రారంభించారు నుస్రత్, అఫ్జల్.  ముందు ఇరవై రోజులు ఈ ఇద్దరే కష్టపడ్డారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా  ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో సహా పోలీస్‌స్టేషన్‌లోని స్టాఫంతా వాళ్లకు సహాయపడ్డం మొదలుపెట్టారు. వీళ్ల కృషి గురించి తెలిసిన ఆ ప్రాంతంలోని కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు... చేయి కలిపారు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి, ముంబై మున్సిపాలిటీకి తెలిసింది. వెంటనే తగినంత మంది సిబ్బందిని పంపించారు నుస్రత్, అఫ్జల్‌కు సహాయంగా. అంతా జత కలిస్తే ఆ చెత్తను తొలగించడానికి మూడు నెలలు పట్టింది వాళ్లకు.


అయిదేళ్లకు...
దేశంలోని పలు ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించారు. నాటారు. చిన్న చెరువు లాంటి దాన్ని తవ్వించారు. ఆ జంటకు ప్రకృతితో ఉన్న తాత్విక అనుబంధానికి నిదర్శనంగా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దారు. వాళ్ల శ్రమ ప్రకృతి నిలయంలా మారడానికి అయిదేళ్లు పట్టింది. రకరకాల పూలు, పళ్లు కాస్తున్న చెట్లు.. తామర పూలతో లోటస్ పాండ్ అయిన తటాకం... ఎత్తయిన చెట్లకు కట్టిన తేనె తుట్టెలు.. వడివడిగా అడుగులేస్తున్న బాతులు.. గెంతుతున్న జింకలతో... నిజంగానే ఆ తోట ఇప్పుడు భూతల స్వర్గమే. రోజూ సాయంకాలైమైందంటే చాలు... స్కూల్ బ్యాగులు ఇంట్లో వదిలేసి బిలబిలమంటూ దేవ్ బాగ్‌కు పరుగులు తీస్తారు పిల్లలు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం.. ఆడుకునేందుకు పెద్ద ప్లే గ్రౌండ్ మాత్రమే కాదు వాళ్ళను ఆకర్షించేది... నుస్రత్, అఫ్జల్ చెప్పే కథలు.. పాటలు.. ఆటలు కూడా! ఈ దేవ్‌బాగ్ నిర్మాణంతో నుస్రత్, అఫ్జల్ కల తీరిపోలేదు. ముంబై లాంటి జనారణ్యాల్లో ఇలాంటి నిజమైన అరణ్యాలను ఏర్పాటు చేసి సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించాలనీ, పిల్లల కోసం ఆట స్థలాలను కాపాడాలనీ కలలు కంటున్నారు. ఆ స్వప్న సాకారానికి కంకణం కట్టుకున్నారు.


నిజానికి దేవ్ బాగ్ ఘనత అంతా ఈ జంటదే అయినా ప్రేరణ సమతానగర్ పోలీస్‌స్టేషన్‌దే అని చెప్తారు. ‘పోలీసులంటే సామాన్య పౌరులకు భయం. బహుశా ఖాకీ కరుకుదనమే ప్రజలకు పరిచయం అవడం వల్ల ఆ భావన కలిగి ఉండొచ్చు. కానీ పోలీసులు సామాన్యుల స్నేహితులే  అని చాటి చెప్పారు సమతానగర్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది. ఇలా పోలీసులు, సామాన్యులు కలిసి సమాజ శ్రేయస్సుకు పాటుపడొచ్చని నిరూపించారు. ఒక్క ఈ విషయంలోనే కాదు మిగిలిన సామాజిక సమస్యలు, అంశాల పట్ల కూడా పోలీసులు, సామాన్యులు కలిస్తే అద్భుతాలే జరుగుతాయి. ఈ వాతావరణం దేశమంతా వ్యాపించాలి’ అంటారు నుస్రత్, అఫ్జల్. 


‘దేశం కోసం ఏదో చేయాలని ఇండియా వచ్చాం.. ఒక లక్ష్యం లేకుండా ఏది కనిపిస్తే అది చేస్తూ పోయాం. సమతానగర్ పోలీస్‌స్టేషన్ జంక్ యార్డ్‌ను చూపి. మాకో లక్ష్యాన్ని కలిపించిన వినాయక్‌కు కృతజ్ఞతలు’ అని చెప్తుంది ఈ సీనియర్ సిటిజన్ల జంట. వారు ఉదయం ఆరింటి నుంచే దేవ్‌బాగ్‌లో డ్యూటీ మొదలుపెట్టి రాత్రి తొమ్మిందింటి వరకూ ఉంటారు. ప్రతి మొక్కనూ, చెట్టునూ, చేమనూ, పక్షినీ, కీటకాన్నీ పలకరిస్తారు. యోగక్షేమాలు చూస్తారు. పసిపిల్లల్లా సాకుతారు. ఇప్పడు ఆ వనమే వాళ్ల సంతానం. సంకల్పం గట్టిగా ఉంటే ఉత్సాహమే నడిపిస్తుంది. వయసును జయించేలా చేస్తుంది అనీ నిరూపించారు నుస్రత్, అఫ్జల్.

‘దేవ్‌బాగ్’ నిర్మాతలు నుస్రత్, అఫ్జల్ ఖత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement