
ముంబై: నగరంలో సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి ఒంటిపై వేయించుకున్న పచ్చబొట్లు హంతకులను పట్టించాయి. ముంబైలోని గురు వాఘ్‌మారే అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటూ వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ క్రమంలో నిజంగానే ఆ వ్యక్తిని స్పా సెంటర్‌లో దుండగులు హత్య చేశారు.
పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టులో 22 మంది పేర్లను గుర్తించారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పా యజమాని సంతోష్ షెరేకర్‌తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. అన్సారీ యూపీఐ ఐడీకి లింకయిన ఫోన్ నంబర్‌కి షెరేకర్ పలుమార్లు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో స్పాలోకి ప్రవేశించి, వాఘ్‌మారే గర్ల్ ఫ్రెండ్‌ను మరొక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం కత్తెర, బ్లేడ్‌లను ఉపయోగించి వాఘ్‌మారేను హత్య చేశారు.
వాఘ్‌మారే గర్ల్‌ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కాగా వాఘ్‌మారే సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్‌లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసేవాడని, అతనిపై దోపిడీ, అత్యాచారం, వేధింపుల క్రిమినల్ కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment