పెద్దలే అబద్ధాలు చెబితే!
క్రైమ్ పేరెంటింగ్
నిజం గడపదాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందంటారు. నిప్పులాంటి నిజాన్ని కూడా మింగేసేటంత నోరెలా వచ్చింది. పెద్దల వల్లే వచ్చింది. ఊరి పెద్ద అబద్ధాలు చెబితేఆ ప్రభావం ఊరి మీద ఉండదా? అలాగే... ఇంటిపెద్ద అబద్ధం చెబితే ఆ ప్రభావం పిల్లల మీద ఉండదా? ఈ సమాజంలో అబద్ధాన్ని కాలరాసి నిజాన్ని నిలబెట్టే శక్తి ఎక్కడైనా ఉందంటే అది... మనలోనే ఉంది. మనం నిజాన్ని నిలబెట్టలేకపోతే భావి తరమే ఒక అబద్ధమైపోతుంది.
‘ఒరేయ్... చింటూ.. నిజం చెప్పు.. ఆ రోజు అక్క, రాహుల్ సినిమాకు వెళ్లారు కదూ. వాళ్లతోపాటు నువ్వూ వెళ్లావ్ కదా?’తల అడ్డంగా ఊపాడు చింటు. ‘వీడు అబద్ధం చెప్తున్నాడు పిన్నీ... ఇప్పుడు కూడా తేజస్వీ క్లాస్‌మేట్స్‌తో పిక్‌నిక్ అని వెళ్లడం నిజం కాదు. రాహుల్, వాడి ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కి వెళ్లింది. వీడికి ఆ విషయం తెలుసు. మనకు చెప్పట్లేదు’ ఆవేశం, బాధ, ఆవేదనతో అరిచాడు సంజయ్. అతడు చింటూకు కజిన్. తేజస్వీ అన్నయ్య. చింటు తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తల వంచుకొని గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న చింటూ దగ్గరకొచ్చి అడిగింది వాళ్ల పెద్దమ్మ అనునయంగా. ‘చెప్పు నాన్నా... తేజక్కయ్య నిజంగానే వాళ్ల ఫ్రెండ్స్‌తో వెళ్లిందా?’
చింటూ తలెత్తి హాల్లో ఉన్న పెద్దవాళ్లందరి వైపు చూశాడు. మళ్లీ తలదించుకుని గోళ్లు గిల్లుకోవడం మొదలుపెట్టాడు.
వాడి ఆ చర్యతో అందరికీ చిర్రెత్తుకొచ్చింది చింటూ తల్లిదండ్రులతో సహా. సంజయ్ అయితే కోపంతో ఊగిపోయాడు.‘ఒరేయ్.. పెద్దమ్మ అడిగినదానికి సరిగ్గా జవాబు చెప్పు. ఆ నిర్లక్ష్యం ఏంటి?’ గదమాయించింది చింటూ వాళ్లమ్మ.‘నాకు తెలీదు.. తెలీదు.. తెలీదు’ అని అరుస్తూ గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు చింటూ.‘అన్నీ అబద్ధాలే పిన్నీ. వాడికి తెలుసు. వీడే తేజస్వీని బైక్ మీద బస్‌స్టాప్ పక్క గల్లీలో దింపాడట. అక్కడున్న సూపర్‌మార్కెట్ కుర్రోడు చెప్పాడు. అరే అన్నా. చింటూకి బైక్ ఎందుకు ఇస్తున్నరు. పొద్దున తేజక్కను ఎక్కించుకొని ఒచ్చిండు. కొద్దిగల పొయింది. లేకుంటే ఈడ్నే ఈ గల్లిల యాక్సిడెంట్ చేస్తుండే. మేమంతా ఉరికొచ్చినం. తేజక్క బండి దిగి ఆగంమాగం ఉరికి ఎవరి కార్లోనో ఎక్కింది. ఏంది చింటూ గంత స్పీడ్ అంటే.. అక్క ఫ్రెండ్స్‌తో బయటకు పోతుంది.. లేట్ అయితుందని స్పీడ్‌గా వచ్చిన అంతే అన్నడు... జెర భద్రం.. బండి ఇయ్యకుండ్రి.. అని చెప్పాడు ఆ కుర్రాడు. అంటే చింటూకి అన్నీ తెలిసినట్టే కదా. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఆ రోజు మూవీలో కూడా మా ఫ్రెండ్ చూశాడట. చింటూ చెప్తేనే తేజస్వీ ఎక్కడుందో తెలుస్తుంది. ఆ రాహుల్ గాడు రాస్కెల్. ప్లీజ్ పిన్నీ నువ్వయినా అడుగు వాడిని’ ఏడిచినంత పనిచేశాడు సంజయ్.చింటూ వాళ్లమ్మకు చింటూ మీద కోపం... సిట్యుయేషన్ పట్ల భయమూ... అందరిలో పరువు తీస్తున్నాడన్న అవమానమూ కలుగుతున్నాయ్.
‘అక్కయ్యా. ఎలాగైనా వాడితో నిజం చెప్పించి తేజస్వీని పదిలంగా తీసుకొచ్చే బాధ్యత మాది. కంగారు పడకండి. అది క్షేమంగానే ఉంటుంది. ఇంటికెళ్లి కాస్త రెస్ట్ తీసుకో. ఈలోపు నేను వాడితో మాట్లాడ్తా. అందరూ ఉంటే కూడా నోరు విప్పడు. వాడి మొండితనం నాకు తెలుసు’ అంది చింటూ వాళ్లమ్మ తన అక్క మాలతితో.‘కొంచెం నువ్వే బుజ్జగించాలి కల్పన.. నాకు భయంగా ఉంది. దానికి ఏం మాయమాటలు చెప్పాడో. ఎటు తీసుకెళ్లాడో. తేజస్వీ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా రాహుల్ గురించి మంచిగా చెప్పట్లేదు. అసలు వాళ్లంతా దాన్ని వారించినా అది వినలేదనే అంటున్నారు. దాన్నెంత మత్తులో పెట్టాడో చూడు వాడు. ప్లీజ్ కల్పన.. చింటూ నిజం చెప్తే వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇవ్వచ్చు’ బతిమాలింది మాలతి.
‘అయ్యో అక్కయ్యా. తేజు నాకూ కూతురే కదా. నాకు మాత్రం బెంగా, భయం ఉండవా? నేను మాట్లాడతాను’ అని అక్కకి అభయ మిచ్చి సంజయ్ వంక చూసింది కల్పన.అర్థమైనట్టుగా అందరూ లేచారు మాలతి, వాళ్లాయన, సంజయ్...వాళ్లను గేట్ దాకా సాగనంపి లోపలికి వచ్చారు కల్పన దంపతులు.చింటూ సోఫాలో కూర్చుని కనిపించాడు.వంటింట్లోకి వెళ్లి కార్న్‌ఫ్లేక్స్ కలుపుకొచ్చి చింటూకిస్తూ వాడి పక్కన కూర్చున ఉంది.‘చింటూ.. రోజూ టీవీల్లో , పేపర్లలో చూస్తున్నాం కదా. బ్యాడ్ బాయ్స్ అమ్మాయిలను తీసుకెళ్లి వాళ్లను ఎలా ఇబ్బంది పెడుతున్నారో. రాహుల్ కూడా అంతే. నీకు తెలిసింది చెప్తే తేజూను మనం జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవచ్చు’ అని ఆపి వాడిని చూసింది కల్పన.ఉదయం నుంచి జరుగుతున్న సీన్‌లో ఇప్పడు ఫస్ట్ టైమ్ వాడి కళ్లల్లో భయం కనిపించింది.‘తెలుసు’.. అన్నాడు నెమ్మదిగా.
ఆ మాటకు ఒక్క ఉదుటున వాడి దగ్గరకు వచ్చి ‘చెప్పు ఎక్కడికి తీసుకెళ్లాడో’ అంటూ వాడి భుజాలు ఊపేస్తూ ఆవేశంగా అడిగాడు చింటూ తండ్రి.‘రాహుల్ వాళ్ల ఫామ్‌హౌజ్‌కే వెళ్లారు. ముందు రోజు రాత్రి తేజక్కయ్య రాహుల్తో ఫోన్‌లో ప్లాన్ చేసుకుంటుంటే విన్నాను’ అన్నాడు అమాయకంగా.‘మరెందుకురా అబద్ధం చెప్పావ్ తెలీదని. ఈ ముక్క అప్పుడే చెప్తే ఈ పాటికి వెళ్లేవాళ్లం కదా’ అన్నాడు కోపంగా చింటూ వాళ్ల నాన్న.
‘తేజక్కయ్య ఎవరికీ చెప్పొద్దంది. రాహుల్‌ని అడిగి ట్యాబ్ ఇప్పిస్తానంది. డ్రాప్ చేస్తే పాకెట్ మనీ ఇస్తానంది. అందుకే చెప్పలేదు’.‘తప్పు కదరా. అబద్ధం చెప్పడం. అబద్దానికి అలా డబ్బులు, గిఫ్ట్స్ తీసుకోవడం’ అంది కల్పన.‘నువ్వూ చాలాసార్లు అబద్ధం చెప్పమన్లేదా? సారీస్ అమ్మే ఆంటీ వస్తే లేనని చెప్పు కేఎఫ్‌సీ చికెన్‌కు మనీ ఇస్తా అని చెప్పలేదా? నాన్న అబద్ధం చెప్పలేదా? ప్రభాకర్ అంకుల్ వస్తే ఇంట్లో లేనని నాతో చెప్పించ లేదా? మొన్న నాన్న హెల్మెట్ లేకుండా వెళ్తుంటే పోలీస్ ఆపితే వైఫ్ హాస్పిటల్‌లో ఉంది... అర్జెన్సీలో హెల్మెట్ మరిచిపోయానని అబద్ధం చెప్పి తప్పించుకోలేదా. పైగా పోలీస్ అంకుల్‌ని ఎలా బురిడీ కొట్టించానో చూడు అని నాకు ఐస్‌క్రీమ్ కొనిపెట్టారు. మీరు అబద్ధం చెప్పినప్పుడు, నన్ను చెప్పమన్నప్పుడు డబ్బులిచ్చారు. తేజక్కయ్య కూడా అంతే చేసింది. నన్నెందుకు తప్పు పడుతున్నారు?’‘నీ వల్ల అక్కయ్య డేంజర్‌లో పడింది. నీకు ఆ మాత్రం తెలీదా?’‘రాహుల్ ఏం భయం లేదని చెప్పాడు. కాసేపు పార్టీ చేసుకొని వచ్చేస్తాం అన్నాడు’‘అది అబద్ధం’‘ఏమో.. నాకు మూవీకి డబ్బులిచ్చాడు’తల్లిదండ్రులిద్దరికీ కోపం వచ్చింది.‘ఇదంతా నీ వల్లే’ భార్య మీదకు తోయబోయాడు.అరచేతిని అడ్డం పెట్టి ‘ముందు బావగారికి కాల్ చేయండి. తేజు రాహుల్ వాళ్ల ఫామ్‌హౌజ్‌లో ఉన్నట్టు’ అంది.
తేజస్వీ ఇంటికి చేరింది.సమయానికి తేజస్వీ అన్నయ్య ఫామ్ హౌస్‌కు వెళ్లి తేజస్వీని తేగలిగాడు. లేకుంటే ఏం జరిగేదో. తనొక్కర్తే బయటకు వెళ్లలేక చింటూ సాయం తీసుకుంది తేజస్వీ. ఇంటర్ చదువుతున్న చింటూ తన తెలిసీ తెలియని తనంతో తేజస్వీకి ప్రమాదం తెచ్చి పెట్టాడు.ఒకవేళ తేజస్వీకి ఏదైనా జరిగి ఉంటే?దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి?
చింటూ తల్లిదండ్రులు ఈ నిందను ఒకరి మీద ఒకరు తోయడంలో బిజీ అయిపోయారు.‘నువ్వే నేర్పావ్ వాడికి అబద్దాలు’ అని తండ్రి అంటే ‘ఇందులో మీ తప్పేం లేదా’ అని భర్తతో వాదులాటకు దిగింది తల్లి.‘నేను మగాడిని... నాకు సవాలక్ష పనులుంటాయ్... వాటి కోసం ఏవో చిన్నచిన్న అబద్ధాలు ఆడాను.. ఆడాల్సి వస్తుంది.. నీకు నాకు తేడా లేదా?’ ‘‘చిన్నదైనా.. పెద్దదైనా.. అబద్ధం అబద్ధమే. మీరు చేస్తే నిజం అవదు. నేను చేస్తే తప్పుగా మారదు. ప్రతిదానికి నా మీద పడి ఏడ్వకండి. అన్నిటికీ నన్ను తçప్పు పట్టకండి’‘పట్టకా? ఎవరని అనాలి? పిల్లలు చెడిపోతే తల్లులనే అంటారు గుర్తుంచుకో’‘మరి మీ చెడుకి మీ అమ్మను అనొచ్చా’‘నోర్ముయ్ మా అమ్మనంటావా? అసలు వాడికన్నీ నీ బుద్ధులే. అబద్ధాలు కూడా నీవే వంట బట్టాయి’ఈ వివాదం అలా సాగుతూనే ఉంది .పిల్లలు అబద్దాలకోరులుగా మారకుండా ఉండాలంటే భిన్నమైన పేరెంటింగ్ కావాలి. ఎలా ఉండాలో సైకియాట్రిస్ట్‌ని అడుగుదాం!
అబద్ధాల కథలు చెప్పొద్దు
అన్ని విషయాల్లో పేరెంట్స్‌ని పిల్లలు అనుకరిస్తారు. అబద్ధాల విషయంలోనూ అంతే. పరిస్థితిని తప్పించడానికో, తప్పించుకోవడానికో పెద్దలు అబద్ధం అడుతారు. అదో టెండెన్సీగా మారింది. పిల్లలు వాటిని అలవాటు చేసుకుంటారు. అందుకే పెద్దలే జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉండీ లేమని చెప్పించడం, ఎవరైనా అవసరానికి ఏదైనా అడిగితే.. అది తమ దగ్గరుందన్న విషయం పిల్లలకు తెలిసినా వాళ్లతోనే లేదని చెప్పించడం వంటివి అస్సలు చేయకూడదు. వీటిని పిల్లలు అవలీలగా అనుకరిస్తారు. పైగా అలా చేయడం తప్పుకాదని అనుకునే ప్రమాదమూ ఉంది. అంతేకాదు బయటి నుంచి మన పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారనే కంప్లయింట్స్ వస్తే.. విషయమేంటో పిల్లలనే నేరుగా అడిగి తెలుసుకోవాలి. పిల్లల వివరణను బట్టే పరిస్థితిని తెలుసుకోవాలి.
అలాగే పిల్లల ఎదురుగా పెద్దవాళ్లు తాము ఆడిన అబద్ధాల విషయంలో ఒకరి మీద ఒకరు తప్పుతోసుకోవడం ఆపాలి. దీనిల్ల.. ‘ఓహో.. అబద్ధం ఆడి.. ఆ తప్పును ఇలా ఎదుటివాళ్ల మీదకు తోసేయొచ్చన్నమాట’ అని నేర్చుకుంటారు. అబద్ధం ఆడి.. దాంట్లోంచి బయటపడడాన్ని ఓ రిలీఫ్‌లా భావిస్తుంటారు. పేరెంట్స్ పిల్లలకు చిన్నప్పుడు ఒక ఊహను.. అంటే అబద్ధాన్ని ఆధారం చేసుకుని చెప్పే కథలను బాల్యానికే పరిమితం చేయాలి. పిల్లలు పెద్దాయ్యాక నిజానికి దగ్గరగా ఉన్నవాటినే చెప్పాలి. పిల్లలు ముందు తల్లిదండ్రులు ఒకరినొకరు నిందించుకోకుండా పిల్లలు లేనప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంట్లో కార్డియల్ అండ్ ట్రాన్స్‌పరెంట్ వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే పిల్లలు ఏ విషయాన్నయినా పెద్దవాళ్లతో నిర్భయంగా షేర్ చేసుకోగలరు. దీని వల్ల అబద్ధాలు ఆడే చాన్సెస్ చాలా తగ్గుతాయి.
– డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
– శరాది