రేపట్లోగా విశ్వాస పరీక్ష!
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నబమ్ టుకీని ఈ నెల 16లోగా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ తథాగత రాయ్ గురువారం ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నబమ్ టుకీ తక్షణం అసెంబ్లీని సమావేశ పరిచి విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా గవర్నర్ లేఖ రాశారు.
అసెంబ్లీ కార్యకలాపాలు శాంతియుతంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని, విశ్వాస పరీక్ష మొత్తాన్ని వీడియో తియ్యాలని, మూజువాణి ఓటుతో కాకుండా డివిజన్(ఓటింగ్) ద్వారానే మెజారిటీ నిరూపించుకోవాలని ఆ లేఖలో సూచించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం గురువారం సాయంత్రం ఈటానగర్ చేరుకున్న నబమ్ టుకీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు తనకు మరింత సమయం కావాలని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో బల నిరూపణ చేసుకోవడం సాధ్యం కాదని, దీనిపై గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తానన్నారు. సీనియర్ అధికారులు, ఇన్‌చార్జి సీఎస్ సత్యగోపాల్ తదితరులతో టుకీ సమావేశమయ్యారు. అసంపూర్తిగా నిలిచి పోయిన పథకాలను, విధానాలను ముందుకు తీసుకెళ్లడానికే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. కాగా, అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా కూడా గురువారం కార్యాలయానికి వచ్చారు. సభ నిర్వహణకు కనీసం 10-15 రోజుల సమయం అవసరమన్నారు. అరుణాచల్‌కు ఇప్పటికీ న్యాయంగా తానే ముఖ్యమంత్రి అని రెబెల్ కాంగ్రెస్ నేత కలిఖో పాల్ చెప్పారు.