nabam tuki
-
ఎమ్మెల్యేలు జంప్.. పీసీసీ చీఫ్ రాజీనామా
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నబమ్ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో నబమ్ టుకీ తన రాజీనామాను శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పంపినట్లు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోయిందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా చెప్పారు. నబమ్ టుకీ రాష్ట్రంలోని సగాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎల్పీ నాయకుడు, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లాంబో తాయెంగ్ ఇటీవల బీజేపీలో చేరారు. అలాగే గత నెలలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ బీజేపీలో చేరారు. -
నాటకీయ మలుపుల..రాజకీయ చదరంగం
ఏడాది కాలంలో ఎన్నెన్ని నాటకీయ పరిణామాలో...! ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ చదరంగం రంజుగా సాగుతోంది. ఏకంగా ముగ్గురు సీఎంలు మారారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిర పర్చేందుకు కేంద్రంలో పాలన సాగిస్తున్న పార్టీ చూపిన ఉత్సాహం, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం, రాష్ట్రపతి పాలన విధించడం, కాంగ్రెస్‌లో చీలిక, సుప్రీంకోర్టు జోక్యం, పదవి పోగొట్టుకున్న సీఎం ఆత్మహత్య... ఇలా ఒకదానికి తర్వాత మరొకటి. తాజాగా మరో ముసలం. 2014లో ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకుగాను కాంగ్రెస్ 42 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. 2011 నుంచి సీఎంగా ఉన్న నబమ్ టుకీయే మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2014 డిసెంబరులో వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి కలిఖో పుల్ను మంత్రివర్గం నుంచి టుకీ తప్పించారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో పుల్ అసమ్మతిని లేవదీశారు. 2016 జనవరి 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీన్ని ముందుకు జరుపుతూ డిసెంబరు 16, 2015 నుంచే అసెంబ్లీ సమావేశాలుంటాయని గవర్నర్ జె.పి.రాజ్‌ఖోవా ఆదేశాలిచ్చారు. టుకీని దింపేందుకు అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. టుకీ ప్రభుత్వం అసెంబ్లీకి తాళం వేయడంతో... డిసెంబరు 16న మరోచోట సమావేశమైన 33 మంది ఎమ్మెల్యేలు (పుల్ వర్గం, బీజేపీ) స్పీకర్‌గా రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు. మరుసటి రోజు హోటల్లో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. టుకీని తొలగించి కలిఖో పుల్ను సీఎంగా ఎన్నుకున్నారు. తర్వాత రెబియాతో పాటు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు లేకుండా... బీజేపీకి చెందిన 11 మంది, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు చేసిన తీర్మానం మేరకు అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ఎలా ముందుకు జరుపుతారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ వాదించింది. అరుణాచల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు సిఫారసు చేసింది. ఈ ఏడాది జనవరి 26న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన విధించాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. దీన్ని సుప్రీం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ఇచ్చిన నివేదికను తమకు అందజేయాలని కోరింది. తర్వాత వాదోపవాదాలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ తమ చర్యలను సమర్థించుకున్నారు. 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ రెబియా ఇచ్చిన ఆదేశాలపై గౌహతి హైకోర్టు ఇచ్చిన స్టేను ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనే కాంగ్రెస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దాంతో కేంద్రం వేగంగా పావులు కదిపింది. మరుసటి రోజు రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అసమ్మతి నేత కలిఖో పుల్ ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జులై 13న సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. అసెంబ్లీని ముందుకు జరుపుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. డిసెంబరు 15 నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది. దాంతో నబమ్ టుకీ నేతృత్వంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచిన కేంద్రానికి ఇది గట్టి ఎదురుదెబ్బ. తాత్కాలిక గవర్నర్‌గా ఉన్న తథాగత రాయ్ రెండురోజుల్లోనే... జులై 16న బల నిరూపణ చేసుకోవాలని టుకీని కోరారు. కనీసం 10 రోజుల గడువివ్వాలని టుకీ కోరగా గవర్నర్ నిరాకరించారు. ఈలోపు తెరవెనుక మంత్రాంగం నడిచి అసమ్మతి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. టుకీ బలపరచబోమని, మరొకరిని సీఎం చేయాలని కోరారు. దాంతో మధ్యేమార్గంగా పెమా ఖండూను సీఎంగా ఎన్నుకోగా... అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సుప్రీం తీర్పుతో పదవి పోగోట్టుకున్న కలిఖో పుల్ ఆగష్టు 9న తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సుప్రీంతీర్పుతో కంగుతిన్న బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతో పావులు కదిపారు. ఫలితంగా సెప్టెంబరు 16న ముఖ్యమంత్రి పెమా ఖండూ 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ)లో చేరిపోయారు. ఎన్డీయేకు చెందిన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (నెడా)లో పీపీఏ భాగస్వామి. కాంగ్రెస్ పార్టీలో చివరికి మాజీ సీఎం నబమ్ టుకీ రూపంలో ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు. రాజీనామా చేయాలనే కేంద్రం సూచనలు పట్టించుకోకుండా గవర్నర్ పదవిలో కొనసాగిన రాజ్‌ఖోవాను సెప్టెంబరు 22న చివరకు రాష్ట్రపతి డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఖండూను, మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన పీపీఏ... శుక్రవారం తమ లెజిస్లేటివ్ పార్టీ నేతగా రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యే (ఎన్నికల అఫిడవిట్ తన ఆస్తుల విలువను 187 కోట్లుగా చూపారు) టకమ్ పారియోను ఎన్నుకున్నట్లు స్పీకర్‌కు తెలియజేసింది. 12 మంది సభ్యులున్న బీజేపీ పెద్దన్న పాత్రను పోషిస్తూ... 43 మంది సభ్యులున్న పీపీఏను చిన్నచూపు చూస్తోందనేది తిరుగుబాటు నేతల వాదన. ఖండూకే తమ మద్దతు ఉంటుందని, మరొకరిని సీఎంగా అంగీకరించమని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అంటోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజుతో టకమ్ పారియోకు తీవ్ర రాజకీయవైరముంది. బీజేపీ (12), ఖండూ వర్గం (సస్పెండైన ఏడుగురు) లేకున్నా... 36 మందితో పీపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఉంది. రెండు జాతీయ పార్టీలు... బీజేపీ, కాంగ్రెస్‌లకు రాజకీయ చదరంగంగా మారిన అరుణాచల్‌లో తాజా పరిణామాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సీఎం మార్పుతో గట్టెక్కిన కాంగ్రెస్
-
అరుణాచల్ పీఠంపై ఖండూ
దేశంలోనే అతి పిన్న వయసు సీఎం ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పెమా ఖండూ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈటానగర్‌లోని రాజ్‌భవన్ కార్యాలయంలో గవర్నర్ తథాగత రాయ్.. ఖండూ చేత ప్రమాణం చేయించారు. దీంతో దేశంలోనే అతి పిన్న వయసు ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడైన 37 ఏళ్ల పెమా ఖండూ తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. దోర్జీ ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చౌనా మెయిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు పెమా ఖండూ వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఇంటికి పెద్ద కుమారుడైన పెమా ఢిల్లీలోని హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్పూర్తి చేశారు. తండ్రి మరణానంతరం మక్తో నియోజక వర్గం (ఎస్టీ రిజర్వ్డ్) నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జలవనరుల అభివృద్ధి, పర్యాటక మంత్రిగా పనిచేశారు. 2011 నవంబర్ 21 నుంచి నబమ్ టుకీ ప్రభుత్వంలో గ్రామీణ పనుల అభివృద్ధి, పర్యాటక మంత్రిగా పనిచేశారు. పౌర విమానయానం, కళలు సాంస్కృతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానూ పెమా పనిచేశారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమా ఖండూ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. పెమా ఖండూ తర్వాత దేశంలోనే అతి పిన్న వయస్కులైన ముఖ్యమంత్రుల జాబితాలో వరుసగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, అస్సాం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్‌లు ఉన్నారు. -
అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ!
-
అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ!
- సీఎల్పీ నేతగా ఎన్నిక - సీఎం, సీఎల్పీ పదవులకు టుకీ రాజీనామా - కాంగ్రెస్ గూటికి రెబల్స్ ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాల మధ్య సీఎల్పీ కొత్త నాయకుడిని ఎన్నుకుంది. నబమ్ టుకీ సీఎం, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) పదవులకు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడు పెమా ఖండూ (37) సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. దీంతో విశ్వాస పరీక్ష వాయిదా పడింది. గవర్నర్ తథాగత్‌రాయ్ శనివారం అసెంబ్లీలో టుకీ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలిసిందేనని తేల్చిచెప్పడం తెలిసిందే. దీంతో విశ్వాస పరీక్షకు కొన్ని గంటల ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వేగంగా మారిన సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్స్ నేత, పదవీచ్యుత సీఎం కలిఖో పుల్ 30 మంది అసమ్మతి ఎమ్మెల్యేలతో కలసి తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎల్పీ భేటీలో నేతగా ఖండూ పేరును టుకీ ప్రతిపాదించగా హాజరైన 44 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పుల్కు, కాంగ్రెస్‌కు కుదిరిన ఒప్పందంలో భాగంగా పెమా సీఎల్పీ నేతగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. అంతకుముందు టుకీ గవర్నర్‌ను కలసి సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ మారిన పరిణామాల వల్ల తాను బలపరీక్షను ఎదుర్కోలేనని గవర్నర్‌కు చెప్పానన్నారు. పెమా మాట్లాడుతూ 47 మంది ఎమ్మెల్యేల మద్దతున్న తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరామన్నారు. అయితే గవర్నర్ తనకు హామీ ఇవ్వలేదని, నిబంధనల మేరకు వ్యవహరిస్తానని చెప్పారన్నారు. పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్‌ల జోక్యంతో పార్టీలో విభేదాలు సమసిపోయాయని వెల్లడించారు. అయితే మొత్తం 60 మంది సభ్యులున్న శాసనసభలో 45 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో పెమా ఖండూ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల స్టార్ పెమా: పెమా ఈశాన్య రాష్ట్రాల కొత్త స్టార్‌గా ఆవిర్భవించారు. ఢిల్లీ హిందూ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2011లో విమాన ప్రమాదంలో తన తండ్రి మరణంతో చిన్నవయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఐదేళ్లకే సీఎం అభ్యర్థిగా మారాడు. -
అరుణాచల్ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు
-
అరుణాచల్ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా నబమ్ తుకీ శనివారం రాజీనామా చేశారు. కొత్త సీఎల్పీ నేతగా పెమ ఖండూ ఎన్నికయ్యారు. ఈవాళ ఉదయం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి 40మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా సొంత గూటికి చేరుకున్నారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమం అయింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీర్పు అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నబమ్ టుకీ.. అసెంబ్లీలో బలనిరూపణకు మరింత సమయం కోరుతుండగా.. శనివారం రోజే బలపరీక్ష తప్పదని గవర్నర్ తథాగతరాయ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. -
టుకీ బలపరీక్షపై ఉత్కంఠ
-
టుకీ బలపరీక్షపై ఉత్కంఠ
- అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు - 10 రోజుల గడవు కోరిన టుకీ; తిరస్కరించిన గవర్నర్ ఈటానగర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీర్పు అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నబమ్ టుకీ.. అసెంబ్లీలో బలనిరూపణకు మరింత సమయం కోరుతుండగా.. శనివారం రోజే బలపరీక్ష తప్పదని గవర్నర్ తథాగతరాయ్ స్పష్టం చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు కనీసం నెల రోజుల సమయమివ్వాలని, గవర్నర్ తనకుతానుగా అసెంబ్లీని సమావేశపర్చలేరని కాంగ్రెస్ వాదిస్తోంది. హోంమంత్రి తంగ బ్యాలింగ్తో కలిసి శుక్రవారం గవర్నర్ రాయ్‌ని కలిసిన టుకీ.. బల నిరూపణకు తనకు కనీసం 10 రోజుల సమయమివ్వాలన్న అభ్యర్థనను, పరీక్షను వాయిదా వేయాలన్న కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించిన గవర్నర్.. శనివారం మెజారిటీని నిరూపించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. పదవీచ్యుత సీఎం కలిఖో పుల్ తనకు 60 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ రెబల్స్, 11 బీజేపీ సభ్యులు సహా 43 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటున్న పరిస్థితుల్లో.. టుకీ ఇప్పటికిప్పుడు మెజారిటీని నిరూపించుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రెబల్స్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా టుకీ కోరుతున్నారు. ‘నబమ్ టుకీని శనివారం మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించార’ని శుక్రవారం రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రాష్ట్ర కేబినెట్ సమావేశమై బలపరీక్షను కనీసం 10 రోజులు వాయిదా వేయాల్సిందిగా గవర్నర్‌ను అభ్యర్థిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు, కలిఖొ నేతృత్వంలోని పీపీఏకు పూర్తి మద్దతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఏకపక్ష ప్రకటన కుదరదు: కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాల నిర్ణయాన్ని గవర్నర్ ఏకపక్షంగా తీసుకోవడం కుదరదని కాంగ్రెస్ పేర్కొంది. సుప్రీంకోర్టు గత తీర్పులను, సర్కారియా కమిషన్ సిఫారసులను ఉటంకిస్తూ.. బల నిరూపణకు కనీసం నెల రోజుల సమయమివ్వాలంది. ‘బలపరీక్షకు సిద్ధంగానే ఉన్నాం. అయితే, ప్రభుత్వ సిఫారసు మేరకే సమావేశాలను ప్రారంభించాల్సి ఉంటుంది’ అని సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. అలాగే, శనివారం బలపరీక్ష జరగకుండా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, గవర్నర్ అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి కూడా కాంగ్రెస్ వివరణ కోరే అవకాశముందన్నాయి. -
రేపట్లోగా విశ్వాస పరీక్ష!
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నబమ్ టుకీని ఈ నెల 16లోగా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ తథాగత రాయ్ గురువారం ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నబమ్ టుకీ తక్షణం అసెంబ్లీని సమావేశ పరిచి విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా గవర్నర్ లేఖ రాశారు. అసెంబ్లీ కార్యకలాపాలు శాంతియుతంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని, విశ్వాస పరీక్ష మొత్తాన్ని వీడియో తియ్యాలని, మూజువాణి ఓటుతో కాకుండా డివిజన్(ఓటింగ్) ద్వారానే మెజారిటీ నిరూపించుకోవాలని ఆ లేఖలో సూచించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం గురువారం సాయంత్రం ఈటానగర్ చేరుకున్న నబమ్ టుకీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు తనకు మరింత సమయం కావాలని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో బల నిరూపణ చేసుకోవడం సాధ్యం కాదని, దీనిపై గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తానన్నారు. సీనియర్ అధికారులు, ఇన్చార్జి సీఎస్ సత్యగోపాల్ తదితరులతో టుకీ సమావేశమయ్యారు. అసంపూర్తిగా నిలిచి పోయిన పథకాలను, విధానాలను ముందుకు తీసుకెళ్లడానికే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. కాగా, అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా కూడా గురువారం కార్యాలయానికి వచ్చారు. సభ నిర్వహణకు కనీసం 10-15 రోజుల సమయం అవసరమన్నారు. అరుణాచల్‌కు ఇప్పటికీ న్యాయంగా తానే ముఖ్యమంత్రి అని రెబెల్ కాంగ్రెస్ నేత కలిఖో పాల్ చెప్పారు. -
ఈ దేశాన్ని సుప్రీంకోర్టు రక్షించింది
-
ఈ దేశాన్ని సుప్రీంకోర్టు రక్షించింది: నబం తుకీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని సర్వోన్నత న్యాయస్థానం రక్షించిందని అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబం తుకీ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. నబం తుకీ బుధవారమిక్కడ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తమకు న్యాయం చేసిందని, ఈ దేశాన్ని ఉన్నత న్యాయస్థానం రక్షించిందని అన్నారు. ఈ ఏడాది జనవరి 26న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వాల తొలగింపు విషయంలో బీజేపీకి ఇది రెండో ఎదురుదెబ్బ. ఇంతకుముందు ఉత్తరాఖండ్ వ్యవహారంలోనూ కమలదళం ఇలాగే దెబ్బతింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, వారి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. అయితే సుప్రీం కోర్టు దగ్గర కేంద్రం పప్పులుడకలేదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలోనే బీజేపీకి చుక్కెదురు అయింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌ను రీకాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
'గవర్నర్ నన్ను బెదిరించారు'
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్‌టుకీ, గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్ఖోవాల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. గవర్నర్ పదవి చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని నబమ్‌టుకీ అన్నారు. తన సహచర మంత్రులతో ఇటానగర్‌లోని రాజ్ భవన్లో గవర్నర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు అవమానించారని తెలిపారు. మీటింగ్‌లో గవర్నర్ బెదిరింపులకు పాల్పడుతూ దుషించారని తెలిపారు. మీటింగ్‌కు వస్తున్నప్పుడ, జరుగుతున్న సమయంలో తమకు తెలియకుండా వీడియో కూడా తీశారని ఆరోపించారు. అయితే బయటకు వచ్చిన వీడియో ఫూటేజీ ఎడిటి చేసిందని తెలిపారు. తనను రెచ్చగొట్టే మాటలను ఆ వీడియోనుంచి తొలగించారన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ నబమ్‌టుకీ గురువారం తాజా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటు.. కాంగ్రెస్ శాసనసభాపక్ష చీఫ్ విప్ రాజేశ్ టాచో వంటి వారు వేసిన పిటిషన్లను జస్టిస్‌జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించే అవకాశముంది. ఇంతకుముందు వేసిన పిటిషన్లు రాష్ట్రపతి పాలనను ప్రశ్నించలేదని.. రాష్ట్రపతి పాలన విధించటానికి ముందే వాటిని దాఖలు చేశారని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో..పిటిషన్ల సవరణకు ధర్మాసనం అవకాశం ఇవ్వగా నబమ్‌టుకీ తాజాపిటిషన్ వేశారు. -
రాష్ట్రపతి పాలనపై పిటిషన్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం నబమ్‌టుకీ గురువారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు.. కాంగ్రెస్ శాసనసభాపక్ష చీఫ్ విప్ రాజేశ్ టాచో వంటి వారు వేసిన పిటిషన్లను జస్టిస్‌జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించే అవకాశముంది. ఇంతకుముందు వేసిన పిటిషన్లు రాష్ట్రపతి పాలనను ప్రశ్నించలేదని.. రాష్ట్రపతి పాలన విధించటానికి ముందే వాటిని దాఖలు చేశారని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. పిటిషన్ల సవరణకు ధర్మాసనం అవకాశం ఇవ్వగా నబమ్‌టుకీ తాజాపిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాతో పాటు కేంద్ర హోంశాఖకు బుధవారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీకి తాళం వేశారు.. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో శాంతిభద్రతలు సహా రాష్ట్రంలో పరిపాలన పతనమవటం, శాసనసభ భవనానికి తాళం వేయటాన్ని రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలటానికి కారణాలుగా అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్‌ఖోవా పేర్కొన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై నిషిద్ధ రహస్య నాగా సంస్థ ఎన్ఎస్సీఎన్ (ఖాప్లాంగ్) ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయని గవర్నర్ చెప్పారు. శాసనసభ సమావేశం శాసనసభ ఆవరణలో జరగకుండా స్పీకర్, ప్రభుత్వంతో కలిసి అడ్డుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాసే ప్రయత్నం ఇక కేంద్ర మంత్రివర్గం అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ మద్దతు లేదని, మైనారిటీ సర్కారుతో చేతులుకలిపిన స్పీకర్ శాసనసభ సమావేశాలు జరగకుండా అడ్డుకోవటం ద్వారా ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను.. ముఖ్యమంత్రికి సభలో మెజారిటీ మద్దతు ఉండాలని, ఆ మెజారిటీని సభలో పరీక్షించాలని చెప్తున్న రాజ్యాంగ కనీస అవసరాన్ని కాలరాసే ప్రయత్నం చేశారని పేర్కొంది. రాజ్‌భవన్ ప్రాంగణాన్ని సీఎం, స్పీకర్ల మద్దతుదారులు పలు గంటల పాటు దిగ్బంధించారని, గవర్నర్‌ను ఘెరావ్ చేయటం రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలటమేనని అభివర్ణించింది. -
అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన
- రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ సిఫారసు - కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు మంగళవారం ప్రణబ్ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఆమోదించారు. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే కంటే.... దానిని సుప్తచేతనావస్థలో ఉంచి... రాష్ట్రపతి పాలన వైపే కేంద్రమంత్రి వర్గం ఇటీవల నిర్ణయించింది. కాంగ్రెస్ పాలనలో ఉన్న అరుణాచల్‌లో సీఎం నబమ్ టుకీపై అసంతృప్తితో 21మంది ఎమ్మెల్యేలు డిసెంబర్ 16న తిరుగుబాటు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. గతేడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హోటల్లో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నబమ్ టుకీకి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. -
అరుణాచల్‌లో అనూహ్య పరిణామాలు
-
అరుణాచల్‌లో అనూహ్య పరిణామాలు
నబమ్ టుకి ప్రభుత్వంపై తిరుగుబాటు ఎమ్మెల్యేల అవిశ్వాసం * కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తిరుగుబాటు సభ్యులు * స్పీకర్ తొలగింపు సహా అన్ని నిర్ణయాలపై గౌహతి హైకోర్టు స్టే గువాహటి/ఇటానగర్: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం అనూ హ్య మలుపులు తిరుగుతోంది. గురువారం ఒక హోటల్లో సమావేశమైన ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు నబమ్ టుకి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టి.. తీర్మానానికి మద్దతు గా ఓటేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే కలిఖో పాల్‌ను రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మరోవైపు గౌహతి హైకోర్టు స్పీకర్ తొలగింపు సహా అన్ని నిర్ణయాలను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. ముఖ్యమంత్రి నబమ్ టుకి రాష్ట్రంలో పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్జ్, ప్రధాని మోదీకి లేఖలు రాశారు. గురువారం స్థానిక హోటల్లో 11 మంది బీజేపీ, ఇద్దరు ఇండిపెండెంట్లతో పాటు 20 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. స్పీకర్ నబమ్ రెబియా ఆదేశాలతో బుధవారం నుంచి శాసనసభ ప్రాంగణం మూతపడటంతో వీరంతా హోటల్లోని కాన్ఫరెన్స్ హాలులోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు డిప్యూటీ స్పీకర్ టి.నార్బు థాంగ్‌డాక్ అధ్యక్షత వహించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్రులు టుకి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ థాంగ్‌డాక్ అవిశ్వాస తీర్మానాన్ని వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. మొత్తం 60 మంది సభ్యులకుగానూ బీజేపీ, స్వతంత్ర, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 33 మంది ఈ సమావేశంలో పాల్గొన్నా రు. ముఖ్యమంత్రి నబమ్టుకితో పాటు ఆయనకు మద్దతిస్తున్న 26 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. తరువాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన కలిఖో పాల్‌ను 33 మంది ఎమ్మెల్యేలు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అనంతరం పాల్‌ను శాసనసభా పక్ష నేతగా థాంగ్‌డాక్ ప్రకటించారు. అసెంబ్లీ తీర్మానాలను గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాకు పంపనున్నట్టు తెలిపారు. మరోవైపు అరుణాచల్ అసెంబ్లీ స్పీకర్ రెబయా తొలగింపు సహా అన్ని నిర్ణయాలను నిలుపుదల చేస్తూ గౌహతి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 24న జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 16కు మారుస్తూ ఈ నెల 9న గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. పార్లమెంట్లో దుమారం.. మరోవైపు అరుణాచల్ పరిణామాలు పార్లమెంట్లో దుమారం రేపాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనకు దిగింది. కాంగ్రెస్‌కు వామపక్షాలు, జేడీయూ మద్దతు తెలిపాయి. -
నమో గాలి కాదు... ఇది టుకి గాలి
దేశమంతటా నమో గాలి వీస్తున్నా సుదూర ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో మాత్రం టుకి గాలి వీస్తోంది. నరేంద్ర మోడీ కూడా చేయలేని పనిని అరుణాచల్ ముఖ్యమంత్రి నాబమ్ టుకి చేసి చూపించారు. 60 సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో టుకి సహా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ లేకుండా గెలిచారు. టుకికి ప్రజల్లో ఎంత పట్టుందో ఈ సంఘటన నిరూపిస్తుంది. ఇలాంటి సంఘటన దేశ ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ జరగలేదు. అరుణాచల్ లో మొత్తం 188 మంది నామినేషన్లు దాఖలు చేశారు.వాటిలో 173 నామినేషన్లను ఎన్నికల సంఘం సరైనవిగా నిర్ధారించింది. వీటిలో 18 మంది ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు పోటీలో కాంగ్రెస్ తరఫున 60 మంది, బిజెపి తరఫున 42, ఎన్ సీ పీ తరఫున 9, స్థానిక పార్టీ పీపీఏ తరఫున 16, ఎన్ పీ ఎఫ్ తరపున 11 మంది, ఇండిపెండెంట్లు 16 మంది, ఆప్ తరఫున ఒకరు పోటీలో ఉన్నారు. ఇప్పుడు 11 మంది కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ లేకుండా నెగ్గారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. పీసీసీ అధ్యక్షుడు ముకుట్ మీథీ ఇప్పటి వరకూ అయిదుసార్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. అయితే బిజెపి మాత్రం ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం తప్ప మరేమీ కాదని, ఇదొక ప్రహసనమని, ప్రజల మనోభావాలను పూర్తిగా సమాధిచేయడమేనని విమర్శించింది. అందుకు సాక్ష్యంగా తన సంతకం ఫోర్జరీ చేసి, తాను పోటీ నుంచి వైదొలగినట్టు బూటకం ఆడుతున్నారని నాబమ్ తాడే అనే బిజెపి అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.