
టుకీ బలపరీక్షపై ఉత్కంఠ
- అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు
- 10 రోజుల గడవు కోరిన టుకీ; తిరస్కరించిన గవర్నర్
ఈటానగర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీర్పు అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నబమ్ టుకీ.. అసెంబ్లీలో బలనిరూపణకు మరింత సమయం కోరుతుండగా.. శనివారం రోజే బలపరీక్ష తప్పదని గవర్నర్ తథాగతరాయ్ స్పష్టం చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు కనీసం నెల రోజుల సమయమివ్వాలని, గవర్నర్ తనకుతానుగా అసెంబ్లీని సమావేశపర్చలేరని కాంగ్రెస్ వాదిస్తోంది.
హోంమంత్రి తంగ బ్యాలింగ్‌తో కలిసి శుక్రవారం గవర్నర్ రాయ్‌ని కలిసిన టుకీ.. బల నిరూపణకు తనకు కనీసం 10 రోజుల సమయమివ్వాలన్న అభ్యర్థనను, పరీక్షను వాయిదా వేయాలన్న కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించిన గవర్నర్.. శనివారం మెజారిటీని నిరూపించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. పదవీచ్యుత సీఎం కలిఖో పుల్ తనకు 60 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ రెబల్స్, 11 బీజేపీ సభ్యులు సహా 43 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటున్న పరిస్థితుల్లో.. టుకీ ఇప్పటికిప్పుడు మెజారిటీని నిరూపించుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రెబల్స్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా టుకీ కోరుతున్నారు. ‘నబమ్ టుకీని శనివారం మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించార’ని శుక్రవారం రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రాష్ట్ర కేబినెట్ సమావేశమై బలపరీక్షను కనీసం 10 రోజులు వాయిదా వేయాల్సిందిగా గవర్నర్‌ను అభ్యర్థిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు, కలిఖొ నేతృత్వంలోని పీపీఏకు పూర్తి మద్దతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది.
ఏకపక్ష ప్రకటన కుదరదు: కాంగ్రెస్
అసెంబ్లీ సమావేశాల నిర్ణయాన్ని గవర్నర్ ఏకపక్షంగా తీసుకోవడం కుదరదని కాంగ్రెస్ పేర్కొంది. సుప్రీంకోర్టు గత తీర్పులను, సర్కారియా కమిషన్ సిఫారసులను ఉటంకిస్తూ.. బల నిరూపణకు కనీసం నెల రోజుల సమయమివ్వాలంది. ‘బలపరీక్షకు సిద్ధంగానే ఉన్నాం. అయితే, ప్రభుత్వ సిఫారసు మేరకే సమావేశాలను ప్రారంభించాల్సి ఉంటుంది’ అని సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. అలాగే, శనివారం బలపరీక్ష జరగకుండా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, గవర్నర్ అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి కూడా కాంగ్రెస్ వివరణ కోరే అవకాశముందన్నాయి.