
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. అధికార పక్షం శివసేన.. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బలపరీక్షపై గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు బుధవారం ఉదయం ఈ పిటిషన్ దాఖలు చేశారు.
శివ సేన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అంగీకరించింది కోర్టు. జస్టిస్ సూర్యకాంత్, పర్దివాలా నేతృత్వంలోని బెంచ్ సాయంత్రం విచారణ చేపట్టనుంది. గవర్నర్ ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయిస్తామని శివ సేన కీలక నేత సంజయ్ రౌత్ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంలో శివసేన అభ్యర్థిస్తోంది.
శివ సేన తరపున అభిషేక్ సింఘ్వి వాదిస్తుండగా.. షిండే వర్గం తరపున నీరజ్‌కిషన్ కౌల్ వాదించనున్నారు. గవర్నర్ బలపరీక్ష ఆదేశాలు చట్టవిరుద్ధం అంటూ వాదించిన సింఘ్వితో ఏకీభవించిన బెంచ్.. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. బల నిరూపణ డాక్యుమెంట్లపై ప్రశ్నించిన బెంచ్‌కు సాయంత్రంలోగా సమర్పిస్తామని సింఘ్వి చెప్పడంతో.. సాయంత్రం ఐదు గంటలకు శివసేన పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లో గురువారం బలపరీక్ష చేపట్టి తీరాలని ఉద్దవ్‌థాక్రే సర్కార్‌ను ఆదేశించారు గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి రాజేంద్ర భగవత్‌కు బుధవారం ఉదయం గవర్నర్ లేఖరాశారు. గురువారం సాయంత్రం లోగా.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన రికార్డులను భద్రపర్చాలని గవర్నర్ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment