అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ!
- సీఎల్పీ నేతగా ఎన్నిక
- సీఎం, సీఎల్పీ పదవులకు టుకీ రాజీనామా
- కాంగ్రెస్ గూటికి రెబల్స్
ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాల మధ్య సీఎల్పీ కొత్త నాయకుడిని ఎన్నుకుంది. నబమ్ టుకీ సీఎం, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) పదవులకు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడు పెమా ఖండూ (37) సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. దీంతో విశ్వాస పరీక్ష వాయిదా పడింది. గవర్నర్ తథాగత్‌రాయ్ శనివారం అసెంబ్లీలో టుకీ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలిసిందేనని తేల్చిచెప్పడం తెలిసిందే. దీంతో విశ్వాస పరీక్షకు కొన్ని గంటల ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వేగంగా మారిన సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్స్ నేత, పదవీచ్యుత సీఎం కలిఖో పుల్ 30 మంది అసమ్మతి ఎమ్మెల్యేలతో కలసి తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎల్పీ భేటీలో నేతగా ఖండూ పేరును టుకీ ప్రతిపాదించగా హాజరైన 44 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పుల్‌కు, కాంగ్రెస్‌కు కుదిరిన ఒప్పందంలో భాగంగా పెమా సీఎల్పీ నేతగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. అంతకుముందు టుకీ గవర్నర్‌ను కలసి సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ మారిన పరిణామాల వల్ల తాను బలపరీక్షను ఎదుర్కోలేనని గవర్నర్‌కు చెప్పానన్నారు. పెమా మాట్లాడుతూ 47 మంది ఎమ్మెల్యేల మద్దతున్న తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరామన్నారు. అయితే గవర్నర్ తనకు హామీ ఇవ్వలేదని, నిబంధనల మేరకు వ్యవహరిస్తానని చెప్పారన్నారు. పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్‌ల జోక్యంతో పార్టీలో విభేదాలు సమసిపోయాయని వెల్లడించారు. అయితే మొత్తం 60 మంది సభ్యులున్న శాసనసభలో 45 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో పెమా ఖండూ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈశాన్య రాష్ట్రాల స్టార్ పెమా: పెమా ఈశాన్య రాష్ట్రాల కొత్త స్టార్‌గా ఆవిర్భవించారు. ఢిల్లీ హిందూ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2011లో విమాన ప్రమాదంలో తన తండ్రి మరణంతో చిన్నవయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఐదేళ్లకే సీఎం అభ్యర్థిగా మారాడు.