విశ్వాస పరీక్ష గట్టెక్కిన ఖండూ సర్కారు
ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో నాలుగు రోజుల క్రితం పురుడు పోసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్షను సులువుగా అధిగమించింది. 60 మంది సభ్యులున్న సభలో 58 మంది హాజరుకాగా, 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటేశారు. 11 మంది విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఖండూ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. బుధవారం సభను సమావేశపరిచి బలం నిరూపించుకోవాలని తాత్కాలిక గవర్నర్ తథాగతరాయ్ హడావుడిగా మంగళవారం సీఎం పెమా ఖండూను ఆదేశించారు. దీంతో బుధవారం డిప్యూటీ స్పీకర్ నోర్బు థాంగ్‌డాక్ సభను సమావేశపరచగా, ఖండూ విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ జరిగింది.
బలనిరూపణ అనంతరం ఖండూ మాట్లాడుతూ, తనపై నమ్మకముంచినందుకు మాజీ సీఎం నబమ్ టుకీ, కలిఖో పుల్ ఇతర సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని నెలల రాజకీయ అనిశ్చితి తర్వాత ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ నాటకీయంగా టుకీ స్థానంలో ఖండూను సీఎంగా నియమించడం తెలిసిందే. కాగా, నబమ్ రెబియా మంగళవారం స్పీకర్ పదవికి రాజీనామా చేయడంతో నోర్బును ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నుకున్నారు.