అరుణాచల్ పీఠంపై ఖండూ
దేశంలోనే అతి పిన్న వయసు సీఎం
ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పెమా ఖండూ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈటానగర్‌లోని రాజ్‌భవన్ కార్యాలయంలో గవర్నర్ తథాగత రాయ్.. ఖండూ చేత ప్రమాణం చేయించారు. దీంతో దేశంలోనే అతి పిన్న వయసు ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడైన 37 ఏళ్ల పెమా ఖండూ తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. దోర్జీ ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చౌనా మెయిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు పెమా ఖండూ వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఇంటికి పెద్ద కుమారుడైన పెమా ఢిల్లీలోని హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌పూర్తి చేశారు. తండ్రి మరణానంతరం మక్తో నియోజక వర్గం (ఎస్టీ రిజర్వ్‌డ్) నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జలవనరుల అభివృద్ధి, పర్యాటక మంత్రిగా పనిచేశారు. 2011 నవంబర్ 21 నుంచి నబమ్ టుకీ ప్రభుత్వంలో గ్రామీణ పనుల అభివృద్ధి, పర్యాటక మంత్రిగా పనిచేశారు. పౌర విమానయానం, కళలు సాంస్కృతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానూ పెమా పనిచేశారు.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమా ఖండూ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. పెమా ఖండూ తర్వాత దేశంలోనే అతి పిన్న వయస్కులైన ముఖ్యమంత్రుల జాబితాలో వరుసగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, అస్సాం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్‌లు ఉన్నారు.