నాటకీయ మలుపుల..రాజకీయ చదరంగం
ఏడాది కాలంలో ఎన్నెన్ని నాటకీయ పరిణామాలో...! ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ చదరంగం రంజుగా సాగుతోంది. ఏకంగా ముగ్గురు సీఎంలు మారారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిర పర్చేందుకు కేంద్రంలో పాలన సాగిస్తున్న పార్టీ చూపిన ఉత్సాహం, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం, రాష్ట్రపతి పాలన విధించడం, కాంగ్రెస్‌లో చీలిక, సుప్రీంకోర్టు జోక్యం, పదవి పోగొట్టుకున్న సీఎం ఆత్మహత్య... ఇలా ఒకదానికి తర్వాత మరొకటి. తాజాగా మరో ముసలం.
2014లో ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకుగాను కాంగ్రెస్ 42 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. 2011 నుంచి సీఎంగా ఉన్న నబమ్ టుకీయే మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2014 డిసెంబరులో వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి కలిఖో పుల్‌ను మంత్రివర్గం నుంచి టుకీ తప్పించారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో పుల్ అసమ్మతిని లేవదీశారు. 2016 జనవరి 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది.
కానీ దీన్ని ముందుకు జరుపుతూ డిసెంబరు 16, 2015 నుంచే అసెంబ్లీ సమావేశాలుంటాయని గవర్నర్ జె.పి.రాజ్‌ఖోవా ఆదేశాలిచ్చారు. టుకీని దింపేందుకు అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. టుకీ ప్రభుత్వం అసెంబ్లీకి తాళం వేయడంతో... డిసెంబరు 16న మరోచోట సమావేశమైన 33 మంది ఎమ్మెల్యేలు (పుల్ వర్గం, బీజేపీ) స్పీకర్‌గా రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు.
మరుసటి రోజు హోటల్‌లో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. టుకీని తొలగించి కలిఖో పుల్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. తర్వాత రెబియాతో పాటు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు లేకుండా... బీజేపీకి చెందిన 11 మంది, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు చేసిన తీర్మానం మేరకు అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ఎలా ముందుకు జరుపుతారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ వాదించింది.
అరుణాచల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు సిఫారసు చేసింది. ఈ ఏడాది జనవరి 26న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన విధించాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. దీన్ని సుప్రీం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ఇచ్చిన నివేదికను తమకు అందజేయాలని కోరింది. తర్వాత వాదోపవాదాలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ తమ చర్యలను సమర్థించుకున్నారు.
14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ రెబియా ఇచ్చిన ఆదేశాలపై గౌహతి హైకోర్టు ఇచ్చిన స్టేను ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనే కాంగ్రెస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దాంతో కేంద్రం వేగంగా పావులు కదిపింది. మరుసటి రోజు రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అసమ్మతి నేత కలిఖో పుల్ ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ఏడాది జులై 13న సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. అసెంబ్లీని ముందుకు జరుపుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. డిసెంబరు 15 నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది. దాంతో నబమ్ టుకీ నేతృత్వంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచిన కేంద్రానికి ఇది గట్టి ఎదురుదెబ్బ. తాత్కాలిక గవర్నర్‌గా ఉన్న తథాగత రాయ్ రెండురోజుల్లోనే... జులై 16న బల నిరూపణ చేసుకోవాలని టుకీని కోరారు.
కనీసం 10 రోజుల గడువివ్వాలని టుకీ కోరగా గవర్నర్ నిరాకరించారు. ఈలోపు తెరవెనుక మంత్రాంగం నడిచి అసమ్మతి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. టుకీ బలపరచబోమని, మరొకరిని సీఎం చేయాలని కోరారు. దాంతో మధ్యేమార్గంగా పెమా ఖండూను సీఎంగా ఎన్నుకోగా... అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సుప్రీం తీర్పుతో పదవి పోగోట్టుకున్న కలిఖో పుల్ ఆగష్టు 9న తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
సుప్రీంతీర్పుతో కంగుతిన్న బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతో పావులు కదిపారు. ఫలితంగా సెప్టెంబరు 16న ముఖ్యమంత్రి పెమా ఖండూ 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ)లో చేరిపోయారు. ఎన్డీయేకు చెందిన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (నెడా)లో పీపీఏ భాగస్వామి. కాంగ్రెస్ పార్టీలో చివరికి మాజీ సీఎం నబమ్ టుకీ రూపంలో ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు.
రాజీనామా చేయాలనే కేంద్రం సూచనలు పట్టించుకోకుండా గవర్నర్ పదవిలో కొనసాగిన రాజ్‌ఖోవాను సెప్టెంబరు 22న చివరకు రాష్ట్రపతి డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఖండూను, మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన పీపీఏ... శుక్రవారం తమ లెజిస్లేటివ్ పార్టీ నేతగా రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యే (ఎన్నికల అఫిడవిట్ తన ఆస్తుల విలువను 187 కోట్లుగా చూపారు) టకమ్ పారియోను ఎన్నుకున్నట్లు స్పీకర్‌కు తెలియజేసింది.
12 మంది సభ్యులున్న బీజేపీ పెద్దన్న పాత్రను పోషిస్తూ... 43 మంది సభ్యులున్న పీపీఏను చిన్నచూపు చూస్తోందనేది తిరుగుబాటు నేతల వాదన. ఖండూకే తమ మద్దతు ఉంటుందని, మరొకరిని సీఎంగా అంగీకరించమని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అంటోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజుతో టకమ్ పారియోకు తీవ్ర రాజకీయవైరముంది. బీజేపీ (12), ఖండూ వర్గం (సస్పెండైన ఏడుగురు) లేకున్నా... 36 మందితో పీపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఉంది. రెండు జాతీయ పార్టీలు... బీజేపీ, కాంగ్రెస్‌లకు రాజకీయ చదరంగంగా మారిన అరుణాచల్‌లో తాజా పరిణామాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్