మరో రాష్ట్రంలో పెను సంక్షోభం
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో పెను సంక్షోభం చోటుచేసుకుంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 44 మంది ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి ఫెమా ఖండూ సహా 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కూటమిలో చేరుతున్నారు. మూడింట రెండు వంతుల మంది ఒకేసారి పార్టీ మారితే వాళ్లకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ఇప్పుడు ఏకంగా దాదాపు మొత్తం పార్టీ సభ్యులంతా ఒకేసారి మారిపోతుండటంతో చట్టప్రకారం ఏమీ చేయడానికి కూడా ఉండదు. దాంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఏమీ లేకుండానే ఒక్క దెబ్బకు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్లయింది. అరుణాచల్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలను గెలుచుకుంది. 2016 మే నెలలోనే పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ - బీజేపీ కలిసి ఒక కూటమిగా రూపొందాయి. ఆ కూటమికి ఇప్పుడు మరింత బలం చేకూరి.. బీజేపీ అధికారంలోకి రాబోతోంది.
ప్రాంతీయ పార్టీ అయిన పీపీఏ 1979లో ప్రారంభమైంది. ఒకేసారి వీళ్లంతా నేరుగా బీజేపీలో చేరితే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయన్న ముందు జాగ్రత్తతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వీళ్లందరినీ పీపీఏలో చేరుస్తున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్నాయంటూ ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో చట్టపరంగా ఎలాంటి సమస్య రాకుండానే అధికారాన్ని అంది పుచ్చుకోడానికి అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.