నాడు కాంగ్రెస్‌ ఖాతాలో 414.. నేడు బీజేపీ అధిగమించేనా? | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: నాడు కాంగ్రెస్‌ ఖాతాలో 414.. నేడు బీజేపీ అధిగమించేనా?

Published Tue, Apr 2 2024 9:17 AM

Congress Far Away From 200 Seats - Sakshi

దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ  నేడు సొంతంగా కనీస ఓట్లను కూడా పొందలేని స్థితికి చేరిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 1991 నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. 1991 తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్‌ 200 సీట్ల సంఖ్యను తాకగలిగింది. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 364 సీట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీకి మొత్తం 44.99 శాతం ఓట్లు వచ్చాయి. 1962లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా తగ్గాయి. ఓట్లు 44.71 శాతం ఉండగా, సీట్లు 361కి తగ్గాయి. 1967లో పార్టీ ప్రజాదరణ మరింత క్షీణించింది. ఓట్లు 40.78 శాతానికి, సీట్లు 283కి తగ్గాయి. అయితే 1971లో పార్టీకి వైభవం తిరిగివచ్చింది. ఓట్లు 43.68 శాతానికి, సీట్లు 352కి పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 28 సీట్లు, బీహార్‌లో 39 సీట్లు, మహారాష్ట్రలో 42 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లోని 73 సీట్లు వచ్చాయి.

1977లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. లోక్‌సభ పదవీకాలం నవంబర్‌తో ముగియాల్సి ఉంది. అయితే హఠాత్తుగా  ఆ ఏడాది ఎన్నికలు ప్రకటించారు. ఎమర్జెన్సీతో ఆగ్రహించిన ప్రజానీకం ఏకమై కాంగ్రెస్‌ను కేవలం 154 సీట్లకు పరిమిత చేశారు. ఓట్ల శాతం కూడా 34 శాతానికి తగ్గింది. మరోవైపు జనతా పార్టీ 295 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జనతా పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 42.69 శాతం ఓట్లతో 353 సీట్లు వచ్చాయి. 1984లో కూడా పార్టీ ఈ సంఖ్యను దాటేసింది. నాడు ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత సెక్యూరిటీ గార్డులే హత్య చేశారు. దీంతో దేశంలో కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తింది.

1984 నాటి రికార్డును పార్టీ ఇప్పటి వరకు దాటలేదు. నాడు సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ఓట్లు 48 శాతానికి పెరిగాయి. సీట్లు కూడా రికార్డు స్థాయిలో 414కు పెరిగాయి. గత పదేళ్లలో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్‌గానీ ఈ రికార్డును దాటలేదు. కాగా లోక్‌సభలో మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం. 1984 తర్వాత కాంగ్రెస్‌కు ఒక్కసారి కూడా ఒంటరిగా మెజారిటీ రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. 1989లో 39.53 శాతం ఓట్లు, 197 సీట్లు వచ్చాయి. 1991లో పార్టీ 36.40 శాతం ఓట్లు, 244 సీట్లు సాధించగలిగింది. ఆ సమయంలో బీజేపీకి తొలిసారిగా 120 సీట్లు రాగా, 20 శాతానికి పైగా ఓట్లు  ఆ పార్టీకి దక్కాయి.

2004 ఎన్నికల వరకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. 1996లో కాంగ్రెస్‌కు 140 సీట్లు, బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. 1998లో ఆ పార్టీ 141 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 184 సీట్లు గెలుచుకుంది. 1999లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు కాంగ్రెస్‌కు 114 సీట్లు దక్కాయి. అయితే  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. 

Advertisement
 
Advertisement