సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కు తోంది. డీఎఫ్, మహాకూటమి దెందూ.. దెందే.. అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. ఓటమి ఒక కూటమిలో చిచ్చురేపితే, గెలుపు మరో కూటమిలో కుమ్ములాటలకు తెరతీసింది. వెరసి అన్ని పార్టీల కార్యకర్తల్లోనూ అనిశ్చితి నెలకొంది.
డీఎఫ్..అధిష్టానం కోర్టులో బంతి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 144 సీట్లు కావాలంటూ ఎన్సీపీ డిమాండ్ చేస్తుండగా మరోవైపు దీనికి ససేమిరా అని కాంగ్రెస్ పేర్కొంటోంది. అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగుతామని ఇరు పార్టీలూ బెదిరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాసామ్య కూటమి (డిఎఫ్) కొనసాగుతుందా.. లేదా అనే విషయంపై కాంగ్రెస్, ఎన్సీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమి గత 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు అనేక అంశాలపై వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. పలుమార్లు ఆ కూటమి ముక్కలు చెక్కలయిపోతుందని పలువురు భావించారు. అయితే ఇరు పార్టీల అధిష్టానాలు సంయమనం పాటిస్తుండటంతో ఇంకా వీరి కూటమి కొనసాగుతోంది. అయితే ప్రతిసారి లోకసభ, అసెంబ్లీ, ఇత ర ఎన్నికల్లో వీరి మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తడం సర్వసాధారణమైంది. ఈసారి అవి తీవ్రస్థాయిలో ఉన్నాయి.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ కోలుకోలేని దెబ్బ తిన్నప్పటికీ.. ఒకరి ఓటమికి మరొకరు కారణమంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేవలం రెండు లోక్‌సభ స్థానాలు సాధించిన కాంగ్రెస్ కన్నా నాలుగు స్థానాలు సాధించిన తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి తమకు ఎక్కువ కేటాయించాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవలే జరిగిన సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి ృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేలతోపాటు ఇరు కాంగ్రెస్‌ల పదాధికారులు పాల్గొని సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు.
అయితే ఈ చర్చల్లో ఎన్సీపీ 144 స్థానాలు కావాలంటూ డిమాండ్ చేయడం, కాంగ్రెస్ ససేమిరా అనడంతో ఈ సీట్ల పంపకాల అంశం ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌లు చర్చలు జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయంపై ఉత్కంఠత కన్పిస్తోంది.
మహాకూటమిలోనూ లుకలుకలే....
బీజేపీ, శివసేన తదితర పార్టీల మహాకూటమిలో కూడా సీట్ల పంపకాల లొల్లి నడుస్తోంది. 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న ఈ కూటమి ఇటీవల లోక్‌సభ ఎన్నికల విజయంతో ఎప్పుడెప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ కూటమిలోని బీజేపీ, శివసేన మధ్య గతంలో కుదిరిన ఒప్పందం ఏ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పార్టీ సూచించిన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు.
అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి అత్యధిక స్థానాలు సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకు అధికారం ఖాయమని భావిస్తున్నాయి. అయితే ఈసారి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయమై ఇంకా ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, శివసేన మధ్య సయోధ్య కుదరలేదు. మోడీ ప్రభంజనం ఉంది కాబట్టి తమకు ఎక్కువ స్థానాలు కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.. అయితే మొదటి నుంచి ఉన్న ఒప్పందం ప్రకారమే ముందుకు పోవాలని శివసేన స్పష్టం చేస్తోంది.
శివసేన ఇప్పటికే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే పేరును సూచించగా, బీజేపీ మాత్రం ఎన్నికల తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ కూటమిలోకి కొత్తగా వచ్చి చేరిన ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరి సంఘటన తదితర పార్టీలకు కూడా సీట్లను కేటాయించాల్సి రానుంది.
గత ఎన్నికల్లో శివసేన 169, బీజేపీ 119 సీట్లలో పోటీ చేశాయి. అయితే ఈసారి వీరితో జతకట్టిన ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయంతోపాటు ఆ సీట్లను ఎవరి కోటా నుంచి తగ్గించాలనే దానిపై కూడా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీనికితోడు కాంగ్రెస్ నేత నారాయణ రాణే మంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన బీజేపీలో చేరనున్నట్టు వార్తలు రావడంతో మహాకూటమిలో అయోమయ స్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో మహాకూటమిలో సీట్లతో పాటు ఇతర అంశాలపై సయోధ్య ఎలా కుదరనుందనే విషయంపై కార్యకర్తల్లో ఉత్కంఠత కన్పిస్తోంది.
అక్టోబర్‌లోనే ఎన్నికలు !
సాక్షి, ముంబై : అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఆగస్టులో ఎన్నికల్ కోడ్ అమల్లోకి తీసుకువచ్చి అక్టోబర్‌లో ఎన్నికల జరపాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రలో ఇటీవల పర్యటి ంచిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ లేదా 8వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం భావిస్తోందని సమాచారం. నక్సలైట్ల ప్రభావమున్న ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని రెండు లేదా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని తెలిసింది.
సీట్ల‘పట్లు’
Published Sat, Jul 26 2014 10:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement