సాక్షి, ముంబై: అసెబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. అధికారికంగా తేదీలను ప్రకటించకపోయినా, అక్టోబరులో ఎన్నికలు జరగనున్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీల్లో అనేక మార్పులుచేర్పులు కనిపిస్తున్నాయి. అన్నింట్లోనూ తిరుగుబాటుదారుల బెడద ఉన్నప్పటికీ ఎన్సీపీ, కాంగ్రెస్‌లో అధికంగా కనిపిస్తోంది.
మరోవైపు సీట్ల పంపకాలపై అధికారపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాసామ్య కూటమి, ప్రతిపక్షాలు శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరీ పార్టీ, శివసంగ్రామ్ పార్టీ మధ్య సయోధ్య కుదరడంలేదు. దీంతో పొత్తుపై కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలను గమనిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయనే అంచనాకు రావొచ్చు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్టయితే కొత్త పొత్తులు ఏర్పడేందుకూ అవకాశం ఉందని చెప్పవచ్చు.
మహాకూటమిలో మిత్రబేధాలు..
మహాకూటమిలో సీట్ల పంపకాలతోపాటు పలు అంశాలపై మిత్రపక్షాల మధ్య విబేధాలున్నాయి. దీంతో ఇప్పటి వరకు సీట్ల పంపకాలపై సయోధ్య కుదరలేదు. గతంలో కేవలం శివసేన, బీజేపీల కూటమి ఉండేది. అయితే ఈసారి ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరి, శివసంగ్రామ్ తదితర పార్టీలు చేరడంతో మహాకూటమిగా ఏర్పాటయ్యాయి. దీంతో కొత్తగా చేరిన పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి.
సీట్లు కేటాయిస్తే ఆ సీట్లను ఎవరి కోటా (శివసేన, బీజేపీ) నుంచి వదులుకోవలనే విషయంపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే సీట్ల పంపకాలు జాప్యమవుతున్నాయి. గత ఎన్నికల ను పరిశీలిస్తే శివసేన 169, బీజేపీ 119 సీట్లలో పోటీ చేశాయి. అయితే ఈసారి వీరితో జతకట్టిన మహాకూటమిలోని ఆర్పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని శేత్కరి పార్టీలు కనీసం రెండంకెల సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్పీఐ అధ్యక్షుడు ఈ విషయంపై ఇటీవలే విలేకరులతో మాట్లాడుతూ తమకు ప్రాధాన్యమిచ్చి రెండంకెల సంఖ్య సీట్లను కేటాయించకుంటే మహాకూటమిలో కొనసాగే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదేమాదిరిగా మిగతా పార్టీలు కూడా శివసేన, బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభావంతోపాటు తమ బలం పెరిగిందని, ఈసారి తమకు అధిక సీట్లు కేటాయించాలని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. ఇలా శివసేన, బీజేపీ మధ్య కూడా విబేధాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా పార్టీ అధిష్టానంతోపాటు సీనియర్ నాయకులు మాత్రం పొత్తు కొనసాగుతుందని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాకూటమిలో చీలిక ఏర్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమి శివసేన బీజేపీ గత 15 ఏళ్లుగా పొత్తు కొనసాగుతోంది. దీంతో ఈసారి మహాకూటమిలో సీట్ల పంపకాలతోపాటు ఇతర అంశాలపై సయోధ్య ఎలా కుదరనుందనే విషయంపై కార్యకర్తల్లో ఉత్కంఠత కన్పిస్తోంది.
ప్రజాసామ్య కూటమిలో ముదురుతున్న ఘర్షణలు..
అధికారపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీల మద్య సీట్ల పంపకాలపై విబేధాలు తీవ్రమవుతున్నాయి. ఒకవైపు 144 సీట్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్న ఎన్సీపీ ఒకమెట్టు దిగింది. కనీసం 124 ఇవ్వాలని అడుగుతోంది. మరోవైపు దీనికి కాంగ్రెస్ ససేమిరా అంటోంది. అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగతామని ఇరు పార్టీలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాసామ్య కూటమి (డీఎఫ్) కొనసాగుతుందా..? లేదా అనే విషయంపై అయోమయం నెలకొంది.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174, ఎన్సీపీ 114 సీట్లలో పోటీ చేశాయి. ప్రారంభంలో 144 సీట్లు కావాలంటు కాంగ్రెస్‌పై ఎన్సీపీ ఒత్తిడి తెచ్చినా ఫలితం దక్కలేదు. దీంతో ఇరు కాంగ్రెస్‌లు ఒకమెట్టు దిగివచ్చినట్టు తెలుస్తోంది. గతంలోకంటే 11 స్థానాలను అధికంగా ఎన్సీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత తెలిపినట్టు సమాచారం. మరిన్ని సీట్లు కావాలని ఎన్సీపీ కోరుకుంటున్నట్టు తెలిసింది. దీంతోపాటు ఒకరిపై మరొకరు ఆరోపణల వల్ల ఇరు పార్టీల మధ్య విబేధాలు తారస్థాయికి చేరింది. దీంతో కూటమి మనుగడకే ముప్పు ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు
కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాసామ్య కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన నలుగురు సిటింగ్ ఎమ్మెల్యేలు బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరినవారిలో జాల్నా జిల్లా పరతూర్‌కు చెందిన సురేష్ జెథలియా, సాంగ్లీ జిల్లా రావేర్‌కు చెందిన శిరీష్ చౌదరి, నాందేడ్ జిల్లా నాయిగావ్‌కు చెందిన వసంత్ చవాన్, సాతారా జిల్లా మాణ్‌కు చెందిన జయకుమార్ గోరే ఉన్నారు. ముంబైలోని గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, మాజీ కేంద్రమంత్రి షిండే సమక్షంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారు.
అన్ని పార్టీల్లో.. పొత్తుల పంచాయితీలు
Published Thu, Sep 11 2014 10:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement