సాక్షి, ముంబై: ‘ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం.. రాజకీయం మొత్తం వారసత్వాల మయం..’ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీలో చోటులేదని కొన్ని పార్టీలు సొంత డప్పు కొట్టుకుంటున్నాయి. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, ప్రధాన కార్యకర్తలకు, పదాధికారులకు ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్నాయి.
కాని వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీల ప్రముఖ నాయకులు తమతమ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల బరిలో దింపుతున్నారు. కాని పార్టీలో కష్టపడి పనిచేసే పదాధికారులకు, కార్యకర్తలకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. వారు బడా నాయకులు కావడంతో తమకెందుకు అభ్యర్థిత్వం ఇవ్వలేదని నిలదీసే సాహసం ఎవరూ చేయడంలేదు.
దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది.
ప్రధాన పదవులు తమ కుటుంబసభ్యులు, బంధువులకు ఇప్పించుకుంటున్న బడా నాయకులు కార్యకర్తలకు చిన్న చిన్న నామినేటడ్ పదవులను, కార్పొరేషన్ పదవులను ఇప్పిస్తూ వారిని బుజ్జగిస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే తతంగం నడుస్తుండటం గమనార్హం.
‘వారసుల’ వివరాలివే...
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కుమారుడు రాహుల్‌కు యావత్మాల్ నియోజక వర్గం నుంచి అభ్యర్థిత్వం లభించింది. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తనయుడు రాజేంద్ర శేఖావత్‌కు అమరావతి నుంచి, మాజీ కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండేకు షోలాపూర్ నుంచి, దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు అమిత్ దేశ్‌ముఖ్‌కు లాతూర్ నుంచి కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది.
బీజేపీకి చెందిన దివంగత నాయకుడు గోపినాథ్ ముండే కుమార్తె పంకజా ముండే పర్లీ నుంచి, కాంగ్రెస్‌కు చెందిన విదర్భ నాయకుడు రంజిత్ దేశ్‌ముఖ్ ఇద్దరు కొడుకులు, అలాగే శివసేనకు చెందిన ఎంపీ ఆనంద్‌రావ్ అడ్సూల్ తనయుడు అభిజిత్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఇదిలాఉండగా యావత్మాల్ నుంచి కాంగ్రెస్ తరఫున నందినీ పార్వేకర్, గోపినాథ్ ముండే కూతురు పంకజా రెండోసారి పర్లీ నుంచి పోటీ చేస్తున్నారు.
బీడ్ లోక్‌సభ నియోజక వర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రీతం ఖాడేకు అభ్యర్ధిత్వం లభించింది. ప్రమోద్ మహాజన్ కూతురు పూనం ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ముండే సోదరుడి కుమారుడు ధనంజయ్ ముండే ఎన్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ బారామతి నుంచి పోటీ చేస్తున్నారు.
కాగా పవార్ కూతురు సుప్రియా సూలే ఎంపీగా కొనసాగుతున్నారు. ఇలా అనేకమంది దిగ్గజాలు ఏళ్ల తరబడి తమ కుటుంబ సభ్యులకే రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. కాని పార్టీలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు, పదాధికారులను మాత్రం పట్టించుకోవడం లేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.
వారసులే ముద్దు..!
Published Tue, Sep 30 2014 10:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement