Kalikho Pul
-
విషాదం : మాజీ సీఎం కుమారుడి అనుమానాస్పద మృతి
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు షుబన్సో అనూహ్య రీతిలో మరణించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో ఫుల్ (20) అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినట్లు కుటుంబ వర్గాలు మంగళవారం తెలిపాయి. దీంతో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన కలిఖో ఫుల్ ఇంట్లో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిఖో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కుమారుడైన షుబాన్సో సస్సెక్స్‌లోని బ్రైటన్‌లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించడం కుటుంబ వర్గాలను కలవరపర్చింది. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూకేలోని భారత హైకమిషన్‌తో సంప్రదిస్తున్నామని తెలిపారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావంటూ 2015 ఏప్రిల్‌లో షో కాజ్ నోటీసు కూడా యివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఫుల్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించడంతో 19 ఫిబ్రవరి 2016న 30మంది రెబెల్ ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఈ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆవేదనకు లోనైన ఫుల్ ఆగస్టు 9, 2016 న నీతి విహార్‌లోని తన అధికారిక నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఒక విషాదం. ఈ సందర్భంగా రాష్ట్రంలోచోటుచేసుకున్న భారీ అవినీతిపై ''మేరే విచార్'' (నా ఆలోచనలు) పేరుతో అనే 60 పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఈ నోట్లో పేర్కొన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ మొదటి భార్య డాంగ్విమ్సాయ్ పుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన మూడవ భార్య దాసాంగ్లు విజయం సాధించారు. -
న్యాయపీఠంపై పేలిన బాంబు..!
సందర్భం అరుణాచల్‌ప్రదేశ్‌లో బర్తరఫ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునఃస్థాపించే కేసులో ఇద్దరు న్యాయమూర్తుల బంధువుల ద్వారా తనను 86 కోట్ల లంచం అడిగారని నాటి సీఎం కలిఖో పుల్ పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయ పీఠపు గౌరవానికి ఇది భంగకరం. ఢిల్లీ అధికార పీఠంలో ఒక వార్త కలకలం రేపుతోంది. అక్కడ ఓ మహిళ అరవై పేజీల బాంబుతో తచ్చాడుతోంది. బాంబులోంచి పొగ వెలువడుతోంది. ఎవరూ దాని నుంచి దృష్టి మరల్చలేకపోతున్నారు. అలాగని దాన్ని ముట్టుకునే సాహసం కూడా ఎవరూ చేయలేక పోతున్నారు. ఈ బాంబు పేలితే ఎవరెవరు బలి అవుతారోననేదే అందరిలో నెలకొన్న ఆందోళన. ఆ బాంబు అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ వదిలి వెళ్లిన సూసైడ్ నోట్. ఈటానగర్లోనైనా, ఢిల్లీలోనైనా, ఇటు ప్రభుత్వాలూ, అటు న్యాయవ్యవస్థా కలిఖో వదిలి వెళ్లిన సూసైడ్ నోట్‌ను మింగలేక, కక్కలేక ఇబ్బంది పడుతున్నాయి. కలిఖో పుల్ కాంగ్రెస్‌కు చెందినవాడు. 2016 ఫిబ్రవరిలో కాంగ్రెస్ సీఎం నబామ్ టుకీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎత్తి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో సీఎం అయ్యారు. సుప్రీం కోర్టు అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను, కలిఖోను గద్దెనెక్కించే నిర్ణయాన్నీ రాజ్యా ంగవిరుద్ధమైనవిగా ప్రకటించింది. తర్వాత కలిఖో ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ఆయన శవం పైకప్పుకు వేలాడుతుండగా, నేలపై చుట్టూతా ఒక నోటుకు చెందిన పది ప్రతులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ‘మేరే విచార్’ (నా భావనలు) అనే శీర్షికతో హిందీలో టైప్ చేసిన ఆ అరవై పేజీల నోట్లో ప్రతి పేజీ పైనా మృతుడి సంతకం ఉంది. అంటే దీని విశ్వసనీయత నిర్వివాదమన్నమాట. (దీని పూర్తి పాఠం www.judicial reforms.org లో ఉంది.) కలిఖో పేల్చిన ఈ బాంబులో అసలైన పేలుడు పదార్థం నడి మధ్యలో ఉంది. ప్రజా జీవితంలో పాతుకుపోయిన అవినీతిని బట్ట బయలు చేస్తూ కలిఖో రాసిన భాగాల్లో ఉంది. అవన్నీ నిజమని భావించలేం. అయినా, రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం, నకిలీ బిల్లులు, డబుల్ బిల్లుల చెల్లింపులు, పట్టుబడినప్పుడు ఫైళ్లను మాయం చేసేయ డం, వందల కోట్ల రూపాయల్ని దిగమింగడం వంటి వాటిపై ఆయన రాసిన కథనాలను మాత్రం ఉత్తుత్త మాటలుగా కొట్టిపారెయ్యలేం. కాంగ్రెస్‌లో రెండు దశాబ్దాల అనుభవంతో పుల్ చేసిన తుది నిర్ధారణ చేదు అనుభవంగానే ఉంది.‘కాంగ్రెస్ పార్టీ తన ఖజానాకు కావలసిన డబ్బులు పంపే వాళ్లకే పెద్ద పీట వేస్తుంది. వాళ్లనే నాయకుల్ని చేస్తుంది. అలా వారు ఖజానాలోంచి ప్రజల సొమ్మును కొంత దోచుకొని అధిష్టానానికి అందజేస్తూ ఉండాలి, అలా వారికి ఆదాయం సమకూ ర్చాలి. ‘ప్రస్తుత రాష్ట్రపతి సహా కాంగ్రెస్ బడా నేతలందరి పేర్లను ఉద హరిస్తూ ఎవరెవరికి ఎంతేసి డబ్బు ఇచ్చారో ఆ నోట్లో కలిఖో రాశారు. కలిఖో చేసిన ఆరోపణల్లో అన్నింటికన్నా తీక్షణమైన భాగం న్యాయ వ్యవస్థకు సంబంధించింది. ఆయన సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులను, ఇద్దరు ప్రస్తుత న్యాయమూర్తులను పేర్కొంటూ వారిపై అవినీతి ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి సంబంధిం చిన అనేక కేసులలో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని పలు అవినీతి కేసుల్ని కొట్టివేశారన్నది ఆ ఆరోపణల సారాంశం. అంతేకాదు, అరుణా చల్ప్రదేశ్లో బర్తరఫ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునఃస్థాపించే కేసులో ఇద్దరు న్యాయమూర్తుల బంధువుల ద్వారా తనను 86 కోట్ల లంచం అడిగారని కూడా పుల్ పేర్కొన్నారు. ఈ నలుగురు న్యాయ మూర్తులలో ఇద్దరిపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చా లేదు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో కలిఖో కక్ష పెంచుకొని ఆరో పణలకు పూనుకున్నారేమో. అయినా సరే, చట్టం మృతుడి చివరి వాంగ్మూలాన్ని లేదా సూసైడ్ నోట్‌ను సాక్ష్యంగా పరిగణిస్తుంది. పైగా ఇది దేశ అత్యున్నత న్యాయ పీఠపు గౌరవానికి సంబంధించిన విషయం కూడా. కలిఖో ఆత్మహత్య తర్వాత సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ ఆదేశించినప్పటికీ విచారణ ఎందుకు జరగలేదు? కేవలం కాంగ్రెస్ నేతల పేర్లున్న ఈ నోట్‌పై విచారణ జరిపించడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? ఆత్మహత్య చేసుకోడానికి ముందు కలిఖో రాసిన నోట్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ కేంద్రానికి సిఫార్సు చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీలోని చాలా మంది పాత్రికేయులకు బిర్లా– సహారాల వద్ద జప్తు చేసుకున్న దస్తావేజులు అందుబాటులోకి వచ్చాయి. బిర్లా– సహారా డాక్యుమెంట్లపై విచారణ జరిపించాలని ప్రశాంత్ భూషణ్ అక్టోబర్‌లో డిమాండ్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి ఆలోచిస్తోంది. అదే సమ యంలో ఢిల్లీలోని ఒక పెద్ద వకీలు ఇంటిపై సోదా జరుగగా కోట్ల రూపాయల అక్రమ నగదు బైటపడింది. ఆ సొమ్ములో ఒక భాగం ఒక పెద్ద న్యాయమూర్తి కుమారుడిదని ఆ వకీలు చెప్పినట్టుగా ఆరోపణలు. నవంబర్–డిసెంబర్ నెలల్లో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఒకనాటి తీర్పులనే పక్కన పెడుతూ, సహారా– బిర్లా కేసులో ఇలాంటి డైరీలపై, దస్తావేజులపై విచారణ జరపలేమనే ఒక కొత్త వ్యాఖ్య మొదలుపెట్టింది. జనవరిలో జస్టిస్ కేహర్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక కొత్త బెంచ్ బిర్లా–సహారా కేసును కొట్టివేసింది. సుప్రీంకోర్టు, ప్రభు త్వాల మధ్య ప్రతిష్టంభన తొలగిపోనున్నదనే వార్తలూ రాసాగాయి. ఈ ఘటనలన్నింటికీ పరస్పర సంబంధం లేకపోవచ్చు. ఇవన్నీ ఒక క్రమంలో జరగడం కేవలం యాదృచ్ఛికమే కావచ్చు కూడా. కొద్ది రోజుల క్రితమే ప్రధాన మంత్రి తన వద్ద విపక్ష నేతలందరి చిట్టాలు న్నాయని హెచ్చరిక స్వరంలో వ్యాఖ్యానించడం విదితమే. బహుశా ఆయన వద్ద మరి కొంతమంది చిట్టాలు కూడా ఉండొచ్చు. కలిఖో పుల్ అనే బాంబు పట్ల ఇంత మౌనం వహించడం వెనుక ఇదే కారణం కావచ్చునేమో! ప్రస్తుతం బాంబు ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ కార్యాల యంలో ఉంది. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఒక తీర్పు ప్రకారం న్యాయ మూర్తులపై విచారణకు ఆదేశాలు జారీ చేయడానికి ముందు ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరోపణ ప్రధాన న్యాయమూర్తి పైనే అయితే రాష్ట్రపతి ఇతర న్యాయ మూర్తుల సలహా కోరతారు. అయితే ఇందులో ఈసారి ప్రధాన న్యాయ మూర్తి, రాష్ట్రపతి ఇరువురి పేర్లూ ఉన్నాయి కాబట్టి కలిఖో పుల్ భార్య ఉపరాష్ట్రపతిని కలసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే అక్కడైనా ఈ రహస్యంపై పరదా తొలగిపోతుందా లేక దీనికి బిరడా మరింతగా బిగించేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
కలిఖో లేఖ ప్రకంపనలు
నిరుడు ఆగస్టులో అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన వెళ్లిపోతూ రాసిన లేఖలోని అంశాలు ఏడెనిమిది నెలల అనంతరం ఇప్పుడు వెల్లడై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకునేవారు వదిలివెళ్లే లేఖలను మరణ వాంగ్మూలాలుగా పరిగణిస్తారు. ఆ లేఖలు మృతుల మనోభావాలను వెల్లడిస్తాయి. వారిని కలవర పెట్టిన అంశాలేమిటో, అంతటి తీవ్ర నిర్ణయానికి వారిని ప్రేరేపించిన వారెవరో చెబుతాయి. సంచలనం సృష్టించిన కేసుల్లో అలాంటి లేఖలను మీడియాకు విడు దల చేయడం కూడా రివాజు. కానీ కలిఖో పుల్ విషయంలో అలా జరగలేదు. లేఖ లోని అంశాల సంగతలా ఉంచి అసలు అలాంటి లేఖ ఉన్నట్టే ఎవరూ బయట పెట్టలేదు. ఆ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసి, అక్కడి రాజకీయ సంక్షోభానికి కారకుడైన జ్యోతి రాజ్‌ఖోవాను ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం తప్పించకపోతే ఆ లేఖ ఎప్పటికీ మరుగున పడేదేమో! కానీ స్వల్పకాలంలోనే తన పదవి ఊడబెరకడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన రాజ్‌ఖోవా పోతూ పోతూ ఆ లేఖ సంగతి వెల్లడిం చారు. నిజానికి ఆ పని పోలీసులే చేయాల్సింది. రాజ్‌ఖోవా నోటి వెంబడి బయ టకు రావడం వల్ల అక్కడి రాష్ట్ర ప్రభుత్వ నిజాయితీపై అందరికీ సందేహాలు కలి గాయి. దాని సంగతలా ఉంచి లేఖలోని ఆరోపణలు చాలా తీవ్రమైనవి. 60 పేజీల నిడివి గల ఆ లేఖ మన వ్యవస్థకు సంబంధించిన సర్వాంగాల్లో పేరుకుపోయిన అవినీతిని ప్రస్తావించింది. అది నిలువెల్లా భ్రష్టుపట్టిపోయిన వైనాన్ని వెల్లడిం చింది. కోట్లాది రూపాయల ప్రజా ధనం ఏ స్థాయిలో దుర్వినియోగమవుతున్నదో తెలిపింది. అంతే చెప్పి ఊరుకోలేదు. ఆ అవినీతికి పాల్పడిన వ్యక్తులెవరో... ఏ ఏ సందర్భాల్లో డబ్బును స్వాహా చేశారో పేర్లతోసహా తెలిపింది. న్యాయవ్యవస్థ సైతం ఇందుకు మినహాయింపు కాదని చాటింది. అరుణాచల్‌ప్రదేశ్ దాదాపు వార్తల్లోకెక్కని రాష్ట్రం. అది చైనా సరిహద్దుల్లో ఉండటం, అడపా దడపా చైనా సైన్యం అందులోకి చొరబడటం వంటి ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడే ఆ రాష్ట్రంపై అందరి దృష్టీ పడుతుంది. అయితే నిరుడంతా అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం దాన్ని పతాక శీర్షికల్లో నిలిపింది. కలిఖో పుల్ ఆత్మహత్యకూ, ఆ పరిణామాలకూ మధ్య ఉన్న సంబంధం వల్ల ఆయన విషాద మరణం అందరినీ మరింతగా కలచివేసింది. కలిఖో పుల్ సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేశారు. ఎమ్మెల్యే మొదలుకొని సీఎం వరకూ అనేక పదవులు నిర్వహించారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు 42 గెల్చుకుని కాంగ్రెస్ ఘన విజయం సాధించాక నబం టుకీ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన అసమ్మతివాదిగా మారారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని కలిసి వివరించేందుకు ఆయన వర్గం దాదాపు 20 రోజులు ఢిల్లీలో పడిగాపులు పడినా ఫలితం లేకపోయింది. చివరకు విసుగు చెంది వారంతా బీజేపీని ఆశ్రయిం చారు. ఆ తర్వాత టుకీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసి, నిరుడు ఫిబ్రవరిలో కలిఖో పుల్తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. మరో నాలుగున్నర మాసాలకు సుప్రీంకోర్టు ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ టుకీ ప్రభుత్వాన్ని పునరుద్ధ రించింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ టుకీని తప్పించి ఆయన స్థానంలో పెమా ఖండూను సీఎం చేసింది. ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో ఆ పార్టీని విడిచి ప్రాంతీయపార్టీ పీపీఏలో చేరారు. అక్కడ నుంచి కూడా నిష్క్రమించి బీజేపీ గూటికెళ్లి ప్రస్తుతం సీఎం కొనసాగుతున్నారు. కలిఖో పుల్ చివరి క్షణాల్లో రాసిన లేఖ ప్రస్తుత ముఖ్యమంత్రి పెమా ఖండూతో మొదలుకొని అనేకమంది నాయకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. రాజ కీయాల్లోకి వచ్చినప్పుడు వారి ఆర్ధిక స్థితేమిటో, ఇప్పుడున్న సంపద ఎంతో తెలి పింది. వారు ఏఏ సందర్భాల్లో ఎంతెంత మొత్తాన్ని కాజేశారో వివరించింది. ఎమ్మె ల్యేలు, ఇతర రాజకీయ నాయకులు తమ తమ స్వప్రయోజనాల కోసం ఎలాంటి పనులకు పాల్పడుతున్నారో, నిరుపేద ప్రజానీకానికి అందాల్సిన నిధుల్ని ఎలా బొక్కుతున్నారో చెప్పింది. ఇది సగటు రాజకీయ నాయకుడు నోటికొచ్చినట్టు చేసిన ఆరోపణల తరహాలో లేదు. ఆ చెప్పడం వెనక ఆర్తి, ఆవేదన కనిపిస్తాయి. ఆయన ప్రస్తావించిన కొన్ని కుంభకోణాలు ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు పుల్ అదనంగా ఇచ్చిన ఆధారా లను పట్టుకుని దర్యాప్తు చేస్తే మరెన్నో అంశాలు వెలుగుచూసే వీలుంది. శాంతి భద్రతలు మొదలుకొని విద్యుత్, విద్య, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ వరకూ ఎన్నిటినో క్రమబద్ధం చేయడానికి, అవినీతిని అంతమొందించి నిరుపేద జనానికి వాటి ఫలాలు అందేలా చూడటానికి ఎంత ప్రయత్నించినా అడ్డంకులెదురు కావ డాన్ని పుల్ ప్రస్తావించారు. కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చూస్తున్నవారికి రాష్ట్ర నాయకుల నుంచి ఎలా ముడుపులు అందాయో వివరించారు. డబ్బు వెదజల్లి న్యాయవ్యవస్థను లోబర్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను కూడా ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో ఆయన నాయకుల పేర్లను మాత్రమే కాదు... న్యాయ మూర్తుల పేర్లను సైతం వెల్లడించారు. తన విషయంలో అనుకూలమైన తీర్పులిప్పి స్తామంటూ కొందరు దళారులు ఎలా వచ్చారో, ఎంత మొత్తం ముడుపులుగా ఇవ్వాలన్నారో చెప్పారు. చావుకు సిద్ధమైన మనిషి అబద్ధం చెప్పడంటారు. అందుకే మరణ వాంగ్మూలాలకు అంతటి ప్రాధాన్యమిస్తారు. కానీ కలిఖో పుల్ లేఖపై మాత్రం ఆదినుంచీ గోప్యత పాటిస్తున్నారు. ప్రధాన పార్టీలు రెండూ మౌనంగా ఉంటున్నాయి. ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలపై కూలంకషంగా దర్యాప్తు జరపాలని మాజీ న్యాయమూర్తులు, మరికొందరు న్యాయకోవిదులూ డిమాండ్ చేశాక రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దర్యాప్తు జరిపించమంటూ కేంద్రాన్ని కోరింది. కనుక ఇక ఆలస్యం పనికిరాదు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిజాయితీపరులుగా పేరెన్నికగన్న ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి నిగ్గుతేల్చాలి. ఆ లేఖలోని నిజానిజాలను దేశ ప్రజల ముందుంచాలి. -
నాటకీయ మలుపుల..రాజకీయ చదరంగం
ఏడాది కాలంలో ఎన్నెన్ని నాటకీయ పరిణామాలో...! ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ చదరంగం రంజుగా సాగుతోంది. ఏకంగా ముగ్గురు సీఎంలు మారారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిర పర్చేందుకు కేంద్రంలో పాలన సాగిస్తున్న పార్టీ చూపిన ఉత్సాహం, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం, రాష్ట్రపతి పాలన విధించడం, కాంగ్రెస్‌లో చీలిక, సుప్రీంకోర్టు జోక్యం, పదవి పోగొట్టుకున్న సీఎం ఆత్మహత్య... ఇలా ఒకదానికి తర్వాత మరొకటి. తాజాగా మరో ముసలం. 2014లో ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకుగాను కాంగ్రెస్ 42 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. 2011 నుంచి సీఎంగా ఉన్న నబమ్ టుకీయే మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2014 డిసెంబరులో వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి కలిఖో పుల్ను మంత్రివర్గం నుంచి టుకీ తప్పించారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో పుల్ అసమ్మతిని లేవదీశారు. 2016 జనవరి 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీన్ని ముందుకు జరుపుతూ డిసెంబరు 16, 2015 నుంచే అసెంబ్లీ సమావేశాలుంటాయని గవర్నర్ జె.పి.రాజ్‌ఖోవా ఆదేశాలిచ్చారు. టుకీని దింపేందుకు అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. టుకీ ప్రభుత్వం అసెంబ్లీకి తాళం వేయడంతో... డిసెంబరు 16న మరోచోట సమావేశమైన 33 మంది ఎమ్మెల్యేలు (పుల్ వర్గం, బీజేపీ) స్పీకర్‌గా రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు. మరుసటి రోజు హోటల్లో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. టుకీని తొలగించి కలిఖో పుల్ను సీఎంగా ఎన్నుకున్నారు. తర్వాత రెబియాతో పాటు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు లేకుండా... బీజేపీకి చెందిన 11 మంది, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు చేసిన తీర్మానం మేరకు అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ఎలా ముందుకు జరుపుతారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ వాదించింది. అరుణాచల్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు సిఫారసు చేసింది. ఈ ఏడాది జనవరి 26న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన విధించాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. దీన్ని సుప్రీం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ఇచ్చిన నివేదికను తమకు అందజేయాలని కోరింది. తర్వాత వాదోపవాదాలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ తమ చర్యలను సమర్థించుకున్నారు. 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ రెబియా ఇచ్చిన ఆదేశాలపై గౌహతి హైకోర్టు ఇచ్చిన స్టేను ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనే కాంగ్రెస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దాంతో కేంద్రం వేగంగా పావులు కదిపింది. మరుసటి రోజు రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అసమ్మతి నేత కలిఖో పుల్ ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జులై 13న సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. అసెంబ్లీని ముందుకు జరుపుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. డిసెంబరు 15 నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది. దాంతో నబమ్ టుకీ నేతృత్వంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచిన కేంద్రానికి ఇది గట్టి ఎదురుదెబ్బ. తాత్కాలిక గవర్నర్‌గా ఉన్న తథాగత రాయ్ రెండురోజుల్లోనే... జులై 16న బల నిరూపణ చేసుకోవాలని టుకీని కోరారు. కనీసం 10 రోజుల గడువివ్వాలని టుకీ కోరగా గవర్నర్ నిరాకరించారు. ఈలోపు తెరవెనుక మంత్రాంగం నడిచి అసమ్మతి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. టుకీ బలపరచబోమని, మరొకరిని సీఎం చేయాలని కోరారు. దాంతో మధ్యేమార్గంగా పెమా ఖండూను సీఎంగా ఎన్నుకోగా... అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సుప్రీం తీర్పుతో పదవి పోగోట్టుకున్న కలిఖో పుల్ ఆగష్టు 9న తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సుప్రీంతీర్పుతో కంగుతిన్న బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతో పావులు కదిపారు. ఫలితంగా సెప్టెంబరు 16న ముఖ్యమంత్రి పెమా ఖండూ 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ)లో చేరిపోయారు. ఎన్డీయేకు చెందిన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (నెడా)లో పీపీఏ భాగస్వామి. కాంగ్రెస్ పార్టీలో చివరికి మాజీ సీఎం నబమ్ టుకీ రూపంలో ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు. రాజీనామా చేయాలనే కేంద్రం సూచనలు పట్టించుకోకుండా గవర్నర్ పదవిలో కొనసాగిన రాజ్‌ఖోవాను సెప్టెంబరు 22న చివరకు రాష్ట్రపతి డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఖండూను, మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన పీపీఏ... శుక్రవారం తమ లెజిస్లేటివ్ పార్టీ నేతగా రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యే (ఎన్నికల అఫిడవిట్ తన ఆస్తుల విలువను 187 కోట్లుగా చూపారు) టకమ్ పారియోను ఎన్నుకున్నట్లు స్పీకర్‌కు తెలియజేసింది. 12 మంది సభ్యులున్న బీజేపీ పెద్దన్న పాత్రను పోషిస్తూ... 43 మంది సభ్యులున్న పీపీఏను చిన్నచూపు చూస్తోందనేది తిరుగుబాటు నేతల వాదన. ఖండూకే తమ మద్దతు ఉంటుందని, మరొకరిని సీఎంగా అంగీకరించమని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అంటోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజుతో టకమ్ పారియోకు తీవ్ర రాజకీయవైరముంది. బీజేపీ (12), ఖండూ వర్గం (సస్పెండైన ఏడుగురు) లేకున్నా... 36 మందితో పీపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఉంది. రెండు జాతీయ పార్టీలు... బీజేపీ, కాంగ్రెస్‌లకు రాజకీయ చదరంగంగా మారిన అరుణాచల్‌లో తాజా పరిణామాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
శవమై కనిపించిన మాజీ సీఎం
-
మాజీ సీఎం అనుమానాస్పద మృతి
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ (48) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఇంట్లోనే శవమై కనిపించారు. ఉరి వేసుకుని ఆయన మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు. రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడివుండొచ్చని భావిస్తున్నారు. ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, కుంగుబాటు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని హోంశాఖ అధికారులు తెలిపారు. గత నెలలో ఆయన పదవి కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్ కు ఆయన 145 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 19 నుంచి జూలై 13 వరకు సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సాయంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి దక్కించుకున్నారు. రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ప్రకటన వెలువడిన కాసేపటికే ఫిబ్రవరి 19న అర్థరాత్రి సీఎంగా పుల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కేంద్రం తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పుల్ పదవి కోల్పోయారు. కలిఖో పుల్ మరణం పట్ల మాజీ సీఎం నబమ్ తుకీ సంతాపం ప్రకటించారు. పుల్ ఆత్మహత్య చేసుకోవడం బాధకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. -
అరుణాచల్ సీఎంగా అసమ్మతి నేత
రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. ప్రమాణం ♦ అర్థరాత్రి ప్రమాణ స్వీకారం చేసిన తిరుగుబాటు నేత కలిఖో పుల్ ♦ మద్దతు తెలిపిన బీజేపీ, స్వతంత్య్ర సభ్యులు ♦ బలనిరూపణకు అవకాశమివ్వాలన్న కాంగ్రెస్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు ఇటానగర్: కాంగ్రెస్ రెబల్ నాయకుడు కలిఖో పుల్ (48) శుక్రవారం రాత్రి అరుణాచల్‌ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రెండు నెలలుగా నెలకొన్న నాటకీయ పరిణామాలు, రాజకీయ అనిశ్చితికి తెరపడింది. రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడిన కాసేపటికే పుల్.. తన అనుకూల వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 60 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో పుల్కు 19 ఎమ్మెల్యేల బలముండగా.. 11 మంది బీజేపీ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతు ప్రకటించారు. తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో చర్చించాక మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త సీఎం కలిఖో పుల్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి టుకీ తీరుపై నిరసనగా.. పుల్ నాయకత్వంలో 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించటంతో.. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిస్థితులతో.. కేంద్రం జనవరి 26న ఇక్కడ రాష్ట్రపతిపాలన విధించింది. ఈ నేపథ్యంలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలన్న కాంగ్రెస్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్రపతి పాలనను ఎత్తేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపటం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ప్రకటన వెలవడిన కాసేపటికే పుల్ కొత్త సీఎంగా ప్రమాణం చేశారు.