అరుణాచల్ సీఎంగా అసమ్మతి నేత
రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. ప్రమాణం
♦ అర్థరాత్రి ప్రమాణ స్వీకారం చేసిన తిరుగుబాటు నేత కలిఖో పుల్
♦ మద్దతు తెలిపిన బీజేపీ, స్వతంత్య్ర సభ్యులు
♦ బలనిరూపణకు అవకాశమివ్వాలన్న కాంగ్రెస్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
ఇటానగర్: కాంగ్రెస్ రెబల్ నాయకుడు కలిఖో పుల్ (48) శుక్రవారం రాత్రి అరుణాచల్‌ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రెండు నెలలుగా నెలకొన్న నాటకీయ పరిణామాలు, రాజకీయ అనిశ్చితికి తెరపడింది. రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడిన కాసేపటికే పుల్.. తన అనుకూల వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 60 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో పుల్‌కు 19 ఎమ్మెల్యేల బలముండగా.. 11 మంది బీజేపీ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతు ప్రకటించారు. తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో చర్చించాక మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త సీఎం కలిఖో పుల్ వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి టుకీ తీరుపై నిరసనగా.. పుల్ నాయకత్వంలో 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించటంతో.. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిస్థితులతో.. కేంద్రం జనవరి 26న ఇక్కడ రాష్ట్రపతిపాలన విధించింది. ఈ నేపథ్యంలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలన్న కాంగ్రెస్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్రపతి పాలనను ఎత్తేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపటం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ప్రకటన వెలవడిన కాసేపటికే పుల్ కొత్త సీఎంగా ప్రమాణం చేశారు.