కలిఖో లేఖ ప్రకంపనలు
నిరుడు ఆగస్టులో అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన వెళ్లిపోతూ రాసిన లేఖలోని అంశాలు ఏడెనిమిది నెలల అనంతరం ఇప్పుడు వెల్లడై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకునేవారు వదిలివెళ్లే లేఖలను మరణ వాంగ్మూలాలుగా పరిగణిస్తారు. ఆ లేఖలు మృతుల మనోభావాలను వెల్లడిస్తాయి. వారిని కలవర పెట్టిన అంశాలేమిటో, అంతటి తీవ్ర నిర్ణయానికి వారిని ప్రేరేపించిన వారెవరో చెబుతాయి. సంచలనం సృష్టించిన కేసుల్లో అలాంటి లేఖలను మీడియాకు విడు దల చేయడం కూడా రివాజు. కానీ కలిఖో పుల్ విషయంలో అలా జరగలేదు.
లేఖ లోని అంశాల సంగతలా ఉంచి అసలు అలాంటి లేఖ ఉన్నట్టే ఎవరూ బయట పెట్టలేదు. ఆ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసి, అక్కడి రాజకీయ సంక్షోభానికి కారకుడైన జ్యోతి రాజ్‌ఖోవాను ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం తప్పించకపోతే ఆ లేఖ ఎప్పటికీ మరుగున పడేదేమో! కానీ స్వల్పకాలంలోనే తన పదవి ఊడబెరకడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన రాజ్‌ఖోవా పోతూ పోతూ ఆ లేఖ సంగతి వెల్లడిం చారు. నిజానికి ఆ పని పోలీసులే చేయాల్సింది. రాజ్‌ఖోవా నోటి వెంబడి బయ టకు రావడం వల్ల అక్కడి రాష్ట్ర ప్రభుత్వ నిజాయితీపై అందరికీ సందేహాలు కలి గాయి. దాని సంగతలా ఉంచి లేఖలోని ఆరోపణలు చాలా తీవ్రమైనవి. 60 పేజీల నిడివి గల ఆ లేఖ మన వ్యవస్థకు సంబంధించిన సర్వాంగాల్లో పేరుకుపోయిన అవినీతిని ప్రస్తావించింది. అది నిలువెల్లా భ్రష్టుపట్టిపోయిన వైనాన్ని వెల్లడిం చింది. కోట్లాది రూపాయల ప్రజా ధనం ఏ స్థాయిలో దుర్వినియోగమవుతున్నదో తెలిపింది. అంతే చెప్పి ఊరుకోలేదు. ఆ అవినీతికి పాల్పడిన వ్యక్తులెవరో... ఏ ఏ సందర్భాల్లో డబ్బును స్వాహా చేశారో పేర్లతోసహా తెలిపింది. న్యాయవ్యవస్థ సైతం ఇందుకు మినహాయింపు కాదని చాటింది.
అరుణాచల్‌ప్రదేశ్ దాదాపు వార్తల్లోకెక్కని రాష్ట్రం. అది చైనా సరిహద్దుల్లో ఉండటం, అడపా దడపా చైనా సైన్యం అందులోకి చొరబడటం వంటి ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడే ఆ రాష్ట్రంపై అందరి దృష్టీ పడుతుంది. అయితే నిరుడంతా అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం దాన్ని పతాక శీర్షికల్లో నిలిపింది. కలిఖో పుల్ ఆత్మహత్యకూ, ఆ పరిణామాలకూ మధ్య ఉన్న సంబంధం వల్ల ఆయన విషాద మరణం అందరినీ మరింతగా కలచివేసింది. కలిఖో పుల్ సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేశారు. ఎమ్మెల్యే మొదలుకొని సీఎం వరకూ అనేక పదవులు నిర్వహించారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు 42 గెల్చుకుని కాంగ్రెస్ ఘన విజయం సాధించాక నబం టుకీ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు.
ఆ సమయంలోనే ఆయన అసమ్మతివాదిగా మారారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని కలిసి వివరించేందుకు ఆయన వర్గం దాదాపు 20 రోజులు ఢిల్లీలో పడిగాపులు పడినా ఫలితం లేకపోయింది. చివరకు విసుగు చెంది వారంతా బీజేపీని ఆశ్రయిం చారు. ఆ తర్వాత టుకీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసి, నిరుడు ఫిబ్రవరిలో కలిఖో పుల్‌తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. మరో నాలుగున్నర మాసాలకు సుప్రీంకోర్టు ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ టుకీ ప్రభుత్వాన్ని పునరుద్ధ రించింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ టుకీని తప్పించి ఆయన స్థానంలో పెమా ఖండూను సీఎం చేసింది. ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో ఆ పార్టీని విడిచి ప్రాంతీయపార్టీ పీపీఏలో చేరారు. అక్కడ నుంచి కూడా నిష్క్రమించి బీజేపీ గూటికెళ్లి ప్రస్తుతం సీఎం కొనసాగుతున్నారు.
కలిఖో పుల్ చివరి క్షణాల్లో రాసిన లేఖ ప్రస్తుత ముఖ్యమంత్రి పెమా ఖండూతో మొదలుకొని అనేకమంది నాయకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. రాజ కీయాల్లోకి వచ్చినప్పుడు వారి ఆర్ధిక స్థితేమిటో, ఇప్పుడున్న సంపద ఎంతో తెలి పింది. వారు ఏఏ సందర్భాల్లో ఎంతెంత మొత్తాన్ని కాజేశారో వివరించింది. ఎమ్మె ల్యేలు, ఇతర రాజకీయ నాయకులు తమ తమ స్వప్రయోజనాల కోసం ఎలాంటి పనులకు పాల్పడుతున్నారో, నిరుపేద ప్రజానీకానికి అందాల్సిన నిధుల్ని ఎలా బొక్కుతున్నారో చెప్పింది. ఇది సగటు రాజకీయ నాయకుడు నోటికొచ్చినట్టు చేసిన ఆరోపణల తరహాలో లేదు. ఆ చెప్పడం వెనక ఆర్తి, ఆవేదన కనిపిస్తాయి. ఆయన ప్రస్తావించిన కొన్ని కుంభకోణాలు ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు పుల్ అదనంగా ఇచ్చిన ఆధారా లను పట్టుకుని దర్యాప్తు చేస్తే మరెన్నో అంశాలు వెలుగుచూసే వీలుంది. శాంతి భద్రతలు మొదలుకొని విద్యుత్, విద్య, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ వరకూ ఎన్నిటినో క్రమబద్ధం చేయడానికి, అవినీతిని అంతమొందించి నిరుపేద జనానికి వాటి ఫలాలు అందేలా చూడటానికి ఎంత ప్రయత్నించినా అడ్డంకులెదురు కావ డాన్ని పుల్ ప్రస్తావించారు.
కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చూస్తున్నవారికి రాష్ట్ర నాయకుల నుంచి ఎలా ముడుపులు అందాయో వివరించారు. డబ్బు వెదజల్లి న్యాయవ్యవస్థను లోబర్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను కూడా ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో ఆయన నాయకుల పేర్లను మాత్రమే కాదు... న్యాయ మూర్తుల పేర్లను సైతం వెల్లడించారు. తన విషయంలో అనుకూలమైన తీర్పులిప్పి స్తామంటూ కొందరు దళారులు ఎలా వచ్చారో, ఎంత మొత్తం ముడుపులుగా ఇవ్వాలన్నారో చెప్పారు. చావుకు సిద్ధమైన మనిషి అబద్ధం చెప్పడంటారు. అందుకే మరణ వాంగ్మూలాలకు అంతటి ప్రాధాన్యమిస్తారు. కానీ కలిఖో పుల్ లేఖపై మాత్రం ఆదినుంచీ గోప్యత పాటిస్తున్నారు. ప్రధాన పార్టీలు రెండూ మౌనంగా ఉంటున్నాయి. ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలపై కూలంకషంగా దర్యాప్తు జరపాలని మాజీ న్యాయమూర్తులు, మరికొందరు న్యాయకోవిదులూ డిమాండ్ చేశాక రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దర్యాప్తు జరిపించమంటూ కేంద్రాన్ని కోరింది. కనుక ఇక ఆలస్యం పనికిరాదు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిజాయితీపరులుగా పేరెన్నికగన్న ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి నిగ్గుతేల్చాలి. ఆ లేఖలోని నిజానిజాలను దేశ ప్రజల ముందుంచాలి.