
న్యాయపీఠంపై పేలిన బాంబు..!
సందర్భం
అరుణాచల్‌ప్రదేశ్‌లో బర్తరఫ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునఃస్థాపించే కేసులో ఇద్దరు న్యాయమూర్తుల బంధువుల ద్వారా తనను 86 కోట్ల లంచం అడిగారని నాటి సీఎం కలిఖో పుల్ పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయ పీఠపు గౌరవానికి ఇది భంగకరం.
ఢిల్లీ అధికార పీఠంలో ఒక వార్త కలకలం రేపుతోంది. అక్కడ ఓ మహిళ అరవై పేజీల బాంబుతో తచ్చాడుతోంది. బాంబులోంచి పొగ వెలువడుతోంది. ఎవరూ దాని నుంచి దృష్టి మరల్చలేకపోతున్నారు. అలాగని దాన్ని ముట్టుకునే సాహసం కూడా ఎవరూ చేయలేక పోతున్నారు. ఈ బాంబు పేలితే ఎవరెవరు బలి అవుతారోననేదే అందరిలో నెలకొన్న ఆందోళన. ఆ బాంబు అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ వదిలి వెళ్లిన సూసైడ్ నోట్. ఈటానగర్‌లోనైనా, ఢిల్లీలోనైనా, ఇటు ప్రభుత్వాలూ, అటు న్యాయవ్యవస్థా కలిఖో వదిలి వెళ్లిన సూసైడ్ నోట్‌ను మింగలేక, కక్కలేక ఇబ్బంది పడుతున్నాయి.
కలిఖో పుల్ కాంగ్రెస్‌కు చెందినవాడు. 2016 ఫిబ్రవరిలో కాంగ్రెస్ సీఎం నబామ్ టుకీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎత్తి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో సీఎం అయ్యారు. సుప్రీం కోర్టు అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను, కలిఖోను గద్దెనెక్కించే నిర్ణయాన్నీ రాజ్యా ంగవిరుద్ధమైనవిగా ప్రకటించింది. తర్వాత కలిఖో ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ఆయన శవం పైకప్పుకు వేలాడుతుండగా, నేలపై చుట్టూతా ఒక నోటుకు చెందిన పది ప్రతులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ‘మేరే విచార్’ (నా భావనలు) అనే శీర్షికతో హిందీలో టైప్ చేసిన ఆ అరవై పేజీల నోట్‌లో ప్రతి పేజీ పైనా మృతుడి సంతకం ఉంది. అంటే దీని విశ్వసనీయత నిర్వివాదమన్నమాట. (దీని పూర్తి పాఠం www.judicial reforms.org లో ఉంది.)
కలిఖో పేల్చిన ఈ బాంబులో అసలైన పేలుడు పదార్థం నడి మధ్యలో ఉంది. ప్రజా జీవితంలో పాతుకుపోయిన అవినీతిని బట్ట బయలు చేస్తూ కలిఖో రాసిన భాగాల్లో ఉంది. అవన్నీ నిజమని భావించలేం. అయినా, రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం, నకిలీ బిల్లులు, డబుల్ బిల్లుల చెల్లింపులు, పట్టుబడినప్పుడు ఫైళ్లను మాయం చేసేయ డం, వందల కోట్ల రూపాయల్ని దిగమింగడం వంటి వాటిపై ఆయన రాసిన కథనాలను మాత్రం ఉత్తుత్త మాటలుగా కొట్టిపారెయ్యలేం.
కాంగ్రెస్‌లో రెండు దశాబ్దాల అనుభవంతో పుల్ చేసిన తుది నిర్ధారణ చేదు అనుభవంగానే ఉంది.‘కాంగ్రెస్ పార్టీ తన ఖజానాకు కావలసిన డబ్బులు పంపే వాళ్లకే పెద్ద పీట వేస్తుంది. వాళ్లనే నాయకుల్ని చేస్తుంది. అలా వారు ఖజానాలోంచి ప్రజల సొమ్మును కొంత దోచుకొని అధిష్టానానికి అందజేస్తూ ఉండాలి, అలా వారికి ఆదాయం సమకూ ర్చాలి. ‘ప్రస్తుత రాష్ట్రపతి సహా కాంగ్రెస్ బడా నేతలందరి పేర్లను ఉద హరిస్తూ ఎవరెవరికి ఎంతేసి డబ్బు ఇచ్చారో ఆ నోట్‌లో కలిఖో రాశారు.
కలిఖో చేసిన ఆరోపణల్లో అన్నింటికన్నా తీక్షణమైన భాగం న్యాయ వ్యవస్థకు సంబంధించింది. ఆయన సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులను, ఇద్దరు ప్రస్తుత న్యాయమూర్తులను పేర్కొంటూ వారిపై అవినీతి ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి సంబంధిం చిన అనేక కేసులలో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని పలు అవినీతి కేసుల్ని కొట్టివేశారన్నది ఆ ఆరోపణల సారాంశం. అంతేకాదు, అరుణా చల్‌ప్రదేశ్‌లో బర్తరఫ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునఃస్థాపించే కేసులో ఇద్దరు న్యాయమూర్తుల బంధువుల ద్వారా తనను 86 కోట్ల లంచం అడిగారని కూడా పుల్ పేర్కొన్నారు. ఈ నలుగురు న్యాయ మూర్తులలో ఇద్దరిపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చా లేదు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో కలిఖో కక్ష పెంచుకొని ఆరో పణలకు పూనుకున్నారేమో. అయినా సరే, చట్టం మృతుడి చివరి వాంగ్మూలాన్ని లేదా సూసైడ్ నోట్‌ను సాక్ష్యంగా పరిగణిస్తుంది. పైగా ఇది దేశ అత్యున్నత న్యాయ పీఠపు గౌరవానికి సంబంధించిన విషయం కూడా. కలిఖో ఆత్మహత్య తర్వాత సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ ఆదేశించినప్పటికీ విచారణ ఎందుకు జరగలేదు? కేవలం కాంగ్రెస్ నేతల పేర్లున్న ఈ నోట్‌పై విచారణ జరిపించడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది?
ఆత్మహత్య చేసుకోడానికి ముందు కలిఖో రాసిన నోట్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ కేంద్రానికి సిఫార్సు చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీలోని చాలా మంది పాత్రికేయులకు బిర్లా– సహారాల వద్ద జప్తు చేసుకున్న దస్తావేజులు అందుబాటులోకి వచ్చాయి. బిర్లా– సహారా డాక్యుమెంట్లపై విచారణ జరిపించాలని ప్రశాంత్ భూషణ్ అక్టోబర్‌లో డిమాండ్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి ఆలోచిస్తోంది. అదే సమ యంలో ఢిల్లీలోని ఒక పెద్ద వకీలు ఇంటిపై సోదా జరుగగా కోట్ల రూపాయల అక్రమ నగదు బైటపడింది. ఆ సొమ్ములో ఒక భాగం ఒక పెద్ద న్యాయమూర్తి కుమారుడిదని ఆ వకీలు చెప్పినట్టుగా ఆరోపణలు.
నవంబర్–డిసెంబర్ నెలల్లో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఒకనాటి తీర్పులనే పక్కన పెడుతూ, సహారా– బిర్లా కేసులో ఇలాంటి డైరీలపై, దస్తావేజులపై విచారణ జరపలేమనే ఒక కొత్త వ్యాఖ్య మొదలుపెట్టింది. జనవరిలో జస్టిస్ కేహర్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక కొత్త బెంచ్ బిర్లా–సహారా కేసును కొట్టివేసింది. సుప్రీంకోర్టు, ప్రభు త్వాల మధ్య ప్రతిష్టంభన తొలగిపోనున్నదనే వార్తలూ రాసాగాయి.
ఈ ఘటనలన్నింటికీ పరస్పర సంబంధం లేకపోవచ్చు. ఇవన్నీ ఒక క్రమంలో జరగడం కేవలం యాదృచ్ఛికమే కావచ్చు కూడా. కొద్ది రోజుల క్రితమే ప్రధాన మంత్రి తన వద్ద విపక్ష నేతలందరి చిట్టాలు న్నాయని హెచ్చరిక స్వరంలో వ్యాఖ్యానించడం విదితమే. బహుశా ఆయన వద్ద మరి కొంతమంది చిట్టాలు కూడా ఉండొచ్చు. కలిఖో పుల్ అనే బాంబు పట్ల ఇంత మౌనం వహించడం వెనుక ఇదే కారణం కావచ్చునేమో! ప్రస్తుతం బాంబు ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ కార్యాల యంలో ఉంది. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఒక తీర్పు ప్రకారం న్యాయ మూర్తులపై విచారణకు ఆదేశాలు జారీ చేయడానికి ముందు ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరోపణ ప్రధాన న్యాయమూర్తి పైనే అయితే రాష్ట్రపతి ఇతర న్యాయ మూర్తుల సలహా కోరతారు. అయితే ఇందులో ఈసారి ప్రధాన న్యాయ మూర్తి, రాష్ట్రపతి ఇరువురి పేర్లూ ఉన్నాయి కాబట్టి కలిఖో పుల్ భార్య ఉపరాష్ట్రపతిని కలసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే అక్కడైనా ఈ రహస్యంపై పరదా తొలగిపోతుందా లేక దీనికి బిరడా మరింతగా బిగించేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
- యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav