ఈ దేశాన్ని సుప్రీంకోర్టు రక్షించింది: నబం తుకీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని సర్వోన్నత న్యాయస్థానం రక్షించిందని అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబం తుకీ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. నబం తుకీ బుధవారమిక్కడ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తమకు న్యాయం చేసిందని, ఈ దేశాన్ని ఉన్నత న్యాయస్థానం రక్షించిందని అన్నారు. ఈ ఏడాది జనవరి 26న అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే.
కాగా ప్రభుత్వాల తొలగింపు విషయంలో బీజేపీకి ఇది రెండో ఎదురుదెబ్బ. ఇంతకుముందు ఉత్తరాఖండ్ వ్యవహారంలోనూ కమలదళం ఇలాగే దెబ్బతింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, వారి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. అయితే సుప్రీం కోర్టు దగ్గర కేంద్రం పప్పులుడకలేదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలోనే బీజేపీకి చుక్కెదురు అయింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ను రీకాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.