అరుణాచల్ సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు బుధవారం చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలన్నింటినీ న్యాయస్థానం రద్దు చేసింది. అసెంబ్లీ సమావేశాల తేదీని ముందుకు జరుపుతూ.... గవర్నర్ తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. డిసెంబర్ 15, 2015 నాటి యథాతథ పరిస్థితి ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో నబమ్ టుకీ మళ్లీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు మార్గం సుగమమైంది.
కాగా 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 మంది సభ్యులుండగా.. అసమ్మతి నేత కాలిఖోపుల్ సారథ్యంలో 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తెలిసిందే. నబమ్ టుకీ సీఎంగా గల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చారు. నాటకీయ పరిణామాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ‘సుప్రీం’ను ఆశ్రయించగా.. గవర్నర్ విచక్షణాధికారాల పరిధిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించారు. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఇది ప్రజాస్వామ విజయమని ఆ పార్టీ అభివర్ణించింది.