అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన
- రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ సిఫారసు
- కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు మంగళవారం ప్రణబ్ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఆమోదించారు.
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే కంటే.... దానిని సుప్తచేతనావస్థలో ఉంచి... రాష్ట్రపతి పాలన వైపే కేంద్రమంత్రి వర్గం ఇటీవల నిర్ణయించింది. కాంగ్రెస్ పాలనలో ఉన్న అరుణాచల్‌లో సీఎం నబమ్ టుకీపై అసంతృప్తితో 21మంది ఎమ్మెల్యేలు డిసెంబర్ 16న తిరుగుబాటు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది.
గతేడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హోటల్లో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నబమ్ టుకీకి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇస్తున్నారు.