
నమో గాలి కాదు... ఇది టుకి గాలి
దేశమంతటా నమో గాలి వీస్తున్నా సుదూర ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో మాత్రం టుకి గాలి వీస్తోంది. నరేంద్ర మోడీ కూడా చేయలేని పనిని అరుణాచల్ ముఖ్యమంత్రి నాబమ్ టుకి చేసి చూపించారు. 60 సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో టుకి సహా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ లేకుండా గెలిచారు. టుకికి ప్రజల్లో ఎంత పట్టుందో ఈ సంఘటన నిరూపిస్తుంది. ఇలాంటి సంఘటన దేశ ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ జరగలేదు.
అరుణాచల్ లో మొత్తం 188 మంది నామినేషన్లు దాఖలు చేశారు.వాటిలో 173 నామినేషన్లను ఎన్నికల సంఘం సరైనవిగా నిర్ధారించింది. వీటిలో 18 మంది ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు పోటీలో కాంగ్రెస్ తరఫున 60 మంది, బిజెపి తరఫున 42, ఎన్ సీ పీ తరఫున 9, స్థానిక పార్టీ పీపీఏ తరఫున 16, ఎన్ పీ ఎఫ్ తరపున 11 మంది, ఇండిపెండెంట్లు 16 మంది, ఆప్ తరఫున ఒకరు పోటీలో ఉన్నారు. ఇప్పుడు 11 మంది కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ లేకుండా నెగ్గారు.
అరుణాచల్ ప్రదేశ్ లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. పీసీసీ అధ్యక్షుడు ముకుట్ మీథీ ఇప్పటి వరకూ అయిదుసార్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. అయితే బిజెపి మాత్రం ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం తప్ప మరేమీ కాదని, ఇదొక ప్రహసనమని, ప్రజల మనోభావాలను పూర్తిగా సమాధిచేయడమేనని విమర్శించింది. అందుకు సాక్ష్యంగా తన సంతకం ఫోర్జరీ చేసి, తాను పోటీ నుంచి వైదొలగినట్టు బూటకం ఆడుతున్నారని నాబమ్ తాడే అనే బిజెపి అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.