
అరుణాచల్‌లో అనూహ్య పరిణామాలు
నబమ్ టుకి ప్రభుత్వంపై తిరుగుబాటు ఎమ్మెల్యేల అవిశ్వాసం
* కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తిరుగుబాటు సభ్యులు
* స్పీకర్ తొలగింపు సహా అన్ని నిర్ణయాలపై గౌహతి హైకోర్టు స్టే
గువాహటి/ఇటానగర్: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం అనూ హ్య మలుపులు తిరుగుతోంది. గురువారం ఒక హోటల్‌లో సమావేశమైన ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు నబమ్ టుకి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టి.. తీర్మానానికి మద్దతు గా ఓటేశారు.
అంతటితో ఆగకుండా కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే కలిఖో పాల్‌ను రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మరోవైపు గౌహతి హైకోర్టు స్పీకర్ తొలగింపు సహా అన్ని నిర్ణయాలను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. ముఖ్యమంత్రి నబమ్ టుకి రాష్ట్రంలో పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్జ్, ప్రధాని మోదీకి లేఖలు రాశారు.
గురువారం స్థానిక హోటల్‌లో 11 మంది బీజేపీ, ఇద్దరు ఇండిపెండెంట్లతో పాటు 20 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. స్పీకర్ నబమ్ రెబియా ఆదేశాలతో బుధవారం నుంచి శాసనసభ ప్రాంగణం మూతపడటంతో వీరంతా హోటల్‌లోని కాన్ఫరెన్స్ హాలులోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు డిప్యూటీ స్పీకర్ టి.నార్బు థాంగ్‌డాక్ అధ్యక్షత వహించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్రులు టుకి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
డిప్యూటీ స్పీకర్ థాంగ్‌డాక్ అవిశ్వాస తీర్మానాన్ని వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. మొత్తం 60 మంది సభ్యులకుగానూ బీజేపీ, స్వతంత్ర, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 33 మంది ఈ సమావేశంలో పాల్గొన్నా రు. ముఖ్యమంత్రి నబమ్‌టుకితో పాటు ఆయనకు మద్దతిస్తున్న 26 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. తరువాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన కలిఖో పాల్‌ను 33 మంది ఎమ్మెల్యేలు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అనంతరం పాల్‌ను శాసనసభా పక్ష నేతగా థాంగ్‌డాక్ ప్రకటించారు. అసెంబ్లీ తీర్మానాలను గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాకు పంపనున్నట్టు తెలిపారు.
మరోవైపు అరుణాచల్ అసెంబ్లీ స్పీకర్ రెబయా తొలగింపు సహా అన్ని నిర్ణయాలను నిలుపుదల చేస్తూ గౌహతి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 24న జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 16కు మారుస్తూ ఈ నెల 9న గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది.
పార్లమెంట్‌లో దుమారం..
మరోవైపు అరుణాచల్ పరిణామాలు పార్లమెంట్‌లో దుమారం రేపాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనకు దిగింది. కాంగ్రెస్‌కు వామపక్షాలు, జేడీయూ మద్దతు తెలిపాయి.