అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాల మధ్య సీఎల్పీ కొత్త నాయకుడిని ఎన్నుకుంది. నబమ్ టుకీ సీఎం, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) పదవులకు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడు పెమా ఖండూ (37) సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. దీంతో విశ్వాస పరీక్ష వాయిదా పడింది. గవర్నర్ తథాగత్‌రాయ్ శనివారం అసెంబ్లీలో టుకీ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలిసిందేనని తేల్చిచెప్పడం తెలిసిందే. దీంతో విశ్వాస పరీక్షకు కొన్ని గంటల ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వేగంగా మారిన సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్స్ నేత, పదవీచ్యుత సీఎం కలిఖో పుల్ 30 మంది అసమ్మతి ఎమ్మెల్యేలతో కలసి తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరారు.