
రాష్ట్రపతి పాలనపై పిటిషన్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం నబమ్‌టుకీ గురువారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు.. కాంగ్రెస్ శాసనసభాపక్ష చీఫ్ విప్ రాజేశ్ టాచో వంటి వారు వేసిన పిటిషన్లను జస్టిస్‌జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించే అవకాశముంది. ఇంతకుముందు వేసిన పిటిషన్లు రాష్ట్రపతి పాలనను ప్రశ్నించలేదని.. రాష్ట్రపతి పాలన విధించటానికి ముందే వాటిని దాఖలు చేశారని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో..
పిటిషన్ల సవరణకు ధర్మాసనం అవకాశం ఇవ్వగా నబమ్‌టుకీ తాజాపిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాతో పాటు కేంద్ర హోంశాఖకు బుధవారం నోటీసులు జారీ చేసింది.
అసెంబ్లీకి తాళం వేశారు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో శాంతిభద్రతలు సహా రాష్ట్రంలో పరిపాలన పతనమవటం, శాసనసభ భవనానికి తాళం వేయటాన్ని రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలటానికి కారణాలుగా అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్‌ఖోవా పేర్కొన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై నిషిద్ధ రహస్య నాగా సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్ (ఖాప్లాంగ్) ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయని గవర్నర్ చెప్పారు. శాసనసభ సమావేశం శాసనసభ ఆవరణలో జరగకుండా స్పీకర్, ప్రభుత్వంతో కలిసి అడ్డుకున్నారని తెలిపారు.
ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాసే ప్రయత్నం
ఇక కేంద్ర మంత్రివర్గం అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ మద్దతు లేదని, మైనారిటీ సర్కారుతో చేతులుకలిపిన స్పీకర్ శాసనసభ సమావేశాలు జరగకుండా అడ్డుకోవటం ద్వారా ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను.. ముఖ్యమంత్రికి సభలో మెజారిటీ మద్దతు ఉండాలని, ఆ మెజారిటీని సభలో పరీక్షించాలని చెప్తున్న రాజ్యాంగ కనీస అవసరాన్ని కాలరాసే ప్రయత్నం చేశారని పేర్కొంది. రాజ్‌భవన్ ప్రాంగణాన్ని సీఎం, స్పీకర్‌ల మద్దతుదారులు పలు గంటల పాటు దిగ్బంధించారని, గవర్నర్‌ను ఘెరావ్ చేయటం రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలటమేనని అభివర్ణించింది.