సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో భాగమైన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులైన మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయనకు అత్యంత ఆప్తుడు, మాజీ మంత్రి నారాయణ ఏదో జరిగిపోతోందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి వినతి మేరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత వారి పిటిషన్లపై విచారణ సాగకుండా వారే శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు.
స్టే పొడిగింపు ఉత్తర్వులూ పొందుతున్నారు. హైకోర్టులో ఇదో పెద్ద ప్రహసనంగా మారింది. తాజాగా గురువారం ఇదే రీతిలో విచారణను సుదీర్ఘ కాలానికి వాయిదా వేయించేందుకు వారి న్యాయవాదులు ప్రయత్నించి విఫలమయ్యారు. కోర్టులో వారి ఎత్తులను రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు.
న్యాయస్థానానికి సైతం వారి ఎత్తుగడలు అర్థమయ్యాయి. దీంతో వచ్చే గురువారానికి మాత్రమే విచారణను వాయిదా వేయించుకోగలిగారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్టే పొంది వాయిదాల మీద వాయిదాలు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ 2021లో ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసు కొట్టేయాలంటూ బాబు, నారాయణ అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2021 మార్చి 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి విచారణ వాయిదా పడుతోంది. ఆ తరువాత ఈ వ్యాజ్యాలు ఓ న్యాయమూర్తి వద్ద విచారణకు రాగా, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు స్టే కొనసాగుతుందంటూ ఉత్తర్వులు పొందారు. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి.
చంద్రబాబు, నారాయణ తరఫు సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ గురువారానికి వాయిదా పడింది. గురువారం మరోసారి సుదీర్ఘ వాయిదాకు వారి వ్యూహాన్ని అమల్లో పెట్టారు. బాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, ఈ కేసులో ఫిర్యాదుదారు, ప్రతివాది ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు నోటీసు అందలేదని, అందువల్ల విచారణ జరపడం సరికాదని అన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రికార్డులను పరిశీలించిన కోర్టు అధికారి.. నోటీసు ఇచ్చినట్లు ఎలాంటి డాక్యుమెంట్ లేదన్నారు.
ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని మరోసారి రికార్డులు చూడాలని కోరారు. మరోసారి రికార్డులను పరిశీలించగా, రామకృష్ణారెడ్డికి 2021లోనే నోటీసులు పంపినట్లు ఉన్న ఉత్తర్వుల కాపీ దొరికింది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు, నారాయణ న్యాయవాదులు విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనికి సుధాకర్‌రెడ్డి అడ్డుతగిలారు. నోటీసులు అందలేదన్న సాకుతో వాయిదా వేయించాలని చూశారన్నారు. వాదనలు వినిపించేందుకు సిద్ధమని చెప్పిన దమ్మాలపాటి శ్రీనివాస్ ఎందుకు వాయిదా కోరుతున్నారని, ఇది టూ మచ్ అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు.
ఇప్పటికే విచారణను ఎన్నోసార్లు వాయిదా వేయించారని చెప్పారు. వాళ్లే చాలాసార్లు వాయిదా తీసుకున్నారని దమ్మాలపాటి అనగా, ఎవరు ఎన్నిసార్లు వాయిదాలు తీసుకున్నారో తేల్చేందుకు తాను ఇక్కడ లేనని న్యాయమూర్తి కరాఖండిగా చెప్పారు. సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. బుధవారం మరో కేసు ఉన్నందున విచారణను గురువారానికి కోరతామని దమ్మాలపాటి చెప్పడంతో తాను అంగీకరించినట్లు తెలిపారు.
గురువారం కూడా వాయిదా కోరడంలో అర్థం లేదన్నారు. తమ ఎత్తుగడ ఫలించదని బాబు, నారాయణ న్యాయవాదులకు అర్థమవడంతో తాము సుదీర్ఘ వాయిదా కోరడం లేదని దమ్మాలపాటి చెప్పారు. వచ్చే గురువారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ బుధవారానికి మొగ్గు చూపగా, దమ్మాలపాటి పదే పదే అభ్యర్థించడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment