బడుగుల భూచోరుడు చంద్రబాబే.. | Andhra Pradesh CID files chargesheet against Chandrababu Naidu in assigned land case in Amaravati | Sakshi
Sakshi News home page

బడుగుల భూచోరుడు చంద్రబాబే..

Published Tue, Mar 12 2024 5:53 AM | Last Updated on Tue, Mar 12 2024 6:31 AM

Andhra Pradesh CID files chargesheet against Chandrababu Naidu in assigned land case in Amaravati - Sakshi

అమరావతిలో అసైన్డ్‌ భూములు కొల్లగొట్టింది పచ్చగద్దలే

రాజధాని పేరిట అమరావతిలో చోటుచేసుకున్న  భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు ముఠానేనని సీఐడీ తేల్చింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం చార్‌్జషీట్‌ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్‌ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్‌ భూములను చంద్రబాబు బ్యాచ్‌ కొల్లగొట్టిందన్నది ఆధారాలతో సహా సీఐడీ వెలుగులోకి తీసుకొచి్చన విషయం తెలిసిందే. కేంద్ర అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ సాగించిన ఈ భూబాగోతం యావత్‌ దేశాన్ని విస్మయపరిచింది. ఏకంగా రూ.4,400 కోట్లు విలువైన 1,100 ఎకరాల అసైన్డ్‌ భూములను చంద్రబాబు, నారాయణ తమ బినావీులు, సన్నిహితుల పేరిట గుప్పెట పట్టారన్నది సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో తేలింది. 

జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్‌ వేశారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి భయపెట్టారు. తమకు ఆ భూములు విక్రయిస్తే కొంతైనా డబ్బులు వస్తాయని చెప్పారు.

తీవ్ర ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినావీులకు అసైన్డ్‌ భూములను సేల్‌డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన కేపీవీ అంజనీకుమార్‌ (రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌), గుమ్మడి సురేశ్, కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కొల్లి శివరామ్‌లతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల పేరిట ఆ అసైన్డ్‌ భూములు బదలాయించారు. అనంతరం.. మంగళగిరి తదితర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి వాటిని అక్రమంగా బదలాయిస్తూ ‘జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించారు. అసైన్డ్‌ భూములను అలా జీపీఏ పేరిటగానీ ఇతరత్రా విధాలుగాగానీ బదిలీ చేయడం చట్టవిరుద్ధం. ఆ తర్వాత ఆ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. తద్వారా తాము బినామీల పేరిట హస్తగతం చేసుకున్న అసైన్డ్‌ భూములకు సీఆర్‌డీఏ భారీ ప్యాకేజీ దక్కేలా చేశారు.

ప్రభుత్వ ఒత్తిడితోనే అంటూ అధికారుల వాంగ్మూలం
నిజానికి.. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. వాటికి భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. అదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు అడ్వకేట్‌ జనరల్‌ కూడా అసైన్డ్‌ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. కానీ.. చంద్రబాబు, నారాయణ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి తాము చెప్పినట్లు చేయమని హుకుం జారీచేశారు. నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అసైన్డ్‌ భూముల బదలాయింపు చేశామని నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు న్యాయస్థానంలో 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్‌గా పరిగణించమని న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలు
నారాయణ కుటుంబసభ్యుల పేరిటే 162 ఎకరాలు
► అసైన్డ్‌ భూదోపిడీ కోసం చంద్రబాబు ముఠా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌కు తెగబడింది. రెవెన్యూ రికార్డులు, సీఆర్‌డీఏ భూసమీకరణ రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లకు విరుద్ధంగా సీఆర్‌డీఏ భూసమీకరణ ప్యాకేజీ ఇచ్చిన వాటిలో 1,336 మంది బినామీల పేర్లు ఉండటం గమనార్హం. 
► నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచే రూ.16.5 కోట్ల నిధులను రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ నిధులను నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి వారి పేరున అసైన్డ్‌ భూములను అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. 
​​​​​​​

► నారాయణ కుటుంబ సభ్యుల పేరిటే అక్రమంగా 162 ఎకరాల అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేశారు. వీటి విలువ రూ.650కోట్లు. నారాయణ 16.5 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.650కోట్ల భూములు కొల్లగొట్టారు.
​​​​​​​► అంతేకాక.. దాదాపు రూ.4వేల కోట్ల విలువైన మరో 1,000 ఎకరాల వరకు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement