నేరెళ్ల ఘటనపై హైకోర్టులో బాధితుడి ఇంప్లీడ్ పిటిషన్
కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై దాడి జరిగిన ఘటనపై విచారణ పారదర్శకంగా సాగాలని బాధితుల్లో ఒకరైన కోలా హరీశ్ పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టులో విచారణ సాగుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాటి కేసులో వాస్తవాలు తెలియాలంటే తన వాదనలు కూడా వినాలని కోరారు.
అలాగే, న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. సిరిసిల్ల జిల్లా చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు టిప్పర్లు నడిచేవి. ఈ క్రమంలోనే 2017, జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్యను ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ జరగ్గా.. 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు రోజుల తర్వాత రాత్రి 11:30 గంటలకు నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెలకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకొని, జూలై 7న అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.
ఎస్‌ఐ తప్పు లేదని విచారణలో తేలింది
ఈ ఘటనలో బాధితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, బాధ్యులైన ఎస్పీ విశ్వనాథ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన పిల్‌తో పాటు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖతో మరో పిల్ దాఖలైంది.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రాధారాణి ధర్మాసనం బుధవారం వి చారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది డి.సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ మంగళవారం అందిందన్నారు. దీనిపై వివరాలు తెలుసుకుని, బదులివ్వడానికి 15 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది.
అయితే, సదరు ఎస్‌ఐ ఎలాంటి తప్పు చేయలేదని విచారణాధికారి నివేదిక ఇచ్చారని, దీంతో సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నామని అఫిడవిట్‌లో ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment