
రేసులో ముగ్గురు కీలక నేతలు
వీరికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందంటున్న బీజేపీ
మార్చి 10కి ముందే ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మైతేయి వర్గానికి చెందిన ఎమ్మెల్యేకే ముఖ్యమంత్రిగా మళ్లీ అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ వర్గానికి చెందిన ముగ్గురి నేతలు రేసులో ఉండగా వీరికి 22 మంది ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దీంతో మార్చి 10న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేసులో శాసనసభ ప్రస్తుత స్పీకర్ తోక్చోమ్ సత్యవ్రత్ సింగ్ కూడా ఉన్నారు. బిరెన్ సింగ్ రెండు పర్యాయాలు సీఎంగా ఉన్నప్పుడు తోక్చోమ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసపై బిరెన్ సింగ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడి తోక్చోమ్ వార్తల్లో నిలిచారు.
ముఖ్యమంత్రి రేసులో ఉన్న రెండో నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్. ఈయన 2017– 2022 సంవత్సరాల మధ్య మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. బిరేన్ సింగ్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్‌లో ఉన్నారు. తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ సీఎం రేసులో ఉన్న మూడో నేత. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీఎం సలహాదారుగా ఉన్న రాధేశ్యామ్ సింగ్ 2017 –2022 మధ్య విద్య, కారి్మక, ఉపాధి శాఖల మంత్రిగా ఉన్నారు.
ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులు
బిరేన్ సింగ్ రాజీనామా తర్వాత, మైతేయి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోయారు. బిరేన్‌సింగ్‌ను మళ్లీ సీఎం చేయాలని ఒక వర్గం కోరుతుండగా, మరో వర్గం వ్యతిరేకిస్తోంది. అయితే మార్చి 10వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపూర్ విషయంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయతి్నంచే అవకాశాలున్నాయి. అందుకే ఆలోగా కొత్త సీఎంను ఎంపిక చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరింతకాలం కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
బలమున్నా..
కరువైన ఏకాభిప్రాయం మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కూడా మైతేయి వర్గానికి చెందినవారే. అయితే, కుకీలతో పాటు బీజేపీకి చెందిన పలువురు మైతేయి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కుకీ–మైతేయి వర్గాల మధ్య 2023 మే 3వ తేదీన మొదలైన హింసకు ఇప్పటికీ అడ్డుకట్టపడలేదు. హింసాకాండ సమయంలో కుకీలకి వ్యతిరేకంగా మైతేయిలను బిరెన్ సింగ్ ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేశారు.
కొత్త సీఎం ఎంపికపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫిబ్రవరి 13న రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీని రద్దు చేయని కారణంగా మార్చి 10 లోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 27 మంది మైతేయిలు, ఆరుగురు కుకీలు, ముగ్గురు నాగాలు, ఒక ముస్లిం ఉన్నారు. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)కు చెందిన ఐదుగురు సహా ఎన్డీఏకు మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment