northeastern states
-
ఈశాన్యంలో అవినీతి సంస్కృతి అంతం
నామ్సాయ్(అరుణాచల్ ప్రదేశ్): ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి సంస్కృతిని బీజేపీ అంతం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పట్టడం లేదని, చివరి లబ్ధిదారుడి దాకా చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నిధులు మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు దారుణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆక్షేపించారు. ఆయన ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ(ఎన్డీయూ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అరుణాచల్ రాష్ట్రం ఈస్ట్ సియాంగ్ జిల్లాలోని పాసీఘాట్‌లో ఎన్డీయూ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఒప్పందంపై సంతకాల అనంతరం నామ్సాయ్ జిల్లాలో భారీ ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ఈశాన్య భారతదేశానికి మోదీ సర్కారు ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలపై అమిత్ షా మండిపడ్డారు. కళ్లు మూసుకుంటే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కళ్లు తెరిచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీజీ.. మీరు కళ్లు తెరవండి. ఇటలీ కళ్లద్దాలను పక్కనపెట్టండి. ఇండియా కళ్లద్దాలు ధరించండి’’ అని అమిత్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇక్కడి ప్రజల్లో దేశభక్తి నిండిపోయిందని, ఒకరినొకరు ‘నమస్తే’ బదులు ‘జైహింద్’ అంటూ అభివాదం చేసుకుంటారని తెలిపారు. ఇలాంటి సన్నివేశం దేశంలో ఇంకెక్కడా చూడలేమన్నారు. -
చల్లటి పంటలు
ఈశాన్య రాష్ట్రాలు అనగానే ముందుగా అక్కడి పచ్చటి తోటలు గుర్తుకు వస్తాయి. వీపున బుట్ట తగిలించుకున్న మహిళలు మనోఫలకం మీద మెదలుతారు. వేళ్లతో అలవోకగా తేయాకు చిగుళ్లను గిల్లుతూ బుట్టలో వేస్తున్న దృశ్యం కూడా. అదే ప్రాంతం నుంచి ఓ మహిళ సేంద్రియ పంటలను బుట్టలో వేయసాగింది. ఇప్పుడు... బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డును కూడా బుట్టలో వేసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు ఒక మోస్తరుగా తెలిసిన రాష్ట్రం సిక్కిమ్, ఆ రాష్ట్రానికి రాజధాని గాంగ్టక్, ఆ నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉంది రాణిపూల్ అనే చిన్న పట్టణం. అది పట్టణమో, గ్రామమో స్పష్టంగా చెప్పలేం. నివాస ప్రదేశాలకు ఒకవైపు కొండలు, మరోవైపు రాణిఖోలా నది, వాటి మధ్య పచ్చగా విస్తరించిన నేల. ఈ నేలనే తన ప్రయోగశాలగా మార్చుకున్నారు దిల్లీ మాయా భట్టారాయ్. ప్రోగ్రెస్ రిపోర్ట్ టెకీగా సిటీలైఫ్ చట్రంలో జీవితాన్ని కట్టిపడేయడం నచ్చలేదామెకు. ‘మనల్ని మనం పరిరక్షించుకుంటాం, అలాగే భూమాతను కూడా పరిరక్షించాలి’... అంటారు మాయా భట్టారాయ్. అందుకోసం గ్రామంలో సేంద్రియ సేద్యాన్ని, సేంద్రియ ఉత్పత్తుల దుకాణాన్ని కూడా ప్రారంభించారామె. ‘పర్యావరణాన్ని పరిరక్షించడంలో సేంద్రియ వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకే ఈ రంగంలో అడుగుపెట్టాను’ అని చెప్తున్నారామె. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్గానిక్ మిషన్‌లో భాగస్వామి అయిన తర్వాత ఆమెకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. శాస్త్ర సాంకేతికతను జోడిస్తూ వ్యవసాయం చేయడంలోనూ, ఆర్థిక సంక్షేమాన్ని సాధించడంలో ఆమె కృతకృత్యులయ్యారు. మన నేలకు పరిచయం లేని పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలను ఇక్కడ పండించారామె. ఆ పంటలకు తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని, ఎక్కువ ఎండ తగలకుండా తెల్లని పై కప్పుతో సస్యాలను రక్షించారు. మన అల్లం, వంకాయలతోపాటు పశ్చిమాన పండే బ్రోకలి వంటి కొత్త పంటల సాగులోనూ పురోగతి సాధించారు. ఆమె ప్రోగ్రెస్ రిపోర్ట్‌కు మంచి గుర్తింపు వచ్చింది. మాయా భట్టారాయ్ అనుసరించిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద స్థానిక మీడియా చానెళ్లు ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. సోషల్ మీడియా కూడా అందుకుంది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా విపరీతంగా ప్రజల్లోకి వెళ్లింది. వాతావరణాన్ని కలుషితం కానివ్వకుండా కాపాడడంలో ఆమె తనవంతుకంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని అందించింది. ఆమె స్ఫూర్తితో అనేక మంది మహిళలు పర్యావరణానికి హానికలిగించని విధంగా సాగు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆమెను ‘బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021’తో గౌరవించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు చెందిన నార్త్ ఈస్టర్న్ హిల్ రీజియన్ 48వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటీవల మేఘాలయలోని ఉమియమ్‌లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. పంటకు పురస్కారం రాణిపూల్‌లోని హాత్ బజార్లో మాయా భట్టారాయ్ దుకాణాన్ని, స్థానిక మహిళలు సేంద్రియసాగులో పండిస్తున్న కూరగాయలను చూపిస్తూ ‘ఇదంతా దిల్లీ మాయా భట్టారాయ్ బాటలో మన మహిళలు సాధించిన విజయం. బయటి నుంచి కూరగాయలు మాకక్కరలేదు... అని చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం’ అని కథనాలు ప్రసారం చేసింది స్థానిక ‘వాయిస్ ఆఫ్ సిక్కిమ్’ మీడియా. ‘నేలకు గౌరవం అందాలి. పంటకు పురస్కారాలు రావాలి. పంట పండించే రైతు శ్రమను గౌరవించే రోజులు రావాలి’ అంటారామె. -
వాళ్లు అగాథం పెంచితే.. మేం అభివృద్ధి చేశాం
ఇంఫాల్/అగర్తలా: గత ప్రభుత్వాలు అభివృద్ధిపరంగా ఈశాన్య రాష్ట్రాలకు, మిగతా దేశానికి మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించగా తమ ప్రభుత్వం మాత్రం లుక్ ఈస్ట్ విధానంతో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. తమ నిరంతర కృషి ఫలితంగానే మిగతా దేశానికి, ఈశాన్యప్రాంతానికి మధ్య ఉన్న అంతరం తగ్గిందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంగళవారం ఆయన రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ.. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల కృషి ఫలితంగా మణిపూర్, ఈశాన్యరాష్ట్రాల్లో తీవ్రవాదం, హింస స్థానంలో శాంతి, అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ఒకప్పుడు దిగ్బంధానికి గురైన మణిపూర్, ఈశాన్యప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖద్వారాలుగా మారబోతోందని తెలిపారు. బీజేపీ హయాంలో దేశ పురోగతికి ఈశాన్య ప్రాంతం చోదకశక్తిగా మారిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన వాటిలో.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఇంఫాల్ స్మార్ట్ సిటీ మిషన్, అత్యాధునిక కేన్సర్ ఆస్పత్రి ఉన్నాయి. వీటితోపాటు మణిపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ భవనానికి, 5 జాతీయ రహదారుల నిర్మాణానికి, మూడు తాగునీటి ప్రాజెక్టులు తదితరాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన త్రిపుర రాజధాని అగర్తలాలో మహారాజా బీర్ బిక్రమ్(ఎంబీబీ) విమానాశ్రయంలో రెండో టెర్మినల్ భవనంతోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. గత ప్రభుత్వాల హయాం లో అవినీతికి, వెనుకబాటుతనానికి మారుపేరుగా ఉన్న త్రిపుర ఇప్పుడు ప్రముఖమైన వాణిజ్య కారిడార్‌గా మారిపోయిందని పేర్కొన్నారు. -
వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఇటీవల సాగించిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల డ్రాగన్ దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశ నాయకులు అరుణాచల్‌లో పర్యటించడాన్ని తాము కచి్చతంగా, గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పింది. అరుణాచల్ రాష్ట్రాన్ని తాము ఇండియాలో భాగంగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అది దక్షిణ టిబెట్‌లో ఒక భాగమని పేర్కొంది. వెంకయ్య నాయుడు ఈ నెల 9న అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, హింసకు తెరపడి, శాంతి నెలకొంటోందని చెప్పారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఏకపక్షంగా, బలవంతంగా, చట్టవిరుద్దంగా ఇండియాలో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని, అక్కడ భారత నేతలు పర్యటిస్తే వ్యతిరేకిస్తామని తేలి్చచెప్పారు. చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినేలా, సరిహద్దు వివాదాలు పెరిగిపోయేలా వ్యవహరించవద్దని భారత్‌కు హితవు పలికారు. అరుణాచల్ మా దేశంలో అంతర్భాగం: భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో వెంకయ్య నాయుడు పర్యటించడం పట్ల చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా అభ్యంతరాలను తిరస్కరించింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తేలి్చచెప్పారు. భారత్ నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థంపర్థం లేని పని అని కొట్టిపారేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. -
నదుల పరిరక్షణ సమిష్టి బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: నదులను పరిరక్షించుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నదుల పునరుజ్జీవనానికి శక్తిమంతమైన జాతీయ ప్రచార ఆవశ్యకతకు పిలుపునిచ్చారు. ఎనిమిది రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు ‘ఫరెవర్ గువాహటి’సచిత్ర పుస్తకాన్ని (కాఫీ టేబుల్ బుక్) విడుదల చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరుగుదలతో నదులు, నీటి వనరులు కలుషితం అవుతున్నాయన్నారు. ఆధునికీకరణ అన్వేషణలో అత్యాశతో మనిషి సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల ప్రాధాన్యం ముందు తరాలు తెలుసుకోవాలంటే జలసంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అనంతరం ఫేస్బుక్ వేదిక ద్వారా తమ మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి... బ్రహ్మపుత్ర నదిని సందర్శించిన మరుపురాన్ని అనుభవాలను వివరించారు. బ్రహ్మపుత్ర సహజ నదీ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ని చేసిందని, అద్భుతమైన నదీతీర ఉద్యానవనం సంతోషాన్ని, మరచిపోలేని జ్ఞాపకాలను పంచిందని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి అందిస్తున్న బ్రహ్మపుత్ర ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతుల్లో భాగమని వెంకయ్యనాయుడు తెలిపారు. అనంతరం, అస్సాం రాష్ట్ర కేన్సర్ ఇన్స్టిట్యూట్లో పీఈటీ–ఎంఆర్ఐ యంత్రాన్ని ప్రారంభించారు.అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంలో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్టిబ్యూటెడ్ కేన్సర్ కేర్ మోడల్‌ను అభినందించారు. -
ఈశాన్య రాష్ట్రాల్లో 20 విమానాశ్రయాలు
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి పెద్ద ఊపును ఇవ్వడంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఇరవై విమానాశ్రయాలను అభివృద్ధి చేయబోతున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటికే రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గువాహటిలో సోమ, మంగళవారాల్లో ‘అష్టలక్ష్మి’(8 రాష్ట్రాలు) ఈశాన్య రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.,. వ్యాక్సినేషన్ ముగిసేలోగా వసతుల కల్పన కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే మనం టూరిజంపై అధికంగా ఆధారపడక పోవడం వల్ల త్వరగా కోలుకునేందుకు అవకాశాలున్నాయి. దీంతో పాటు భారత్‌లో టీకా కార్యక్రమం వేగంగా అమలవుతోంది. అధికశాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ముగిసేలోగా పర్యాటకరంగ అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక సదుపాయాల మెరుగునకు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించుకునేందుకు, బ్రాండింగ్ కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశాం. పర్యాటకాభివృద్ధికి మెండుగా అవకాశాలు ఇక్కడి గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో భిన్నమైనవి. వినూత్న శైలితో సాగే వీరి పండుగలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడి జలపాతాలు కూడా అందమైన పరిసరాలతో ప్రకృతి రమణీయతతో విలసిల్లుతుంటాయి. లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. స్విట్జర్లాండ్ బదులు ఇక్కడే సినిమా షూటింగులు జరపొచ్చు. ఇలా ఇక్కడ పర్యాటకాభివృద్ధికి మెండుగా అవకాశాలున్నాయి. సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఇక్కడ పెద్దసంఖ్యలో సినిమాల చిత్రీకరణ జరిగేలా చొరవ తీసుకుంటాం. త్వరలో ఇక్కడ పెట్టుబడిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. పామాయిల్, ఇతర రంగాల్లో పెట్టుబడులు రాబడతాం. ఉపాధి కల్పన ద్వారా ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. సమస్యలను అధిగమించాం ఈశాన్య రాష్ట్రాలను 35 ఏళ్ల పాటు చొరబాట్లు, తీవ్రవాద గ్రూపుల సమస్యలు పట్టి పీడించాయి. రోజులు, నెలల తరబడి రాష్ట్రాల మధ్య రోడ్ల మూసివేత వంటివి కొనసాగేవి. ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఘనమైన చరిత్ర, విభిన్న జాతులు, తెగల జీవనశైలి ఇలా అనేక అద్భుతమైన అంశాలెన్నో ఉన్నా.. పైన పేర్కొన్న సమస్యల కారణంగా సరైన మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా, ఇలా ఏవీ అందుబాటులో లేక పర్యాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైంది. గత ఏడేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ఆ సమస్యలు అధిగమించాం. ఇప్పటికే అనేక మార్పులు తీసుకొచ్చాం. రోడ్డు, రైలు కనెక్టివిటీ పెరిగింది. దీంతో పర్యాటకరంగ అభివృద్ధికి గట్టి చర్యలు చేపడుతున్నాం. -
మూడు శాఖల నిర్వహణ నాకొక ఛాలెంజ్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మూడు శాఖల నిర్వహణ ఓ ఛాలెంజ్ అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి, పనుల పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని.. ఆటంకాలన్నీ తొలగిపోయాయని, మరింత మెరుగుపర్చేందుకు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో సంక్షోభం: రాహుల్ గాంధీతో సీఎం భేటీ -
శాటిలైట్ ఇమేజింగ్‌తో సరిహద్దుల నిర్ణయం
న్యూఢిల్లీ/గువాహటి/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, ఒక్కోసారి అవి హింసాత్మక రూపంగా మారుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటువంటి పరిణామాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఆయా రాష్ట్రాల హద్దులను శాటిలైట్ ఇమేజింగ్ సాయంతో నిర్ణయించనుంది. ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎన్ఈఎస్ఏసీ, నెశాక్)కి అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దులను శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా శాస్త్రీయంగా ఖరారు చేయాలన్న ఆలోచనను హోంమంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితం తెరపైకి తెచ్చారని ఆ అధికారులన్నారు. శాస్త్రీయంగా చేపట్టే సరిహద్దుల విభజన కచ్చితత్వంతో ఉంటుందనీ, దీని ఆధారంగా చూపే పరిష్కారం రాష్ట్రాలకు ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ అధికారులు పేర్కొన్నారు. నెశాక్ నుంచి అందే శాటిలైట్ మ్యాపింగ్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరుగుతుందనీ, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని వారు చెప్పారు. అస్సాం, మిజోరం సరిహద్దుల్లో జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణల్లో ఇటీవల ఐదుగురు అస్సాంకు చెందిన పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది వరకు గాయపడటంతో ఈ ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీలు మరోసారి తెరపైకి వచ్చాయి. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్(ఎన్ఈసీ), కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష శాఖ సంయుక్త ఆధ్వర్యంలో షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నెశాక్ ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో వరద హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నెశాక్ సాంకేతిక సాయాన్ని అందజేస్తోంది. కాగా, 1875లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా సరిహద్దుల్లోని రిజర్వు ఫారెస్టులో ఉన్న 509 చదరపు మైళ్ల ప్రాంతం తమదేనని మిజోరం వాదిస్తుండగా, అదేం కాదు, 1993లో నిర్ణయించిన ప్రస్తుత సరిహద్దునే గుర్తిస్తామని అస్సాం చెబుతోంది. ఇద్దరు సీఎంలతో మాట్లాడిన అమిత్ షా అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, జొరంతంగాలతో ఫోన్లో మాట్లాడారు. సమస్యకు అర్థవంతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు అనంతరం జొరంతంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇలా ఉండగా, జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణలకు సంబంధించి అస్సాం సీఎం హిమంతపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకునే అవకాశముందని మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్మావియా చువాంగో వెల్లడించారు. ఈ విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు. అరెస్టుకయినా సిద్ధం: సీఎం హిమంత సరిహద్దు ఘర్షణలపై నోటీసులు అందితే మిజోరం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని అస్సాం సీఎం హిమంత చెప్పారు. అరెస్టయినా అవుతాను గానీ, తనతోపాటు కేసులు నమోదైన రాష్ట్ర అధికారులను మాత్రం విచారణకు పంపేది లేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు కోర్టు నుంచి బెయిల్ కూడా కోరనన్నారు. చర్చలే సమస్యకు పరిష్కారమని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంత స్ఫూర్తిని సజీవంగా ఉంచటమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. -
ఆలయాల భద్రతపై.. ఏపీ వైపు రాష్ట్రాల చూపు
సాక్షి, అమరావతి : హుండీల్లో డబ్బులు చోరీ.. పంచలోహ విగ్రహాలు మాయం.. దేవాలయాలకు సంబంధించిన నేరాల్లో ఏళ్ల తరబడి పోలీసులు, ప్రజలు వింటున్న మాటలు ఇవి. కానీ, ఇందుకు భిన్నంగా.. గత కొంతకాలంగా పథకం ప్రకారం రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం ఘటనలు పోలీసులకు సరికొత్త సవాళ్లను విసిరాయి. దేవుడి మాటున విపక్షాలు మత రాజకీయాలకు తెరతీశాయి. దీనిని సకాలంలో పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు దిశా నిర్దేశం చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పోలీసులు తీసుకున్న ఈ చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు ఈ విషయంలో ఏపీ వైపు చూస్తున్నాయి. ఆలయాల భద్రతలో రాష్ట్రం చేపట్టిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రంలో పటిష్ట చర్యలు ఇలా.. ఆలయాల్లో చోటుచేసుకుంటున్న దుర్ఘటనలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఆలయాలకు ఎక్కడాలేని విధంగా భద్రత కల్పించడమే ఇందుకు కారణం. వాటిలో ముఖ్యమైనవి.. ►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మతపరమైన సంస్థలు, ఆలయాలకు సంబంధించిన భద్రతపై పోలీసు శాఖ సోషల్ ఆడిట్ నిర్వహించింది. దానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టింది. ►విగ్రహాల విధ్వంసానికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటుచేసింది. ప్రతి జిల్లాలోను ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ►గతేడాది సెప్టెంబరు 5 నుంచి ఇప్పటివరకు మొత్తం 59,529 మతపరమైన సంస్థలు, ఆలయాలకు పోలీసులు జియో ట్యాగింగ్ చేశారు. ►రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46,225 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ►దేవదాయ శాఖకు చెందిన ప్రధాన ఆలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు మూడు షిఫ్ట్‌ల పద్ధతిలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ►గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని వాటికి నిర్వాహకులు, యాజమాన్యం, స్థానిక ప్రజలు బందోబస్తు చర్యలు తీసుకునేలా పోలీసు శాఖ అప్రమత్తం చేసింది. ►అంతేకాక.. రాష్ట్రవ్యాప్తంగా 22,955 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటుచేయాలని పోలీసు శాఖ నిర్దేశించుకోగా ఇప్పటివరకు 17,853 ఏర్పాటుచేశారు. మిగిలిన 5,102 దళాల ఏర్పాటుకు కూడా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల అధ్యయనం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయాల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో మతపరమైన సంస్థలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు, గ్రామ రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. వీటి గురించి తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్ పోలీసు అధికారులు ఏపీ డీజీపీ సవాంగ్‌తో చర్చించారు. ఇక్కడికి వచ్చి ఆలయాల భద్రతా చర్యలను అధ్యయనం చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. అలాగే, పలు ఈశాన్య రాష్ట్రాల పోలీసులు సైతం ఇక్కడి చర్యలను అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపించడం మనకు గర్వకారణం. – జి. పాలరాజు, పోలీస్ అధికార ప్రతినిధి -
ఇంటర్నెట్ షట్‌డౌన్ @ 100
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రికార్డు స్థాయిలో వివిధ సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తాజాగా ఉత్తరప్రదేశ్‌లో 21 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చర్చకు దారి తీస్తోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమబెంగాల్లో ఇప్పటికే చాలాసార్లు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ► డిసెంబర్ 19న రాజధాని ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు. ► జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసినపుడు అంటే ఆగస్టు 5న నిలిపేసిన ఇంటర్నెట్ సేవల్ని ఇప్పటివరకు చాలాచోట్ల పునరుద్ధరించలేదు. ► ఇటీవల వివాదాస్పద బాబ్రీమసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువడ్డానికి ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. ► 2012 నాటికి కశ్మీర్లో ఒకట్రెండు జిల్లాలకే పరిమితమైన ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది 2019 వచ్చేసరికి 14 రాష్ట్రాలకు చేరుకుంది. ► నిరసనలు, ఆందోళనలు జరిగిన ప్రతీసారి తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికే ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పౌరులకు ఉండే ఒక సదుపాయాన్ని రద్దు చేయడం ప్రాథమిక హక్కుని కాలరాయడమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ► అంతేకాదు ఇలా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం వల్ల భారత్‌కి 2012–2017 మధ్య 300 కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని ఓ అంచనా. గతంలోనూ.. ► భారత్‌లో తొలిసారిగా 2010లో గణతంత్ర వేడుకకు ముందు కశ్మీర్ లోయ ప్రాంతంలో ఇంటర్నెట్, ఫోన్ సేవలను ప్రభుత్వం ఆపేసింది. ► 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని సైన్యం మట్టుబెట్టాక కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి. ► 2016లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాల్యాండ్ ఆందోళనలు ఉధృతంగా ఉన్నపుడు 100 రోజులు ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు. ► 2015లో గుజరాత్లో పటీదార్ల ‘రిజర్వేషన్’ల ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. -
ఆగని ‘పౌరసత్వ’ ప్రకంపనలు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దేశ రాజధానితో పాటు పశ్చిమబెంగాల్, అస్సాంల్లో ఆదివారం ఉధృతంగా నిరసన ప్రదర్శనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో ఆందోళనకారులు బస్సులకు, అగ్నిమాపక వాహనానికి నిప్పుపెట్టారు. గువాహటిలో పోలీసుల కాల్పుల్లో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. లండన్‌లోని భారతీయ హైకమిషన్ కార్యాలయం ఎదుట కొందరు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కాగా, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలని యోచిస్తున్నట్లు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వెల్లడించింది. మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ‘ముస్లింల హక్కులకు భంగం కలిగే ఒక్క అంశం కూడా చట్టంలో లేదు’ అని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పష్టం చేశారు. రాజధానిలో.. ఆగ్నేయ ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ దగ్గరలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టారు. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఒక పోలీసుకు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. కాగా, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని విద్యార్థి సంస్థ ఎన్ఎస్యూఐ తెలిపింది. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఉద్యమంలో చేరి హింసకు పాల్పడుతున్నాయని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీలో ఉంటూ విద్యార్థులను రెచ్చగొడ్తున్న విద్యార్థేతరులను అదుపులోకి తీసుకునేందుకు ఆదివారం పోలీసులు జామియా మిలియా వర్సిటీలో సోదాలు జరిపారు. బెంగాల్లో.. :పశ్చిమబెంగాల్లోని నాడియా, బీర్భుమ్, నార్త్ 24 పరగణ, హౌరా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు రహదారులపై టైర్లు, కట్టెలను తగలబెట్టారు. ముర్షీదాబాద్, మాల్డా, నార్త్ 24 పరగణ, హౌరా జిల్లాల్లో ఇంటర్నెట్ను అధికారులు నిలిపేశారు. అస్సాంలోని గువాహటిలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆందోళనకారుల సంఖ్య ఆదివారానికి నాలుగుకి చేరింది. ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ మాత్రం ఐదుగురు చనిపోయారని, పలువురి పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపింది. బుధవారం నుంచి తమ ఆసుపత్రిలో బుల్లెట్ గాయాలతో 29 మంది చేరారని గువాహటి మెడికల్ కాలేజీ తెలిపింది. లండన్‌లోని భారతీయ హై కమిషన్ ముందు కొందరు అస్సాం వాసులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంప్రదాయ అస్సామీ వస్త్రధారణలో పిల్లలతో పాటు వచ్చిన యువత ఈ కార్యక్రమంలో పాల్గొంది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ యూకే శాఖ కూడా నిరసన ప్రదర్శన చేపట్టింది. పార్టీ పెడతాం: ఏఏఎస్‌యూ పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్‌యూ) సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తోంది. శిల్పి సమాజ్తో కలిసి పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఏఏఎస్‌యూ సంకేతాలిచ్చింది. సుప్రీంకోర్టుకు ఏజీపీ పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అధికార బీజేపీ భాగస్వామ్య పక్షమైన అస్సాం గణపరిషద్ (ఏజీపీ) నిర్ణయించిందని ఏజీపీ నేత దీపక్ దాస్ తెలిపారు. అస్సాం ప్రజల సెంటిమెంట్‌ను ఏజీపీ గౌరవిస్తుందని ఈ చట్టం తమ ఉనికిని, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుందని భావిస్తున్నారని ఆయన చెప్పారు. మరోవైపు ఈ చట్టాన్ని ఏజీపీ ఎప్పుడూ సమర్థించలేదని మంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత స్పష్టం చేశారు. -
2018లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ షట్‌డౌన్
కశ్మీర్లో కల్లోలం.. ఇంటర్నెట్ కట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తం.. సమాచారం షట్ డౌన్ సున్నిత అంశాలపై కీలక తీర్పు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవ్ ఏ ఆందోళనకైనా, ఏ నిరసనకైనా అదే తంత్రం, అదే వ్యూహం న్యూఢిల్లీ/వాషింగ్టన్: పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవడంతో పది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటల సేపు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పుడే కాదు 2018లో భారత్‌లో పలు సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం ఇవాళ, రేపు చాలా దేశాల్లో జరుగుతోంది. ఆందోళనల్ని అణచివేయాలంటే ప్రజలకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేయడమే మార్గమన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి.భారత్‌తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్ హౌస్ సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఇంటర్నెట్, డిజిటల్ మీడియా స్వేచ్ఛపై 65కు పైగా దేశాల్లో ఈ సంస్థ సమగ్ర అధ్యయనాన్నే నిర్వహించింది. ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్ షట్డౌన్లు మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్ లోయలో ఇంటర్నెట్, ఫోన్ సేవల్ని నిలిపివేశారు. ► 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హన్ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి. ► కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగస్టు 4 నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్ సేవలు పునరుద్ధరించారు కానీ, 130 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్ ఇంకా వాడకంలోకి రాలేదు. ► 2016లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ► 2015లో గుజరాత్లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ పటీదార్ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ► గత నెలలో రామజన్మ భూమి తీర్పుకు ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ అయింది. ఏ ఏడాది ఎన్నిసార్లు 2017 79 2018 134 2019 90 2012 నుంచి లెక్కల్ని చూసుకుంటే 360సార్లకు పైగా దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. హోంశాఖకి అధికారాలు ప్రజల భద్రత కోసం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, ఆంక్షలు విధించడానికి 2017లో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని కొన్ని నిబంధనల్ని చేర్చారు.. దీని ప్రకారం కేంద్ర హోంశాఖ, హోంశాఖ కార్యదర్శులకు తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసే అధికారం ఉంటుంది. అయితే అయిదు రోజుల తర్వాత పరిస్థితుల్ని తప్పనిసరిగా సమీక్షించాలి. ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు భారత్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకి కూడా ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేరళ హైకోర్టు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. రోజుల తరబడి ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చట్టవ్యతిరేకమని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ సభ్యుడు ప్రణేష్ ప్రకాశ్ అంటున్నారు. -
‘పౌరసత్వం’పై మంటలు
గువాహటి/కోల్‌కతా: సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం బెంగాల్లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌కు, బస్సులకు నిప్పుపెట్టారు. అస్సాంలోని సోనిపట్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఆయిల్ ట్యాంకర్‌కు నిప్పుపెట్టడంతో అందులోని డ్రైవర్ మృతి చెందాడు. పౌరసత్వ చట్ట సవరణను రద్దు చేయాలంటూ ఈనెల 18వ తేదీన విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. పౌరసత్వ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ దీనికి నిరసనగా ఈ నెల 21వ తేదీన బిహార్ బంద్ పాటించాలని ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆందోళనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఈనెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇలా ఉండగా, అస్సాంలోని డిబ్రూగఢ్, గువాహటిలతోపాటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో అధికారులు శనివారం కర్ఫ్యూను సడలించారు. వదంతులు వ్యాపించకుండా అస్సాంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు. మంటల్లో రైల్వే స్టేషన్, బస్సులు బెంగాల్లో రెండో రోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. ముర్షీదాబాద్, ఉత్తర 24 పరగణాల జిల్లాలు, హౌరా గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌కు, బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హౌరా– ముంబై, ఢిల్లీ–కోల్‌కతా హైవేపై రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన 15 బస్సులకు నిప్పుపెట్టడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బగ్నాన్లో 20 దుకాణాలు లూటీకి గురయ్యాయి. వందలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు శనివారం మధ్యాహ్నం సంక్రాయిల్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌కు నిప్పుపెట్టారు. పట్టాలపై బైఠాయించడంతో సెల్డా–హస్నాబాద్, షొండాలియా–కాక్రా మిర్జాపూర్, హౌరా–ఖరగ్‌పూర్ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అస్సాంలో మరొకరు మృతి అస్సాంలో శనివారం వివిధ సంఘాలు, సంస్థల ఆందోళనల కారణంగా రైళ్ల రాకపోకలు, రవాణా వ్యవస్థ స్తంభించాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలు పనిచేయలేదు. సోనిపట్ జిల్లా ధెకియాజులి వద్ద శుక్రవారం రాత్రి ఖాళీ ఆయిల్ ట్యాంకర్‌కు ప్రజలు నిప్పుపెట్టడంతో అందులోని ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం ఉదయం అతడు ఆస్పత్రిలో కన్నుమూశాడని పోలీసులు తెలిపారు. గురువారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో రాష్ట్రంలో ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. కామాఖ్య రైల్వే స్టేషన్‌కు దిగ్బంధించడంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గువాహటి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజులపాటు సత్యాగ్రహం పాటించాలని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆందోళనలకు మద్దతుగా ఈనెల 18వ తేదీన విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఎస్ఏకేపీ) అధ్యక్షుడు వాసవ్ కలిటా వెల్లడించారు. 16వ తేదీ నుంచి జరిగే సత్యాగ్రహ నిరసనలకు కూడా ఆయన మద్దతు ప్రకటించారు. తమ పౌరులకు అమెరికా, బ్రిటన్ హెచ్చరిక వాషింగ్టన్/లండన్: ఇంటర్నెట్ సేవలపై నిషేధం.. రవాణా వ్యవస్థకు అంతరాయం.. కొనసాగుతున్న ఆందోళనలు.. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా, బ్రిటన్‌తోపాటు కెనడా, సింగపూర్, ఇజ్రాయెల్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న అస్సాంలో అధికార పర్యటనలను అమెరికా తాత్కాలికంగా రద్దు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న తమ పౌరులకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పలు సూచనలు చేసింది. ఆందోళనలు, అస్థిర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, సాధ్యమైనంత వరకు జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో సంచరించవద్దని, చుట్టుపక్కల జరిగే పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లరాదని బ్రిటన్, కెనడా, ఇజ్రాయెల్ తమ దేశస్తులను హెచ్చరించాయి. -
రణరంగంగా జామియా వర్సిటీ
న్యూఢిల్లీ/గువాహటి/ఈటానగర్: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే.. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను ఆందోళనకారులు తగలబెట్టారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో, మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ల్లో శుక్రవారం కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. అస్సాంలో నిరసనలకు కేంద్రమైన గువాహటిలో శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. లాఠీచార్జ్.. టియర్ గ్యాస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లాలనుకున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులను పోలీసులు వర్సిటీ గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల పైకి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో, ప్రతిగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని, రాళ్లు కూడా మొదట పోలీసులే రువ్వారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులే బారికేడ్లను ధ్వంసం చేసి తమపైకి దూసుకువచ్చారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యారు. దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(ఆప్) ఘటనాస్థలికి వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రైల్వే స్టేషన్‌కు నిప్పు పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆందోళనకారులు తగలబెట్టారు. వేలాదిగా అక్కడికి వచ్చిన నిరసనకారులు రైల్వే కార్యాలయానికి, ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్‌కు, ట్రాక్స్‌కు నిప్పంటించారు. అక్కడ రైల్వే పోలీసులపై తిరగబడ్డారు. బెల్డాంగ పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. రఘునాథ్గంజ్ పోలీస్ స్టేషన్‌లోని వాహనాలకు నిప్పంటించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ముస్లిం జనాభా ఎక్కువ. అలాగే, ముస్లిం జనాభా అధికంగా ఉన్న గ్రామీణ హౌరా, బిర్భుమ్, బుర్ద్వాన్ల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అరుణాచల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి, వీ«ధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈటానగర్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు. 30 కి.మీల దూరం సాగిన ఈ ర్యాలీలో పాల్గొని, గవర్నర్ బీడీ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. గువాహటిలో ఏఏఎస్‌యూ ర్యాలీ అస్సాంలోని గువాహటిలో తాత్కాలికంగా కర్ఫ్యూను తొలగించారన్న సమాచారంతో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు వేలాదిగా దుకాణాల ముందు బారులు తీరారు. నగరంలోని దాదాపు అన్ని చోట్ల భద్రతా బలగాలు మోహరించాయి. పలు చోట్ల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. నగరంలో శుక్రవారం ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నగరంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించింది. అమిత్ షా పర్యటన రద్దు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ఆది, సోమవారాల్లో హోంమంత్రి అమిత్ షా జరపనున్న పర్యటన రద్దయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్ ప్రధాని పర్యటన రద్దు జపాన్ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దయింది. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా గువాహటిలో ప్రధాని మోదీతో ఈనెల 15 నుంచి జరగాల్సిన భేటీ రద్దయినట్లు తెలిపింది. అల్ప సంఖ్యాకుల హక్కులకు రక్షించండి వాషింగ్టన్: పౌరసత్వ చట్ట సవరణ..తదనంతర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి అల్పసంఖ్యాక మతాల వారి హక్కులకు రక్షణ కల్పించాలని భారత్‌ను కోరింది. పౌరసత్వ చట్టంపై సుప్రీంలో పిటిషన్లు పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), పీస్ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్ శర్మ, కొందరు న్యాయ విద్యార్థులు కూడా శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ చట్ట సవరణలపై తక్షణం విచారణ చేపట్టాలని మహువా మొయిత్రా తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. అయితే, ధర్మాసనం నిరాకరించింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు ఈ చట్టం ద్వారా భంగం కలుగుతోందని జైరాం రమేశ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
మేఘాలయలో ఇంటర్నెట్ సేవలు బంద్
షిల్లాంగ్: రాజ్యసభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయలో పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. నిరసనల నేపథ్యంలో మేఘాలయలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం నుంచి 48 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలతో పాటు ఎస్ఎంఎస్, వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ సేవలను సైతం నిలిపివేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండటంతో తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు గురువారం కర్ఫ్యూ విధించారు. అస్సాంలోని పది జిల్లాల్లో బుధవారం నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా ప్రభుత్వం ఈ నిషేధాన్ని మరో 48 గంటల పాటు పొడిగించింది. గుహవటి, డిబ్రూగర్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు -
అట్టుడుకుతున్న ఈశాన్యం
గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాం, త్రిపురల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అస్సాంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పౌర నిరసనలకు కేంద్రంగా మారిన అస్సాం రాజధాని గువాహటిలో బుధవారం నిరవధిక కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూని ధిక్కరిస్తూ నిరసనకారులు వీధుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. గువాహటి, దిస్పూర్, డిబ్రూగఢ్, జోర్హాత్, త్రిపుర రాజధాని అగర్తల తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరసనకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అస్సాం రాజధాని దిస్పూర్లో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు దిస్పూర్లో ఆదివారం భేటీ కానున్న వేదికను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనల కారణంగా తేజ్‌పూర్ నుంచి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కొద్దిసేపు గువాహటి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పలు రైళ్లను రద్దు చేశారు. త్రిపుర, అస్సాంలలో ఆర్మీని మోహరించారు. అస్సాంలోని 10 జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్ను నిలిపేశారు. త్రిపురలో మంగళవారం నుంచే ఇంటర్నెట్తో పాటు ఎస్ఎంఎస్ సదుపాయాన్ని కూడా నిలిపేశారు. ఆందోళన ఎందుకు? ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని జనాభా స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ బిల్లు ముస్లిం శరణార్థులకు వర్తించదు. ఇప్పటికే అస్సాం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన కొందరిలో నెలకొంది. -
ఆర్టికల్ 371 జోలికి వెళ్లం
గువాహటి: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అక్రమంగా ఒక్క వలసదారున్ని కూడా దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్ఈసీ) 68వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 371ని కూడా కేంద్రం రద్దు చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. ‘దీనిపై నేను ఇదివరకే పార్లమెంటులో స్పష్టతనిచ్చాను. నేడు 8మంది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మరోసారి చెబుతున్నా. కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్లదు’ అని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే దాన్ని రద్దుచేశామని, అయితే ఆర్టికల్ 371 మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుందని, ఈరెండింటి మధ్య చాలా తేడా ఉందని షా వివరించారు. ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతూ..అక్రమ చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని షా అభిప్రాయపడ్డారు. -
దేశం 1 టైమ్ జోన్లు 2
భారత్‌లో రెండు టైమ్ జోన్లను ప్రవేశపెట్టాలన్న అంశం మరోసారి చర్చకు వచ్చింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యుడు ఉదయం 4 గంటలకే ఉదయించి, సాయంత్రం నాలుగు గంటలకు అస్తమిస్తాడు. ఈ నేపథ్యంలో విలువైన పగటి సమయాన్ని వాడుకోవడానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక టైమ్ జోన్ రూపొందించాలని ఢిల్లీలోని సీఎస్ఐఆర్–నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు సూచించారు. ఈ విషయమై పరిశోధనలు జరిపిన నిపుణులు.. అస్సాం, మేఘాలయ , నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా భారీగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చని కనుగొన్నారు. పగటి సమయంలో వ్యత్యాసం సాధారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం రెండు గంటలు ముందుగానే జరుగుతుంది. దేశమంతా ఒకే భారత కాలమానం (ఐఎస్టీ) లేదా టైమ్ జోన్ పాటిస్తూ ఉండటంతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుండటంతో రాత్రిపూట ఇంటికి వెళ్లిన భావన ప్రజల్లో కలుగుతోంది. రాత్రిపూట విధులు నిర్వహించేందుకు విపరీతంగా విద్యుత్ ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో పగటి సమయాన్ని ముందుకు జరపగలిగితే స్థానిక ప్రజలు ఇబ్బందిపడకుండా పనులు చేసుకోగలుగుతారనీ, విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని సీఎస్ఐఆర్–ఎన్పీఎల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు కలిపి ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉత్పాదకత కూడా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. ఇప్పుడున్నది ఒకే ఐఎస్టీ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత ప్రామాణిక కాలమానం (ఐఎస్టీ) ఉదయం 5.30 గంటలుగా అమలవుతోంది. అదే యూకేలోని గ్రీన్విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశం ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం(యూసీటీ) అర్ధరాత్రి 0.00 గంటలకు గ్రీన్విచ్ టైమ్‌గా లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో సమయాన్ని ఓ గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా? లేదా? ఈ విధానాన్ని అమలు చేయగలమా? అన్న విషయమై పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అందులో భారత కాలమానాన్ని మరో గంట ముందుకు జరపగలిగితే ఈశాన్య భారతం, పోర్ట్బ్లెయిర్లో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తేలినట్లు ఎన్పీఎల్ డైరెక్టర్ దినేశ్.కె.అస్వల్ తెలిపారు. భారత్‌లో రెండు టైమ్ జోన్లను అమలు చేయొచ్చని తాము శాస్త్రీయంగా నిరూపించామనీ, ఇక ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాలంపై కొన్ని సంగతులు ► బ్రిటిష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కోల్‌కతా టైమ్ జోన్లుగా విభజించారు. ► 1947 సెప్టెంబర్ 1న భారత ప్రామాణిక కాలమానం(ఐఎస్టీ) ఏర్పడింది ► 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైమ్)ను పాటించాలని అసోం(అప్పటి అస్సాం) అనధికారికంగా నిర్ణయించింది. పగటి సమయం ఒక గంట ఎక్కువ ఉండేలా గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టారు. ► ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైమ్ జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువాహటి హైకోర్టు తోసిపుచ్చింది. ► 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ సైతం ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైమ్‌జోన్ కావాలని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదాతోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
సాలూరు: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాయంటే అందుకు కారణం ప్రత్యేక హోదాయేనని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం ఆయన సిక్కిం రాష్ట్రం నుంచి విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. అంచనాల కమిటీ సభ్యులుగా కమిటీ చైర్మన్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆద్వర్యంలో స్టడీ టూర్ నిమిత్తం పశ్చిమబెంగాల్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. ఈ టూర్ ద్వారా ఆయా రాష్ట్రాలు అభివృద్ధి నిధుల కేటాయింపు, ఖర్చు చేస్తోన్న తీరుతెన్నులను పరిశీలిస్తున్నామన్నారు. ఈశాన్య రాష్ట్రాలు కేవలం ప్రత్యేక హోదా రాష్ట్రాలు కావడంతోనే అభివృద్ధి సాధ్యమౌతోందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదాతో ఏం ఒరుగుతుందని ప్రశ్నించారని, ఆయన ఆయా రాష్ట్రాలను చూస్తే ఏం ఒరుగుతుందో తెలుస్తుందన్నారు. కొండప్రాంతమైనా ఎంతగానో అభివృద్ధి చెందాయని తెలిపారు. పశ్చిమబెంగాల్లో గిరిజనుల అభివృద్దికి హిల్ కౌన్సిల్ ఏర్పాటుతో అక్కడి గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారని, ఆ తరహాలో మన రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఈ తరహాలోనే సాలూరు ఏజెన్సీ ప్రాంతలోనున్న కొఠియా గ్రామాల అభివృద్ధికి నిధులు సమకూరాయన్నారు. దాదాపు 180కోట్ల రూపాయలను ఒడిశా ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రంలో సాగవుతున్న టీ, కాఫీ తోటలలో 95శాతం విదేశాలకు ఎగుమతులవుతున్నాయని చెప్పారు. తమ టూర్ ద్వారా ఆయా రాష్ట్రాలు అభివృద్ధికి దోహదపడిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ ద్వారా నివేదించనున్నామని తెలిపారు. -
అణచివేత చట్టానికి స్వస్తి
మేఘాలయలో ఇరవై ఏడేళ్లనుంచి అమల్లో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేకాధికా రాల) చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మిన హాయింపు ఇచ్చినట్టు తెలిపింది. అస్సాంలో కూడా పాక్షికంగా ఉపసంహరించే ప్రతిపాదన ఉన్నట్టు చెబుతున్నారు. త్రిపురలో మూడేళ్లక్రితం అప్పటి వామపక్ష ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంది. ఆనాటినుంచీ మా ప్రాంతాల్లో కూడా దీన్ని తొలగించాలని ఇతర ఈశాన్య రాష్ట్రాలనుంచి, జమ్మూ–కశ్మీర్‌నుంచి పలు సంస్థలు డిమాండు చేస్తున్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మణిపూర్ యువతి ఇరోం షర్మిల దాదాపు పదహారేళ్ల సుదీర్ఘకాలం నిరాహార దీక్ష జరిపారు. ఇది అమలవు తున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని సమీక్షించి తగిన సిఫార్సులు చేయాలని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఆ విషయంలో 2010లో యూపీఏ సర్కారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అది కూడా చట్టాన్ని పాక్షికంగా ఉపసంహరించాలని సూచించింది. ఇలా వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు ఏక కంఠంతో అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు... సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్గ ఉపసంఘమే పాక్షిక ఉపసంహరణకు మొగ్గు చూపినప్పుడు కూడా ఓ చట్టం ఇన్నాళ్లు మనుగడ సాగించగలగటం ఆశ్చర్యకరమే. కానీ సైన్యం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లనే ఇవన్నీ నిరర్ధకమయ్యాయని తెలిస్తే అంతకన్నా ఆశ్చర్యం కలుగుతుంది. కల్లోలిత రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం ఆసరా లేకుండా శాంతిభద్రతలను కాపాడే బాధ్యత తీసుకోవడం తమకు సాధ్యం కాదని సైన్యం చెప్పిన పర్యవసానంగా యూపీఏ సర్కారు దీని జోలికెళ్లడం మానుకుంది. దేశంలో స్వాతంత్య్రానంతరం రూపొందించిన ఒక చట్టంపై ఇంత పెద్ద యెత్తున నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం కావడం సాయుధ దళాల(ప్రత్యేకాధికా రాల) చట్టం విషయంలో మాత్రమే జరిగింది. అయితే దీని మూలాలు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ వలసపాలకులు తీసుకొచ్చిన సాయుధ దళాల విశేషాధికారాల ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు తిరుగు బాట్లతో అట్టుడుకుతున్నప్పుడు 1958లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అవిభక్త అస్సాంలోని నాగాలాండ్‌లో అమలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమేపీ ఇతరచోట్లకు ఇది విస్తరించింది. 1990లో జమ్మూ–కశ్మీర్లో శాంతిభద్రతలు క్షీణిం చడం మొదలయ్యాక అక్కడ కూడా దీన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు. కల్లోల పరిస్థితులున్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసు కోవడం సర్వసాధారణం. కానీ ఆ వంకన ప్రభుత్వాలే జనం బతుకుల్లో కల్లోలం సృష్టిస్తే దాన్నెవరూ చూస్తూ ఊరుకోరు. తిరుగుబాట్లకూ లేదా ఉద్యమాలకూ మూల కారణాలేమిటో, అవి లేవనెత్తుతున్న సమస్యలేమిటో అవగాహన చేసుకుని పరిష్కరించడానికి బదులు ఇలాంటి కఠిన చట్టాలను ఆశ్రయిస్తే ‘సులభంగా’ గట్టె క్కగలమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పర్యవసానంగా ఆ కల్లోలిత ప్రాంతాల్లోని జనం ప్రాణభయంతో బతుకీడుస్తున్నారు. సాయుధ దళాల చట్టం సైన్యానికి విశేషాధికారాలు ఇస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణకు నియమితులైన బలగాలు అనుమతి లేకుండా ఎవరి ఇళ్లనైనా తనిఖీ చేయొచ్చు. వారెంటు లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. ప్రమాదకారులన్న అనుమానం వచ్చిన వ్యక్తులను కాల్చి చంపొచ్చు. బహిరంగ స్థలాల్లో అయిదుగురు వ్యక్తులు గుమిగూడి ఉంటే, వారి వల్ల ముప్పు వాటిల్లవచ్చునని అనిపిస్తే కాల్పులు జరపొచ్చు. సైన్యం చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయడం పౌరులకు సాధ్యం కాదు. ఏ సైనికుడైనా అన్యాయంగా, అకారణంగా ప్రాణం తీశాడని ఆరోపణ వస్తే వారిని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతినీయాలి. ప్రజా ప్రతినిధులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ నోరెత్తడానికి లేదు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విశేష ప్రాధాన్యమిచ్చే రాజ్యాంగం అమలవుతున్నచోట దానికి విరుద్ధమైన ఇలాంటి క్రూర చట్టం రూపొందడం, ఎందరు కాదన్నా అవిచ్ఛిన్నంగా కొనసాగడం దిగ్భ్రాంతికరమే. శత్రువులన్న అనుమానం కలిగినంతమాత్రాన, ఆరోపణలొచ్చినంతమాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే చట్టబద్ధపాలన మాత్రమే కాదు... ప్రజాస్వామ్యం కూడా తీవ్ర ప్రమాదంలో పడినట్టు పరిగణించా ల’ని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో 2000 సంవత్సరం నుంచి 2012 వరకూ 1528మంది పౌరులను సాయుధ బలగాలు అకారణంగా హతమార్చాయని, వాటిపై విచారణ జరిపించడంతోపాటు సాయుధ దళాల చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇచ్చిన తీర్పులో ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. 2004లో తంగజం మనోరమ చాను అనే మహిళను అస్సాం రైఫిల్స్ సిబ్బంది అరెస్టు చేశాక ఆమె శవమై కనబడినప్పుడు పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ ఘటనను నిరసిస్తూ కొందరు మణి పురి మహిళా ఉద్యమకారులు సైనికులు బస చేసిన కాంగ్లా భవనం ముందు నగ్న నిరసనకు దిగారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం వంటివి ఉన్న సమస్యను పరిష్క రించకపోగా కొత్త సమస్యలను తీసుకొస్తాయి. ప్రజలకూ, ప్రభుత్వాలకూ మధ్య అగాధాన్ని పెంచుతాయి. అసంతృప్తిని మరింత విస్తరింపజేస్తాయి. జనం ఎదు ర్కొంటున్న సమస్యలపై సకాలంలో స్పందిస్తే, వారి డిమాండ్లలోని సహేతుకతను అవగాహన చేసుకుని తగిన పరిష్కారాన్ని అన్వేషిస్తే ఉద్యమాలు ఉగ్రరూపం దాల్చవు. అమానుష చట్టాల అవసరమే ఉండదు. అంతర్జాతీయంగా మన దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్న ఈ చట్టాన్ని మణిపూర్, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో సైతం ఉపసంహరించడంతోపాటు దాన్ని సంపూర్ణంగా రద్దు చేసే దిశగా ఆలోచించాలి. -
ఈశాన్య రాష్ట్రాలలో స్వల్ప భూకంపం
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాలు, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. భారత్-మయన్మార్ సరిహద్దున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూప్రకంపనలు రావడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. ప్రపంచంలో భారీ భూకంపం సంభవించే అవకాశం గల ఆరో జోన్‌గా అసోం, మేఘాలయా, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్టాలను గుర్తించారు. -
కేంద్ర బస్సుల్లో ఢిల్లీకి మొండి చేయి
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) ఆధ్వర్యంలో దేశంలోని అన్ని నగరాలకు కేటాయించిన వెయ్యి బస్సులు కేటాయించినా, రాజధాని నగరానికి మాత్రం మొండిచెయ్యి చూపారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదికలు పంపని కారణంగానే ఢిల్లీకి అదనపు బస్సుల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు కేటాయించగా మిగిలిన 468 బస్సుల్లోనూ 407 బస్సును ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించారు. మిగిలిన 61 బస్సులకోసం ఇతర పట్టణాల నుంచి ఇప్పటికే కేంద్రానికి నివేదికలు అందాయి. దీంతో ఈ మారు కేటాయింపుల్లో ఢిల్లీ నగరానికి కొత్త బస్సులు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పట్టణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్న ప్రకారం..ప్రభుత్వం అదనపు నిధులు కేటాయిస్తే వాటిలోంచి కొత్త బస్సులు కొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అంది నా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు అందని కారణంగానే బస్సుల కేటాయింపులో కోత పడినట్టు తెలి పారు. కొత్తగా కొనుగోలుచేసిన బస్సుల్లో లోఫ్లోర్వి గాక స్టాండర్డ్ఫ్లోర్ బస్సులే ఉన్నందునే ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని వారు పేర్కొన్నా రు. వాస్తవానికి షీలా సర్కార్ ఆధ్వర్యంలో నగరంలోని మరికొన్ని కొత్త బస్సులు తేవాలని నిర్ణయిం చారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి రావడంతో అది సాధ్యపడలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆదిశగా ఇంకా పనులు ప్రారం భం కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.