
భారత్‌లో రెండు టైమ్ జోన్లను ప్రవేశపెట్టాలన్న అంశం మరోసారి చర్చకు వచ్చింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యుడు ఉదయం 4 గంటలకే ఉదయించి, సాయంత్రం నాలుగు గంటలకు అస్తమిస్తాడు. ఈ నేపథ్యంలో విలువైన పగటి సమయాన్ని వాడుకోవడానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక టైమ్ జోన్ రూపొందించాలని ఢిల్లీలోని సీఎస్‌ఐఆర్–నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్‌పీఎల్) శాస్త్రవేత్తలు సూచించారు. ఈ విషయమై పరిశోధనలు జరిపిన నిపుణులు.. అస్సాం, మేఘాలయ , నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా భారీగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చని కనుగొన్నారు.
పగటి సమయంలో వ్యత్యాసం
సాధారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం రెండు గంటలు ముందుగానే జరుగుతుంది. దేశమంతా ఒకే భారత కాలమానం (ఐఎస్‌టీ) లేదా టైమ్ జోన్ పాటిస్తూ ఉండటంతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుండటంతో రాత్రిపూట ఇంటికి వెళ్లిన భావన ప్రజల్లో కలుగుతోంది. రాత్రిపూట విధులు నిర్వహించేందుకు విపరీతంగా విద్యుత్ ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో పగటి సమయాన్ని ముందుకు జరపగలిగితే స్థానిక ప్రజలు ఇబ్బందిపడకుండా పనులు చేసుకోగలుగుతారనీ, విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని సీఎస్‌ఐఆర్–ఎన్‌పీఎల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు కలిపి ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉత్పాదకత కూడా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు.
ఇప్పుడున్నది ఒకే ఐఎస్‌టీ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత ప్రామాణిక కాలమానం (ఐఎస్‌టీ) ఉదయం 5.30 గంటలుగా అమలవుతోంది. అదే యూకేలోని గ్రీన్‌విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశం ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం(యూసీటీ) అర్ధరాత్రి 0.00 గంటలకు గ్రీన్‌విచ్ టైమ్‌గా లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో సమయాన్ని ఓ గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా? లేదా? ఈ విధానాన్ని అమలు చేయగలమా? అన్న విషయమై పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అందులో భారత కాలమానాన్ని మరో గంట ముందుకు జరపగలిగితే ఈశాన్య భారతం, పోర్ట్‌బ్లెయిర్‌లో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తేలినట్లు ఎన్‌పీఎల్ డైరెక్టర్ దినేశ్.కె.అస్వల్ తెలిపారు. భారత్‌లో రెండు టైమ్ జోన్లను అమలు చేయొచ్చని తాము శాస్త్రీయంగా నిరూపించామనీ, ఇక ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కాలంపై కొన్ని సంగతులు
► బ్రిటిష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కోల్‌కతా టైమ్ జోన్లుగా విభజించారు.
► 1947 సెప్టెంబర్ 1న భారత ప్రామాణిక కాలమానం(ఐఎస్‌టీ) ఏర్పడింది
► 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైమ్)ను పాటించాలని అసోం(అప్పటి అస్సాం) అనధికారికంగా నిర్ణయించింది. పగటి సమయం ఒక గంట ఎక్కువ ఉండేలా గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టారు.
► ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైమ్ జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువాహటి హైకోర్టు తోసిపుచ్చింది.
► 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ సైతం ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైమ్‌జోన్ కావాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment