న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న ఒకే ‘టైం జోన్’ స్థానంలో రెండు టైం జోన్లు ఉంటే భారతదేశానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మన లాంటి సువిశాల దేశంలో భిన్నమైన వేషభాషలతో పాటు వాతావరణ మార్పుల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఒక్కో రకమైన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒక టైంజోన్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు కలిపి మరో టైం జోన్ ఏర్పాటు చేస్తే మంచిదని సైంటిస్ట్‌లు తమ అధ్యయనంలో వెల్లడించారు.ఈ మేరకు ఢిల్లీలోని సీఎస్‌ఐఆర్– నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్‌పీఎల్) శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తమ పరిశోధన ఆధారంగా ‘రెండు టైం జోన్ల ఆవశ్యకత’ శీర్షికతో రాసిన పత్రం ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురితమైంది.
ఈశాన్యంలో ముందే సూర్యాస్తమయాలు...
భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో వెలుగుపరంగా కొన్ని గంటలు కోల్పోవాల్సి వస్తోంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రమై పగటి సమయం మరింత కుచించుకుపోవడంతో ఉత్పాదకత తగ్గిపోయి, అధిక విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రెండో టైంజోన్‌లోని రాష్ట్రాలు, ప్రాంతాల్లోని గడియారాలను మిగతా దేశంలోని (మొదటి టైంజోన్ రాష్ట్రాలు) ప్రాంతాల కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని ఈ అధ్యయనంలో సూచించారు. దీని వల్ల ఈ ప్రాంతంలో పనివేళలు ముందుగా ప్రారంభమై ముందుగా ముగుస్తాయి. ఈ కారణంగా ఉత్పాదకత పెరగడంతో పాటు విద్యుత్ ఆదా కూడా చేయవచ్చునని పేర్కొన్నారు.
ఇప్పుడున్నది ఒకే ఐఎస్‌టీ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే భారత కాలమానం (ఐఎస్‌టీ) ఉదయం 5.30గా అమలవుతోంది. (అదే యూకేలోని గ్రీన్‌విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశ గీత ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివరల్ టైం (యూసీటీ) అర్థరాత్రి 0.00 గంటలకు గ్రీన్‌విచ్ టైంగా లెక్కిస్తున్నారు). ఈ పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల్లో ఒక గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా లేదా, ఈ విధానాన్ని అమలుచేయొచ్చా లేదా అన్న విషయాన్ని ఈ అధ్యయనంలో పరిశీలించారు.
యూటీసీ కంటే అయిదున్నర గంటల స్థానంలో, ఆరున్నర గంటల టైమ్‌జోన్ పెడితే ఈశాన్యరాష్ట్రాలు, పోర్ట్‌బ్లెయిర్‌లలో ఉత్పాదకత పెరుగుతుందని తాము కనుక్కున్నామని ఎన్‌పీఎల్ డైరెక్టర్ దినేష్ కె ఆస్వల్ తెలిపారు. రెండు టైం జోన్ల కారణంగా రైలు ప్రమాదాలకు ఆస్కారమేర్పడుందనే ఆందోళనను కొందరు వ్యక్తం చేయగా, పశ్చిమబెంగాల్, అస్సాం సరిహద్దులోని అలిపుర్‌దౌర్ స్టేషన్లో రైలు గడియారాల సమయాలు మార్చితే ఈ ప్రమాదాన్ని అధిగమించవచ్చునని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ‘మనదేశంలో రెండు టైంజోన్లు ఉండొచ్చునని శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించాం. దీనిని అమలు చేయాలా వద్ద నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది’ అని అస్వల్ చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఐఎస్‌టీ–2ను అమలు చేసేందుకు ఎన్‌పీఎల్ ప్రైమరి టైమ్ స్కేల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండు టైంజోన్లను అమలు చేస్తే, ఏడాదికి 20 మిలియన్ల కిలో వాట్ల విద్యుత్‌ను ఆదాచేయొచ్చునని అంచనా వేశారు.
పూర్వాపరాలు...
- బ్రిటీష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కలకత్తా టైంజోన్లుగా విభజించారు
- 1947 సెప్టెంబర్ 1న భారత కాలమానం (ఐఎస్‌టీ)ఏర్పడింది
- 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైం)ను పాటించాలని అస్సాం అనధికారికంగా నిర్ణయించింది. ఐఎస్‌టీ కంటే పగటి సమయం ఒక గంట ముందు ఉండేలా చేసుకున్న ఏర్పాటును గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటీషర్లు ఉపయోగించారు
- ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైం జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువహటి హైకోర్టు తోసిపుచ్చింది.
- 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పేమా ఖందు ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైంజోన్ కావాలని డిమాండ్‌ను పునరుద్ఘాటించారు
Comments
Please login to add a commentAdd a comment