CSIR
-
సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: సీఎస్ఐఆర్–యూజీసీ–నెట్ ఉమ్మడి పరీక్ష వాయిదా పడింది. వచ్చే వారం జరగాల్సిన ఈ పరీక్షను అనివార్య పరిస్థితులు, రవాణాపరమైన ఇబ్బందుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం తెలిపింది. పరీక్ష తదుపరి తేదీని వెబ్సైట్లో ప్రకటిస్తామని వివరించింది. అయితే, పేపర్ లీకైందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సీఎస్ఐఆర్–యూజీసీ–నీట్ పరీక్షను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్íÙప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తారు. మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్‌ను కూడా అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం తెల్సిందే. -
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్తో రిలాక్స్డ్గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం. ఎందుకంటే ఇలా..డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం. ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్‌ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!) -
అప్నా నంబర్ ఆయేగా
మీ షూ సైజు ఎంత? యూకే సైజులో అయితే ఈ నంబర్.. యూఎస్ సైజులో అయితే ఈ నంబర్ అని చెబుతాం.. చాలా చెప్పుల షాపుల్లో ఈ నంబర్లే నడుస్తున్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా? మన పాదాల సైజు గురించి చెప్పేందుకు.. వేరే దేశాల నంబర్లపై ఎందుకు ఆధారపడుతున్నామో.. మన దేశానికి సొంత ఫుట్‌వేర్ సైజుల నంబర్ ఎందుకు లేదో? ఇకపై ఆ సీన్ మారనుంది. ఎందుకంటే.. త్వరలోనే అప్నా నంబర్ బీ అయేగా.. అప్పుడెప్పుడో బ్రిటిష్‌వాళ్లు.. దేశానికి స్వాతంత్య్రం ముందు బ్రిటిష్ వాళ్లు వారి ఫుట్‌వేర్ సైజుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సగటు భారత మహిళ 4 నుంచి 6 సైజుల మధ్య ఉండే పాదరక్షలను ధరిస్తోంది. అలాగే సగటు పురుషుడు 5 నుంచి 11 సైజుల మధ్య ఉండే ఫుట్‌వేర్‌ను వేసుకుంటున్నాడు. అయితే భారతీయుల అవసరాలకు అనుగుణంగా పాద రక్ష ల కొలతల వివరాలు లేవు.. దీంతో ఇప్పటివరకు మనకంటూ ప్రత్యేక విధానం లేకుండాపోయింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల భారత్‌లో ఏటా సగటు భారతీ యుడు 1.5 జతల పాదరక్షలను కొనుగోలు చేస్తున్నాడు. అంటే ఎన్ని కోట్ల జతలో చూడండి. అలాగే షూ తయారీపరంగా కూ డా భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. కానీ ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా వచ్చే పాదరక్షల్లో 50 శాతం తమకు సరిపో వట్లేదని వినియోగదారులు తిరస్క రిస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో భారత ఫుట్‌వేర్ సైజుల విధానాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశవ్యా ప్తంగా ఇటీవల భారతీ యుల పాదాల సైజులపై ఓ సర్వే జరి గింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ ఐఆర్) పరిధిలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) ఈ అధ్యయనం చేపట్టింది. ఈ సైజుల విధానానికి ‘భా’(భారత్) అనే పేరు పెట్టాలని భావిస్తు న్నారు. దేశంలో ఫుట్‌వేర్ తయారీకి ఇకపై ఈ సైజులే కొల మానం కానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న యూకే/ యూరో పియన్, యూఎస్ సైజులను ‘భా’ భర్తీ చేయనుంది. సర్వేలో ఏం తేలింది? భారత్‌లో వివిధ జాతుల ప్రజలు ఉండటం.. పైగా.. ఈశాన్య భారతానికి చెందిన ప్రజల పాదాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల పాదాలకన్నా కాస్త చిన్నవిగా ఉంటాయి కాబట్టి.. దేశంలో కనీసం 5 రకాల ఫుట్‌వేర్ సైజుల పద్ధతి అవసరమ వుతుందని ఈ సర్వేకు ముందు భావించారు. తర్వాత అందరికీ ఒకే ఫుట్‌వేర్ సైజు సరిపోతుందని తేల్చారు. 2021 డిసెంబర్ నుంచి 2022 మార్చి మధ్య దేశవ్యాప్తంగా లక్ష మంది ప్రజల షూ కొలత లకు సంబంధించి సర్వే నిర్వహించారు. పాదాల సైజు, వాటి నిర్మాణ తీరు, సగటు భారతీ యుల పాదాల ఆకారం గురించి మరింత మెరుగ్గా అర్థం చేసు కొనేందుకు 3డీ ఫుట్ స్కానింగ్ మెషీన్లను సర్వే కోసం ఉపయోగించారు. దీని ప్రకారం సగటు భారతీయ మహిళ పాదం 11 ఏళ్ల వయసులోనే గరిష్ట సైజుకు చేరుకుంటుందని తేలింది. అలాగే సగటు పురుషుడి పాదం 15 లేదా 16 ఏళ్లకు గరిష్ట సైజుకు చేరుకుంటోందని వెల్లడైంది. అలాగే భారతీయుల పాదాలు యూరోపియన్లు లేదా అమెరికన్ల పాదాలకన్నా వెడల్పుగా ఉంటాయని సర్వే నిర్ధారించింది. ఇన్నేళ్లుగా యూకే, యూరోప్, యూఎస్ పాదాల సైజుల ప్రకారం వెడల్పు తక్కువగా ఉండే ఫుట్‌వేర్ తయార వుతుండటంతో భారతీయు లంతా ఇప్పటివరకు బిగుతుగా ఉన్న పాదరక్షలు ధరిస్తున్నారని.. బిగుతుగా ఉండటంతో కొందరు తమ పాదాల కన్నా పొడవైన పాదరక్షలు కొనుక్కుంటున్నారని తేలింది. ముఖ్యంగా హై హీల్స్ వాడే మహిళలు వారి పాదాల సైజుకన్నా పెద్దవైన హైహీల్స్నే వాడుతు న్నారని.. ఇవి అసౌకర్యంగా, గాయాలకు దారితీసేలా ఉన్నాయని కూడా సర్వేలో వెల్లడైంది. ఇక మగవారైతే షూ వదులుగా ఉండకుండా చూసుకొనేందుకు లేస్‌లను మరింత గట్టిగా కడుతున్నారు. ఇది షూ ధరించే వారిలో సాధారణ రక్త ప్రసరణను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, షుగర్ వ్యాధితో బాధపడేవారు ఇలా తమ సైజులకు నప్పని పాదరక్షలు ధరిస్తూ గాయాల ముప్పును ఎదుర్కొంటున్నారని తేలింది. ఈ నేపథ్యంలో ‘భా’ అందుబాటులోకి వస్తే అది వినియోగదారులకు, పాదరక్షల తయారీదారులకు లాభం చేకూర్చనుంది. ఈ సర్వే ఆధారంగా చేసిన సిఫార్సులను కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)కి సమర్పించింది. ఆ విభాగం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)కు ఈ సిఫార్సులను పంపింది. దేశంలో సైజుల విధానానికి అనుమతి తెలపడంతోపాటు దాన్ని అమలు చేసే అధికారం బీఐఎస్కే ఉంది. ప్రస్తుతం యూకే కొలతల ప్రకారం 10 సైజుల విధానం అమల్లో ఉండగా ‘భా’ వల్ల వాటి సంఖ్య 8కి తగ్గనుంది. దీనివల్ల ఇకపై అర సైజుల అవసరం కూడా తప్పనుంది. వచ్చే ఏడాదిలో ‘భా’ విధానం అమల్లోకి వస్తుందని అంచనా. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సైన్సు అవార్డుల్లో కోతలా?
శాస్త్ర ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ విజేతల పేర్లను సాంప్రదాయికంగా ‘సీఎస్‌ఐఅర్’ ఫౌండేషన్ డే అయిన సెప్టెంబర్ 26న ప్రకటిస్తుంటారు. ఈసారి వారి పేర్లను అప్పుడు ప్రకటించలేదు. పైగా ప్రధాని చేతుల మీదుగా బహూకరించకుండా వారున్న చోటికే అవార్డు పంపించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలన్న సిఫార్సులూ సాగాయి. ఇటీవలి వారాల్లో ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉత్తమ పీహెచ్డీ థీసిస్ అవార్డులను, ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డులను ఇవ్వవద్దని వారి ఫ్యాకల్టీలను ఆదేశించాయి. ఇలాగైతే 2047 నాటికి భారత్ శాస్త్ర ప్రగతిలో స్వావలంబన దేశంగా మారేనా? సృజనాత్మక కృషికి ప్రోత్సాహం ఇలాగేనా? శాంతి స్వరూప్ భట్నాగర్ (ఎస్ఎస్బీ) ప్రైజ్‌ను 1957లో నెలకొల్పారు. భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్) ప్రథమ డైరెక్టర్ పేరిట దీన్ని ఏర్పర్చారు. అనువర్తిత లేదా ప్రాథమిక పరిశోధనలో అసాధా రణ ప్రతిభ ప్రదర్శించిన వారికి భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటుంది. అవార్డులు గెలుచుకున్న వారి పేర్లను సాంప్రదాయికంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ రోజైన సెప్టెంబర్ 26న ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్ విజేతల పేర్లను చివరిక్షణంలో ప్రకటించకుండా నిలిపివేశారు. దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విభాగాల సెక్రటరీలు, మంత్రులు హాజరైన అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ మినిట్స్‌ని పంపించారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ అవార్డు ఎకో సిస్టమ్ మార్పు గురించి ఈ సమావేశం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలని ఈ సమావేశం సిఫార్సు చేసింది. ఒక్కొక్క ఎస్ఎస్బీ ప్రైజ్ విజేతకు ఇస్తున్న రూ. 15 వేల అదనపు నగదు ఉపకార వేతనం స్థానంలో భారీ మొత్తాన్ని ఒకేసారి అందించడం, లేదా నెలవారీ పారితోషికంపై గరిష్ఠంగా 15 సంవత్సరాల పరిమితి విధించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రతిపాదనను కూడా ఈ సమావేశ మినిట్స్ బహిర్గత పరిచాయి. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌కి గరిష్ఠ అర్హతా వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాల వరకు ఉంటోంది. 15 సంవత్సరాల పరిమితి విధించడం వల్ల అది 60 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌ను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ సంవత్సరం సీఎస్ఐఆర్ సంస్థాపక దినం రోజున ప్రకటించడానికి ప్రయత్నించారు. కానీ సీఎస్ఐఆర్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 15న ప్రధాని అధ్యక్షతన నిర్వహించినప్పుడు, తదుపరి ఎస్ఎస్బీ అవార్డు ప్రదాన ఉత్సవాలు జరిపే తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రకటించారు. మూడు వారాల తర్వాత 2019–21 సంవత్సరానికి గాను ఈ అవార్డులను 37 మందికి వారు ఉన్న చోటకే అవమానకరంగా పంపించారు. కాగా 2012–2015, 2016–2018 సంవత్సరాలకుగానూ 2016, 2019లలో ప్రధాని ఈ అవార్డును జాతీయ సైన్సు దినోత్సవం (ఫిబ్రవరి 28/29న) సందర్భంగా విజ్ఞాన్ భవన్లో బహూకరించారు. 2020లో ప్రచురితమైన సీఎస్ఐఆర్ డాక్యుమెంట్ ప్రకారం, ఇంతవరకు ఎస్ఎస్బీ ప్రైజ్‌ని గెలుచుకున్న 560 మందిలో అప్పటికి 244 మంది మూడు జాతీయ సైన్సు అకాడమీలకు ఫెలోలుగా ఎంపికయ్యారు. 143 మంది ఇటలీలోని థర్డ్ వరల్డ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్(టీడబ్ల్యూఏఎస్)కు ఫెలోలుగా ఎంపికయ్యారు. 64 మందికి టీడబ్ల్యూఏఎస్ ప్రైజ్ వచ్చింది. 25 మంది రాయల్ సొసైటీ ఫెలోషిప్‌కి ఎంపికయ్యారు. మరో 15 మంది అమెరికాకు చెందిన నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ అసోసియేట్స్‌గా ఎంపిక య్యారు. మరో 30 మంది ఇన్ఫోసిస్ సైన్స్ ప్రైజ్ అందుకున్నారు. కనీసం 100 మంది పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ గెలుచుకున్న వారి ప్రతిభను ఈ డేటా తేటతెల్లం చేస్తోంది. భట్నాగర్ లారెట్స్ (1958–2018) అనే శీర్షికతో ప్రచురితమైన పుస్తకం ఎస్ఎస్బీ ప్రైజ్ చరిత్రను వివరిస్తుంది. ఈ ప్రైజ్‌ని 1958లో బహుకరించారు. తొలి గ్రహీతకు ఒక ఫలకం, రూ. 10,000 నగదును బహుమతిగా ఇచ్చారు. తొలి బహుమతి పుచ్చుకున్నది భట్నాగర్ సమకాలికుడు అయిన సర్ కేఎస్ కృష్ణన్ (1940). 60 ఏళ్ల వయసులో ఈయనకు తొలి ప్రైజ్ దక్కింది. రెండో సంవత్సరం అంటే 1959లో ఇద్దరు గణిత శాస్త్రజ్ఞులు కె చంద్రశేఖరన్, సీఆర్ రావులకు ఈ ప్రైజ్ దక్కింది. ఆనాటికి వీరి వయస్సు 39 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం, ఏడు రంగాలకు కలిపి ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రైజ్ మొత్తం 2008లో రూ. 5 లక్షలకు పెరిగింది. ఒక సబ్జెక్టులో ఎంత మందికి అవార్డు ఇచ్చారనే దాంతో సంబంధం లేకుండా ఎంపికైన ప్రతి ఒక్కరికీ తలా రూ. 5 లక్షలను ఇస్తూ వచ్చారు. దీనికి తోడుగా, దశాబ్దం క్రితం బహుమతి గ్రహీతలందరికీ రూ. 15,000 ఉపకార వేతనం ఇవ్వడం మొదలెట్టారు. గత విజేతలకూ దీన్ని వర్తింపజేశారు. ఎస్ఎస్బీ అవార్డు గ్రహీతలకు నెలవారీ చెల్లింపులు జరపాలనేది మెరుగైన ప్రతిభ కనబర్చినవారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్న భావనలోంచి వచ్చింది. నాలుగు నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ అకా డమీలలో కనీసం రెండింటిలో రీసెర్చ్ ఫెలోస్‌గా ఎంపికైన యూని వర్సిటీ టీచర్లకు నెలకు రూ. 15 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూజీసీ, శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్టీ) ఆసక్తి చూపాయి. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు జేసీ బోస్ ఫెలోషిప్ కింద మరొక రూ. 25,000లను అందించే మరొక పథకంతో డీఎస్టీ ముందుకొచ్చింది. అత్యంత ప్రతిభావంతుడైన భారత శాస్త్రవేత్తకు సీఎస్ఐఆర్ లేదా యూజీసీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ పథకం కింద, దాంతోపాటు డీఎస్టీ – జేసీ బోస్ ఫెలోషిప్ కింద అందే ద్రవ్యపరమైన ప్రయోజనాలు ఇవే మరి. ఈలోగా, మెరుగైన ఐఐటీలు కొన్ని తమ సొంత చెయిర్ ప్రొఫెస ర్షిప్లను నెలకొల్పాయి. ఇవి కూడా ద్రవ్యపరమైన ప్రయోజనాలను అర్హులైన శాస్త్రవేత్తలకు ఇస్తూ వచ్చాయి. ఇలాంటి ప్రోత్సాహకాలను స్ఫూర్తిగా తీసుకుని పలు ఇతర సైన్స్ విభాగాలు, మంత్రిత్వ శాఖలు తమతమ సొంత ప్రతిభ ఆధారిత ప్రోత్సాహక పథకాలతో ముందు కొచ్చాయి. సెప్టెంబర్ 16న జరిగిన సమావేశం, ఇలాంటి అన్ని స్కీములను మదింపు చేస్తూనే, వీటిని కుదించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సంస్థల్లోని ప్రైవేట్ విరాళాల మద్దతు కలిగిన అవార్డులకు కూడా ఈ సమీక్షను వర్తింపజేశారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుతో సంప్రదించి, నోబెల్ అవార్డు ప్రమాణాల్లో ఒక అవార్డును ఏర్పర్చాలని చైర్మన్ చేసిన సూచనను కూడా మినిట్స్ పేర్కొంది. అయితే 2003లో రూ. 25 లక్షల నగదుతో ఏర్పర్చిన ఇండియన్ సైన్స్ అవార్డును 2010లో తీసేశారనే విషయాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న ఏ ఒక్కరూ పేర్కొనలేదు. ఈలోగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ సంస్థ 2008లో రూ. 25 లక్షల మొత్తంతో తొలి సైన్స్ ప్రైజ్‌ని ఐఐటీ కాన్పూర్‌కి చెందిన గణిత శాస్త్ర జ్ఞుడు మణీంద్ర అగర్వాల్‌కు బహూకరించింది. 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ పరిధిని విస్తృత పరిచి నగదు మొత్తాన్ని రెట్టింపు చేశారు. ఆరు విభాగాల్లో వీటిని అందిస్తున్నారు. ఒక్కో ప్రైజు లక్షరూపాయల విలు వను కలిగి ఉంటుంది. దీనికి పన్ను కూడా మినహాయించారు. ఇటీవలి వారాల్లో, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరొక అడుగు ముందుకేశాయి. అత్యుత్తమ పరిశోధనా పత్రానికి, అత్యుత్తమ పీహెచ్డీ థీసెస్‌కి ఇస్తున్న అవార్డును సైతం నిలిపి వేయాలని వాటి ఫ్యాకల్టీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ రెండు అవార్డులూ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. అన్నిటికంటే మించి డీఎస్టీ అందిస్తున్న కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్కాలర్ షిప్పులను కూడా ఉన్నట్లుండి రద్దుచేయడం దారుణమనే చెప్పాలి. 2047 నాటికి భారత్‌ని స్వావలంబన సాధించిన దేశంగా మార్చడానికి సృజనాత్మక కృషి జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కానీ శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపునిచ్చే ప్రభుత్వ అవార్డులను చాలావరకు రద్దు చేయాలని ప్రధాని స్వయంగా ఆయా మంత్రిత్వ శాఖలను కోరారంటే నమ్మశక్యం కావడం లేదు. ప్రభుత్వ ఆలోచనల్లో ఉన్నదాన్ని కార్పొరేట్ రంగం ఇప్పటికే అమలు చేసేసిందని ప్రభుత్వం లెక్కించి ఉండవచ్చు. కాబట్టే ప్రభుత్వ రంగంలో ఉన్న అవార్డులను కూడా కుదించాలని అది నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అరుణ్ కుమార్ గ్రోవర్ మాజీ వైస్ చాన్స్‌లర్, పంజాబ్ యూనివర్సిటీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కోర్టుల్లో స్థానిక భాష: మోదీ
కేవడియా (గుజరాత్): న్యాయమందే ప్రక్రియలో ఆలస్యం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సమర్థ దేశం, సామరస్యపూర్వక సమాజం నెలకొనాలంటే బాధితుల పట్ల సానుభూతితో స్పందించే న్యాయవ్యవస్థ చాలా అవసరమన్నారు. ‘‘కఠినమైన న్యాయ పరిభాష పౌరులకు అడ్డంకిగా నిలిచే పరిస్థితి మారాలి. కొత్త చట్టాలను స్థానిక భాషల్లో రాయాలి. కోర్టుల్లో స్థానిక భాషల వాడకం పెరగాలి. తద్వారా న్యాయప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని చెప్పారు. గుజరాత్‌లోని కేవడియా సమీపంలో ఏక్తానగర్లో శనివారం మొదలైన రెండు రోజుల అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల సదస్సును ఉద్దేశించి మోదీ వీడియో సందేశమిచ్చారు. ఈ ఉద్దేశంతోనే బ్రిటిష్ కాలం నాటి 1,500కు పైగా కాలం చెల్లిన, పనికిరాని పాత చట్టాలను తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో బుట్టదాఖలు చేసిందన్నారు. ‘‘లోక్ అదాలత్‌ల వంటి ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియలు కోర్టులపై భారాన్ని తగ్గించడంతో దోహదపడుతున్నాయి. పేదలకు సులువుగా సత్వర న్యాయమూ దొరుకుతోంది. చట్టాల్లోని కాఠిన్యం, గోప్యత లేనిపోని సంక్లిష్టతలకు దారి తీస్తుంది. అలాగాక అవి సామాన్యునికి కూడా అర్థమయ్యేలా ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. పలు దేశాల్లో చట్టాలు చేసినప్పుడు అందులోని న్యాయపరమైన పారిభాషిక పదాలను అందరికీ వివరిస్తారు. స్థానిక భాషలోనూ రాస్తారు. అలా అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొన్ని దేశాల్లో చట్టాలు చేసేటప్పుడే అవి ఎంతకాలం పాటు అమల్లో ఉండేదీ ముందే నిర్ణయిస్తారు. మనమూ వీటిని అందిపుచ్చుకోవాలి. యువతకు న్యాయ విద్యను కూడా స్థానిక భాషల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. సవాళ్లను అధిగమించేందుకు భారత న్యాయవ్యవస్థ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఇంధనావసరాలు తీర్చేందుకు ఉమ్మడి కృషి పరిశోధన సంస్థలకు మోదీ పిలుపు న్యూఢిల్లీ: నానాటికీ పెరిగిపోతున్న దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు పరిశ్రమ, పరిశోధన, విద్య తదితర రంగాలన్నీ ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.అన్ని రంగాల్లోనూ శాస్త్రీయ దృక్పథాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటివాటి వాడకాన్ని పెంచాలన్నారు. శనివారం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) భేటీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌ను ప్రపంచ సారథిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్ 2047 దిశగా కృషి చేయాలని సూచించారు. -
వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..
యాదగిరిగుట్ట: తిరుమలలో మాదిరిగానే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి, అమ్మవారికి వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేయనున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్టలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు లక్నోలోని సెంటర్ ఫర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీమ్యాప్), సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్స్ కౌన్సిల్(సీఎస్ఐఆర్) సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఇటీవల యాదాద్రి ఆలయ అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ, యాదగిరిగుట్ట మున్సిపల్ అధికారులు చర్చించారు. యాదగిరిగుట్ట, ధర్మపురి, వేములవాడలో ఈ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి యాదగిరిగుట్టను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అగరుబత్తుల తయారీకి ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యులకు, సిబ్బందికి శిక్షణనిచ్చారు. యాదగిరిగుట్టలో ప్రస్తుతం శాంపిల్‌గా చేతులతో అగరుబత్తులను తయారు చేస్తున్నారు. తయారీ విధానమిదే.. రోజూ ఆలయంలో వాడిన పూలను మున్సిపల్ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తారు. ఈ పూలను వేరుచేసి నీడలో ఆరబెడతారు. అనంతరం ఒక్కోరకం పువ్వులను వేర్వేరుగా యంత్రంలో వేసి పౌడర్ తయారు చేస్తారు. పువ్వు పౌడర్, జిగట్ పౌడర్‌ను కలుపుతారు. దాన్ని సన్నని స్టిక్స్‌కు పెట్టి రోల్ చేస్తారు. ఆరబెట్టాక సువాసన వెదజల్లేలా తులసీపత్రాల నూనెను అగరుబత్తులకు అద్దుతారు. కిలోపువ్వుల పౌడర్‌తో 2,500 అగరుబత్తులు తయారవుతాయి. ప్రస్తుతం ఆలయం నుంచి రోజూ 6 నుంచి 8 కిలోల వరకు పూలు వస్తున్నాయి. పట్టణంలో 2,700 మంది మహిళాస్వయం సహాయక సంఘాల సభ్యులున్నారు. వీరితో అగరుబత్తులు తయారు చేయించి, వారినే సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా వీలు కల్పించనున్నారు. మహిళల ఉపాధికి శిక్షణ వాడిన పూలతో అగరుబత్తుల తయారీకి మహిళాసంఘాల సభ్యులకు మొదటి విడత శిక్షణ పూర్తయింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ బాధ్యత తీసుకుంది. – శ్రవణ్ కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదాద్రి బ్రాండ్ పేరిట అమ్మకాలు పూలతో తయారు చేసిన అగరుబత్తులను భక్తులు స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. యాదాద్రి బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేపడతాం. – ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ -
సీఎస్ఐఆర్కు తొలి మహిళా డీజీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధనలు చేసే 38 సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయ్యారు. సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్విను సీఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇథియమ్ అయాన్ బ్యాటరీలు రూపొందించడంలో కలైసెల్వి గతంలో మంచి ప్రతిభ కనబరిచారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కలైసెల్వి తమిళనాడులోని కరైకుడిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్ అభివృద్ధిపై గత 25 ఏళ్లుగా ఆమె పరిశోధనలు చేస్తున్నారు. -
గ్లాస్ సీలింగ్ బద్దలుకొట్టడం కొత్తేమీ కాదు..మరోసారి ఘనతను చాటుకున్న సైంటిస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి మహిళా సైంటిస్టుగా రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు దేశవ్యాప్తంగా 38 పరిశోధనా సంస్థల కన్సార్టియం కీలక బాధత్యలను చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. 2019 ఫిబ్రవరిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CECRI)కి సారథ్యం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా అవతరించిన ఘనత కూడా కలైసెల్వికే దక్కింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్‌గా కలైసెల్వి శనివారం నియమితు లయ్యారు. ఆమె నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండేళ్ల కాలం, లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా అయితే అది అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అంబాసముద్రం అనే చిన్న పట్టణానికి చెందిన వారు కలైసెల్వి. లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో విశేష కృషి చేసిన ఆమె ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదే ఇన్స్టిట్యూట్లో ఎంట్రీ లెవల్ సైంటిస్ట్‌గా కరియర్‌ను ప్రారంభించడం విశేషం. 125కిపైగా ఎక్కువ పరిశోధనా పత్రాలు, ఆరు పేటెంట్లు ఆమె ఖాతాలోఉన్నాయి. పురుషాధిపత్య సవాళ్లను అధిగమించి అనేక ఉన్నత పదవులను చేపట్టిన కలైసెల్వి తాజాగా మరో అత్యున్నత సంస్థకు హెడ్‌గా ఎంపిక కావడంపై నారీశక్తి అంటూ పలువురు అభినందనలు ప్రకటిస్తున్నారు. Dr N Kalaiselvi has been appointed as the DG, CSIR & Secretary, DSIR. Hearty congratulations to Dr Kalaiselvi from the CSIR Family.@PMOIndia @DrJitendraSingh @PIB_India @DDNewslive pic.twitter.com/oHIZr9uoMG — CSIR (@CSIR_IND) August 6, 2022 -
గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ గాలిలో ఉండగలదని, గాలి ద్వారా వ్యాపించగలదనడానికి సరైన ఆధారాలను సీఎస్ఐఆర్–సీసీఎంబీ హైదరాబాద్, సీఎస్ఐఆర్–ఇమ్టెక్ చండీగఢ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం కోవిడ్–19 చికిత్స అందించిన ఆస్పత్రులు, కోవిడ్–19 రోగులను ఉంచిన గదులు, హోం ఐసోలేషన్ పాటించిన కోవిడ్–19 రోగులున్న గదుల నుంచి గాలి నమూనాలను సేకరించి పరిశోధన చేశారు. ఈ క్రమంలో గాలిలో వైరస్ ఉన్నట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కనుగొన్నారు. కరోనా రోగులున్న పరిధిలో వైరస్ గాలిలోకి వ్యాపిస్తోందని, ఇతరులు ఆ పరిధిలోకి వెళ్తే వైరస్ బారిన పడతారని అంచనాకు వచ్చారు. గదిలో ఇద్దరి కన్నా ఎక్కువ మంది రోగులున్న చోట కోవిడ్–19 పాజిటివిటీ రేటు 75 శాతం ఉందని.. ఒకరు ఉన్నా లేదా రోగులు వెళ్లిపోయిన తర్వాత ఖాళీ చేసిన గదిలో పాజిటీవిటీ రేటు 15.8 శాతంగా ఉందని కనుగొన్నారు. బయటి గాలిలో కన్నా గదిలోని గాలిలో వైరస్ ఎక్కువ యాక్టివ్‌గా ఉందని పరిశోధనలో పాల్గొన్న శాస్తవేత్త డాక్టర్ శివరంజని మొహరీర్ స్పష్టం చేశారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సీసీఎంబీ ప్రొఫెసర్, సీనియర్ సైంటిస్ట్, టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనిటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా సూచిస్తున్నారు. చదవండి: టీకా వేసుకోవాలని... బలవంతపెట్టలేం: సుప్రీం -
కోవిడ్‌పై సీసీఎంబీ–ఎస్బీఐ పరిశోధన
సాక్షి, హైదరాబాద్: ‘ఎస్బీఐ ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ జీనోమిక్స్ గైడెడ్ ప్యాండమిక్ ప్రివెన్షన్’ను భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ భాగస్వామ్యంతో పనిచేయనున్న సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరికి రూ.9.94 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ భారత్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాలను మరింత ధృఢం చేసుకునే దిశలో ఎస్బీఐ సెంటర్ ఫర్ ఎక్స్‌లెక్స్ ఫర్ జీనోమిక్స్ గైడెడ్ ప్యాండమిక్ ప్రివెన్షన్ ఏర్పాటుకు సీఎస్ఐఆర్–సీసీఎంబీతో భాగస్వామ్యం కావడం తమ సంస్థకు ఎంతో గర్వకారణమని చెప్పారు. కోవిడ్‌ను అర్థం చేసుకునేందుకు అవసరమైన అమూల్యమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎస్బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో భాగంగా ఎస్బీఐ ఫౌండేషన్ ఏర్పడిందని దినేష్ ఖారా తెలిపారు. కార్యక్రమంలో ముంబై డీఎండీ, సీడీవో ఓపీ మిశ్రా, హైదరాబాద్ డీఎండీ, ఐఏడీ ఆర్.విశ్వనాథన్, ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ మంజులా కల్యాణసుందరం, ఫౌండేషన్ బృందం సభ్యులు పాల్గొన్నారు. -
హరిత టపాసులతో కాలుష్యానికి చెక్
సాక్షి, అమరావతి: దీపావళి సందర్భంగా పెద్దఎత్తున వెలువడే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి హరిత టపాసులు చక్కని ప్రత్యామ్నాయంగా మారాయి. తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసులనే దీపావళి రోజున వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చాయి. దీపావళి సందర్భంగా వినియోగించే సాధారణ టపాసుల వల్ల విపరీతమైన కాలుష్య కారకాలు విడుదలై అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో పీల్చే గాలి అత్యంత విషపూరితంగా మారడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్రంలో దీపావళి రోజున వాయు కాలుష్యం సాధారణ రోజు కంటే ఐదురెట్లు ఎక్కువ ఉన్నట్లు గతంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. సాధారణంగా గాలిలో ధూళికణాలు (పీఎం 10, పీఎం 2.5) 60కి మించకూడదు. కానీ దీపావళి రోజున 300 నుంచి 400కు పైగా ఉంటున్నాయి. టపాసుల నుంచి బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళి వెలువడుతోంది. అలాగే శబ్దాలు సాధారణ స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటివల్ల ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అందుకే హరిత టపాసులు వాడాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తోంది. అన్నిచోట్ల అందుబాటు తక్కువ కాలుష్య కారకాలు విడుదల చేసేలా హరిత టపాసుల ఫార్ములాను మూడేళ్ల కిందట శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), జాతీయ పర్యావరణ, ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరి) సంయుక్తంగా రూపొందించాయి. బాణసంచా తయారు చేసేవారికి దీని గురించి వివరించి ఈ ఫార్ములాతోనే టపాసులు తయారు చేయాలని ఈ సంస్థలు కోరాయి. అనేకమంది తయారీదారులు ఇందుకోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారు.తక్కువ బూడిద, ముడిపదార్థాలను వాడి చిన్న సైజులో హరిత టపాసులను తయారు చేస్తారు. చూడ్డానికి ఇవి మామూలు టపాసుల్లానే ఉంటాయి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, బాంబులు వంటివి కూడా ఉంటాయి. ఇవి సాధారణ టపాసుల కంటె 30 నుంచి 50 శాతం తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయి. కాలుష్యకారక వాయువులు, పొగ, శబ్దాలు కూడా తక్కువగానే విడుదలవుతాయి. సాధారణ టపాసులు విక్రయించే షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. అలాగే పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లతోపాటు ఆన్లైన్లోను ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా గ్రీన్‌లోగో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. హరిత టపాసులతో పర్యావరణ పరిరక్షణ ప్రజలందరు హరిత టపాసులను కాల్చాలి. అప్పుడు ప్రజారోగ్యానికి ఇబ్బందులు తప్పుతాయి. పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దీపాల పండుగను అందరు సురక్షితంగా జరుపుకోవడానికి హరిత టపాసులు ఉపయోగపడతాయి. – అశ్వినీకుమార్ పరిడ, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ -
బీఈసీఐఎల్‌లో కన్సల్టెంట్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్).. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్–ఎన్సీఆర్ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. (బ్యాంకు జాబ్ ట్రై చేస్తున్నారా.. మీకో గుడ్ న్యూస్) ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సీనియర్ కన్సల్టెంట్–04, కన్సల్టెంట్–03, జూనియర్ కన్సల్టెంట్–03 ► సీనియర్ కన్సల్టెంట్: విభాగాలు: ఇన్విరాన్‌మెంటల్ సైన్స్/టెక్నాలజీ, లా. అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.80,000 వరకు చెల్లిస్తారు. ► కన్సల్టెంట్: విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఇన్విరాన్‌మెంటల్ సైన్స్ /టెక్నాలజీ. అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.60,000 వరకు చెల్లిస్తారు. ► జూనియర్ కన్సల్టెంట్: విభాగాలు: ఐటీ, ఓఎల్. అర్హత: విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.09.2021 ► వెబ్సైట్: www.becil.com ఐహెచ్‌బీటీలో 17 ఖాళీలు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ(ఐహెచ్బీటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 17 ► పోస్టుల వివరాలు: సైంటిస్ట్–10, సీనియర్ మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్–07. ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎంబీబీఎస్, పీహెచ్డీ/ఎంఫార్మా/ఎండీ(ఆయుర్వేద)/ఎంవీఎస్సీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 28–40ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.49,000 నుంచి రూ.1,08,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://www.ihbt.res.in/en/ -
‘థర్డ్‌వేవ్’ను దేశం తట్టుకోగలదు: సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్
సాక్షి, చౌటుప్పల్: కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా తట్టుకొనే శక్తి దేశానికి ఉందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మండే తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిందని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలోని భూ అయస్కాంత పరిశోధన క్షేత్రం (ఎన్జీఆర్ఐ)లో కొత్తగా ఏర్పాటు చేసిన జియో మ్యాగ్నటిక్ అబ్జర్వేటరీని శనివారం ఆయన ప్రారంభించారు. జియోమ్యాగ్నటిక్ అబ్జర్వేటరీ పనితీరును పరిశీలించారు. కార్యాలయంలో ఫొటో గ్యాలరీని తిలకించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ థర్డ్‌వేవ్ సంభవించినా అంతగా నష్టం ఉండదని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుండడం, 60–65 శాతం మందిలో ఇప్పటికే యాంటీబాడీలు వృద్ధి చెందడంతో థర్డ్‌వేవ్ పెద్దగా ప్రభావం చూపదన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో సీఎస్ఐఆర్ కీలకపాత్ర పోషించిందన్నారు. సీసీఎంబీతో కలసి సమన్వయంతో పనిచేసిందని, కోవాగ్జిన్ తయారీకి అవసరమైన తోడ్పాటును అందించామన్నారు. మొదటి, రెండోడోస్ టీకా వేసుకున్న వ్యక్తులకు మూడో డోస్(బూస్టర్) అవసరం వస్తుందా రాదా అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కరోనా వైరస్ మానవ సృష్టా లేదా ప్రకృతి పరంగా వచ్చిందా అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. ప్రకృతి విపత్తులపై అలర్ట్... జియో మ్యాగ్నటిక్ అబ్జర్వేటరీలు ప్రపంచ వ్యాప్తంగా 450 ఉండగా, వాటిలో 150 డిజిటల్ అబ్జర్వేటరీలు ఉన్నాయని సీఎస్ఐఆర్ డీజీ శేఖర్ సి. మండే తెలిపారు. అయితే మన దేశంలో 10 చోట్లే అబ్జర్వేటరీల ఏర్పాటు జరిగిందన్నారు. ఈ అబ్జర్వేటరీలో ప్రతి సెకనుకు సేకరించే నమూనాలు ఉపగ్రహం ద్వారా ప్రపంచంలోని అన్ని అబ్జర్వేటరీలతో అనుసంధానమై ఉంటాయన్నారు. దీంతో అన్ని అబ్జర్వేటరీల నుంచి వచ్చే సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించడం ద్వారా భూ అయస్కాంత క్షేత్రాల మార్పును గుర్తించవచ్చన్నారు. భూకంపాలు, సౌర తుపానులు, సునామీలను ముందుగా గుర్తించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అప్రమత్తం కావొచ్చన్నారు. భూగర్భంలో ఖనిజాలు, జలవనరులు, చమురు నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ అబ్జర్వేటరీ గుర్తిస్తుందని శేఖర్ మండే తెలిపారు. ఈ నూతన అబ్జర్వేటరీలో కెనడా, డెన్మార్క్ తయారు చేసిన అత్యాధునిక మ్యాగ్నో మీటర్లను అమర్చామన్నారు. విలేకరుల సమావేశంలో ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వి.ఎం. తివారీ, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ నందన్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ శ్రీనాగేష్, అజయ్ మాంగీక్, కీర్తిశ్రీవాత్సవ, కుస్మిత అలోక తదితరులు పాల్గొన్నారు. -
కరోనా కట్టడిలో టాటా గ్రూపు
ముంబై: టాటా గ్రూపులో భాగమైన టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ (టాటాఎండీ) సంస్థ కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వానికి సహకారం అందివ్వనుంది. అందులో భాగంగా కరోనా నిర్థారణ పరీక్షల సామార్థ్యం పెంపు పనుల్లో భాగం కానుంది. దీనికోసం సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)తో టాటా ఎండీ ఒప్పందం చేసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో చిన్న పట్టణాల (ద్వితీయ, తృతీయ శ్రేణి)తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరగనుంది. టెస్టింగ్ సామర్థ్యం పెంపు భవిష్యత్తులో కరోనా పరీక్షల అవసరాలు పెరిగితే.. అందుకు తగ్గట్టుగా టెస్టింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నట్టు టాటా కంపెనీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సీఎస్ఐఆర్ ల్యాబ్‌లను కరోనా పరీక్షలకు వినియోగించుకోవడం ఈ ఒప్పందంలో భాగంగా ఉండనుంది. అలాగే, టాటాఎండీకి చెందిన ‘చెక్ సార్స్–కోవ్–2’ టెస్ట్ కిట్స్‌ను పరీక్షల కోసం విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు టాటా ఎండీ ఓ ప్రకటనలో తెలియజేసింది. చదవండి : కరోనాకి బెదరని లంబోర్గిని -
ఈ ట్రయల్స్ విజయవంతమైతే తక్కువ ఖర్చుతో కరోనా చికిత్స
సాక్షి, న్యూఢిల్లీ: నులిపురుగులను నియంత్రించే నిక్లోసమైడ్ ఔషధాన్ని కరోనా చికిత్స నిమిత్తం లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో సీఎస్ఐఆర్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న కరోనా రోగులపై నిక్లోసమైడ్ ఎంతమేర సమర్థంగా పనిచేస్తుంది, భద్రత తదితరాలు అంచనా వేయడానికి పలు అధ్యయనాలు చేపట్టారు. గతంలో పెద్దలు సహా పిల్లలకు కూడా నులిపురుగు (టేప్–వార్మ్) నివారణకు నిక్లోసమైడ్ విస్తృతంగా వినియోగించేవారు. ఈ ఔషధం భద్రతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరీక్షించినట్లు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వశాఖ పేర్కొంది. నిక్లోసమైడ్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స అందుబాటులోకి వస్తుందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మాండే తెలిపారు. సీఎస్ఐఆర్ డీజీ సలహాదారు రామ్ విశ్వకర్మ మాట్లాడుతూ... సిన్సిటియా (ఒక కణంలో ప్రవేశించిన వైరస్ సమీపంలోని మరిన్ని సెల్స్‌ను కలుపుకొని సమూహంగా ఏర్పాటై వైరస్ వ్యాప్తి చేసే క్రమం) ఏర్పడటాన్ని నిరోధించే ఔషధాలను గుర్తించే క్రమంలో నిక్లోసమైడ్ సురక్షితమైన ఔషధంగా లండన్‌కు చెందిన కింగ్స్ కళాశాల పరిశోధకుల అధ్యయనంలో తేలిందన్నారు. కరోనా రోగుల్లోని ఊపిరితిత్తుల్లో సిన్సిటియా ఏర్పాటును నిక్లోసమైడ్ నియంత్రిస్తుందన్నారు. ఎండోసైటిక్ పాత్వే (పీహెచ్ డిపెండెంట్) ద్వారా వైరస్ ప్రవేశాన్ని నిరోధించడంతోపాటు సార్స్–కోవ్ 2 ప్రవేశాన్ని కూడా సమర్థంగా నిరోధించగల ఔషధంగా నిక్లోసమైడ్ పనిచేస్తుందని జమ్మూలోని సీఎస్ఐఆర్–ఐఐఐఎం, బెంగళూరులోని ఎన్‌సీబీఎస్‌ల సంయుక్త పరిశోధనలో తేలిందన్నారు. -
సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీలో ఉద్యోగాలు
చెన్నైలోని సీఎస్ఐఆర్–స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్(ఎస్ఈఆర్సీ).. టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► అర్హత: కనీసం 55శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టుల్లో ఎస్ఎస్సీ/పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టును అనుసరించి 28 ఏళ్లు, 31 ఏళ్లు ఉండాలి. ► వేతనం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా స్క్రీనింగ్ కమిటీ అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తుంది. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ట్రేడ్ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు. ట్రేడ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని తుది ఎంపికలో భాగంగా రాత పరీక్షకు పిలుస్తారు. ► పరీక్షా విధానం: దీనిలో మూడు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్–1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్–2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్, పేపర్–3 సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీ క్యాంపస్, తారామణి, చెన్నై–600113 చిరునామాకు పంపించాలి . ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 11.06.2021 ► వెబ్సైట్: https://www.serc.res.in మరిన్ని నోటిఫికేషన్లు: బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్ పోస్టులు -
‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్న వారికి కరోనా రిస్క్ తక్కువ, వారికి మాత్రం!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న పెనుభూతం కరోనా. ఈ వైరస్ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాలని, మాంసం అధికంగా తినాలన్న సూచనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజానికి మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. అంతేకాదు ‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్నవారు కూడా కరోనా బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా పరిశోధనలో తేలింది. శాకాహారుల్లో సెరో–పాజిటివిటీ స్వల్పమేనని పరిశోధకులు అంటున్నారు. కోవిడ్–19 వ్యాధికి కారణమయ్యే సార్స్–కోవ్–2 వైరస్‌ను ఢీకొట్టే ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్) ఎవరెవరిలో ఎక్కువగా ఉంటాయన్న దానిపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) పాన్–ఇండియా సెరో సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్ఐఆర్ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ‘బీ’, ‘ఏబీ’ గ్రూప్ రక్తం ఉన్నవారిలో సెరో పాజిటివిటీ అధికంగా ఉంటుందని, వారికి కరోనా రిస్క్ ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్నవారికి ఈ వైరస్ వల్ల పెద్దగా ముప్పేమి ఉండదని అంటున్నారు. అంతేకాకుండా సిగరెట్ తాగేవారి గొంతులో జిగురు పొర ఏర్పడుతుందని, ఇది వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యయనంలోనూ ఇదే విషయం బయటపడింది. ప్రతిరక్షకాలు తగ్గడం వల్లే.. భారత్‌లో మొదటి వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు గత ఏడాది సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత తీవ్రత తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈ ఏడాది మార్చి నుంచి కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీన్ని సెకండ్ వేవ్ అంటున్నారు. జనంలో ‘అర్థవంతమైన ప్రతిరక్షకాలు’ తగ్గడమే ఇందుకు కారణమని సీఎస్ఐఆర్ అభిప్రాయపడింది. చదవండి: ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తేడా ఏంటి ? -
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికం గా ఉన్నప్పటికీ డెత్ రిస్క్ మాత్రం అతితక్కువగా నమోదవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి ప్రజల జన్యుమార్పు క్రమమేనని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు అనుబంధంగా పనిచేస్తున్న జీనోమిక్స్ సంస్థ విశ్లేషించింది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమై దాదాపు ఏడాదిన్నర అవుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు పరిశోధనలు చేశాయి. ఇదే క్రమంలో కరోనా మరణాలకు సంబంధించి జన్యుమార్పుల ఆధారంగా సీఎస్ఐఆర్ ప్రతినిధుల బృందం లోతైన అధ్యయనం చేసింది. అంతర్జాతీయంగా 100 రకాల జన్యుమార్పులను ఆధారంగా తీసుకున్న అధ్యయన బృందం... అందులో తొలి 8 మార్పులను ప్రామాణికంగా తీసుకొని ఆ మేరకు పరిశోధన సాగించింది. అందులో 2 రకాల జన్యుమార్పులు దేశీ యంగా సరిపోలాయి. ఆర్ఎస్-10735079, ఆర్ఎస్-2109069 రకానికి చెందిన జన్యుమార్పులు భారతీయుల్లో సరిపోలగా అవి ఏయే రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయో అధ్యయన బృందం పరిశీలించింది. జాతీయ జీనోమ్ కోడ్ ఆధారంగా ఈ పరిశోధన సాగింది. 25 ప్రాంతాలుగా విభజన... దేశాన్ని 25 రకాల భౌగోళిక ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించి అక్కడి ప్రజల జన్యుక్రమాన్ని నమోదు చేసింది. భాష, సంస్కృతి, గిరిజన తెగలు, కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా ఈ ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎస్ఐఆర్ తాజా పరిశోధన జియోగ్రాఫికల్ రీజియన్ల ఆధారంగా సాగింది. దేశీయంగా గుర్తించిన 2 రకాల జన్యుమార్పులు ఎక్కువగా గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు అంచనా వేస్తూ ఆయా రాష్ట్రాలను రిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. ఇక రిస్క్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిస్క్ ఎక్కువున్న ప్రాంతాలను ఎంపిక చేసి వేగవంతంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎస్ఐఆర్ సూచిస్తోంది. రిస్క్ తక్కువున్న చోట కూడా వ్యాక్సినేషన్ జరపాలని, అయితే ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తే మరణాల రేటును తగ్గించవచ్చని సీఎస్ఐఆర్ కేంద్రానికి సూచించింది. ఆర్థిక సర్వే ప్రకారం... దేశంలో కరోనా మరణాలకు సంబంధించిన గణాంకాలను కేంద్రం ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వేలో ప్రస్తావించింది. ఇందులో కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కువ మరణాలు గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్‌లలో నమోదైనట్లు ప్రకటించింది. అలాగే తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ, బిహార్, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాలున్నాయి. జీనోమ్ స్టడీ ఆధారంగా సీఎస్ఐఆర్ వెల్లడించిన వివరాలతో కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే వివరాలు దాదాపుగా సరిపోలడం గమనార్హం. సెకండ్ వేవ్‌లోనూ అవే ప్రాంతాలు కరోనా ఫస్ట్ వేవ్‌లో ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాలే సెకండ్ వేవ్‌లోనూ తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న సమయంలో ఆ ప్రాంతాల్లో రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రాంతాలవారీగా ప్రభావాన్ని పరిశీలిస్తే మానవ జన్యుమార్పులు ఒక కారణం కావచ్చు. రిస్క్ ప్రాంతాల గుర్తింపులో ఇలాంటి పరిశోధనలు కీలకపాత్ర పోషిస్తాయి. - డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ వైద్య కళాశాల -
భారత్‌కు మరో సవాల్: కరోనా మూడో అవతారం
న్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా ట్రిపుల్ మ్యూటెంట్ దేశానికి సరికొత్త సవాల్ విసురుతోంది. రోజుకి 3 లక్షలకి చేరువలో కేసులు నమోదై కరోనా ప్రళయ భీకర గర్జన చేస్తున్న వేళ ఈ మూడో అవతారం వెలుగులోకి వచ్చింది. డబుల్ మ్యూటెంట్ అంతర్జాతీయంగా దడ పుట్టిస్తూ ఉంటే ఈ ట్రిపుల్ మ్యూటెంట్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందా అన్న భయాందోళనలున్నాయి. ట్రిపుల్ మ్యూటెంట్ అంటే వైరస్ మూడుసార్లు జన్యు మార్పిడికి లోనవడం. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మూడుసార్లు జన్యు క్రమాన్ని మార్చుకున్న కరోనా కేసులు బయటపడ్డాయి. మొదట ఈ వైరస్ బెంగాల్లో గుర్తించినట్టుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు. ‘‘ట్రిపుల్ వేరియెంట్ వాయువేగంతో వ్యాప్తి చెందుతుంది. అత్యధిక మంది దీని బారిన పడతారు’’అని మెక్‌గిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మధుకర్ పాయ్ చెప్పారు. ట్రిపుల్ మ్యూటెంట్ కేసుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే తప్ప ఎంత హానికరమో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. చదవండి: (డబుల్ మ్యూటెంట్.. పేరు వింటేనే దడపుట్టేస్తోంది!) -
సీఎస్ఐఆర్, ఐఐసీటీల మధ్య పరిశోధన ఒప్పందం
సాక్షి, అమరావతి: స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్(ఎస్ఏఎస్), వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, సీఎస్ఐఆర్-ఐఐసీటీల మధ్య విద్య, పరిశోధనా రంగాలలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులకు, విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో పరిశోధనలు చేయడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పరస్పరం ఆసక్తి ఉన్న రంగాలలో నిధుల కోసం ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వివిధ ఏజెన్సీలకు పంపవచ్చని పేర్కొన్నారు. దీంతో నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు(ఎఫ్‌డిపిలు), జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సెమినార్లు, సింపోజియం, వర్క్‌షాప్‌లు ద్వారా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పరిశోధనలు చేయవచ్చని తెలిపారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వీఐటీ-ఏపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆసక్తి ఉన్న యువతీ యువకులు పరిశోధనలో రంగంలో ఎదగడానికి ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సుల ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల ప్రాజెక్ట్, పరిశోధన, ఇంటర్న్‌షిప్, సిఓ-ఓపీ, సీనియర్ డిజైన్ ప్రాజెక్టులకు సహకారం అందించటం జరుగుతుందని చెప్పారు. ఐఐసీటీ సహకారంతో అందించే కోర్సులపై గెస్ట్ లెక్చర్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ఎక్స్చేంజి ప్రోగ్రాంలు, ప్రాజెక్టులకు పూర్తి సహకారంతో పాటు ద్వైపాక్షిక కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకొనుటకు సహాయపడుతుందని తెలియజేశారు. వీఐటీ-ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సీ.ఎల్.వీ. శివ కుమార్, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.వీ. సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్ -
ఎస్ఈఆర్సీలో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ పోస్టులు
చెన్నైలోని సీఎస్ఐఆర్–స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్(ఎస్ఈఆర్సీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 14 » పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్–08, డ్రైవర్–02, టెక్నీషియన్–04. » జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: అర్హత: 10+2/ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు. » డ్రైవర్: అర్హత: వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్(ఎల్ఎంవీ–హెచ్ఎంవీ) ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 27 ఏళ్లు మించకూడదు. » టెక్నీషియన్: అర్హత: కనీసం 55శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టుల్లో ఎస్ఎస్సీ/పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో పని అనుభవం ఉండాలి. » ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. » పరీక్షా విధానం: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్–1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్–2 జనరల్ అవేర్నెస్–జనరల్ లాంగ్వేజ్ విభాగాలు ఉంటాయి. మొదటి పేపర్లో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే పేపర్–2 వాల్యుయేషన్ ఉంటుంది. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మెరిట్, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. » టెక్నీషియన్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డ్రైవర్ పోస్టులకు స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీ, సీఎస్ఐఆర్ రోడ్, తారామణి, చెన్నై–600113 చిరునామాకు పంపించాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.03.2021 » దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 31.03.2021 » వెబ్సైట్: www.serc.res.in -
వ్యాక్సిన్ కోసం టాటా, మోడరానా ఇంక్ జట్టు
ముంబై: టాటా గ్రూప్ యొక్క హెల్త్‌కేర్ వెంచర్ మోడరానా ఇంక్‌తో కలిసి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను భారతదేశంలో తీసుకురావడానికి భాగస్వామ్యం కోసం చర్చలు ప్రారంభించినట్లు ఎకనామిక్ టైమ్స్ నేడు తెలిపింది. టాటా మెడికల్ & డయాగ్నోస్టిక్స్, మోడరనా యొక్క వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తో జతకట్టిన్నట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై మోడెర్నా, టాటా మెడికల్ & డయాగ్నోస్టిక్స్ స్పందించలేదు.(చదవండి: వ్యాక్సిన్ రేస్‌లో టాప్‌టెన్‌లో భారత్) ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. కానీ మోడెర్నాను సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ఇది భారతదేశం వంటి పేద దేశాలకు మరింత అనుకూలంగా ఉంటుంది వారు పేర్కొన్నారు. మోడరనా యొక్క వ్యాక్సిన్ చివరి పరీక్ష దశలో 94.1శాతం మందికి ఎలాంటి తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తలేదు. ఈ వ్యాక్సిన్ ఈ నెల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలో ఉపయోగించడానికి ఆమోదించబడింది అని మోడరనా సంస్థ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమంలో ఏ వాక్సిన్ ను పరిగణనలోకి తీసుకోవాలంటే ప్రతి టీకా తయారిదారి కంపెనీ తప్పనిసరిగా స్థానికంగా పరీక్షలు జరపాలని భారతదేశం ఆదేశించింది. -
సీఓ2 ఎఫెక్ట్.. సముద్రమట్టాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు అంతకంతకూ పెరిగిపోతున్న కారణంగా గత దశాబ్ద కాలంలో సముద్ర మట్టాలు ఏడాదికి సగటున 4.8 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయని అంతర్జాతీయ శాస్త్ర వేత్త డాక్టర్ అనీ కాజనేవ్ తెలిపారు. ఈ పెరుగుదల గత రెండు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉందని, పైగా సముద్రమట్టాల పెరుగుదల రేటు కూడా పెరిగిందన్నారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) 60వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ఆన్లైన్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ శేఖర్ సి మాండే, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వి.ఎం.తివారీ పాల్గొన్నారు. సూర్యుడి నుంచి భూమిని చేరుతున్న శక్తి ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి రూపంలో మళ్లీ అంతరిక్షంలోకి మళ్లే శక్తి తక్కువ కావడం వల్ల భూతాపోన్నతి పెరుగుతున్న విషయం తెలిసిందే. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాలు భూతాపోన్నతి వేగాన్ని పెంచుతున్నాయని, 2010–2020 మధ్యకాలంలో వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు రికార్డు స్థాయికి చేరడం గమనార్హమని డాక్టర్ అనీ కాజనేవ్ తెలిపారు. కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఈ ఏడాది మార్చిలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు తగ్గినప్పటికీ ఆ తరువాత షరా మామూలుగా మారిపోయిందన్నారు. భూమి సగటు ఉష్ణోగ్రతలు 1850–2019 మధ్యకాలంలో ఒక డిగ్రీ సెల్సియస్ వరకు పెరగ్గా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఆమె వివరించారు. హిమనీనదాలు వేగంగా కరిగిపోతుండటం వల్ల సముద్ర మట్టాల పెరుగుదలలో వేగం ఎక్కువైందని చెప్పారు. 1900–1990 మధ్యకాలంలో ఇది 15 సెంటీమీటర్లుగా ఉందని, ఆ తరువాత కాలంలో ఉపగ్రహాల సాయంతో సముద్రమట్టాలపై జరిపిన పరిశీలన కూడా ఇదే తీరులో కొనసాగుతోందన్నారు. -
గంటకు 1,105 మందికి
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ పడగ విప్పుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 26,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు 1,105 మంది కరోనా సోకినట్లు స్పష్టమవుతోంది. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. గురువారం నుంచి శుక్రవారం వరకు.. ఒక్కరోజులో 475 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 7,93,802కు, మరణాలు 21,604కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 2,76,685 కాగా, 4,95,512 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. గత 24 గంటల్లో 19,138 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 62.42 శాతానికి చేరింది. మరణాల రేటు తగ్గుముఖం దేశంలో కరోనా సంబంధిత మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. నెల రోజుల క్రితం మరణాల రేటు 2.82 శాతం కాగా, ప్రస్తుతం 2.72 శాతం మాత్రమేనని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఇది తక్కువేనని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యిందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 62.42 శాతంగా ఉందని తెలియజేసింది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు జాతీయ సగటు కంటే అధికమేనని వివరించింది. 2021లో వ్యాక్సిన్! కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభంలో సిద్ధమయ్యే అవకాశం ఉందని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ విభాగం, సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ముఖ్య సాంకేతిక సలహాదారు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలియజేశారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అధ్యక్షతన సైన్స్ అండ్ టెక్నాలజీపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో సమావేశమైంది. దేశంలో కరోనా తాజా పరిస్థితిపై చర్చించారు. హోం క్వారంటైన్లో యడియూరప్ప సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం/అధికార నివాసాన్ని ఐదు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. శానిటైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత తెరుస్తామని చెప్పారు. దేశంలో కరోనా ప్రబలిన తర్వాత కర్ణాటక సీఎం ఆఫీసును మూసివేయడం ఇది రెండోసారి. ముందు జాగ్రత్త చర్యగా 77 ఏళ్ల యడియూరప్ప హోం క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన శుక్రవారం ప్రకటించారు. రాబోయే కొన్నిరోజుల పాటు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు. -
హెర్డ్ ఇమ్యునిటీతో రిస్క్: సీఎస్ఐఆర్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు టీకాను కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే టీకా కనిపెట్టడానికి ఇంకా సంవత్సర కాలం పడుతుందని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే పదానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో కరోనా వైరస్ నియంత్రణకు హర్డ్ ఇమ్యునిటీ ఉపయోగపడుతుందని దేశాలు భావించడం పెద్ద రిస్క్ అని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ శేఖర్ మండే తెలిపారు. కరోనా నియంత్రణకు ఐదు సూత్రాల ఫార్ములాను సీఎస్ఐర్ ప్రతిపాధించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ జనాభాలో 60 నుంచి 70 శాతం ప్రజలు వ్యాధితో బాధపడుతన్నప్పుడే హర్డ్ ఇమ్యునిటీ పని చేసే అవకాశం ఉందని మండే తెలిపారు. ఏదయినా అంటువ్యాధితో అధిక జనాభా బాధపడుతున్నప్పుడు కొంత కాలం తరువాత వారి శరీరంలో వ్యాధిని ఎదుర్కొవడానికి రోగనిరోధకశక్తి లభిస్తుంది. ఇటీవల కరోనాకు టీకా అవసరం లేదని.. ప్రజలకు సహజంగా లభించే రోగనిరోధకశక్తి ద్వారా వైరస్ అంతమవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ -
యాంటీబాడీల తయారీకి భారత్ బయోటెక్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కారక వైరస్ నియంత్రణకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల యాంటీబాడీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్‌తో కలిసి పరిశోధనలు మొదలుపెట్టింది. న్యూమిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కోవిడ్–19 రోగుల నుంచి సేకరించిన యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, ఇండోర్‌లోని ఐఐటీతోపాటు గురుగావ్‌లోని ప్రెడోమిక్స్ టెక్నాలజీస్‌లు కూడా ఈ ప్రాజెక్టుకు తమవంతు సాయం అందిస్తాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం టీకాలు, మందుల తయారీకి ఇప్పటికే పలు ప్రయత్నాలు జరుగుతున్నా ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే కాకుండా.. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్‌ను ఎదుర్కోగల మోనోక్లోనల్ యాంటీబాడీల తయారీకి ప్రాజెక్టు సిద్ధమైంది. ఇప్పటికే వైరస్ బారిన పడ్డవారికి చికిత్స కల్పించేందుకు యాంటీబాడీలు ఉపయోగపడతాయని, భారత్ బయోటెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆయుర్వేద ప్రభావమెంత?
న్యూఢిల్లీ: కరోనాపై సంప్రదాయ ఆయుర్వేద ఔషధం అశ్వగంధ చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారణ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అశ్వగంధను కరోనా సోకకుండా నిరోధించగల ఔషధంగా వైద్య సిబ్బందికి, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఇతరులకు హైడ్రో క్లోరోక్విన్ స్థానంలో వినియోగించవచ్ఛా? అనే విషయంపై నియంత్రిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ను సీఎస్ఐఆర్, ఐసీఎంఆర్‌ల సహకారంతో ఆయుష్, ఆరోగ్య, శాస్త్ర,సాంకేతిక శాఖలు ప్రారంభించాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం వెల్లడించారు. ఆయుర్వేద ఔషధాలు యష్టిమధు, గదుచి, పిప్పలి, ఆయుష్ 64ల సమ్మేళనాన్ని సాధారణ కోవిడ్ రోగులకు ఇవ్వడంపైనా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ తెలిపారు. వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా, అలాగే, సోకాక ఔషధంగా వాటిని వినియోగించడంపై పరీక్షలు జరుపుతున్నామన్నారు. కరోనా తీవ్రంగా ఉండేవారిపై ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియో ఔషధాల ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారించే పరీక్షలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోవిడ్‌పై ఆయుష్ ఔషధాల ప్రభావం, ఆయా ఔషధాల వినియోగం తదితర సమాచారం తెలిపే ‘సంజీవని’ యాప్‌ను హర్షవర్ధన్ ఆవిష్కరించారు. -
ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ
(మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి): కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో 38 పరిశోధన సంస్థలు ఉన్నాయి. వాటిలో 4,500 మంది శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి సీఎస్ఐఆర్ పనిచేస్తోంది. పర్యావరణం మొదలు ఆరోగ్యం వరకు.. పలు రంగాల్లో అవసరమైన పరిశోధన ఫలితాలను దేశానికి అందించడానికి నిరంతరం పనిచేస్తున్నామని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మాండే చెప్పారు. ‘పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ.. మందులు, టీకాలు కనిపెట్టడానికి జన్యు శ్రేణి మన దేశ ప్రజల్లో ఉన్న వైవిధ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. జినోమ్ సీక్వెన్స్ (జన్యు శ్రేణి) కూడా మన వాళ్లలో ఉన్నంత విభిన్నంగా మరెక్కడా ఉండదు. అందువల్లే మనదేశంలో అరుదైన జెనెటిక్ డిజార్డర్స్ (జన్యు సంబంధిత సమస్యలు) ఎక్కువ. వీటిని అధిగమించడానికి 1008 మంది జన్యు శ్రేణులను రూపొందించాం. మందులు, టీకాలు కనిపెట్టడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మానవుల జన్యు బ్లూప్రింట్‌ను డీకోడ్ చేయడానికి జన్యు శ్రేణి పనికొస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్తంగా జన్యుశ్రేణి రూపకల్పన ప్రాజెక్టును చేపట్టాయి. అలాగే డెంటల్ ఇంప్లాంట్స్‌ను చౌకగా తయారుచేసే పరిజ్ఞానాన్ని రూపొందించాం. దీనివల్ల ఇప్పుడున్న ధరల్లో మూడో వంతుకే ఇంప్లాంట్స్ లభించనున్నాయి. స్పెంట్ వాష్‌ను శుద్ధి చేస్తే.. మద్యం తయారీ ప్లాంట్ల (డిస్టిలరీస్)లో వ్యర్థ జలాలను ‘స్పెంట్ వాష్’ అంటారు. దీన్ని శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటివరకు లేదు. ఒక లీటరు మద్యం తయారు చేస్తే 10–15 లీటర్ల వ్యర్థజలం (స్పెంట్ వాష్) వస్తుంది. మొలాసిస్ నుంచి మద్యం తయారుచేసే కర్మాగారాలు దేశంలో 300కు పైగా ఉన్నాయి. ఇవి ఏటా 250 కోట్ల లీటర్ల స్పెంట్ వాష్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని అంచనా. ఇవి స్పెంట్ వాష్, మిగతా వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు వదులుతున్నాయి. ఫలితంగా తీవ్ర దుర్గంధం వెలువడటంతోపాటు పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. స్పెంట్ వాష్‌లో కాలుష్యానికి కారణం.. పొటాష్. దీన్ని వేరు చేస్తే మిగతా వ్యర్థాలను తొలగించడం చాలా సులువు. పొటాష్‌ను వేరు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) అభివృద్ధి చేసింది. పొటాష్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. స్పెంట్ వాష్‌ను శుద్ధి చేస్తే.. రూ.700 కోట్ల విలువైన పొటాష్‌ను ఉత్పత్తి చేయొచ్చు. శుద్ధి ప్రక్రియలో శుద్ధ జలం కూడా వస్తుంది. ఆ నీటిని డిస్టిలరీస్ వాడుకోవచ్చు. అయితే.. స్పెంట్ వాష్ శుద్ధి ప్లాంట్ ఏర్పాటు మరీ చౌక కాదు. 2.5 ఏళ్లలో పొటాష్ ఉత్పత్తి ద్వారా పెట్టుబడి వచ్చేస్తుంది. తర్వాత నుంచి లాభమే. వ్యర్థాల రీయూజ్‌కు పరిశోధనలు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల తీవ్ర కాలుష్య సమస్యలు వస్తున్నాయి. వ్యర్థాలను తిరిగి ఉపయోగించడానికి అనువైన పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించే దిశగా పరిశోధనలు చేస్తున్నాం. రైతులు ఆ వ్యర్థాలను సులువుగా ‘రీయూజ్’ చేసే పరిజ్ఞానాన్ని వచ్చే సీజన్‌కు సీఎస్ఐఆర్ అందిస్తుంది. అల్జీమర్స్ వ్యాధికి మందు అల్జీమర్స్ వ్యాధికి కుంకుమ పువ్వు నుంచి మందు తయారు చేశాం. క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రత్యామ్నాయ వనరుల నుంచీ బయోఫ్యూయల్ తయారీ.. దేశానికి ఇంధన భద్రతను అందించే శక్తి బయో ఫ్యూయల్‌కు ఉంది. కానుగ నుంచే ఇప్పటివరకు బయోఫ్యూయల్ తయారు చేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల నుంచి కూడా తయారు చేయొచ్చు. సీఎస్ఐఆర్ రూపొందించిన బయో ఫ్యూయల్‌తో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి విమానం నడిపాం. వాణిజ్యపరంగా బయోఫ్యూయల్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఇలా చేస్తే.. ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇటు ప్లాస్టిక్ సమస్యను, అటు ఇంధన కొరతను అధిగమించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే ప్లాస్టిక్ సమస్యను అధిగమించవచ్చు. ‘మేకిన్ ఇండియా’కు సహకారం మేకిన్ ఇండియా కార్యక్రమానికి సీఎస్ఐఆర్ తన వంతు సహకారమందిస్తోంది. వివిధ రంగాల్లో చేస్తున్న పరిశోధన ఫలితాలను పరీక్షించడానికి ఇటీవల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందించడానికి ఇది దోహదం చేస్తుంది. 19 సీట్ల విమానం సిద్ధమైంది.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, నేషనల్ ఏరోనాటిక్స్‌తో కలిసి తేలికపాటి విమానాల తయారీ మీద పరిశోధనలు చేస్తున్నాం. 19 సీట్ల ‘సరస్’ విమానం సిద్ధమైంది. దీన్ని పరీక్షిస్తున్నాం. 70 సీట్ల విమానం డిజైన్ ఆమోదం పొందింది. ఈ పరిశోధనలు పూర్తయితే.. దేశంలో చిన్న విమానాశ్రయాలకు కూడా విమానాలు తిరిగే అవకాశం ఉంటుంది. ‘విజిబిలిటీ’ తక్కువగా ఉన్నప్పుడు విమానాలు దిగడం (ల్యాండింగ్) పెద్ద సమస్య. దీన్ని అధిగమించడానికి హైలెవల్ సెన్సార్స్ ఉన్న ‘దృష్టి’ని రూపొందించాం. ప్రస్తుతం 50 ‘దృష్టి’ వ్యవస్థలను దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో వాడుతున్నారు. ఈ టెక్నాలజీని రెండు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చాం. ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు కూడా ఇవ్వబోతున్నాం. -
విపత్తులో.. సమర్థంగా..
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల సమర్థ నిర్వహణకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలలు తమవంతు కృషి చేస్తున్నాయని సంస్థ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి.మండే తెలిపారు. ఇటీవలి ఫానీ తుపాను సమయంలో చెన్నైలోని సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ ఎస్ఈఆర్సీ డిజైన్ చేసి, రెడ్‌క్రాస్ సంస్థ నిర్మించిన తుపాను బాధితుల కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయని, అలాగే గుజరాత్‌లోని మరో పరిశోధన సంస్థ తుపాను బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మొబైల్ నీటి శుద్ధీకరణ ప్లాంట్లను సరఫరా చేసిందని చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో పద్మభూషణ్ ఎ.వి.రామారావు ‘కిలో’ల్యాబ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ, తుపాను బాధితులకు అందించే ఆహారం శుభ్రంగా ఉండేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసేందుకు మైసూరులోని సీఎస్ఐఆర్ సంస్థ సీఎఫ్టీఆర్ఐ ప్రత్యేక ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసిందని, దీని సాయంతో అతితక్కువ కాలంలోనే పెద్ద సంఖ్యలో ఆహారపు పొట్లాలను సిద్ధం చేయగలిగామ ని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రపు నీటితోపాటు ఎలాంటి మురికి నీటినైనా శుద్ధి చేసి గంటకు నాలుగు వేల లీటర్ల తాగునీరు ఇవ్వగల మొబైల్ వ్యాన్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశామని తెలిపారు. దేశం మొత్తమ్మీద పదుల సంఖ్యలో సీఎస్ఐఆర్ సంస్థలు ఉన్నాయని.. వేర్వేరు పరిశోధన సంస్థలు కలిసికట్టుగా ప్రాజెక్టులు చేపట్టడం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోందని, వ్యవసాయ సంబంధిత ఆగ్రో మిషన్‌లో ఎనిమిది సంస్థలు పాల్గొంటుండగా.. ఫార్మా మిషన్‌లోనూ ఐదు సంస్థలు భాగస్వాములుగా పనిచేస్తున్నాయని వివరించారు. కిలో ల్యాబ్ ప్రత్యేకమైంది: శ్రీవారి చంద్రశేఖర్ ఐఐసీటీ ప్రాంగణంలో ఆవిష్కృతమైన పద్మభూషణ్ ఎ.వి.రామారావు కిలో ల్యాబ్ చాలా ప్రత్యేకమైందని.. అత్యంత పరిశుద్ధమైన వాతావరణంలో మం దుల తయారీకి అవసరమైన రసాయనాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు వీలు కల్పిస్తుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ల్యాబ్ ప్రత్యేకతలను వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి పరిశోధనశాల ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని తెలిపారు. మొత్తం రూ.పదికోట్ల వ్యయంతో నిర్మించామని, ఫార్మా రంగపు స్టార్టప్ కంపెనీలు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. యాంటీ వైరల్, కేన్సర్ చికిత్సకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతోనూ సురక్షితంగా పనిచేసేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ పరిశోధన శాలలో తయారైన రసాయనం మరే ఇతర శుద్ధీకరణ అవసరం లేకుండా ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుకోవచ్చునన్నారు. 2021 నాటికి దేశీయంగానే కీటకనాశినులు, పురుగుల మందులు తయారు చేసేందుకు ఐఐసీటీ ప్రయత్నాలు చేస్తోందని.. డ్యూపాంట్, సిన్జెంటా తదితర అంతర్జాతీయ కంపెనీల 15 కీటకనాశినుల పేటెంట్లకు కాలం చెల్లనున్న నేపథ్యంలో వాటిని మరింత మెరుగుపరిచి సొంతంగా తయారు చేస్తామని చెప్పారు. -
క్షీరదాలలో కొత్తరకం సూక్ష్మజీవ నిరోధక మూలాలు
హైదరాబాద్: గుడ్లు పెట్టే క్షీరదాలలో ఎకిడ్నా జాతికి చెందిన జంతువుల పాలలో సరికొత్తరకం సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్ ఆనవాళ్లు ఉన్నట్లు సీఎస్ఐఆర్-సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కోవకు చెందిన జంతువులు, వాటి సంతానం ఎటువంటి అంటురోగాల బారిన పడకుండా తమ పాల ద్వారా సంరక్షించుకొంటున్నట్లు పరిశోధన ద్వారా తెలిసింది. సీఎస్ఐఆర్-సీసీఎంబీకి చెందిన డాక్టర్ సతీశ్ కుమార్ నాయకత్వంలోని పరిశోధక బృందం ఈ ప్రొటీను, కణంపై పొరలో రంధ్రాలను ఏర్పరుస్తున్నట్లు కనిపెట్టారు. ఈ కారణంగా వీటిని సూక్ష్మజీవి నాశక మందులకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించవచ్చునని సతీశ్ చెబుతున్నారు. ఈకోలిని ఉపయోగిస్తూ సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్‌ను భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ బృంద సభ్యులు మార్గాలను కనుగొన్నారు. మూగజీవుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం పశు పోషణ రంగంలో సూక్ష్మజీవి నాశకాల(యాంటి బయోటిక్)ను విచక్షణా రహితంగా ఉపయోగిస్తున్నారని, ఫలితంగా సూక్ష్మజీవి నాశకాలను తట్టుకుని నిలిచే బ్యాక్టీరియా సంతతి పెరుగుతోందని సతీష్ చెప్పారు. డాక్టర్ సతీశ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఎకిడ్నా నుంచి సంగ్రహించిన సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్‌కు మాస్టయిటిస్ కారక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉన్నదని రుజువు చేయగలిగింది. ఈ పరిశోధన తాలూకు నివేదికను ఇటీవల ‘బయోచిమికా ఎట్ బయోఫిజికా యాక్టా-బయోమెంమెబ్రేన్స్’లో ప్రచురించారు.సీఎన్ఐఆర్-సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ.. సాంక్రమిక వ్యాధులు అంతకంతకూ పెరుగుతున్నటువంటి ప్రస్తుత వాతావరణంలో ముందంజ వేసేందుకు ఈ అధ్యయనాలు ఒక ఉత్తమ మార్గంగా ఉన్నాయని అన్నారు. -
దేశం 1 టైమ్ జోన్లు 2
భారత్‌లో రెండు టైమ్ జోన్లను ప్రవేశపెట్టాలన్న అంశం మరోసారి చర్చకు వచ్చింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యుడు ఉదయం 4 గంటలకే ఉదయించి, సాయంత్రం నాలుగు గంటలకు అస్తమిస్తాడు. ఈ నేపథ్యంలో విలువైన పగటి సమయాన్ని వాడుకోవడానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక టైమ్ జోన్ రూపొందించాలని ఢిల్లీలోని సీఎస్ఐఆర్–నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు సూచించారు. ఈ విషయమై పరిశోధనలు జరిపిన నిపుణులు.. అస్సాం, మేఘాలయ , నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా భారీగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చని కనుగొన్నారు. పగటి సమయంలో వ్యత్యాసం సాధారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం రెండు గంటలు ముందుగానే జరుగుతుంది. దేశమంతా ఒకే భారత కాలమానం (ఐఎస్టీ) లేదా టైమ్ జోన్ పాటిస్తూ ఉండటంతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుండటంతో రాత్రిపూట ఇంటికి వెళ్లిన భావన ప్రజల్లో కలుగుతోంది. రాత్రిపూట విధులు నిర్వహించేందుకు విపరీతంగా విద్యుత్ ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో పగటి సమయాన్ని ముందుకు జరపగలిగితే స్థానిక ప్రజలు ఇబ్బందిపడకుండా పనులు చేసుకోగలుగుతారనీ, విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని సీఎస్ఐఆర్–ఎన్పీఎల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు కలిపి ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉత్పాదకత కూడా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. ఇప్పుడున్నది ఒకే ఐఎస్టీ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత ప్రామాణిక కాలమానం (ఐఎస్టీ) ఉదయం 5.30 గంటలుగా అమలవుతోంది. అదే యూకేలోని గ్రీన్విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశం ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం(యూసీటీ) అర్ధరాత్రి 0.00 గంటలకు గ్రీన్విచ్ టైమ్‌గా లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో సమయాన్ని ఓ గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా? లేదా? ఈ విధానాన్ని అమలు చేయగలమా? అన్న విషయమై పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అందులో భారత కాలమానాన్ని మరో గంట ముందుకు జరపగలిగితే ఈశాన్య భారతం, పోర్ట్బ్లెయిర్లో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తేలినట్లు ఎన్పీఎల్ డైరెక్టర్ దినేశ్.కె.అస్వల్ తెలిపారు. భారత్‌లో రెండు టైమ్ జోన్లను అమలు చేయొచ్చని తాము శాస్త్రీయంగా నిరూపించామనీ, ఇక ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాలంపై కొన్ని సంగతులు ► బ్రిటిష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కోల్‌కతా టైమ్ జోన్లుగా విభజించారు. ► 1947 సెప్టెంబర్ 1న భారత ప్రామాణిక కాలమానం(ఐఎస్టీ) ఏర్పడింది ► 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైమ్)ను పాటించాలని అసోం(అప్పటి అస్సాం) అనధికారికంగా నిర్ణయించింది. పగటి సమయం ఒక గంట ఎక్కువ ఉండేలా గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టారు. ► ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైమ్ జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువాహటి హైకోర్టు తోసిపుచ్చింది. ► 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ సైతం ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైమ్‌జోన్ కావాలని డిమాండ్ చేశారు. -
ఒక దేశం రెండు టైం జోన్లు...!
న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న ఒకే ‘టైం జోన్’ స్థానంలో రెండు టైం జోన్లు ఉంటే భారతదేశానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మన లాంటి సువిశాల దేశంలో భిన్నమైన వేషభాషలతో పాటు వాతావరణ మార్పుల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఒక్కో రకమైన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒక టైంజోన్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు కలిపి మరో టైం జోన్ ఏర్పాటు చేస్తే మంచిదని సైంటిస్ట్‌లు తమ అధ్యయనంలో వెల్లడించారు.ఈ మేరకు ఢిల్లీలోని సీఎస్ఐఆర్– నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తమ పరిశోధన ఆధారంగా ‘రెండు టైం జోన్ల ఆవశ్యకత’ శీర్షికతో రాసిన పత్రం ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురితమైంది. ఈశాన్యంలో ముందే సూర్యాస్తమయాలు... భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో వెలుగుపరంగా కొన్ని గంటలు కోల్పోవాల్సి వస్తోంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రమై పగటి సమయం మరింత కుచించుకుపోవడంతో ఉత్పాదకత తగ్గిపోయి, అధిక విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రెండో టైంజోన్లోని రాష్ట్రాలు, ప్రాంతాల్లోని గడియారాలను మిగతా దేశంలోని (మొదటి టైంజోన్ రాష్ట్రాలు) ప్రాంతాల కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని ఈ అధ్యయనంలో సూచించారు. దీని వల్ల ఈ ప్రాంతంలో పనివేళలు ముందుగా ప్రారంభమై ముందుగా ముగుస్తాయి. ఈ కారణంగా ఉత్పాదకత పెరగడంతో పాటు విద్యుత్ ఆదా కూడా చేయవచ్చునని పేర్కొన్నారు. ఇప్పుడున్నది ఒకే ఐఎస్టీ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే భారత కాలమానం (ఐఎస్టీ) ఉదయం 5.30గా అమలవుతోంది. (అదే యూకేలోని గ్రీన్విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశ గీత ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివరల్ టైం (యూసీటీ) అర్థరాత్రి 0.00 గంటలకు గ్రీన్విచ్ టైంగా లెక్కిస్తున్నారు). ఈ పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల్లో ఒక గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా లేదా, ఈ విధానాన్ని అమలుచేయొచ్చా లేదా అన్న విషయాన్ని ఈ అధ్యయనంలో పరిశీలించారు. యూటీసీ కంటే అయిదున్నర గంటల స్థానంలో, ఆరున్నర గంటల టైమ్‌జోన్ పెడితే ఈశాన్యరాష్ట్రాలు, పోర్ట్‌బ్లెయిర్‌లలో ఉత్పాదకత పెరుగుతుందని తాము కనుక్కున్నామని ఎన్పీఎల్ డైరెక్టర్ దినేష్ కె ఆస్వల్ తెలిపారు. రెండు టైం జోన్ల కారణంగా రైలు ప్రమాదాలకు ఆస్కారమేర్పడుందనే ఆందోళనను కొందరు వ్యక్తం చేయగా, పశ్చిమబెంగాల్, అస్సాం సరిహద్దులోని అలిపుర్దౌర్ స్టేషన్లో రైలు గడియారాల సమయాలు మార్చితే ఈ ప్రమాదాన్ని అధిగమించవచ్చునని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ‘మనదేశంలో రెండు టైంజోన్లు ఉండొచ్చునని శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించాం. దీనిని అమలు చేయాలా వద్ద నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది’ అని అస్వల్ చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఐఎస్టీ–2ను అమలు చేసేందుకు ఎన్పీఎల్ ప్రైమరి టైమ్ స్కేల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండు టైంజోన్లను అమలు చేస్తే, ఏడాదికి 20 మిలియన్ల కిలో వాట్ల విద్యుత్‌ను ఆదాచేయొచ్చునని అంచనా వేశారు. పూర్వాపరాలు... బ్రిటీష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కలకత్తా టైంజోన్లుగా విభజించారు 1947 సెప్టెంబర్ 1న భారత కాలమానం (ఐఎస్టీ)ఏర్పడింది 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైం)ను పాటించాలని అస్సాం అనధికారికంగా నిర్ణయించింది. ఐఎస్టీ కంటే పగటి సమయం ఒక గంట ముందు ఉండేలా చేసుకున్న ఏర్పాటును గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటీషర్లు ఉపయోగించారు ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైం జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువహటి హైకోర్టు తోసిపుచ్చింది. 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పేమా ఖందు ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైంజోన్ కావాలని డిమాండ్‌ను పునరుద్ఘాటించారు -
అమరావతిలో సీఎస్ఐఆర్ ప్రయోగ కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ప్రయోగ, ప్రదర్శన కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ గిరీశ్ సాహ్నీ, సీనియర్ శాస్త్రవేత్తలు మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్ఐఆర్ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాల్ని, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదించగా.. సీఎం అంగీకారం తెలిపారు. ‘సెంటర్ ఫర్ స్కేలింగ్ అప్ అండ్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ రెలవెంట్ సీఎస్ఐఆర్ టెక్నాలజీస్’ పేరుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో సవివర కార్య ప్రణాళికను సిద్ధం చేసి తీసుకొస్తామని సాహ్ని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ శాశ్వత నిర్మాణం పూర్తయ్యేవరకు వేచి ఉండనక్కర్లేదని, తాత్కాలిక ఏర్పాటు చేసుకుని వెంటనే పని ప్రారంభించాలని సూచించారు. కాగా, బౌద్ధ ఆలయం నిర్మాణానికి అమరావతిలో పదెకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, డిజైన్లు ఇవ్వాలని మంగళవారం తనను కలిసిన థాయిలాండ్ బృందాన్ని కోరారు. రాష్ట్రం నుంచి థాయి ఎయిర్వేస్ సేవలు నడిపేందుకు బృందం ఆసక్తి చూపగా, విజయవాడ నుంచి ప్రారంభించాలని సీఎం సూచించారు. నేడు చంద్రబాబు దుబాయ్ పర్యటన: సీఎం చంద్రబాబు బుధవారం దుబాయ్ పర్యటనకు వెళుతున్నారు. గురువారం అక్కడి పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులతో సమావేశమై.. విశాఖపట్నంలో ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. -
తెలంగాణావాసికి శాంతి స్వరూప్ పురస్కారం
హైదరాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన నరేశ్ పట్వారీకి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం లభించింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ శుక్రవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. నరేశ్ పట్వారీ ప్రస్తుతం ఐఐటీ ముంబైలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు పతకంతో పాటు రూ.5లక్షల నగదు అందజేస్తారు. 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.15 వేల నగదు అందజేస్తారు. -
సికిల్‌సెల్ ఎనీమియాకు మెరుగైన చికిత్స
సాక్షి, హైదరాబాద్: సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని ఎదుర్కొనేందుకు కౌన్సిల్ ఫర్ సైంటి ఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) నడుం బిగించింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) నేతృత్వంలో ఈ వ్యాధిని సులువుగా గుర్తించేందుకు చికిత్స విధానాలను మెరుగుదలకు ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.54 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శుక్రవారం సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది పిల్లలు ఈ వ్యాధిబారిన పడుతున్నారని, వీరిలో సగం మంది భారత్‌లోనే ఉన్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న గిరిరాజ్ ఛాందక్ మాట్లాడుతూ జన్యు మార్పుల కారణంగా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తుల్లోని రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయని, ఫలితంగా రక్తహీనత, విపరీతమైన ఒళ్లునొప్పులు వస్తుంటాయని వివరించారు. భారత్‌లో ఈ వ్యాధిగ్రస్తులు చత్తీస్‌గఢ్‌లో ఎక్కువగా ఉండగా.. ఏపీతో పాటు మహారాష్ట్ర, ఒడిశాల్లోనూ వ్యాధిబారిన పడిన వారు ఉన్నారని తెలిపారు. సికిల్‌సెల్ ఎనీమియాకు సమర్థమైన చికిత్స అందించడమే కాకుండా అతిచౌకగా వ్యాధి నిర్ధారణ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
ఎన్జీఆర్ఐ సైంటిస్టుకు జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: సీఎస్ఐఆర్– ఎన్జీఆర్ఐలో చీఫ్ సైంటిస్టు ఎన్.పూర్ణచందర్‌రావుకు కేంద్ర గనులశాఖ అందించే ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కింది. భూగర్భ అంశాల్లో ఆయన సేవలకుగాను కేంద్రం ‘నేషనల్ జియోసైన్స్ అవార్డు’కు ఎంపిక చేసింది. భూకంపాలు, భూగర్భంలో జరిగే అంతర్గత మార్పులపై పలు పరిశోధనలను జరిపిన ఆయన ‘భూకంప అధ్యయనంలో శాస్త్రీయ తవ్వకాలు’ పరిశోధనలకు బృంద నాయకునిగా వ్యవహరిస్తున్నారు. -
'చక్కెర' వ్యాధికి చవకైన మందు!
బెంగళూరు: టైప్-2 మధుమేహ వ్యాధి చికిత్స కోసం శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి(సీఎస్ఐఆర్) సోమవారం కొత్తగా ఆయుర్వేదిక్ యాంటీబయోటిక్ ఔషధం బీజీఆర్-34ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఔషధం రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి, శరీరంపై ఇతర ఔషధాల దుష్ర్పభాలను తగ్గింస్తుందని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్బీఆర్ఐ) శాస్త్రవేత్త ఏకేఎస్ రావత్ తెలిపారు. లక్నోలోని ఎన్బీఆర్ఐ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్(సీఐఎంఏపీ) సంస్థలు సంయుక్తంగా ఈ ఔషధాన్ని అభివృద్ధిచేశాయి. కర్ణాటక సహా సరిహద్దు రాష్ట్రాలో 5 రూపాయలకే దీన్ని ఆయుర్వేదిక్ ఫార్మా సంస్థ ఏఐఎంఐఎల్ ముందుకు వచ్చింది. కస్తూరి పసుపు, ఏగిస, తిప్పతీగ, మంజిష్ట, పొడపత్రి, మెంతులు తదితరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ ఔషధాన్ని తయారుచేశారు. -
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
-
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మ అవార్డును వెనక్కిచ్చిన పీఎం భార్గవ భార్గవ బాటలో మరికొందరు శాస్త్రవేత్తలు నిరసన వ్యక్తం చేసిన 53మంది చరిత్రకారులు * వాదనలకు బుల్లెట్లతో జవాబిస్తున్నారని ఆరోపణ * బీజేపీపై వ్యతిరేకతే కారణం: వెంకయ్య సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రచయితలు, కళాకారులు.. సినీ ప్రముఖుల కోవలో శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా చేరారు. భారత దేశంలో ‘అసహన’ వాతావరణం పెచ్చుమీరుతోందని.. దీన్ని నియంత్రించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ విధమైన హామీ ప్రకటన చేయకపోవటాన్ని నిరసిస్తూ గురువారం దేశంలోని 53మంది ప్రముఖ చరిత్రకారులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ప్రఖ్యాత శాస్త్రవేత్త పీఎం భార్గవ తనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు హైదరాబాద్‌లో ప్రకటించారు. సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)వ్యవస్థాపక డెరైక్టర్ అయిన పుష్ప ఎం భార్గవ 1986లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.‘‘ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. మోదీ ప్రభుత్వం భారత్‌ను హిందూ ఛాందసవాద దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇది నాలాంటి వారికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు..’’ అని పేర్కొన్నారు. దేశ పౌరులందరూ శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంటే... కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సంస్థ (సీఎస్ఐఆర్) సమావేశాల్లో పాల్గొనడం ఇలాంటిదేనన్నారు. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు తన దృష్టిలో ఏమాత్రం సానుభూతి లేదని... బీజేపీ ఆ సంస్థకు రాజకీయ విభాగంగా పనిచేస్తుండటం మరింత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. భార్గవతో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు అశోక్‌సేన్, పీ.బలరాం, మాడభూషి రఘునాథన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డీ.బాలసుబ్రమణియన్‌లు కూడా తమ అవార్డులను వెనక్కి ఇవ్వాలని ఇంతకుముందే నిర్ణయించుకున్నారు. వీరంతా తమ నిరసనను వెబ్సైట్లో ప్రకటన ద్వారా తెలియజేశారు. బుల్లెట్లా సమాధానం?: దేశంలో వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా కలుషితమైపోయిందని దేశంలోని ప్రఖ్యాత చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేశారు. రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, కేఎన్ ఫణిక్కర్, మృదులా ముఖర్జీలతో సహా మొత్తం 53మంది చరిత్రకారులు దేశంలో ప్రస్తుతం కల్లోల పరిస్థితి నెలకొన్నదంటూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దాద్రీ ఘటన, సుధీంద్ర కులకర్ణిపై ఇంక్‌తో దాడి వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. ‘అభిప్రాయభేదాలను వ్యక్తం చేస్తే వాటికి భౌతిక దాడులకు పరిష్కారం చూపాలని ప్రయత్నిస్తున్నారు. వాదనలకు ప్రతివాదనలు చేయకుండా బుల్లెట్లతో సమాధానాలిస్తున్నారు. ఒకరి తరువాత మరొకరు అవార్డులు వెనక్కి ఇస్తుంటే, రచయితలను రాయడం ఆపేయమని సలహా ఇవ్వ టం, మేధావులను మౌనంగా ఉండమని అన్యాపదేశంగా చెప్పటమే...’ అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం గా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు రక్షణ కల్పించటం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, భిన్నత్వాన్ని పరిరక్షించటం ప్రభుత్వ బాధ్యత అని వారన్నారు. ఇప్పటికే 36 మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇవ్వటం, మరో అయిదుగురు తమ అధికారిక పదవులను విడిచిపెట్టడం, ఫిల్మ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియావిద్యార్థులు 139రోజులు సమ్మె చేయటంతో పాటు 10మంది సినీ కళాకారులు అవార్డులను వెనక్కి ఇవ్వటం తెలిసిందే. అదొక ప్రదర్శన హైదరాబాద్: శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అవార్డులను వెనక్కి ఇవ్వటం ఒక ప్రదర్శన అని ఇస్రో మాజీ చైర్మన్, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త మాధవన్ నాయర్ గురువారం ఆరోపించారు. భారత్ లాంటి పెద్ద దేశంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని.. వాటన్నిం టికీ ప్రభుత్వమే కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. జీవిత సాఫల్యానికి గుర్తింపుగా దేశం గౌరవంగా ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చి వాటిని అవమానించటం తగదని ఆయన హితవు చెప్పారు. కాగా, ఈ నిరసనలతో మోదీసర్కారు ఇరుకున పడిందని తొలుత తన అవార్డును వెనక్కి ఇచ్చిన ప్రఖ్యాత రచయిత్రి నయనతార సెహగల్ అన్నారు. వీరంతా బీజేపీ వ్యతిరేకులు: అరుణ్‌జైట్లీ పట్నా/ముంబై: అవార్డులు వెనక్కి ఇస్తున్న వారంతా ‘తయారుచేయబడిన తిరుగుబాటుదారుల’ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. అవార్డులు వెనక్కి ఇస్తు న్న వారంతా రాజకీయం చేస్తున్నారు. ‘నా మాటకు నేను కట్టుబడి ఉన్నా.. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారి సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాలను ఫేస్బుక్, ట్విటర్లలో జాగ్రత్తగా గమనించండి. వారు బీజేపీపై పిచ్చి వ్యతిరేకతతో ఉన్నవారన్నది స్పష్టం అవుతుంది.’అని జైట్లీ అన్నారు. జైట్లీ మాట లు విమర్శను సహించని వైఖరిని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. వీరంతా భారత ప్రతిష్టను, హిందూ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పక్షాలు, వామపక్ష భావజాల వర్గాలు పనిగట్టుకుని దుష్ర్పచారానికి పూనుకున్నాయని వెంకయ్య ఆరోపించారు. పీఎం భార్గవ బీజేపీ వ్యతిరేక సైన్యానికి నాయకుడని, బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. మరోవైపు తనకు ఇచ్చిన అవార్డును వెనక్కి ఇవ్వబోనని ప్రముఖ నటి విద్యాబాలన్ తేల్చి చెప్పారు. -
ప్రతిభావంతులను శోధించే..సీఎస్ఐఆర్-నెట్
పరిశోధనలు చే స్తూ ప్రతి నెల ఫెలోషిప్ పొందాలన్నా..యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలన్నా రాయాల్సిన పరీక్ష.. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్). దీన్ని ఏటా రెండు సార్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ నిర్వహిస్తుంది..దీనికి సంబంధించి తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు,ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్.. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష ఆరు సబ్జెక్ట్‌లలో జరుగుతుంది. అవి.. కెమికల్ సెన్సైస్; ఎర్త్- అట్మాస్పియరిక్-ఓషియన్-ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్; ఇంజనీరింగ్ సెన్సైస్. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 200 మార్కులకు ఉండే ప్రశ్నపత్రాన్ని మూడు విభాగాలుగా పార్ట్-ఎ, బి, సిగా విభజించారు. సమాధానాలను గుర్తించడానికి 3 గంటల సమయం కేటాయించారు. ఒకేరకంగా పార్ట్-ఎ: రాత పరీక్షలో మొదట ఉండే పార్ట్-ఎ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిషన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ అంశాల నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 15 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఈ విభాగానికి మార్కులు 30. సబ్జెక్టివ్గా పార్ట్-బి: పార్ట్-బీలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్‌ల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 70 మార్కులు కేటాయించారు. మ్యాథమెటికల్ సెన్సైస్‌లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున మొత్తం 75 మార్కులు ఉంటాయి. ఫిజికల్ సెన్సైస్‌లో 25 ప్రశ్నల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున ఈ విభాగానికి మొత్తం 70 మార్కులు. నైపుణ్యాధారితం పార్ట్-సి: పార్ట్-సీలో ప్రధానంగా నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా సబ్జెక్ట్‌ల్లోని శాస్త్రీయ అనువర్తనాలకు అభ్యర్థి ఏమేరకు అన్వయించే నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు? అనే అంశాన్ని పరీక్షిస్తారు. ఇందులో కూడా అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సెన్సైస్‌లో 75 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. ఎర్త్ సెన్సైస్‌లో 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ఈ విభాగానికి 100 మార్కులు. లైఫ్ సెన్సైస్‌లో 75 ప్రశ్నలకుగాను 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. మ్యాథమెటికల్ సెన్సైస్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 4.75 మార్కుల చొప్పున ఈ విభాగానికి 95 మార్కులు. ఫిజికల్ సెన్సైస్‌లో 30 ప్రశ్నలకుగాను 20 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కుల చొప్పున ఈ విభాగానికి 100 మార్కులు. లైఫ్ సెన్సైస్:గత రెండేళ్ల సరళిని పరిశీలిస్తే.. అధిక శాతం ప్రశ్నలు బయోకెమిస్ట్రీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి వచ్చాయి. బయోకెమిస్ట్రీ నుంచి 20-25 మార్కులకు; అమైనో ఆమ్లాలు, వాటి రసాయనిక నిర్మాణం, తత్వం, ప్యూరిఫికేషన్ నుంచి ఎనిమిది మార్కులకు ప్రశ్నలు అడిగారు. సెల్ బయాలజీ మెంబ్రాన్ నుంచి నాలుగు నుంచి ఎనిమిది, సెల్ సైకిల్ నుంచి నాలుగు నుంచి ఆరు, సెల్ సిగ్నలింగ్ నుంచి 16 మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. జెనెటిక్స్‌లో కూడా 20-25 మార్కులకు ప్రశ్నలు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మెండీలియన్ జెనెటిక్స్, పాపులేషన్ జెనెటిక్స్ మీద దృష్టి సారించాలి. ప్లాంట్ ఫిజియాలజీ నుంచి తప్పకుండా 20-25 మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు. కిరణజన్య సంయోగక్రియ, ఫైటో హార్మోన్, ఫోటో ఫిజియాలజీ, నైట్రోజన్, మెటబాలిజమ్ నుంచి కనీసం 20 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. ఎకాలజీలో బిహేవిరియల్ ఎకాలజీ, పాపులేషన్ ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఎకాలజీ నుంచి 25-30 మార్కులకు ప్రశ్నలు ఉంటున్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్డీఎన్ఏ టెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. ఇమ్యూనాలజీ నుంచి 12-16, పరిణామ క్రమ శాస్త్రం, డవలప్మెంట్ బయాలజీ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి పరిశీలిస్తే.. మౌలిక శాస్త్రాలైన బోటనీ, జువాలజీ నుంచి అడిగే ప్రశ్నల సంఖ్య పెరిగింది. బోటనీలో వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి, జువాలజీ నుంచి ఫైలా క్యారెక్టరిస్టిక్స్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి బోటనీ, జువాలజీ అభ్యర్థులకు ప్రిపరేషన్ సులభమేనని చెప్పొచ్చు. వీరు బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, ఆర్డీఎన్ఏ టెక్నాలజీ అంశాల్లో కొంత కష్టపడితే విజయం సాధించవచ్చు. ఎంఎస్సీ (బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ) విద్యార్థులు జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ వంటి అంశాలపై దృష్టి సారించాలి. బయోకెమిస్ట్రీ, జెనెటిక్ ఇంజనీరింగ్, సెల్ బయాలజీకి సంబంధించి కాన్సెప్ట్ మ్యాప్‌లను, వివిధ అంశాల సారూప్యత, వైవిధ్యాలను తెలిపే టేబుల్స్‌ను రూపొందించుకోవాలి. ఎస్క్యూ3ఆర్ (సర్వే, క్వొశ్చన్, రీడ్, రీసైట్, రీకాల్) పద్ధతిని ప్రిపరేషన్లో ఉపయోగించాలి. ఈ విభాగానికి సంబంధించి 13 యూనిట్లలో కనీసం ఏడు యూనిట్లను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. పరీక్షకు అందుబాటులో ఉన్న ఐదు నెలల్లో మొదటి నాలుగు నెలలు ఈ ఏడు యూనిట్ల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇందులో మూడు నెలలు క్లిష్టమైన, పీజీ సిలబస్‌లో లేని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగో నెలలో పీజీ సబ్జెక్ట్స్ చదవాలి. ఐదో నెలను పునశ్చరణకు, గత ప్రశ్నపత్రాల ప్రాక్టీస్‌కు కేటాయించాలి. కెమికల్ సెన్సైస్: ఇందులో మెరుగైన స్కోర్‌కు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అంశాలపై బీఎస్సీ (ఆనర్స్) స్థాయి ప్రిపరేషన్ సాగించాలి. పార్ట్-సి కోసం ఏదో ఒక స్పెషలైజేషన్‌లో మాత్రమే ప్రిపేర్ కావడం సముచితం కాదు. మిగతా విభాగాలపై కూడా దృష్టి సారించాలి. ఈ క్రమంలో ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ.. ఇనార్గానిక్ విభాగంలో గ్రూప్ థియరీ, స్పెక్ట్రోస్కోపి, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ అంశాలను బాగా ప్రిపేర్ కావాలి. గత రెండేళ్ల నుంచి ఈ విభాగంలో మన రాష్ట్ర విద్యార్థులు తక్కువ స్కోర్ చేస్తున్నారు. కారణం ఎక్కువ మంది విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఎంఎస్సీ చేయడమే. వీరు ఫిజికల్ కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టి సారిస్తే మెరుగైన మార్కులు సాధించవచ్చు. ఫిజికల్ సెన్సైస్: ఈ విభాగంలో పార్ట్-బిలో క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఈఎమ్ థియరీ, మ్యాథమెటికల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ అంశాల నుంచి సమాన సంఖ్యలోనే ప్రశ్నలు ఇస్తున్నారు. ఒక్కోసారి క్వాంటమ్ మెకానిక్స్, ఈఎమ్ థియరీ నుంచి ఒకటి రెండు ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి. పార్ట్-సి కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. ఇందులో రాణించాలంటే సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ ఫిజిక్స్, అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇన్ ఫిజిక్స్ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇంజనీరింగ్ సెన్సైస్:ఇందులోని పార్ట్-బీలో మ్యాథ్స్, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో లీనియర్ అల్జీబ్రా, కాలిక్యులస్, కాంప్లెక్స్ వేరియబుల్స్, వెక్టర్ కాలిక్యులస్, ఆర్డినరీ డిఫెరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రోబబిలిటీ, సాలిడ్ బాడీ అండ్ ఫ్లూయిడ్ మిషన్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రోమాగ్నటిక్స్ వంటి అంశాల నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున ఈ విభాగానికి కేటాయించిన మా ర్కులు 70. పార్ట్-సిలో సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎలక్ట్రికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, సాలిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో ప్రతి అంశం నుంచి 10 ప్రశ్నల చొప్పున మొత్తం 70 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇందులో ప్రతి ప్రశ్నకు 5 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు ఈ విభాగానికి కేటాయించారు. ఈ విభాగంలో అభ్యర్థి తన బ్రాంచ్ కాకుం డా అదనంగా మరో సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. అవి.. ఈసీఈ: ఎలక్ట్రానిక్స్-సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్-మెటీరియల్ సైన్స్. సీఎస్ఈ: సీఎస్ఈ-ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ-థర్మోడైనమిక్స్. సివిల్: సాలిడ్ మెకానిక్స్-ఫ్ల్లూయిడ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్. మెకానికల్: ఫ్లూయిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్. కెమికల్/ఎన్విరాన్మెంటల్: థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్. ఏరోనాటికల్/ఆటోమొబైల్: థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్. ఈఈఈ:ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్. జనరల్ టిప్స్: స గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా లాభిస్తుంది. స సిస్టర్ ఎగ్జామ్స్‌గా వ్యవహరించే డీ బీటీ-జేఆర్ఎఫ్, ఐసీఎంఆర్-జేఆర్ఎఫ్, ఐసీఏఆర్-జేఆర్ఎఫ్, జెస్ట్, బార్క్, డీఆర్డీఓ వంటి పరీక్షలు రాయడం ఉపయోగకరం. స పరీక్షలో మొదట పార్ట్-సితో ప్రారంభించండి. ఎందుకంటే ఇది స్కోర్ చేయగలిగిన విభాగం. తర్వాత పార్ట్-బి, చివరగా పార్ట్-ఎను సాధించండి. పార్ట్-బిలో ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం కేటాయించాలి. పార్ట్-సిలో ప్రతి ప్రశ్నను మూడు/నాలుగు నిమిషాల్లో సాధించడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ).. సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా నియామకాలను చేపట్టడానికి యూజీసీ అనుమతినిచ్చింది. ఈ మేరకు గతేడాది యూజీసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు లేఖ కూడా రాసింది. ఐఓసీఎల్ బాటలోనే ఇతర పీఎస్‌యూలు నడిచే అవకాశం ఉంది. సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ద్వారా జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు సీఎస్ఐఆర్ పరిశోధనశాలలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రెండేళ్లపాటు నెలకు రూ. 16 వేల ఫెలోషిప్, ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ. 20 వేలు చెల్లిస్తారు. ఈ క్రమంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూడో ఏడాది నుంచి ప్రతి నెలా రూ. 18 వేల ఫెలోషిప్ అందుకోవచ్చు. జేఆర్ఎఫ్లో అత్యంత ప్రతిభావంతులకు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ. 20 వేల ఫెలోషిప్, ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ. 70 వేలు చెల్లిస్తారు. తర్వాత ప్రతిభ ఆధారంగా మూడేళ్లపాటు పొడిగింపు లభిస్తుంది. ఈ సమయంలో నెలకు రూ. 24 వేల ఫెలోషిప్ లభిస్తుంది.సీఎస్ఐఆర్-యూజీసీ నెట్లో అర్హత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్స్టిట్యూట్లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షకు హాజరు కావాలంటే నెట్/సెట్లో అర్హత సాధించాలి.