
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కారక వైరస్ నియంత్రణకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల యాంటీబాడీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్‌తో కలిసి పరిశోధనలు మొదలుపెట్టింది. న్యూమిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కోవిడ్–19 రోగుల నుంచి సేకరించిన యాంటీబాడీలను వృద్ధి చేస్తారు.
పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, ఇండోర్‌లోని ఐఐటీతోపాటు గురుగావ్‌లోని ప్రెడోమిక్స్ టెక్నాలజీస్‌లు కూడా ఈ ప్రాజెక్టుకు తమవంతు సాయం అందిస్తాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం టీకాలు, మందుల తయారీకి ఇప్పటికే పలు ప్రయత్నాలు జరుగుతున్నా ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే కాకుండా.. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్‌ను ఎదుర్కోగల మోనోక్లోనల్ యాంటీబాడీల తయారీకి ప్రాజెక్టు సిద్ధమైంది. ఇప్పటికే వైరస్ బారిన పడ్డవారికి చికిత్స కల్పించేందుకు యాంటీబాడీలు ఉపయోగపడతాయని, భారత్ బయోటెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment