
న్యూఢిల్లీ: కరోనాపై సంప్రదాయ ఆయుర్వేద ఔషధం అశ్వగంధ చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారణ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అశ్వగంధను కరోనా సోకకుండా నిరోధించగల ఔషధంగా వైద్య సిబ్బందికి, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఇతరులకు హైడ్రో క్లోరోక్విన్ స్థానంలో వినియోగించవచ్ఛా? అనే విషయంపై నియంత్రిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ను సీఎస్‌ఐఆర్, ఐసీఎంఆర్‌ల సహకారంతో ఆయుష్, ఆరోగ్య, శాస్త్ర,సాంకేతిక శాఖలు ప్రారంభించాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం వెల్లడించారు.
ఆయుర్వేద ఔషధాలు యష్టిమధు, గదుచి, పిప్పలి, ఆయుష్ 64ల సమ్మేళనాన్ని సాధారణ కోవిడ్ రోగులకు ఇవ్వడంపైనా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ తెలిపారు. వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా, అలాగే, సోకాక ఔషధంగా వాటిని వినియోగించడంపై పరీక్షలు జరుపుతున్నామన్నారు. కరోనా తీవ్రంగా ఉండేవారిపై ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియో ఔషధాల ప్రభావాన్ని శాస్త్రీయంగా నిర్ధారించే పరీక్షలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోవిడ్‌పై ఆయుష్ ఔషధాల ప్రభావం, ఆయా ఔషధాల వినియోగం తదితర సమాచారం తెలిపే ‘సంజీవని’ యాప్‌ను హర్షవర్ధన్ ఆవిష్కరించారు.