న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్న వేళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వేసిన అంచనాలు కొత్త ఊపిరిపోస్తున్నాయి. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రజలు కోవిడ్–19 నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తే మరో రెండు నెలల్లోనే ఆ మంచిరోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మార్చి నాటికి ఎండమిక్ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్‌లో వ్యాధుల నివారణ విభాగం చీఫ్ సమీరన్ పాండా చెప్పారు.
ఎండమిక్ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్‌గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం. ప్రజలందరూ కోవిడ్ రక్షణ కవచాలైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేస్తూ ఉంటే, కొత్త వేరియంట్లు ఏవీ పుట్టుకొని రాకపోతే కరోనా ఇక తుది దశకు చేరుకున్నట్టేనని అన్నారు.
కరోనా ఎండమిక్ దశ మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమిస్తే కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్ వేవ్ మూడు నెలల్లో ముగిసిపోతుంది’’ అని ఐసీఎంఆర్ నిపుణుల బృందం గణిత శాస్త్ర విధానం ఆధారంగా రూపొందించిన అంచనాల్లో వెల్లడైందని పాండా తెలిపారు. ‘‘మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది.
ఢిల్లీ, ముంబైలలో కోవిడ్–19 కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయో లేదో తెలియాలంటే మరి రెండు, మూడు వారాలు వేచిచూడాలి. ఆ రెండు నగరాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ అక్కడ కరోనా పరిస్థితి ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పలేము. ఒకట్రెండు రోజుల్లో అక్కడ పరిస్థితులపై ఒక అంచనాకి రాలేము. ప్రస్తుతానికి ఒమిక్రాన్, డెల్టా కేసులు అక్కడ 80:20 నిష్పత్తిలో నమోదవుతున్నాయి’’ అని పాండా వివరించారు.
కరోనా పరీక్షలు తప్పనిసరి
వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి వివిధ దశల్లో ఉందని పాండా చెప్పారు. కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ ఉంటే దానికి అనుగుణంగా కోవిడ్–19 పరీక్షలకు సంబంధించి వ్యూ హాలు మార్చుకుంటామన్నారు. కరోనా పరీక్షలు తగ్గించాలని తాము ఎప్పుడూ రాష్ట్రాలకు చెప్పలేదన్నారు. కరోనా స్వభావం మారినప్పుడల్లా ఐసీఎంఆర్ కోవిడ్–19 పరీక్షలు, నిర్వహణ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటుందని వివరించారు.
కరోనా అత్యవసర పరిస్థితులు ఇక ఉండవ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ
దావోస్: కోవిడ్–19తో విధించే అత్యవసర పరిస్థితులు ఈ ఏడాదితో ముగిసిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలను నిర్మూలించి అందరికీ లభ్యమయ్యేలా చర్యలు చేపడితే కోవిడ్–19 మర ణాలు, ఆస్పత్రిలో చేరికలు, లాక్‌డౌన్‌లు వంటివి అరికట్టవచ్చునని డబ్ల్యూహెచ్‌ఒ ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ అసమానతలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మైఖేల్ ఇలాంటి వైరస్‌లో మన పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగంగానే ఎప్పటికీ ఉంటాయన్నారు. అన్ని దేశాలకు సమానంగా టీకా పంపిణీ జరిగితే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఇక రాకపోవచ్చునని అన్నారు.
ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసుల ఉధృతి కొనసాగుతూ ఉండడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్టుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. అయితే పరస్పర ఒప్పందం ఉన్న దేశాలకు ప్రత్యేక విమానాలు నడుస్తాయని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై డీసీజీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి విడతల వారీగా నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 40 దేశాలకు ప్రత్యేక విమానాలు మాత్రం యథాతథంగా తడుస్తాయని డీసీజీఏ పేర్కొంది.
ఒకే రోజు 2.82 లక్షల కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఒకే రోజు 2,82,970 కేసులు నమోదయ్యాయి. 18,31,000కి క్రియాశీల కేసుల సంఖ్య చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రతీ కరోనా కేసుని జన్యుక్రమ విశ్లేషణకు పంపించడం సాధ్యం కాదని అందుకే ఒమిక్రాన్ కేసులు ఎంత శాతం నమోదవుతున్నాయో కచ్చితమై న లెక్కలు చెప్పలేమని స్పష్టం చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 15.53శాతంగా ఉంది.
(కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?)
Comments
Please login to add a commentAdd a comment