న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న పెనుభూతం కరోనా. ఈ వైరస్ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాలని, మాంసం అధికంగా తినాలన్న సూచనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజానికి మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. అంతేకాదు ‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్నవారు కూడా కరోనా బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా పరిశోధనలో తేలింది.
శాకాహారుల్లో సెరో–పాజిటివిటీ స్వల్పమేనని పరిశోధకులు అంటున్నారు. కోవిడ్–19 వ్యాధికి కారణమయ్యే సార్స్–కోవ్–2 వైరస్‌ను ఢీకొట్టే ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్) ఎవరెవరిలో ఎక్కువగా ఉంటాయన్న దానిపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) పాన్–ఇండియా సెరో సర్వే నిర్వహించింది.
సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ‘బీ’, ‘ఏబీ’ గ్రూప్ రక్తం ఉన్నవారిలో సెరో పాజిటివిటీ అధికంగా ఉంటుందని, వారికి కరోనా రిస్క్ ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ‘ఓ’ గ్రూప్ రక్తం ఉన్నవారికి ఈ వైరస్ వల్ల పెద్దగా ముప్పేమి ఉండదని అంటున్నారు. అంతేకాకుండా సిగరెట్ తాగేవారి గొంతులో జిగురు పొర ఏర్పడుతుందని, ఇది వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యయనంలోనూ ఇదే విషయం బయటపడింది.
ప్రతిరక్షకాలు తగ్గడం వల్లే..
భారత్‌లో మొదటి వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు గత ఏడాది సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత తీవ్రత తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈ ఏడాది మార్చి నుంచి కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీన్ని సెకండ్ వేవ్ అంటున్నారు. జనంలో ‘అర్థవంతమైన ప్రతిరక్షకాలు’ తగ్గడమే ఇందుకు కారణమని సీఎస్‌ఐఆర్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment